Previous Page Next Page 
రారామాఇంటిదాకా పేజి 27


    "సుజనా! సుజనా!" మెల్లగా పిలిచాడు.
    
    హాల్లో సోఫా మీద కూర్చున్న సుజన తమను ఎవరో పిలుస్తున్నట్లనిపించి బయటికి వచ్చింది.
    
    వంశీని చూడగానే ఆమెకు ఏడుపు తన్నుకొచ్చింది. భోరున ఏడుస్తూ అతని దగ్గరికి వడివడిగా వచ్చింది.
    
    ఈ హఠాత్ పరిణామానికి అతను బెంబేలు పడిపోయాడు. తన శోభనం ఉద్రేకం మీద కన్నీళ్ళ వర్షం కురుస్తున్నట్లు గిలగిల లాడిపోయాడు.
    
    "ఏమైంది? ఎందుకేడుస్తున్నావ్?"
    
    "మాతాతయ్య చనిపోయాడు. అమ్మా వాళ్ళంతా ఇప్పుడే బయల్దేరి వెళ్ళారు"
    
    అప్పుడర్ధమైంది ఆమె ఎందుకేడుస్తోందో అతనికి. అర్ధం కాగానే నవ్వు జలపాతంలా దూకింది.
    
    నవ్వుతున్న అతన్ని ఒక్క క్షణం విస్మయంతో చూస్తుండిపోయింది.
    
    "మా తాతయ్య చనిపోతే నీకు నవ్వు వస్తోందా?" నిష్టూరం పోయింది.
    
    "దాని వెనక చిన్న మెలిక వుంది. లోపలికెళదాం. పద చెబుతాను" ఆమె భుజం మీద చేయివేసి నడిపించుకెళ్ళాడు.
    
    ఇద్దరూ సోఫాలో కూర్చున్నారు.
    
    "ఇంతకీ పూలపొట్లం ఎక్కడ?" అతను నాలుగువేపులా చూస్తూ అడిగాడు.
    
    ఎవరన్నట్లు చూసింది.
    
    "సుబ్బులు"
    
    "అది పూలపొట్లమా? అలాంటి కాంప్లిమెంట్లు, ఉపమానాలు ఉపయోగించావంటే నేను ఊరుకోను" చిరుకోపం ఎర్రగా పులుముకుంది ఆమె ముఖం మీద.
    
    "ఇంకెప్పుడూ నీ ముందు అననులే"
    
    "అంటే ఇంకెవరి దగ్గరయినా అంటావా?"
    
    "ఛీ ఛీ - అలాంటిదేమీ లేదులే నా మాటలకు ద్వంద్వార్దాలు వుండవు. ఇంతకీ ఎక్కడికెళ్ళింది?"
    
    "ఇంటి దగ్గర ఏదో పనుందని వెళ్ళింది"
    
    "ఎప్పుడొస్తుంది?"
    
    "సాయంకాలం"
    
    "హమ్మయ్య మన శోభనానికి చివరనున్న అడ్డంకి కూడా తొలగిందన్న మాట"
    
    "శోభనమా?" ఆమె ఆశ్చర్యపోయింది.
    
    "శోభనమే కాకపోతే మన ఫస్ట్ నైట్ డే టైమ్ లో జరగబోతోంది అంతే"
    
    "నాకేమీ అర్ధం కావడంలేదు"
    
    "అర్ధం కాకపోవడానికి ఇది పజిల్ కాదు. ఫస్ట్ నైట్ యిప్పుడే మన శోభనం త్వరగా తయారవ్"
    
    "నీకు ఏమయినా పిచ్చి పట్టిందా? అవతల తాతయ్య పోయి నేను ఏడుస్తుంటే తగుదునమ్మా అని శోభనానికి ఎంచక్కా తయారయ్యావ్"
    
    "అదా నీ బాధ? కానీ అసలు రహస్యం చెప్పేస్తున్నాను. మీ తాతయ్య పోలేదు."
    
    ఆమె ఆశ్చర్యంతో బిగుసుకుపోయింది.
    
    "ఔను ఆయన నిక్షేపంలా తాంబూలం రోలులా వున్నాడు. నేనే ఈ డ్రామా అంతా ఆడాను."
    
    అప్పటికి ఆమెకు కొంత అర్ధమైంది. తాతయ్య చనిపోలేదన్న ఆనందం లీలగా మెదిలింది.
    
    "డ్రామానా?"

    "అవును ఆ టెలిగ్రామ్ ఇచ్చింది నేనే"
    
    "నువ్వా?"
    
    "ఎందుకలా మాట మాటకీ ఆశ్చర్యపోతావ్! ఈ ఐడియా నాదే.  'పూల పల్లకి' ఫెయిలయ్యాక - మొదటి ప్లాన్ కి నేను పెట్టుకున్న కోడ్ లే పూలపల్లకి అంటే. ఈ పథకం పేరేమిటో తెలుసా? రవ్వల నెక్లెస్ - బావుందా? ఇక అసలు విషయానికి వస్తే మీ తాతయ్య పోయినట్లు టెలిగ్రామ్ ఇస్తే అందరూ వెళతారని తెలుసు. నువ్వు కొత్త పెళ్ళి కూతురివి గనుక నిన్ను పిలుచుకు వెళ్ళరని ఊహించాను. మీ నాన్న కత ఏంటో నాకు తెలియంది కాదుగా. ఆయనలాంటివాడు ప్రపంచంలో వుండడు. ప్రతిదానికి జాతకాలు, రాహుకాలాలూ, యమగండాలు చూసే వ్యక్తి ఏ పనీ చేయలేడు. పని జరక్కుండా అడ్డుపడడం తప్ప"
    
    "మొత్తానికి బ్రహ్మాండమైన ప్లాన్ వేశావే. కానీ తన తమ్ముడు పోయాడని ఏడుస్తున్న బామ్మను తలచుకుంటుంటే మాత్రం జాలేస్తోంది"
    
    "ఆ దుఃఖం అంతా ఎంతసేపులే ఆ ఊరికి వెళ్ళగానే విషయం తెలిసిపోతుంది. తమను ఆట పట్టించటానికి ఎవరో టెలిగ్రామ్ ఇచ్చారని అనుకుంటారు. ఇక భోజనాలు అవీ చేసి, కాసేపు ముచ్చట్లాడి బయలుదేరేసరికి సాయంకాలమవుతుంది. ఈలోగా మనది...." ఆపై చెప్పలేక ఆమెపై వాలి అలానే గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు.
    
    ఆమెకు శరీరమంతా జివ్వున లాగినట్లయింది. సుఖాన్ని కూరిన డైనమెట్లు రక్తంలో పేలినట్లు ఏదో తెలియని పులకరింత ఊపేస్తోంది.
    
    అతను ఆమెను లేవదీసి, బెడ్ రూమ్ లోకి నడిపించుకు వెళ్ళాడు. ఇద్దరూ మాట్లాడుకోవడం లేదు.
    
    కోరిక క్షణ క్షణానికి పెరిగి మొత్తం శరీరాన్నంతా ఆక్రమించుకుంటోంది.
    
    అంతకు ముందు తెలియని సుఖం కోసం మనసులు రెండూ వెదుక్కుంటున్నాయి.
    
    ఆమె అలానే బెడ్ మీద వాలిపోయింది.
    
    స్వర్గం వాకిట ముందు పెట్టిన ప్రమిదల్లా ఆమె కళ్ళు మెరుస్తున్నాయి. ఎర్రజీరలతో ఆహ్వానాన్ని రాస్తున్నట్లు అవి అటూ ఇటూ కదులుతున్నాయి. ఎద పొంగి, ఏదో వత్తిడి కోసం చూస్తున్నట్లు మరింతగా బిగుసుకుంది. అతని స్పర్శ కోసం తపస్సు చేసి చిక్కిపోయినట్లు నడుం సన్నగా కనిపిస్తోంది.
    
    శృంగార కావ్యాలను రాయడానికి వుంచుకున్న రసాయనాల ఇంకుబుడ్డిలా బొడ్డు లోతుగా వుంది. ఆపైన జరుగుతున్నదేమిటో అర్ధం కాకూడదని కాబోలు చీర మరింతగా మడతలు పడింది.
    
    అతను పక్కగా పడుకుని ఆమెని తన వేపు తిప్పుకున్నాడు. ఒక్కసారిగా కనకాంబరాల పూలతోట పక్కకి ఒత్తిగిలినట్లు అనిపించింది.
    
    ఆమె మూడంకె వేసి మరింతగా ముడుచుకుపోయి అతని వేపుకి జరిగింది. చేమంతుల పూలమాల శ్వాస తాకిడికి మెలికలు తిరిగినట్లు ఫీలయ్యాడు.
    
    ఇక తాళలేక తన కుడిచేతిని అతని మీద వేసి గట్టిగా బిగించింది. ఎర్ర మందారాలు ఒక్కసారిగా మీద రాలినట్లు పులకరించి పోయాడు.
    
    కళ్ళెత్తి కోరికతో విశాలమైన ఛాతీకేసి చూసింది. నందివర్ధనాల రెమ్మ కళ్ళకు గంతలు కట్టేసినట్లనిపించింది. అతను తమకంతో పెదవుల్ని నుదుటిమీద అన్నాడు. సూర్యోదయం చిట్లి ముఖం మీద పరుచుకున్నట్లు ఉక్కిరి బిక్కిరయ్యాడు.
    
    పెదవుల్ని చెమ్మ చేశాడు - అమృత కలశం పగిలి అమృతం అంతా ఒక్కసారిగా గొంతులోకి దిగుతున్నట్లు తబ్బిబ్బయ్యాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS