Previous Page Next Page 
ఆరాధన పేజి 25


    "ఎప్పు డొచ్చారు?"
    "ప్రొద్దున్న అనుకోండి. ఇల్లు చేరేసరికి దాదాపు పదకొండు గంటలైంది." కుమార్ మంజువైపు ప్రశ్నార్ధకంగా చూస్తూ అన్నాడు. అయ్యో-మరి భోజనానికి ఏర్పాట్లేం చేశావ్ మంజూ?
    పెద్దామె ఏదో అనబోయి నోరెత్తింది. కాని మంజు ఠకీమని చెప్పింది. 'హోటల్ నించి తెప్పించాను. ఇల్లు చాలదని డాక్టర్ అన్నపూర్ణ ఇంట్లో అంతా ఏర్పాటు చేశాను" మంజు కాఫీ అందించింది.    
    కుమార్ ముఖంలో ఏ భావం ద్యోతకం కాలేదు గంభీరంగానే వుండిపోయాడు. మీకు ఏది కావలసినా మంజు నడిగి చేయించుకోండి...ఆమె క్రొత్తది కాదుగా?....నన్ను క్షమించాలి ........ముఖ్యమైన పనుంది..." మంజు పాపను తీసుకుంది. కుమార్ తన గదిలోకి వెళ్ళి లైటు వేసుకుని పుస్తకాలు ముందేసుకుని కూచున్నాడు?    
    "మీ ఆయనకు మర్యాదలు తెలియవా మంజూ?" అంది పెద్దామె. తను ఓడిపోయిందని తెలుసు కుమార్ వ్యక్తిత్వ ప్రభావం ఏమో - అతడ్ని చూడగానే నోరు మూతపడిపోయింది.
    మంజు నవ్వింది. తనకెంతో గర్వంగా సంతోషంగా వుంది. "మర్యాదల సంగతి తెలియదు గానీ వదినా: పోయే ప్రాణాల్ని మాత్రం రక్షించగలదు రేపు ముఖ్యమైన ఆపరేషన్స్ వుంటే చాలా రాత్రివరకు చదువుకుంటారు. మీతో ముసలమ్మ కబురు చెప్పుతూ కూచుంటే అక్కడ ప్రాణాలు పోతాయి.....ఐనా మీకు కావలసింది నేను.....తనతో మాట్లాడాలని నీ కెప్పటినించి పుట్టిందీ అ.... అటు కోర్కె మాటలు నేర్చిన దానివి....'
    "నువ్వే నేర్పావేమో!"
    గంటగడచింది. ఏవో కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. మంజు తప్ప అందరు ఏదో నిరాశకులోనై అర్ధంలేని మాటలు మాట్లాడుతున్నారు.
    కుమార్ వచ్చాడు. అతని ముఖం నిర్మలంగా వుంది. అంటే తన అనుమానాలు నివృత్తి అయ్యాయన్నమాట.
    అతడు మౌనం దాల్చాడు మంజువారు వచ్చిన కారణాలను వరుసక్రమముగా అప్పగించింది.    
    "ఇవన్నీ మంజు చూచుకోగలదు .... కానీ మీ విషయం మాత్రం- మీ కిష్టమైతే నేను చూస్తాను.... లేకపోతే మరో డాక్టరుకు రికమెండ్ చేస్తాను. మీ యిష్టం"
    మంజు నవ్వింది..... "అన్నయ్యోయ్.....ఈ డాక్టరుగారు చూస్తే ఫీజులేదు. యాభై మిగిలి నట్లే.....మరొకరికి వంద ముట్టజెప్పాలి..."
    అన్న తటపటాయించాడు. ఇతని ద్వారా ఫ్రీగా మందిప్పించుకోవాలని ముందే అనుకుని వచ్చాడు. కానీ....మర్యాద తక్కువౌతుందని ఇలా జాగుచేస్తున్నాడు. మంజు చుర చుర చూచింది. "సర్జన్ మాదప్పదగ్గరకు తీసికోని వెళ్తానండి మీకెందుకు శ్రమ" అంది భర్తతో.
    "ఐతే.....ఇదికూడా సెటిల్ అయిందన్న మాటే" కాకికి ఎంగిలి చెయ్యి విదల్చని అన్నా వదినెల గుండె లెగిరిపోయాయి. వెంటనే అన్నాడు. "ఎవరో ఎందుకులెండి- మీరున్నారుగా- చూసి చెప్పండి"
    ఇంకా భోంచెయ్యలేదుగా - పదండి"
    ఇద్దరూ లేచి ఆఫీసు రూంలో కెళ్ళారు. పెద్ద వదిన వెళ్ళి గుమ్మంలోంచి తొంగి చూస్తోంది. కుమార్ పరీక్ష చేసే విధానం చూస్తోంటే వారిద్దరికి గౌరవం పుడ్తోంది, అతని ముఖంలో ఏభావం వ్యక్తం కావటంలేదు తలపైకెత్తిచేతితో కడుపు ఒత్తుతూ ఆలోచిస్తున్నాడు. అహస్తవ్యయానికి కళ్ళున్నట్లే- కడుపులోని అసాధారణ తను చూడగలవు? పరీక్ష ముగించి చేతులు కడుక్కుని టవల్ తో తుడుచుకుంటూ వచ్చాడు.
    "ఏ మంటారు డాక్టర్?"
    అన్న సంబోధనను విని మంజు సంభ్రమాశ్చర్యాలతో అన్నకేసి చూచింది. వదిన ముఖం ప్రక్కకు త్రిప్పుకుంది.
    "ఫలానా అని చెప్పటం కష్టం, మీరు చెబుతున్న గుట్టులను బట్టి కడుపులో పుండు వుండాలి. లేదా డ్యుడోనియం - అంటే అన్నకోశం చివర - చిన్న ప్రేవుల మొదలు కలుపుతూ ఒక 'లూస్" వుంటుంది. అది నొప్పి చేయవచ్చు. రేపు నాతోవస్తే ఇంకొన్ని పరీక్షలు చేసి, ఎక్స్ రే తీసి చెప్పగలను. ఇక్కడే చేయించకుంటానంటే మంజు అన్ని ఏర్పాట్లు చెయ్యగలదు."
    పెద్దామెకు వంక దొరికింది. "ఇంత అనుభవజ్ఞులు, ఇప్పుడు చేసిన పరీక్ష మేరకు మీకు ఏమి తెలుస్తోంది? చెప్పలేరా?"
    చివరిమాట అడిగిన విధానంలో కుమార్ ఆమె మన స్తత్వాన్ని అర్ధం చేసుకోగలిగాడు, మందహాసం చేస్తూ మంజు కేసి చూశాడు క్షణం.
    "నేను అనుభవజ్ఞుడను కానండీ....నేను పేర్చుకోవలసిన విషయాలు చాలా వున్నాయి. ఈ పరీక్షనుబట్టి కొంత చెప్పగలను......కానీ.....మంజుకు చెబితే అర్ధం చేసుకోగలదు" అతని ముఖం నిర్మలంగా వుంది.....అంటే "నీకు చెప్పినా అర్ధం చేసుకోలే" వన్న మాటేగా - ఆమె ముఖం నల్లబడింది, ఏమి గాలిదుమారం రేపుతుందోనని-మంజు భయపడింది. ఓ విధంగా భర్త జవాబు అమెకెంతో సబబైనదిగా తోచింది. నవ్వును దాచుకుంది.
    అప్పుడే వచ్చిన కళ్యాణి రాకతో వాతావరణం మారింది. కొడుకు కుమార్ దగ్గరకు పరుగు దీశాడు. వాడు పడకముందే ఎత్తుకుని తొడమీద కూర్చుండబెట్టుకున్నాడు. "నమస్కారం బావగారూ" అని పలుకరించి ఇటు తిరిగింది.
    "మీరంతా మా దగ్గర దిగనందుకు అత్తయ్య ఇదై పోతున్నారు..."
    "ఎలా వీలౌతుందమ్మా-నువ్వు వేరుగా వుంటే మా కిన్ని సమస్యలు లేకపోవును" మంజుకేసి కసిగా చూచింది.
    కల్యాణికీ తరహా జవాబులు వదినె నోట వినటం అలవాటైంది. "రేపు ఆదివారం- భోజనానికి అందర్నీ రమ్మని మరీ మరీ కబురు చేశారు. బావగార్ని చూచి చాలా రోజులైనట్లుంది....మీరు తప్పక రావాలి."
    ఔనమ్మా - చాలా రోజులే గడిచిపోయాయి. అమ్మ కులాసాగా వున్నారు కదా?.....రేపు భోజనం సంగతి...నాకు రావటానికి వీలుండదు."
    హమ్మయ్య - అనుకున్నారంతా.
    "ఎందుకని - రేపు మీకు కూడా సెలవేగా- పైగా అందరం కలసి సరదాగా...."
    "మంజు వస్తుందిలే- నాకు రేపొక్క రోజు సెలవు. ఎక్కడికి వెళ్ళాలని వుండదు......మంజూ నువ్వూ- పాప- పాప వద్దులే........."
    అతను పూర్తిచేయకుండా మంజు అంది నేను కూడా రానే కళ్యాణీ మరొక మారొస్తాంలే. అక్కయ్యకు, మీ అత్తగార్కి చెప్పు"
    కళ్యాణి కిదంతా అర్ధం కాలేదు. అందరి ముఖాల కేసి పరీక్షగా చూచింది.        
    "అదంతా నాకు తెలీదమ్మా - అత్తయ్య మాత్రం రేపు తప్పకుండా మిమల్నో మారు రమ్మన్నారు. బావగార్ని చూచి రెండు నెలలు దాటాయట."
    "ఐతే వస్తాంలే" కుమార్ సాలోచనగా అన్నాడు.    
    "ఐతే- మేము మరొక రోజు వస్తాంలే పక్షం రోజులుండేలా వున్నాం.
    పెద్ద వదిన మాటలకు కల్యాణి విస్తుపోయింది. ఆమెకు కుమార్ ను అందరు గౌరవించటం సహించలేకుండా వుంది.
    "చూడమ్మా రేపు గుడినుంచి అలా వస్తాం' భోజనం అదీ వద్దు.
    "అలాగే మరి..... వదినా-రేపు రాకపోతే ఆవిడ ఏమనుకుంటారు" ఏరా అన్నయ్యా - అలా నోటికి తాళంవేసి కూచుంటావేం,"
    "తాళంచెవులు వదిన దగ్గరున్నాయి" మంజు ఫకాల్న నవ్వింది. ఆ మాటకు ఆమెకే నవ్వు వచ్చింది. ఏదో కులాసాగా కబుర్లు చెప్పుకుని ఎక్కడివారక్కడకు వెళ్ళిపోయారు.
    మరుసటిరోజు ఆదివారం. పాపను ముస్తాబు చేసి భర్త ప్రక్కలో రిక్షాలో కూచోబెట్టింది. "సరిగ్గా పదకొండు గంటలకి కళ్యాణి వారింట్లో వుండు మంజు" అంటూంటే రిక్షా కడలి పోయింది. మంజుకు ఆ వేళ ఆఫ్ డ్యూటీ. అన్నా వాళ్ళ గదికి వెళ్ళింది. కుమార్, పాప చర్చికి వెళ్ళారని చెబుతూ కుర్చీలో కూచుంది.
    "ఏం- నువ్వూ వెళ్ళలేదేం!" వదిన వెటకారంగా అంది.    
    "వెల్తుంటాను.... ఇవ్వాళా మీతో కళ్యాణి వాళ్ళింటి కెళ్ళాలని మానేశాను" మంజు ముఖం లోని పరిహాస రేఖల్ని చూచి మూతి ముడుచుకుందామె.
    అందరు కలసివెళ్ళారు. ఓ అరగంట కూర్చున్నాక కుమార్ వాళ్ళు వచ్చేశారు లక్ష్మికి కూడా వాళ్ళుంటారేమోనని భయంగానే వుంది, మూర్తి. కళ్యాణి నిస్సహాయులైపోయారు. కళ్యాణి అత్తగారికి అంతా క్షుణ్ణంగా తెలుసు. కానీ ఆమె ఎవ్వరినీ ఏ విధంగా నొప్పించనూ సాహసించలేదు గుమ్మందాక వచ్చి సాగనంపుతూ అంది "బాబు-కుమార్- రాత్రిళ్ళు వున్నట్లుండి చాలా నీరసంగా అయి పోతున్నాను. ఒకసారి ప్రాణాలు కాపాడావు..... తీరికగా వచ్చిచూచి మరోమారు రక్షించుబాబు." ఆమె కళ్ళల్లో లీలామాత్రంగా అగుపించిన కన్నీరు చూచిన లక్ష్మి. పెద్దవదిన: పెద్దన్న ఎందుకో బాధపడిపోయారు:
    "రేపే వచ్చి చూస్తానమ్మా - నమస్కరించి అందరికీ చెప్పి వెళ్ళిపోయారు. కానీ "రేపు" ఆమెను చూడటానికి వీలులేకుండా - నిద్ధట్లోనే భగవంతుని సన్నిధానం చేరుకుంది కబురు విన్న కుమార్ అమితంగా చలించిపోయాడు. స్వంత తల్లిని పోగొట్టుకున్న వాడిలా దుఃఖించాడు. అందుకే- ఆమె ఆఖరిసారిగా చూడాలనికోరింది ఆమెకు తెలుసు- తన జీవితం పరిసమాప్తి కాబోతుందని! ఎంత దొడ్డ బుద్ధి- ఎంత వాత్సల్యం చూపేది- ఎంతటి విశాల హృదయం!
    యాంత్రికంగా తన దినచర్యలో మునిగి పోయాడు. మంజు అన్నగారు ఇంటర్వ్యూ కెళ్ళాడు. పిల్లలిద్దరికీ టాన్సిల్స్ తీసేశారు. హైదరాబాద్. సికిందరాబాద్ చూస్తున్నారు. పెద్దన్న కుమార్ తో ఆసుపత్రి కెళ్ళేవాడు ఎక్స్ రేలు, పరీక్షలు అయ్యాయి. ఆపరేషన్ చేయాలి కడుపులో ఏదో పుండున్నట్లు అది ఆపరేషన్ ద్వారానే నయమౌతుందన్నట్లు ముందుగానే వాళ్ళవూళ్ళో చెప్పారు. అదే మాట ఇక్కడా చెబుతున్నారు....కానీ....దీనికి మరో మందుకూడా వుంది;
    బలమైన ఆహారం తింటే ఆపరేషన్ అవసరంలేదుట! కుమార్ ఈ మాట చెప్పగానే అందరు విస్తుపోయినమాట అటుంచి- పెద్దావిడ కొంగు అడ్డంపెట్టుకుని నవ్వింది.
    "పరిహాస మాడుతున్నారా డాక్టర్" పెద్దన్న సీరియస్ గా అడిగాడు-
    "లేదు..... పరిహాసమాడటం దేనికి? అన్న కోశం- ఆహారాన్ని జీర్ణించే నిమిత్తం మూడుచుకుని చిన్నదై, తిరిగి పెద్దదౌతుంది. మీ అన్న కోశం త్వరగా ముడుచుకుంటోంది. అన్నకోశంలో హైడ్రోక్లోరిక్ ఆసిడ్ వస్తుంది ఈ ఆసిడ్ వల్ల అన్నకోశం పాడవకుండాలోపల ఒక పొర వుంటుంది. ఈ పొరను తినివేసేశక్తి ఆసిడ్ కు లేదు, తద్వారా అన్నకోశం దెబ్బతినడానికి వీల్లేదు. డ్యుడోనియం అన్నానే - దానిలో ఈ పొరలేదు. అందుకని ఆసిడ్ దాన్ని పాడుచేయగలదు. మీ అన్నకోశం చురుకుగా పనిచేయటంవల్ల కొంత ఆసిడ్ డ్యుడోనియంలోకి వచ్చే స్తోంది. కడుపునిండా వుంది. అన్నకోశానికి బాగా పని కల్గిస్తే ఈ ఆసిడ్ బైటికి రాకుండా లోపలున్న ఆహారాన్ని జీర్ణంచెయ్యగలదు. కారంపండ్ల రసాలు. లవంగ, సున్నం తప్ప-సాధారణ బలమైన భోజనం మీరు తింటే అంతా సర్దుకు పోయి పుండు మానిపోగలదు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS