Previous Page Next Page 
లోకం పోకడ పేజి 24


    "అయిన సంబంధం , మేనరికం చేతులారా నువ్వే కాదన్నావు కదురా నాయనా. అప్పుడు సరే నంటే ఎంత బావుండేది! ఇంతకీ రాసిపెట్టి ఉంటె ఎవ్వరూ చేరపలేరు. అదృష్టం అందల మెక్కిస్తానంటే బుద్ది బురద గుంట లోకి లాగిందన్న సామెత గా అయింది మన సంసారం. మీ నాన్న కేమో ఆ గొడవలు. ఎంతటి పేరు ప్రతిష్టలు , మర్యాదా తెచ్చుకున్నారో యిప్పుడు అందరికీ అంత విరోదులయారు. మన ఊరు ఏదో సమితి అవుతుందట. ఆ సమితికి ప్రెసిడెంటు కావాలని అయన తాపత్రయం. ఇంతకీ నా రోజులు బయట పడ్డాయ్యి" అని పమిట చెంగు తో కళ్ళు తుడుచుకుంది. సురేంద్ర కూడా మనస్సులో బాధపడ్డాడు.    
    "పోనీవమ్మా . ఎవరి జీవితాలు ఎట్లా గడవాలో అట్లాగే గడిచి పోతయ్యి. అదృష్ట హీనుడికి కావాలని ఎంత తాపత్రయపడ్డా అంటదు. అంతే" అన్నాడు.
    భోజనం పూర్తి చేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు.
    ఆ మర్నాడే రమేష్ వద్ద నుంచి ఉత్తరం వచ్చింది. తన పొలం వ్యవహారాలు చూసుకునేందుకు నాలుగు రోజులు సెలవు పెట్టి వస్తున్నాననీ , ఒక్క రోజు రామన్న పాలెం లో కూడా ఉంటాననీ వ్రాశాడు రమేష్. ఇంకా నాలుగు రోజులు వ్యవధి ఉంది.
    ఆ ఉత్తరం చదువుకుని సురేంద్ర ఎంతో పొంగిపోయాడు. ఎప్పుడు నాలుగు రోజులు గడుస్తాయో, ఎప్పుడు రమేష్ వస్తాడా అని రోజులు లెక్క పెట్ట సాగాడు.
    అనుకున్నట్లు గానే పండుగలు వెళ్ళాక రమేష్ వచ్చాడు. సురేంద్ర అమాంతంగా రమేష్ ను కావలించు కుని సంతోషాతిశయం తో వచ్చిన కన్నీళ్ళ తో రమేష్ భుజం తడిపాడు.
    "ఏరా , రమేష్! ఎంత దయ కలిగింది రా నామీద! మా ఊరు రావటం ఇదే మొదలు. అంతా కులాసాగా ఉన్నారా? మా చెల్లాయ్ వసుంధర కులాసాగా ఉందా? మీ అక్కయ్య కామాక్షి కులాసా? పొలం సంగతి ఏమయింది? ఎట్లా తేల్చుకున్నారు వ్యవహారం? చెప్పరా బాబూ!" అంటూ సంతోషంతో గబగబా మాట్లాడేశాడు సురేంద్ర.
    "అంతా కులసానే. వసుంధర చక్కగా ఉద్యోగం చేస్తున్నది. ఇప్పుడు యిల్లు మారాం. చింతల బస్తీలో ఇంకో పెద్ద యిల్లు తీసుకున్నాం. ఇప్పుడు అక్కయ్య కూడా వచ్చిన తరువాత యిల్లు చాలటం లేదు. అందుచేత ఇల్లు మార్చాం. ఇద్దరం సంపాయిస్తున్నాం గా.  అందుకని యింకో పది రూపాయలు అద్దె ఎక్కువ రాగా పోగా ఎక్కువ ఏమిటయ్యా అంటే మా యింటి వారి కోడలు ఒకావిడ ఉంది. ఆవిడకు యిద్దరు పిల్లలు. పెద్దది ఆడపిల్లకు అయిదేళ్ళు. రెండోవాడు మగపిల్లాడి కి రెండేళ్ళు. వాడు మా కామాక్షి అక్కయ్య కి బాగా మాలిమి అయినాడు. ఇరవై నాలుగ్గంట లూ వాడు మా యింట్లో నే ఉంటాడు. వసుంధర కు పిల్లలంటే యిష్టం లేదు. వాళ్ళు దొడ్డి కి వెళతారంటుంది. పక్కలు వేస్తె పాడు చేస్తారంటుంది. పుస్తకాలూ , పత్రికలూ చించు తున్నారంటుంది. ఆ పిల్లాడు రాగానే "పో బాబూ మీ అమ్మ దగ్గరికి పో' అంటుంది. వాడు వినిపించుకోకుండా , 'అత్తా' అంటూ మా అక్కయ్య బుజాల మీద వాల్డాడు. అక్కయ్య కు ఆ పిల్లాడంటే తగని ముద్దు. బాగానే ఉంటాడు లే ఆ కుర్ర వెధవ" అంటూ ఒక సిగరెట్టు వెలిగించాడు రమేష్.
    "బావుందిరా! మంచి కాలక్షేపమే మీకు. మీ వ్యవహారాలు ఏమయినయ్యి?"
    "రాఘవరావు ఎదురు తిరిగాడు. ఊళ్ళో వాళ్ళు ఎవరు చెప్పినా బుకాయిస్తున్నాడు. కోర్టు కు పోదామంటున్నాడు. వాడు మీ నాన్నకు లొంగుతాడనే ఆశ ఒక్కటుంది. పార్టీ రాజకీయాల్లో యిద్దరూ ఒక్కటే. మరి మీ నాన్నగారికి మన విషయం చెపుతావా?"
    "అంతవరకూ వచ్చిందే! సరే ఉండు. రాత్రికి నాన్నతో మాట్లాడుదాం. ఇంకా విశేషాలు ?"
    "శ్యామసుందరి బావున్నదా? ఎప్పుడయినా గుంటూరు లో కనుపించిందా? మాట్లాడావా?"
    "ఒక్కసారే మాట్లాడాను. ఎక్కువ  విశేషాలు లేవు. ఇప్పుడు శ్యామసుందరి చాలా బావుందిరా. వసుంధర మాదిరే అంత పొడుగూ ఉంది."
    "దిబ్బిన కుక్క కాదన్నమాట."
    "కాదు" అన్నాడు సురేంద్ర. ఏదో ఒక అనిర్వచనీయమైన ఆవేదన అతని మనస్సులో కలిగి మెల్లగా మాయమైంది.
    ఆ రాత్రి తండ్రి రాగానే విషయాలన్నీ చెప్పాడు సురేంద్ర. రామయ్య గారు అంతా విని, "అబ్బాయ్, రమేష్, నువ్వు మావాడి స్నేహితుడివి ఆ చుట్టరికం తోనే నీకు మాట సహాయం చెయ్యమంటావ్? రాఘవరావు తో రాజీ చెయ్యమంటావ్? అంతేకదూ" అన్నాడు.
    "అంతేనండి. మీరు పెద్దవారు. పలుకు బడి కలవారు. మీ ఊరి సమితి అధ్యక్షుడుగా ఎన్నుకోబడలానే నా కోరిక. మా వ్యవహారాల విషయం లో రాఘవరావు ని కాస్త దార్లో పెట్టె బాధ్యత మీ మీద పెడుతున్నా. తప్పక మాకు సాయం చెయ్యాలి." అన్నాడు రమేష్ ప్రాధేయ పూర్వకంగా.
    రామయ్య గారు చివరికి ఎట్లాగయితేనేం రాఘవరావు తో మాట్లాడి వ్యవహారం సరిచేసి పెడతానన్నాడు. రమేష్ ఎంతో సంతోషించాడు. సురేంద్ర, "మా నాన్న జీవితంలో యింత ఆప్యాయంగా మాట్లాడటం నేను పుట్టి బుద్దేరిగిం తరువాత ఎప్పుడూ వినలేడురా" అన్నాడు మెల్లగా రమేష్ తో.
    ఉన్న ఒక్క రోజూ ఎన్నో కబుర్లు చెప్పుకుని సంతోషంగా గడిపారు మిత్రులిద్దరూ. రామయ్య గారు ఈలోగా రాఘవరావు ను పిలిపించి వ్యవహరం చర్చిస్తాననీ, మళ్ళా ఎప్పుడు రావలసింది కొడుకు చేత ఉత్తరం వ్రాయిస్తాననీ చెప్పాడు. మర్నాడు ఉదయమే రమేష్ హైదరాబాదు వెళ్ళాడు. సురేంద్ర గుంటూరు వెళ్ళాడు.
    వారం పది రోజులు పోయాక రామయ్య గారు రాఘవరావు కు కబురు చేశాడు. ఏ రాజకీయాలు తనతో సంప్రదించటానికి పిలిపించారో నని రాఘవరావు వచ్చాడు. విషయమంతా రాఘవరావు తో సంప్రదించాడు. రాఘవరావు నీళ్ళు నమిలాడు. మాట సందర్భం లో అది ఫోర్జరీ కాంట్రాక్టు గానే మాట జారాడు. రాఘవరావు. నయానా, భయానా ఎన్నో చివాట్లు పెట్టాడు రామయ్య గారు. కోర్టుకు పొతే బండారం బయట పడుతుందని గట్టిగా చెప్పాడు రామయ్య గారు. చివరకు రాఘవరావు రాజీ మార్గం చెప్పాడు.
    "వాళ్ళ పొలం మూడేకరాల చిల్లరా, పాటి దిబ్బెల పొలం తో సహా నేనే తీసుకోవాలని ఉంది. అతనూ ఉద్యోగం చేస్తూ పట్న వాసస్థుడయాడు గాని, ఊళ్ళో ఉండి వ్యవసాయం చెయ్యటం లేదు కదా? పొలం అందుకని నేనే కొనుక్కుంటాను. ఎకరం మూడు వేల చొప్పున నాకు అమ్మే టట్లు ఏర్పాటు చెయ్యండి. పాత కాంట్రాక్టు రద్దు చేసుకుంటాను" అన్నాడు రాఘవరావు.
    ఉత్తరం వ్రాయించి కనుక్కుంటా నన్నాడు రామయ్య గారు.
    పల్లెటూళ్ళ లో కొంతమంది వ్యక్తులు ఉంటారు. బస్తీ ల్లో ఉద్యోగ రీత్యా ఉన్నవాళ్ళ పోలాలంటే వాళ్లకు మక్కువ జాస్తీ. ఉద్యోగాలు వదులుకుని వాళ్ళు వచ్చి వ్యవసాయం చెయ్యరు. వాళ్ళు మక్తాల వసూళ్ళ వేళకు వస్తారు. మళ్ళీ పొలం దగ్గరికి రావటం మరుసటి సంవత్సరమే. అలాంటి వాళ్ళ పొలాలు ఎంత చవకగా వస్తే అంత చవకగా కొనుక్కుని తామే అనుభవించాలని పల్లెటూరి రైతుల ఆశ. బస్తీల్లో ఉండెవాళ్ళ కు వాళ్ళు చెప్పినట్లు గా వినటం కన్నా గత్యంతరమూ లేదు. వాళ్ళను కాదని వాళ్ళు యితరులకు అమ్మనూ లేరు. అందుకనే ఉద్యోగాలూ చేసుకునే వాళ్ళ పొలాలు అంతంత మాత్రం గానే ఉంటాయి. ఆ ఇచ్చే మక్తాలూ , అమ్మితే వచ్చే ధరలూ చెప్పనక్కర లేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS