Previous Page Next Page 
రారామాఇంటిదాకా పేజి 25


    అతను బలాన్నంతా చేతుల్లోకి తీసుకుని లాగాడు. కందిరీగలు కుట్టినట్లు బాధతో కమిలిపోయాను. అయిదడుగులా అయిదంగుళాలు మనిషిని నాలుగు అడుగుల పెట్టెలో పెట్టి బయటనుంచి చీలలతో బిగించినట్లు ముడుచుకు పోయాను.
    
    "ఏమిటలా బిగుసుకుపోతావ్! ఇలా అయితే అయినట్లే -" అన్నాడు. అప్పటికే నిస్సత్తువ నాలోని చైతన్యాన్నంతటినీ హత్య చేసింది. కాళ్ళూ చేతులూ వశం తప్పాయి. ప్లాస్టిక్ తో చేసినట్లు బిగదీసుకుపోయాయి. కళ్ళు వాటంతటవే మూసుకుపోతున్నాయి. శరీరం ప్రాణాన్ని కోల్పోయినట్లు చచ్చుబడిపోయింది.
    
    అప్పటికే ఆయన నాలో కలిసిపోవడానికి నానా తంటాలు పడుతున్నాడు. కానీ నా స్థితి అందుకు వీలు కల్పించడం లేదు. శరీరం గట్టిగా ఇనుములా తయారయింది. మెత్తదనం ఎక్కడో మాయమయి పోయింది.
    
    గుండెల్లో మంట మరింత ఎక్కువైంది నాకు. శరీరాన్ని వుండలా చుట్టి ముళ్ళ కంపమీద గిరవాటేసినట్లు కళ్ళలోంచి నీళ్ళు చిప్పిల్లు తున్నాయి.
    
    కనురెప్పలు మూతలుపడ్డాయి. ఆ బాధను మరిచిపోవడానికి నేనూ, మనోహర్ గడిపిన క్షణాలను బలవంతంగా గుర్తుకు తెచ్చుకున్నాను.
    
    మొదట - మనోహర్ డాబామీద వీడియో సినిమా చూడడానికి వెళ్లినప్పుడు అతని చేతి నా ఎదకు తగలడం - సుగుణ వాళ్ళింట్లో మనోహర్ గట్టిగా కౌగలించుకుని, బుగ్గలపై సుతారముగా ముద్దు పెట్టడం, వీధిలో వెళుతూ నన్ను చూసి కొంటెగా కన్ను గీటడం, గొబ్బీలు తట్టడానికి వెళుతున్నానని ఇంట్లో చెప్పి, శివాలయం దగ్గర కలుసుకోవడం, అన్నీ పుప్పొడిమీద అచ్చొత్తిన చిత్రాల్లా కన్పిస్తున్నాయి. ఏదో హాయి శరీరానికి రిలాక్స్ ని కలగజేసింది. జీవ కణాలన్నీ ఆనందాన్ని పీల్చుకుని సాగాయి. మనసు రంగుల తుఫానులో చిక్కుకున్న గాలిపటమే అయింది. రక్తం జ్ఞాపకాలతో మరింత చిక్కబడింది.
    
    నాలో కనిపించిన ఈ ఈజ్ కి నా భర్త ఓ క్షణం పాటు విస్తుపోయినట్లు ఒక క్షణం ఆగడం నాకు తెలియదు. నా మనసంతా మనోహర్ ఆక్రమించేసుకున్నాడు.
    
    ఆ క్షణంలో నేనెవరో, నేనెక్కడున్నానో మరిచిపోయాను. శివాలయం వరండాలో నేనూ, మనోహర్ కలిసి సుఖాల అంచులు పట్టుకుని స్వర్గానికి పాకుతున్నట్లే వుంది.
    
    "మనోహర్.... మనోహర్..." అంటూ నా భర్తని పట్టుకున్నాను. ఒక లిప్తకాలం పాటు ఆయన షాక్ తో గడ్డకట్టుకు పోయినట్లు నాకు తెలిసే అవకాశమే లేదు. నా హృదయమంతా, నా తనువంతా మనోహర్ తో నిండిపోయింది.
    
    "మనోహర్" ఈసారి మరింత గట్టిగా వాటేసుకున్నాను. నా ఉద్రేకాన్ని చూసి నా భర్త తన వయసు మరిచిపోయాడు. రెట్టించైనా ఉత్సాహంతో నన్ను పూర్తిగా ఆక్రమించుకున్నాడు.
    
    ఓ పావుగంట తరువాత నేను ఆ ట్రాన్స్ లోంచి బయటపడ్డాను. అప్పుడు గుర్తొచ్చాయి పరిసరాలన్నీ, పక్కనే అలిసిపోయి కనుగుడ్లను పైనున్న రూఫ్ కేసి గురి చూస్తున్న ఆయన్ను చూస్తూనే భయంలాంటిది జరజరా గుండెల్లో పాకింది.
    
    నేను కలవరించిన మనోహర్ ఎవరో చెప్పమంటాడని ఆయనవైపు చూడకుండా తల దించుకున్నాను.
    
    చిత్రం - ఆయన ఆ ప్రశ్న వేయలేదు అప్పుడే కాదు - మా పెళ్ళయిన మొదటి రాత్రి నుంచి ఇప్పటివరకూ ఆయన నా దగ్గరకు చేరిన ప్రతి రాత్రీ నేను కళ్ళు మూసుకోవడం తరువాయి ఆ పేరును ఉచ్చరిస్తున్నా ఆయన అడగలేదు.
    
    నేను ఈజ్ అయిపోవడం వల్ల రెట్టింపు ఉత్సాహంతో సుఖాన్ని జుర్రుకోవచ్చన్న స్వార్ధంతో ఆయన ఆ ప్రశ్న వేయడం లేదు. ఆ నాలుగు క్షణాలనూ భరించడం కోసం మనోహర్ ని కలవరించే టెక్నిక్ ను నేనూ విడవడం లేదు.
    
    జీవితంలో ఇంతభయంకరంగా రాజీపడడం నాకూ, నా భర్తకే చెల్లింది" కైవల్య చెప్పడం ఆపింది. అప్పటికే బాగా చీకటి పడింది.
    
                                                          *    *    *    *    *
    
    ఉదయం తొమ్మిది గంటలై వుంటుంది. తూర్పు ఆకాశంలో సూర్యుడు మండుతున్న చక్రంలా తిరుగుతున్నాడు. గాలి నులివెచ్చగా తగులుతోంది.
    
    సుజన అక్కయ్యలు ముగ్గురూ పెరట్లో వడియాలు పెడుతున్నారు. సత్యనారాయణరావు భగవద్గీత టీకాతాత్పర్యం చదువుకుంటున్నాడు అనసూయమ్మ వంటింట్లో కుస్తీలు పడుతోంది. సుజన బామ్మ డాబా మీద నుంచి కిందకు దిగి వరండాలో కూర్చుని వీధిన వస్తూ పోతూన్న జనాన్ని చూస్తోంది.
    
    సుజన ఇంకా నిద్ర లేవలేదు. రాత్రి చాలా పొద్దుపోయేవరకూ ఆమె కైవల్య చెప్పిన సంగతులన్నీ నోట్ చేసుకుంటూ వుండిపోయింది. ఏ మూడింటికో నిద్రలోకి జారిపోయింది.
    
    వడియాలు పెడుతున్న ముగ్గురూ మాటల్లో పడ్డారు. "మొన్న రాత్రి వంశీ ఇచ్చిన లడ్డూ తినగానే అంత నిద్ర ముంచుకొచ్చిందేమిటి మన ముగ్గురికి" సుజన పెద్దక్కయ్య ఉమ తన సందేహాన్ని వెలిబుచ్చింది.
    
    "అందులో మత్తు మందు కలిపి వుంటాడని నా నమ్మకం. అలా మనల్ని నిద్రపుచ్చి సుజన గదిలో దూరి, ఫస్ట్ నైట్ ఛాన్సు కొట్టేద్దామనుకున్నాడు కాబోలు. కానీ నేను సేకరించిన డేటా ప్రకారం అది చివరి క్షణంలో ఫెయిలయింది" రెండో అక్కయ్య రమాదేవి చెప్పింది.
    
    "అదెలాగ?" చిన్నక్కయ్య హేమ అడిగింది.
    
    "మన బామ్మకు నిద్ర మాత్రలు వేసుకుని నిద్రపోయే అలవాటు కదా ఆ రాత్రి మాత్రలు ఇవ్వకనే అమ్మ నిద్రపోయింది. లడ్డులోని మత్తు మందువల్ల కొంతసేపు నిద్ర్టపోయి తిరిగి లేచికూర్చుంది బామ్మ. అప్పుడు మన సుజన హీరో రంగప్రవేశం చేసాడు. బామ్మ అడ్డుపడింది. తన రూమ్ లో కలల్లో తేలిపోతున్న సుజన వంశీ రాకను గమనించలేదు. బామ్మ తన ఫస్ట్ నైట్ ప్రహసనాన్ని చెప్పడంతో అతగాడు జడుసుకుని ఉడాయించాడు."
    
    "లేకుంటే సుజన మన ఛాలెంజ్ లో నెగ్గేదన్న మాట" అంది ఇంకో అక్కయ్య.
    
    "అంతేకదా! ఆ దేవుడు బామ్మ రూపంలో వచ్చి మనల్ని ఆదుకున్నాడన్న మాట. లేకుంటే సుజన మనపై విజయగర్వంతో స్వారీ చేసేది."
    
    "ఇక నుంచి మనం జాగ్రత్తగా వుండాలి. భార్యాభర్తలిద్దరూ చాలా సీరియస్ గా ఈ ఛాలెంజ్ లో నెగ్గాలని చూస్తున్నారు"
    
    "ఓ.కే! అలాగే" ముగ్గురూ కూడబలుక్కున్నారు.
    
    హాల్లోంచి సత్యనారాయణ గొంతు శ్రావ్యంగా వినిపిస్తోంది. వంటింట్లోంచి మసాలా వాసన బరువుగా గాలిలోకి లేస్తోంది.
    
    బామ్మ వస్తూ పోతున్న జనం మీద సుబ్బులుతో కామెంట్ చేస్తోంది. అంత వయసులో కూడా ఆమె హుషారుగా వుంటుంది. తన వాక్ చాతుర్యంతో ఎదుటివాళ్ళను బురిడీలు కొట్టిస్తూ వుంటుంది.
    
    "ఆ వచ్చేది జయ కదా పెళ్ళికి ముందు సొరకాయలా వుండేది. ఇప్పుడేమిటి అలా ములక్కాడలా అయిపోయింది. కొంపదీసి మొగుడు దీన్ని ఒక్క క్షణం వదలడం లేదు కదా. ముందే వాడు సైన్యంలో పనిచేసి వచ్చినవాడు వైడ్కి ప్రతీదీ యుద్దంలా అనిపిస్తోందేమో" సుబ్బులు ఆమె మాటలకు నవ్వుకుంటూ వుండిపోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS