'బాధపడకమ్మా! ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం మానవ కనీస ధర్మం! కనీస ధర్మాన్ని నిర్వర్తించడం కూడా ఒక గొప్పేనా?' లాలిస్తున్నట్లుగా ఉన్నాయి రామం మాటలు.
'శారూ....! నీకు ఎన్నిసార్లో చెప్పాను. ఒకటికి పదిసార్లు మమ్ములను పొగడవద్దని. అయినా వినడం లేదు.' అని రామం వైపు తిరిగి 'బావా! ఇంకా మన ఊరి విశేషాలేమిటి?' ఆ సంభాషణను అక్కడికి త్రుంచుతూ అంది శాంత.
'ఏమున్నాయి. ఆస్పత్రి భవనం ముందు చక్కని పూలచెట్లు, క్రోటన్సు వేయాలను కుంటున్నాను. పూలమొక్కల గురించిన వివరాలు స్తీలకే ఎక్కువ తెలుస్తాయి. అందుకు మీ సలహా కావాలి.'
'బావా! ఆస్పత్రి చుట్టూ ఎర్రగులాబీ మొక్కలను వేయించు. ఎర్రగులాబీలు ఎంతో అందంగా ఉంటాయి. అవంటే నాకెంతో యిష్టం!'
'నీకు ఏ పూలు యిష్టమమ్మా?' శారదను చూస్తూ ప్రశ్నించాడు రామం.
'మల్లెపూలన్నయ్యా!'
'బాగుంది. మీ యిద్దరి అభిరుచులు, యిందాక మీరు చీరెలను ఎన్నుకున్నప్పుడే గ్రహించాను. మల్లెమొక్కల మధ్య ఎర్రగులాబీ మొక్కలను నాటితే మల్లెల మధ్య ఎర్రగులాబీలు పూస్తాయి.'
'అదేమిటన్నయ్యా? ఈ విషయంలో డాక్టర్ల సలహా తీసుకోవడం ఎంతో ముఖ్యం!'
'ఎందుకు?'
'వ్యాధులతో బాధపడే రోగులకు ఏయే రంగులు మనశ్శాంతిని కలిగిస్తాయో వారు శాస్త్రోక్తంగా తెలియజేయగలరేమో?'
'ఇంత చిన్న విషయానికి వారెందుకమ్మా? అన్ని రకాల పూలమొక్కలను తీసుకు వెడతాను. మీరు చెప్పిన మల్లె మొక్కలను, ఎర్రగులాబీ మొక్కలను ఎక్కువగా తీసుకు వెడతాను.' చిరునవ్వుతో అన్నాడు రామం.
శాంత చేతిగడియారాన్ని చూసిన శారద 'తొమ్మిధైంది. అన్నయ్యా యిక మేము వెడదాం' అంది.
'అలాగే! ఈ రోజు ముగ్గురమూ తాజు మహల్ హోటలులో భోంచేద్దాం! ఆ తర్వాత మీరు హాస్టలుకు వెడుదురుగాని.' అని లేచి మేన్ గేటువైపు మెల్లిగా నడక సాగించాడు.
అతనిని శాంత, శారదలు అనుసరించారు. భోజనానంతరం రామం సుందరం గదికి, వారిద్దరూ హాస్టలుకు వెళ్ళారు.
అలవాటు ప్రకారం తెల్లవారు ఝాము ననే లేచాడు రామం. నిత్యకృత్యాలు తీర్చుకొని బట్టలు మార్చుకుంటూ ఉండగా సుందరం వచ్చాడు.
'ఏరా! నీ డ్యూటీ అయిపోయిందా?' చిరునవ్వుతో సుందరాన్ని ప్రశ్నించాడు రామం.
'అయిపోయింది. రాత్రి ఎన్నింటికి వచ్చావు?'
'పది దాటింది.' అని రాత్రి ఎటు తిరిగిందీ వివరంగా చెప్పాడు.
'అలాగా! నేను స్నానం చేసి వస్తాను.' నీవు అలా కూర్చొని ఆ మాగజిన్లు తిరగేస్తూ ఉండు' ని మేగజిన్లను చూపుతూ బాత్ రూమ్ వైపు నడిచాడు.
'అలాగే! త్వరగా తెములు' అని అక్కడున్న వారపత్రికలను తిరగవేయసాగాడు రామం.
పదిహేను నిముషాలలో సుందరం తయారయ్యాడు. అప్పటికి ఏడు దాటింది.
'ఒరేయ్! నాకు చాలా అలసటగా ఉంది. ఇంత త్వరగా ఎక్కడికి వెడతాం? ఒకటి రెండు గంటలాగి బయలుదేరామంటే రాత్రి తొమ్మిది గంటల వరకు మన పనులు చూసుకోవచ్చు.' అన్నాడు సుందరం బద్ధకంగా ఆవులిస్తూ. అతని కళ్ళు రాత్రంతా నిద్రలేని కారణంగా ఎర్రబడి ఉన్నాయి.
'అలాగే! తొందరేముంది? విశ్రాంతి తీసుకో...' అన్నాడు రామం తన చేతిలో ఉన్న వారపత్రికలో 'జ్యోత్స్న' వ్రాసిన కధానికపై దృష్టి నిలుపుతూ.
ఆసక్తితో కధను చదవడంలో లీనమయ్యాడు రామం-
తొమ్మిది కాగానే వారపత్రికను అక్కడున్న టేబులు పై వేసి, సుందరం వైపు చూశాడు రామం. అలసటతో మంచం మీద ఒళ్ళు మరచి నిద్రపోతున్నాడు. అతనిని చూసిన రామం జాలిపడ్డాడు. అతనికి వైద్య వృత్తి పైననే సానుభూతి కలిగింది. వేళా పాళా లేకుండా పిలుపు రాగానే రోగులను చూడడానికి వెళ్ళవలసి వచ్చే డాక్టర్లపట్ల అతనికి అపారమైన గౌరవాభిమానాలున్నాయి.
'ఒరేయ్ సుందరం! అపర కుంభకర్ణునిలా అలా నిద్రపోతున్నావేంరా?' అని సుందరాన్ని తట్టి లేపాడు.
సుందరం బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ లేచి మత్తుగా ఆవలించాడు-
'ఏమిట్రా...? అప్పుడే నిద్ర లేపావేం?'
'తొమ్మిది దాటింది. ఆత్మారాముడు లోపల గోల చేస్తున్నాడు. మనం టిఫిను చేసే సరికి ఎలాగూ పది దాటుతుంది.' సుందరాన్ని తొందరపెడుతూ అన్నాడు రామం.
'ఏమిట్రా నీ హడావుడి? కాస్త నిదానించు.' అని బాత్ రూం లోపలికి వెళ్ళి వచ్చి డ్రెస్ చేసుకున్నాడు.
రూముకు తాళంవేసి యిద్దరూ టిఫిను చేయడానికి బయలు దేరారు. అక్కడికి దగ్గరలో ఉన్న ఆనందభవన్ లో టిఫిను చేశారు. హోటలు నుండి బయలుదేరి హాస్పిటలుకు కావలసిన పరికరాలు, ఫర్నీచరు సికింద్రాబాదులో ఎక్కడ దొరికినవి అక్కడ కొన్నారు. అన్నీ ఖరీదుచేసే సరికి సాయంత్రం ఐదు దాటింది.
'ఒరేయ్ రామం! ఏదైనా యింగ్లీషు పిక్చరుకు వెడదామా?' అడిగాడు.
'ఎందుకురా? పూలమొక్కలు కొని ..... మాట్లాడి రాత్రికి యింటికి వెళ్ళిపోతాను. పని ఐపోయిందిగా!'
'ఒరేయ్! ఒరేయ్!! ఒరేయ్!!! ఏమిట్రా ఈ అన్యాయం నాతోటేమో రెండురోజులు శలవు పెట్టించి నీవేమో ఈ రాత్రికే వెళ్ళి పోతానంటున్నావ్! ఇదెక్కడి న్యాయంరా బాబూ?' నవ్వుతూ అన్నాడు సుందరం.
'ఇంతత్వరగా పని పూర్తవుతుందనుకో లేదు. పని ఐపోయాక యిక యిక్కడ ఉండ బుద్ధి పుట్టడంలేదు. వెడ్తానురా!'
'తంతాను. ఏం మనిషివిరా నువ్వు! నీవు ఎప్పుడూ వస్తావుట్రా యిక్కడికి? పూల మొక్కలు రేపు కొనుక్కుందువుగాని. ఈరోజు రేపు నే చెప్పినట్లు వినవలసిందే! పద! టివోలీలో బ్రహ్మాండమైన యింగ్లీషు పిక్చరు నడుస్తూ ఉంది. చూద్దాం....!' ఎంతో ఉత్సాహం ప్రదర్శిస్తూ అన్నాడు సుందరం.
'ఒరేయ్! నాకు యింగ్లీషు పిక్చర్లు అర్ధం కావు. అయినా ఆ సభ్యతా సంస్కారాలు నాకు గిట్టవు' ముభావంగా అన్నాడు రామం.
'కిట్టకపోతే ఆచరణలో పెట్టడం మానేయ్! అంతేగాని చూడడంలో తప్పేముంది? ఏ విషయాలైనా తెలుసుకోవడంలో తప్పులేదుకద! తెలుసుకున్న తర్వాత ఆచరించడం నీ యిష్టా యిష్టాల మీద ఆధార పడి ఉంటుంది. చాలా బాగుంటుందిరా సినిమా! నామాట విని చూద్దూ!' బలవంతం చేశాడు సుందరం.
'నాకు యింగ్లీషు పిక్చరు అర్ధం కాదురా! పోనీ ఏదైనా హిందీపిక్చరుకు వెడదాం నాకు అర్ధమౌతుంది.'
'సరే! అలాగే! మరి దేనికి వెడదామంటావ్? 'దిల్ ఎక్ మందిర్' చాలా బాగుందట! నే చూళ్ళేదు.'
'అలాగే వెడదాం పద!'
సినిమాటైముకు యిద్దరూ హాలుకు వెళ్ళారు. వీరు వెళ్ళేసరికి న్యూసు మొదలైంది. సినిమా చూస్తున్నంతసేపూ యిద్దరూ ఒకరితో మరొకరు మాట్లాడు కోలేదు. ఆ పిక్చరు వారిని ఎంతగానో ఆకర్షించడంవల్ల తదేకధ్యానంతో చూడసాగారు.
సినిమా వదిలినతర్వాత దీర్ఘమైన ఒక వేడి నిట్టూర్పును విడిచాడు సుందరం. భోజనం చేయడానికి యిద్దరూ న్యూతాజువైపు నడుస్తూ కబుర్లలో పడ్డారు.
'ఎలా ఉంది పిక్చరు?' ప్రశ్నించాడు సుందరం.
'చాలా బాగుంది.
'అలా నిజజీవితంలో జరిగే అవకాశముందంటావా?'
'ఎందుకు జరగదు? చాలా సహజంగా ఉంది. ఆ సంభాషణలు, ఆ నటన ఎక్కడా ఔచిత్యం దెబ్బతినకుండా ఉన్నాయి.'
నిజంగా రాజేంద్రకుమర్ నటన ఎంతో అద్భుతంగా ఉంది!'
'సుందరం....నా ఉద్దేశ్యంలో రాజేంద్ర కుమార్ కన్న రాజుకుమార్ చాలా చక్కగా నటించాడు. అతడు చూడడానికి అందంగా ఉండడు కాని క్యారక్టరిశస్టిక్ యక్టరు. ప్రతిడాక్టరు తప్పక చూసి తీరవలసిన పిక్చరు. వైద్యవృత్తిలో రాగాద్వేషాలకు తావుండదని చక్కగా నిరూపిస్తుంది కధ. అబ్బ! ఆ పాపమరణం నా హృదయాన్ని కదిలించి వేసింది. ఎవరిమీదైనా హద్దుమీరి మమతలు పెంచుకోకూడదని చక్కని నిరూపణ చేస్తుందా సంఘటన. ఆ పాపపై అంతా మమతలు పెంచుకుంటారు. మరణించగానే అమితంగా దుఃఖిస్తారు. సినిమా ఎంతో బాగుందిరా! చివరి దృశ్యం చూసిన నేను కన్నీరు ఆపుకోలేక పోయాను.' ఆ సినిమాను ఎంతో మెచ్చుకున్నాడు రామం. ఇంతలో హోటలు చేరుకున్నారు వారు.
భోజనానంతరం గదికివెళ్ళి పడుకున్నారు. రాత్రి నిద్రలేని కారణంగా వెంటనే నిద్ర పోయాడు సుందరం.
రామానికి నిద్ర పట్టలేదు. సినిమాలోని సంఘటనలు అతనిమనసును ద్రవింపజేశాయి. ప్రేమించిన దొకరిని. పెండ్లాడిన దొకరిని. ఆ ప్రేమించిన వైద్యుని దగ్గరకే పెండ్లాడిన భర్తను వైద్యంకోసం తీసుకు వెడుతుంది. డాక్టరు లోగా తనప్రియుడని గుర్తించిన ఆమె మనసు గడియారం పెండ్యూలంలా ఊగిసలాడుతుంది. ఆ సమయంలో ఆమె మనస్తత్వాన్ని ఎంతో చక్కగా చూపించగలిగాడు ఆ డైరక్టరు. అసలు గొప్పతనమంతా ఆ కధలోనే ఉంది. పూవుకు తావి అబ్బినట్లు డైరక్షన్ ఎంతో చక్కగా ఉండడంవల్ల హృదయానికి హత్తుకుపోయేలా ఉంది ఆ సినిమా.
'ఆ పాప మరణంతో నాయిక పడిన మనస్తాపం వర్ణనాతీతం. గతంలో తనపై గల అనురాగంతో తనభర్త మరణానికి కూడా కారకుడౌతాడేమోనని వణికిపోయింది ఆమె. తనపై ప్రేమ చంపుకోలేక యింతవరకూ వివాహం చేసుకోని ఆ డాక్టరును అనుమానిస్తుంది. ఒకసారి వెళ్ళి ప్రాధేయపడుతుంది. తనకా దుర్భుద్దేలేదనీ, ఆమె భర్త ప్రాణాన్ని కాపాడడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తాననీ, ఆమెకు వాగ్ధానం చేస్తాడు ఆ డాక్టరు. కాని అతనిని నమ్మడానికి ఆమెకి ధైర్యం చాలలేదు. మరొక డాక్టరు దగ్గరకు వెడదామని భర్తను ఒత్తిడి చేస్తుంది.కాని భర్త నిరాకరిస్తాడు.
