అంతలో ఖాకీ డ్రస్సులో వున్న ఒక వ్యక్తి సైకిల్ తొక్కుకుంటూ అక్కడికి వచ్చాడు.
సైకిల్ నిలబెట్టి "సత్యనారాయణగారిల్లు ఇదేనా?" అని గట్టిగా అడిగాడు. వరండాను ఊడుస్తున్న సుబ్బులు ఒక్కక్షణం అతనివైపు చూసి "ఇదే! ఏమిటి?" అని ద్వారం దగ్గరికి వచ్చింది.
"సత్యనారాయణగారికి టెలిగ్రామ్"
"అమ్మో! టెలిగ్రామా! అయ్యో! ఏం వచ్చింది నాయనా! తెల్లవారి నుంచీ కుడికన్ను అదురుతూ వుంది. అప్పుడే అనుకున్నాను ఏదో దుర్వార్త వినబోతామని, ఏమైంది దేవుడో?" బామ్మ రాగయుక్తంగా శోకాలు ప్రారంభించింది.
ఈ అరుపులకి సత్యనారాయణ భగవద్గీతను మూసి ఇవతలకు వచ్చాడు.
వడియాలు పెడుతున్న వాళ్ళూ పరుగు పరుగున అక్కడికి చేరుకున్నారు. అనసూయమ్మ చేతులకున్న మసి అయినా తుడుచుకోకుండా వచ్చి "ఏమైంది?" అంటూ అందరివైపు చూస్తూ ప్రశ్నించింది.
ఈ హడావుడికి సుజన కూడా నిద్ర లేచి, మేడమీద నుండి కిందకు దిగింది.
ఈలోగా ఖాకీ బట్టలతను వరండా మెట్లెక్కి పైకివచ్చి "సత్యనారాయణగారు మీరేనా?" అని అడిగాడు.
"అవును నాయనా"
"టెలిగ్రామ్ సార్ ఇదిగో ఇక్కడ సంతకం పెట్టండి"
ఆయన సంతకం పెట్టాక వణుకుతున్న చేతులతో టెలిగ్రామ్ నందుకున్నాడు. అందులో వున్న మేటర్ చదివాక "అరే! మన వేదాంతం రఘురామయ్య కాలధర్మం చేశారే" బాధ మిళితమైన స్వరంతో స్వగతంలా అన్నాడు.
"తాతయ్య వేదాంతం రఘురామయ్య చనిపోయారా!" పిల్లలంతా ఒక్కసారిగా నోళ్ళు తెరిచారు.
అప్పటికి అర్ధమైంది బామ్మకు. "అయ్యో! మా తమ్ముడు పోయాడా!" అంటూ ఏడుపు ప్రారంభించింది. ఆమెను సముదాయిస్తూ అందరూ లోనికి తీసుకువెళ్ళారు. అయినా ఆమె ఏడుపు ఆపలేదు.
"మరి అందరం వెళ్ళాలి కదా బయల్దేరండి" సత్యనారాయణ అన్నాడు.
"సుజన?" అనసూయమ్మ సందేహంగా అడిగింది.
"అది కొత్త పెళ్ళికూతురు గదా అది చావులకు, కర్మక్రియలకూ రాకూడదు శాస్త్రం ఒప్పుకోదు. అదింట్లోనే వుంటుంది. రాజులపాళెం ఎంతదూరం! మహావుంటే ఇరవై కిలోమీటర్లకు మించదు. రాత్రికి ఏ వేళకయినా వచ్చేయచ్చు. నెల్లూరులో మన ఊరికి వచ్చే లాస్ట్ బస్ తొమ్మిది గంటలకి, దాన్ని మిస్ చేసుకోకుండా వచ్చేయాలి. రాత్రి చనిపోయాడు కాబట్టి ఈరోజు ఎత్తుబడి అయిపోతుంది. మా అమ్మను వదిలేసి వస్తే, కర్మక్రియల వరకూ వుండి ఆ తరువాత వచ్చేస్తుంది"
"అయ్యో! నా తమ్ముడూ" బామ్మమధ్యమధ్యలో ఆగి ఏడుపు సాగిస్తూ వుంది.
ఇలా తర్జన భర్జనలు జరిగి చివరికి సుజనను ఇంట్లో వుంచి, తోడుగా సుబ్బుల్ని వుండమని మిగిలినవారంతా చావుకు బయల్దేరారు. వాళ్ళు బస్టాండ్ చేరుకునేసరికి పదకొండు గంటలయింది. అప్పటికే అందరికీ ఆకలి బయలుదేరింది. వెళుతున్నది చావుకు కాబట్టి ఎప్పుడు తింటామో ఏమో అన్న వేదన కూడా మొదలయింది. ఈ వేదనతోనే అందరూ డస్సిపోయారు.
బస్టాండ్ దగ్గరున్న మామిడితోపులో ఓ పక్కగా నక్కి వున్న వంశీ, వాళ్ళు ఎప్పుడు బస్సులో ఎక్కుతారా అని గుడ్లప్పగించి చూస్తున్నాడు.
వీళ్ళు చావుకి వెళ్ళి వచ్చేటప్పటికి ఎలా లేదన్నా రాత్రి పదిగంటలవుతుంది. ఇప్పుడు పదకొండు గంటలయింది. అంటే పదిగంటల సమయం వుంటుంది. ఈలోగా తన ఫస్ట్ నైట్ ని లాగించెయ్యాలి. రాత్రి జరిగితే అది ఫస్ట్ నైట్ అవుతుంది. మరి పగలు జరిగినా శోభనం శోభనమే గదా మరి కొద్దిక్షణాల్లో తాను సుజన కౌగిలిలో కరిగిపోతాడు.
వంశీ ఈ ఊహలకే చలించిపోయాడు. ఏదో ఉద్రేకం గుండెను కదిలిస్తోంది. ఇంకొక్క క్షణం ఆగలేక బస్సు వస్తుందో లేదోనని చూశాడు. దూరంగా ఎర్రటి బస్సు వస్తోంది. అది అతని కళ్ళకు మాత్రం తన శోభనానికి పచ్చజెండా ఊపుతున్నట్లే వుంది.
బస్సు వచ్చి ఆగింది. అందరూ బిలబిలమంటూ ఎక్కారు. బస్సు బయలుదేరింది.
అన్తఃవరకూ తుప్పల్లో వున్న వంశీ ఇవతలికి వచ్చాడు. "ఆహా! జగమే ఊయల" అన్న పాట అప్రయత్నంగా అతని నోటివెంట వచ్చింది. సుజన ఒంటరిగా వుందన్న విషయం అతనికి ఎక్కడలేని ఉత్సాహాన్ని ఇస్తోంది. తామిద్దరూ శోభనం మధురిమలను అనుభవించడమే కాకుండా, ఛాలెంజ్ లో కూడా నెగ్గుతామన్న థ్రిల్ రక్తాన్నంతా కవ్విస్తోంది.
మరో అయిదు నిముషాలకు ఇంటికి చేరుకున్నాడు. బాత్రూమ్ లో దూరి శుభ్రంగా స్నానం చేశాడు. తెల్లటి పైజమా, లాల్చీ వేసుకున్నాడు. లైట్ గా సెంట్ స్ప్రే చేసుకున్నాడు.
"అదేమిట్రా భోజనాలప్పుడు తయారవ్వావ్ ఎక్కడికీ?" అతని తల్లి విచిత్రంగా చూస్తూ అడిగింది.
"ఎక్కడికీ లేదులేవే అలా మా ఫ్రెండ్ ఇంటికెళ్ళొస్తాను" అన్నాడు వంశీ.
"మీ మామయ్యకు మామయ్య చనిపోయాడట. మనిషిచేత చెప్పి పంపించారు. మనింటి తరపున ఎవరయినా వెళ్లుంటే బావుండేది. నేనెటూ వెళ్ళలేని స్థితిలో వున్నాను కదా అందుకే నిన్ను పంపిద్దామని చూస్తే కనిపించకపోతివి" అంది అతని తల్లి.
"మామయ్యవాళ్ళు ఎదురుపడ్డారులేవే. కొత్త పెళ్ళికొడుకు చావులకి రాకూడదట. శాస్త్రం ఒప్పుకోదని చెప్పాడు. అందువల్ల నిలిచిపోయాను. నువ్వు భోజనం చేసేయ్. నేను ఆలస్యంగా వస్తాను" అన్నాడు వంశీ.
ఇక ఏమీ మాట్లాడలేక ఆమె కొడుకువైపు నిస్సహాయంగా చూస్తుండిపోయింది. చావుకి ఎవరో ఒకరు వెళ్ళలేకపోయామన్న బాధ ఆమెను కృంగదీస్తున్నా అతను అదేమీ పట్టించుకోకుండా బయటికి అడుగువేశాడు.
ఎండా వెన్నెలంత హాయిగా వుంది. గాలి తన శోభనానికి ముత్తయిదువలను పిలవడానికి అటూ ఇటూ తిరుగుతున్నట్లే ఉంది. ఆకాశం చందనాన్ని రాసుకోవడానికి ఉపయోగించే రాతిపలకలా వుంది. అక్కడక్కడా వున్న మబ్బులు అగరొత్తుల పొగ ఆ రూపం దాల్చినట్లు కనిపిస్తున్నాయి.
ప్రకృతంతా తనకు సహకరిస్తున్నట్లు అనిపించింది వంశీకి. ద్రాక్షపళ్ళ వైన్ లో మనసును ఊరబెట్టినట్లు మత్తుగా వుంది. మగ్గం మీద దూదిని ఏకినట్లు శరీరాన్ని ఎవరో ఏకుతున్నట్లు ఉద్వేగం ప్రకంపనాలను పుట్టిస్తోంది. అతను వీధి మలుపు తిరిగాడు. కొత్త పెళ్ళికొడుక్కి దిష్టి తీయడానికి పసుపునీళ్ళ పళ్ళెంను సిద్దం చేసినట్లు గోపీరంగుతో మెరిసిపోతున్న సత్యనారాయణగారిల్లును చూస్తూనే అతని నరాలన్నీ గొడుగు చువ్వల్లా విచ్చుకున్నాయి.
ఇంటిపక్క నుండి నడిచి దొడ్లోకి వెళ్ళాడు. ఎవరూ లేరక్కడ చాలా నిశ్శబ్దంగా వుంది.
