
12
నెలలు గడుస్తుంటే రాజేశ్వరి మిసమిసలాడే శరీరంతో కొంచెం పచ్చని చాయని పులుముకుని మరీ మరీ చూడాలనిపించేట్లు వుంది. శ్రీనివాస్ రాజేశ్వరి కోసమే బ్రతుకుతున్నాడు. అతనికి శరీరం నిండా అణువణువునా రాజేశ్వరి నిండిపోయింది. ఎనిమిది నెలలు దాటిపోయాయి. శ్రీనివాస్ అప్పులు అధికం అయిపోయాయి. రాజేశ్వరికి యేమాత్రం తెలియనివ్వలేదు అతను. రాత్రి పదకొండు గంటలు దాటుతుంటే రాజేశ్వరికి నొప్పులు ప్రారంభం అయాయి. చేతిలో ఐదు రూపాయలు తప్ప అతనికి కానీ కనిపించటం లేదు.
గవర్నమెంటు హాస్పిటల్లో చేర్పించాడు. తెల్లవారితే, అన్ని సమస్యలే. పాలవాడు, యింటి అద్దె, కిరాణా కొట్టు మనిషి . చాకలి యిలా అంచెలంచెలుగా నిలబడి అతని కన్నుల ముందు నృత్యం చేస్తున్నారు. రాజేశ్వరి నెమ్మదిగా అంది. 'నేను బ్రతక్కపోతే....'
'ఛ! ఏం మాటలవి? చూడు రాజేశ్వరి నువ్వు మగ పిల్లాడిని కంటేనే యింటికి రావాలి.'
'లేకపోతె?'
'తలుపు తియ్యను.'
'యేమిటో ఆశ'
'అదంతే.'
'నాకు ఆడపిల్లే కావాలి.'
'అయితే నీ యిష్టం ' శ్రీనివాస్ మొహం చిన్నపోయింది.
'మీ యిష్టమే నేరువేరు తుందేమో అప్పుడే చిన్న బుచ్చుకోవడం దేనికి?'
'నేను ...యేమిటో భయంగా వుండండి!' శ్రీనివాస్ ప్రేమగా చూశాడు. 'మొదట్లో ఆడవాళ్ళంతా యిలాగే భయపడతారు రాజేశ్వరీ! భయపడినా అందరూ పిల్లల కోసమే ప్రాకులాడుతారు. చిత్రంగా లేదూ.....'
రాజేశ్వరి స్ట్రిచ్చర్ మీద పడుకుని రెండు చేతులూ జోడించి నమస్కారం చేసింది.
శ్రీనివాస్ భగవంతుడిని ప్రార్దిస్తూనే వున్నాడు. రాజేశ్వరి సులభంగా ప్రసవం కాలేదు. మేజర్ ఆపరేషన్ చేశారు. మగపిల్లాడు చాలా ఆరోగ్యంగా , మరీ దృడంగా సిస్టర్ చేతిలో నలిగి పోతుంటే శ్రీనివాస్ ప్రాణం గిజగిజ లాడింది.
తొమ్మిది రోజులు క్షణాల్లా గడిచిపోయాయి. బలవంతంగా తనంతట తానె డిశ్చార్జ్ చేయించుకొని వచ్చేసింది రాజేశ్వరి. శ్రీనివాస్ ఇల్లు తుడవడం, అంట్లు తోమడం, బట్టలకి సబ్బు పెట్టడం రాజేశ్వరి హృదయాన్ని గుప్పిట్లో పెట్టుకొని యెవరో కసితీరా సలుపుతున్నట్లు బాధపడుతోంది. అతని భుజం మీద చేయి వేసి 'పోనీ పనిమనిషిని పెట్టించండి' అంది నెమ్మదిగా. శ్రీనివాస్ తలెత్తి వొకసారి చూశాడు. అతని చూపుల్లో భావ వీచికలు విసురుగానే తగిలాయి. తమాయించుకుని అన్నాడు. 'ఈ రోజుల్లో పది రూపాయలు పెడితే గాని దొరకరోయ్ పని మనుషులు. ఆ డబ్బు వుంటే బాబుకి పాలూ, నీకు మందులూ వస్తాయి.'
'నా సంగతికేమి? మీ ఆరోగ్యం చూసుకొండి ? మీరు దెబ్బ తిన్నారంటే యిక జీవితం సాగేదేలా?'
శ్రీనివాస్ నవ్వి అన్నాడు. 'నువ్వు నమ్ముతావో లేదో గానీ నర్సు చేతిలో బాబు నలిగి పోతుంటే నా ప్రాణం విలవిలలాదిపోయింది సుమా!'
'అబ్బ! మరేం. మీకే మహా ప్రేమ వుంది. పిల్లాడు నలిగిపోతే ఏమై పోతుందేమిటి?
'అదేమో నా ప్రాణాన్నే నలిపెస్తున్నా రేమో అనిపించింది. ఈ కష్టాలు యెక్కువ కాలం నిలవ్వు రాజేశ్వరి. పనిమనిషి దేనికి? రెండు నేల్లాగితే నువ్వే ఆరోగ్యంగా తిరుగుతావు.'
రాజేశ్వరి మరి మాట్లాడలేదు.
* * * *
బాలింతరాలు రాజేశ్వరి కి కడుపు నిండా తినేందుకే పెట్టలేక పోతున్నాను అనే బాధ శ్రీనివాస్ ని పీల్చి పిప్పి చేస్తోంది. శ్రీనివాస్ మునికాళ్ళ మీద చేతులు చాపుకుని కూర్చుండి పోయాడు. పిల్లడు పాలకి గోల పెడుతున్నాడు. రాజేశ్వరి కే తిండి లేక పొతే పసివాడికి పాలు ఎక్కణ్ణించి వస్తాయి. ఈ ఆకలితో ఈ బాధలో యెవరినైనా అప్పు అడిగితె? శ్రీనివాస్ చేసే పనుల్లో ఏదో మోసం, అన్యాయం కనిపిస్తున్నాయి రాజేశ్వరి కంటికి:
రాజేశ్వరి ఆలోచనలు మరో వైపుకు మళ్ళాయి. పోనీ సమాజం ప్రెసిడెంటు ని అడిగితె? చుట్టూ ప్రహరీ, బోహెన్ విల్లా పూల చెట్లు, నాలుగైదు వేప చెట్లూ చిన్న ఆశ్రమం లాంటి యింట్లో పండిపోయిన గెడ్డంతో గుబురు మీసాలతో చూడగానే నమస్కారం చేయాలనే వర్చస్సు తో పవిత్రంగా వెలిగిపోతూ సదా గీతాపారాయాణ చేస్తుంటారు, సమాజంలో హోదా పలుకుబడి వున్న నారాయణ బాబు.
మేలిముసుగు వేసుకుని అడుగులో అడుగు వేస్తూ మండు టండలో అయన గదిలోకి అడుగు పెట్టింది రాజేశ్వరి.
సమాజం లో చాలా పెళ్లిల్లె జరుగుతుంటాయి. యెంతో మంది వస్తూ పోతూ వుంటారు. ప్రత్యేకం రాజేశ్వరి ని గుర్తుంచు కోవడానికి కారణం లేకపోలేదు. శ్రీనివాస్ జంట నగరాల్లో నాటక సమాజాల్లో ప్లేబాకు యిచ్చి గొప్ప పేరు తెచ్చుకున్నాడు. రెండు మూడేళ్ళ లోనే అతని పాట వినని మనిషి లేకపోవచ్చును బహుశా. రేడియో లో అతను పాడుతుంటే నూటికి ఒక్కరైనా ఆగి, నిలబడి , విని మరీ వెడుతుంటారు. సమాజంలో యేదైనా కార్యక్రమం జరుగుతే శ్రీనివాస్ తప్పకుండా హాజరు అవుతాడు.
రాజేశ్వరి ని వెంటనే పోల్చుకుని అన్నారు నారాయణ బాబు "రామ్మా రా. కూర్చో . ఎండలో వచ్చావు పని మీదేమో' ఆయన కంఠస్వరం బాధ్యత తో నిండిపోయింది.
రాజేశ్వరి నెమ్మదిగా అంది : 'అయన తెచ్చే జీతం యేమౌతుందో తెలీడం లేదు బాబుగారూ. యింట్లో తిండికే యిబ్బందిగా వుంది. యేదైనా సమాజం తరుపున సర్దుతారేమో అని.'
'సమాజం ఆర్ధికంగా పెద్ద హోదాలో లేదు రాజేశ్వరి. మా బాధ్యత మేము గుర్తించి దేశ సౌభాగ్యం కోసం ప్రయత్నిస్తాం. ఏకజాతి , ఐకమత్యం సమాజం ఆదర్శం. మరి నువ్వు యిలా యిబ్బందుల్లో చిక్కు కున్నావంటే ఆశ్చర్యంగా వుంది. అతను ట్యూషన్లు చెబుతాడు. పైగా రేడియో ఆర్టిస్టు....యీ డబ్బంతా....'

'అయన తాగుతారు బాబుగారూ.'
నారాయణబాబు ఆశ్చర్యాన్ని అణచుకున్నారు: 'నేను డాన్ని సమర్ధించను కానీ శ్రీనివాస్ జీతం త్రాగెందుకే అయిపోతోంది అంటే నమ్మకం లేకుండా వుంది.'
'ఆయనలో వున్న మంచి నేర్పరితనం నలుగుర్నీ నమ్మించడం. ఆయన్ని చూసి అందరూ అలాగే అంచనా వేసుకుంటారు. నిజానికీ నేను చెప్పేది మీకూ నమ్మకం లేనట్లుంది.'
'అదేం కాదు. ఆర్ధిక యిబ్బందులు అందరికీ వుంటాయి. శ్రీనివాస్ వ్యసనాలలో ఉంటాడనేదే కొంచెం ఆశ్చర్యంగా వుంది.'
'బాబుగారూ నేను ట్యూషన్లు చెప్పి అయినా బాకీ తీరుస్తాను. దయచేసి ఒక్క పాతిక రూపాయలు సర్దండి.'
నారాయణ బాబు లేచి వెళ్లి బీరువా లో రెండు పది కాగితాలూ వొక ఐదు నోటూ చేతికి యిస్తూ అన్నారు : 'అంత యిబ్బందిలో వుంటే శ్రీనివాస్ వచ్చి అడగవచ్చును గదా. అంత దూరం నుంచి వొంటరిగా ఆడపిల్లవి రావడం ......ప్చ్ నాకు బాగులేదు. నేను వస్తాను యింటి వరకూ.'
రాజేశ్వరి తల వాల్చేసింది. 'ఒద్దు బాబుగారూ. బస్సులో వెళ్ళిపోతాను. అట్టే దూరం అనిపించదు. కృతజ్ఞురాలిని.' అంది అయన పాదాలు తాకుతూ.
వెనక్కి తగ్గి అన్నారు: 'సమాజం యే ఒక్కరికీ ఆర్ధికంగా సహాయం చేయలేదు. యిది పెద్ద బాబు యింటి ఖర్చుల కోసం పంపాడు బీదా బిక్కీ ఫీజులు వాడే కడతాడు. అందులోంచి యిస్తున్నాను. నువ్వు జాగ్రత్తగా వెళ్లిరా.'
రాజేశ్వరి వీధి మలుపు దాటే వరకూ నిలుచును నిట్టుర్చారు. రాజేశ్వరి వెను తిరిగింది నిట్టుర్పు విని.
అవును ఆయనతో అబద్దం చెప్పింది. డబ్బు అడిగేందుకు శ్రీనివాస్ త్రాగుతాడని అంది. పార్టీకి వెళ్ళిన శ్రీనివాస్ స్నేహితుల బలవంతం మీద కొంచెం తాగి వస్తే అప్పుడు సమర్ధించిన తను నారాయణ బాబు యెదుట చిలవలు పలవలు గా అల్లి డబ్బు తీసుకు వచ్చింది. 'యెందుకిలా చేశాను' తనకు తానె ప్రశ్నించు కుంది. శ్రీనివాస్ కీ విషయం తెలిస్తే వొక్క నాటికి వూరుకోడు అభిమాన ధనుడు అతను చంద్రమౌళి ని అప్పు అడిగినట్లు , నారాయణ బాబు దగ్గర తెచ్చినట్లూ తెలిస్తే అతను ముమ్మాటికి రాద్దాంతం చేశాడు. యీ సమస్య ని తను ఎదుర్కోవాలి. యింటికి వచ్చి ఆలోచనలో పడింది రాజేశ్వరి.
శ్రీనివాస్ పీట మీద కూర్చున్నాడు. రెండు కూరలు, పులుసూ, పచ్చడి తో కడుపు నిండా వడ్డిస్తుంటే శ్రీనివాస్ ఆశ్చర్యపోయాడు : 'యివన్నీ ఎక్కడివి ' అంటూ.
'ముందు మీరు భోజనం చేయండి. కడుపు నిండా భోజనం చేసి చాలా రోజులు అయింది.'
శ్రీనివాస్ అసంతృప్తి గా అన్నాడు: 'నాకేవిటో యీ పదార్ధాలు రుచికరంగా లేవు రాజేశ్వరీ. రోజూ నువ్వు చేసే మిరప కాయల పచ్చడే చాలా బాగుంది వీటి ముందు అయినా నీకు డబ్బు యెక్కడిది. నిరంజనం గారూ ఆఫీసు బాపతు డబ్బు యేమైనా ఇచ్చారా .'
'వుహూ.'
'మరి?'
'మీరు భోజనం చేయండి బాబూ. తినేది వంట బట్టకుండా విస్తరి ముందు కూర్చొని తెగ ప్రశ్నలు కురిపిస్తున్నారు . నేను డబ్బు తీసుకు వచ్చేందుకు తగనా.'
'అది కాదు రాజేశ్వరీ . విషయం తెలీకుండా తినేందుకు ముద్ద మింగుడు పడడం లేదు. కంఠం మధ్యలోనే ఆగిపోయింది గులకరాయిలా . అదేదో చెప్పేస్తే నాకు అంత బాధ వుండదు.'
రాజేశ్వరి గుండె దిటవు చేసుకుని అంది నెమ్మదిగా : 'ఆర్యసమాజం ప్రెసిడెంట్ యిచ్చారు.'
నోటికి అందిస్తున్న ముద్ద కంచం లో పడిపోయింది జారి. అతను కంచాన్ని ముందుకు తోసేసి వెంటనే చెయ్యి కడిగేసు కున్నాడు. కోపాన్ని దిగమింగుతూ అడిగాడు.
'యందు కిచ్చారు అయన? దయాభిక్షగా సమాజం యెవరికీ ఆర్ధిక సహాయం చేయదు. అందులో నేను గవర్నమెంటు ఉద్యోగస్తుడిని నిన్ను పిలిచి, మన ఆర్ధిక చిక్కులు తెలిసినట్లు యివ్వడం నాకు నమ్మశక్యంగా లేదు.'
'అది వాళ్ళ బాధ్యత మనకి పెళ్లి చేశారు. యిప్పుడు ఆపదలో వున్నాం. మధ్యాహ్నం నారాయణ బాబు కనిపిస్తే అడిగాను.'
'నీకెంత బుద్ది లేదు' శ్రీనివాస్ యెన్నడూ ఆ మాట అనలేదు.
'తప్పేం వుంది ఇందులో? బుద్ది తక్కువ పనేమీ చేయలేదు నేను. పిల్లడు పాల కోసం వొకటే యేడుపు అప్పటికీ చంద్రమౌళి గారిని అప్పుగా అడిగాను.'
శ్రీనివాస్ కి దుఃఖం ముంచుకు వచ్చింది. మనం యివాళ దరిద్రం లో వున్నాం అని నలుగురిని దేవిరించేందుకు వెళ్ళావా? నా పరువు నట్టేట్లో ముంచి. చంద్రమౌళి నాకు స్నేహితుడే కానీ అప్పులు అడిగేంత సన్నిహితం లేదే నాకు. అతను అంత పెద్ద ఆఫీసరు. నీకు సిగ్గే లేకపోయింది?'
