పులిచర్మం దులుపుతుండగా పెద్ద దొరగారి చూపు నామీద పడింది. మరుక్షణం లో పెద్ద దొరగార్ని చూస్తున్న చిన్న దొరగారి చూపు కూడా నామీద పడింది. చిన్న దొరగార్ని చూస్తున్న జనమంతా నాకేసి తిరిగారు.
గత్యంతరం లేకపోయింది.
నేను సరాసరి వెళ్లి దొరగారికి రెండు చేతులూ జోడించి నమస్కరించాను. దొరగారు తదేకంగా క్రింది నుంచి పైదాకా నన్ను పరీక్షించి "ఎవరు నువ్వు?' అని అడిగారు.
ఆ ప్రశ్నకు ఏ సమాధానం చెప్పాలో అప్పటి దాకా నేను ఆలోచించలేదు. ఆ క్షణంలో మనసుకు తట్టింది నోట్లో నుంచి వచ్చింది.
"అయ్యా! నేను జ్యోతిష శాస్త్రం బాగా చదువు కున్న వాణ్ణి. త్రికాలాలనూ పుక్కిట బట్టినట్లు చెప్పగలను. పరీక్షించి చూడండి. మీకు మెప్పు కలిగితే ఈ బీద బ్రాహ్మణుడి కి తగిన పారితోషక మిప్పించండి" అన్నాను.
చిన్నదోరగారు భయంకారా చార్లు కేసి చూశారు.
భయంకరా చార్లు గారు తల పంకించారు.
చిన్న దొరగారి పెదిమల పై కారు మేఘాల చాటు నుంచి వచ్చిన విద్యుల్లతలా చిన్న చిరునవ్వు తొంగి చూసింది. భయంకరాచార్లు గారు అరుగు మీదికి ఆహ్వానించారు. కుమ్మరి ఎల్ల మంద అనే నౌకరు ఎవరి అజ్ఞా కాకుండానే కొబ్బరి చెట్టు మీదికి ఎగబాకి, నాలుగు బొండాలు కొట్టి, నీరు గ్లాసుల్లోకి తోడి, నాకూ అందరికీ ఇచ్చాడు , సారాంశం -- నన్ను వారు అతిధిగా గౌరవించారు.
ముందు భయంకరా చార్లు గారు చేయి చాపారు. నేను అంతకు ముందు ఇలా జ్యోతిష్యం చెప్పలేదు. అయినా ధైర్యంగా అచార్లు గారి చెయ్యి అందుకున్నాను.
"మీ మేధా శక్తి గొప్పది. అలనాటి తిమ్మరుసుతో పోల్చదగ్గవారు. ఎన్ని కష్టాలు మీ చుట్టూ ముసురుకు వచ్చినా, ఆకాశం విరిగి మీద పడుతున్నా, మీ మేధ వాడి తగ్గదు. పాదరసం లా పరుగెత్తి ఒక పరిష్కారాన్ని కనుక్కుంటుంది. ఆ దెబ్బతో సమస్యలన్నీ మబ్బుల్లా విడిపోతాయి. మీ సలహా మీ చుట్టూ పక్కలున్న వారికి అమూల్యమైంది " అన్నాను తాపీగా నిశ్చలంగా దైవ శాసనం చదువుతున్నట్లు.
అందరు భయంకరా చార్ల కేసి చూశారు. పెద్ద దొరగారు దవడలు నొక్కుకున్నారు. చిన్న దొరగారు ముక్కు మీద వేలేసుకున్నారు.
"నేనేన్నాళ్ళు బ్రతుకుతాను?' అన్నారు అచార్లు గారు.
"డెబ్బై రెండు" అన్నాను.
అచార్లు గారు తబ్బిబ్బై పోయి దొరగారి కేసి తిరిగి , "సరిగ్గా నా జాతకంలో అలాగే వ్రాసి ఉంది సుమా!' అన్నారు. జనమంతా మంత్రముగ్ధులైనట్లు నాకేసి చూస్తున్నారు. పెద్ద దొరగారు నొక్కుకుంటున్న దవడలు అలాగే ఉన్నాయి. చిన్న దొరగారి ముక్కు మీద వేలు అలాగే ఉంది.
మూడున్నర క్షణాల నిశ్శబ్దం తరవాత చిన్న దొరగారు ముక్కు మీద వేలు తీశారు. నుంచున్నారు. ఎల్లమంద దొరగారి కుర్చీని అరుగు పక్కకు జరిపారు. మళ్ళీ కూర్చొని దొరగారు చెయ్యి చాచారు. మహా ప్రసాదాన్ని స్వీకరించిన చందంబున నేను శ్రీవారి హస్తాన్ని అందుకొని, తదేకంగా అరచేతి లోకి చూశాను. పిచ్చి గీతలు తప్ప నాకేమీ కనిపించలేదు. ఏం చెప్పాలో అంతకంటే తోచటం లేదు. అక్కడున్న జనమంతా నా పెదిమల కేసి తదేకంగా చూస్తూ, నా నోటి వెంట వెలువడే ప్రతి శబ్దాన్నీ దివ్య నాదంగా అందుకోవటానికి సిద్దంగా ఉన్నారు.
నా మెదడు పని చేయటం మానింది.
సుమబాల ను వెతుక్కుంటున్నది.
రస భంగం ఔతుందని కళ్ళు మూసుకున్నాను. చీమ చిటుక్కు మన్నంత నిశ్శబ్దం. కాకి అరిచింది. పెద్ద దొరగారు కాకి కేసి చూసి మూడో కన్ను తెరిచారు. కాకి కావు మంటూ లేచి చక్కా పోయింది.
నేను నోరు విప్పాను.
"దొరగారూ, మీకు పదహారేళ్ళ నాడు ఒక జలగండం తప్పి ఉండాలే " అన్నాను.
చుట్ట అంటిస్తూ ఆగిపోయారు పెద్ద దొరగారు. వెలిగి మండుతున్న అగ్గి పుల్ల నుసి అయిపొయింది. "ఔను, బాబూ! భద్రాచలం సీతారామ కళ్యాణికి వెళ్లి వస్తున్నాం. చిన్న దొరగారికి అప్పుడు పదహారేళ్ళు ఉంటాయి. గోదావరి దాటుతున్నాం. ఒక మొసలి మా వెంట పడింది. దొరగారు దాని మీదికి దూకి బాకుతో పొడిచి చంపారు. కాని వరదగా వస్తున్న గోదావరి నుంచి బైటికి రాలేకపోయారు. సుడి గుండం లో ఇరుక్కుపోయారు. ఓ రెండు మైళ్ళు కొట్టుకు పోయారు. చిన్న దొరగారు పోయారని మేమంతా అనుకోని గుండె రాయి చేసుకుని, తిరిగి వస్తున్నాం. కొంత దూరం వచ్చేసరికి చిన్న దొరగారి పిలుపు వినిపించింది. ఆగి వెనక్కి తిరిగి చూశాం. దొరగారు తడిసిన బట్టలు పిండుకుంటూ రావటం చూశాము. ఇంతకీ జాతకం బాగుంది. బ్రతికి బైట పడ్డారు" అంటూ చెక్కిళ్ళ మీద నించి జారి, రాలి కల్వం లోని సిద్ద మకర ధ్వజం లో పడుతున్న బాష్పధారను తుడుచుకొని , చుట్ట వెలిగించారు పెద్ద దొరగారు.
సుమబాల వ్రాసిన ఉత్తరాలలో ఏ ఒక్క అక్షరం నేను మరిచిపోలేదు.
"మీ కింతమంది పిల్లలు, పేర్లివి. ఈ ఊరి దేవాలయపు ధర్మకర్తలు మీరు. ఈ చెరువు మీ తాతగారు తవ్వించారు. మీకు వేటలో గొప్ప నైపున్యముంది. అదృష్టానికి పొంగి పోవటం, దురదృష్టానికి కుంగి పోవటం మీ లక్షణం కాదు. పదిమందిని అజ్ఞాపించే జీవితం మీది. మీరున్న ప్రాంతంలో మీ ఉనికి గొడుగులా ఉండి, ప్రజలకు నీడ నిస్తుంది...." ఇలాగే చెప్పాను.
చిన్న దొరగారు విపరీతంగా సంతోషించి సత్రంలో నాకు బస ఏర్పాటు చేసి, 'రేపు వెళుదురు గాని' అన్నారు. బ్రాహ్మల చెవురు గట్టు మీద కట్టారు సత్రం. మూడు గదులున్నాయి. ఒకదాంట్లో సీతమ్మ గారని ఒక విధవావిడ ఉంటుంది.
ఆ పూట ఆవిడ వండి నాకు భోజనం పెట్టింది. నేను భోం చేస్తుండగా వంటింట్లో నుంచి తిట్లు వినిపించాయి.
"దీనమ్మ కడుపు కాల! జన మెత్త గానే సరా?సిగ్గూ శరమూ ఉండక్కర్లా. ఈసారి ఇంట్లో అడుగు పెట్టనీ, అట్లకాడ కాల్చి వాత పెడతాను, ఏముంది? వెధవ బ్రతికు. ఎక్కే గుమ్మం! దిగే గుమ్మం."
ఇలాగె తిట్టుకుంటూ సీతమ్మ గారు కొరివి కారం తెచ్చి నా విస్తట్లో గిరవాటు పెట్టింది.
"మామ్మ గారు, ఎవర్ని తిడుతున్నారు?' అడిగాను.
"పిల్లి, నాయనా . దీందుంప తెగ -- దీని కెంత తిండి కరువో. ఒక్కటీ దక్కనియ్యదు. సగం కాపరం దీంతో దుంప నాశనం అయిపోతున్నదనుకో" అంటూ గరిట విసిరింది పిల్లి మీద. కధల్లోని పేదరాసి పెద్దమ్మ గుర్తు వచ్చింది సీతమ్మను చూస్తె. కాని ఈవిడ పేదరాసి పెద్దమ్మ లా కధ ముందుకు సాగటానికి ఉపయోగించే మనిషిలా లేదు. ఎంత కదిలించాలో అంత కదిలించాను. లాభం లేకపోయింది. ఎంతసేపూ పిల్లుల్ని తిట్టడం, కాకుల్ని తోలటం తప్ప, ఆవిడ కీ ఇహలోక విషయాలేమీ పట్టినట్లు లేవు. ఆ సాయంత్రం మళ్ళీ దొరగారు కబురు చేశారు. సాయంత్రం అయిదింటికి సభ తీర్చారు. మళ్ళీ తెలివిగా అయిదారుగురి కి జోస్యం చెప్పాను.
రాత్రికి మళ్ళీ సీతమ్మ గారి చేతి భోజనం. "ములక్కాయ పులుసు నీ కిష్టమేనా , బాబూ" అంది. ఇష్టం లేదన్నాను. ఇంకేమిష్టం అని అడగకుండా వెనక్కి తిరిగి వంటింట్లో కి వెళ్లి, ఆ పూట ములక్కాయల పులుసే కాచింది సీతమ్మ గారు. సెగలు కక్కుతున్న పులుసు చేతి మీద పోస్తూ "నేను పేట్టిన ములక్కాయ పులుసు తింటే జన్మలో మరిచి పోరు బాబూ! పెదవడ్లపూడి కారణం గారి ఇల్లరికపుటల్లుడు పెరింబొట్లు పనిగట్టుకొని ఈ ఊరు వచ్చి నా చేత మునక్కాయ పులుసు కాపించుకొని, భోం చేసి వెళుతుండేవాడు!" అంది.
భోజనం చేసి పడుకున్నాను. జరగవలసింది ఆలోచిస్తూ. ఆకాశం నిర్మలంగా ఉన్నా రాధాల్లాటి మబ్బులు అందంగా మందంగా అప్పుడప్పుడు మసకలు వేస్తూ దిగంతాల కు సాగి చిన్నవై చీకట్ల లో కలిసి పోతున్నాయి. ఇంతదూరం వచ్చి తిరిగి రాలేక బయలుదేరాను. గేటు దాటాను. విశాలమైన మండువా ఇల్లది. లోపలికి వెళ్లాను. ఆ చీకట్లో అణు మాత్రం పరిచయం లేని ఆగుమ్మాలు దాటుకుంటూ ఎలా వెళ్ళానో గుర్తు లేదు. ఒక గదిలో నిద్రిస్తున్న సుమబాల కనిపించింది. ఆమెను గుర్తుపట్టాను. ఫోటోలో ఎలా ఉందొ అలానే ఉంది. ఏదో ఆనందం, ఏదో ఉత్సాహం , ఏదో ఉద్వేగం నా హృదయంలో నిండిపోయింది.
ఆమె చెక్కిళ్ళు తడిసి ఎర్రబడ్డాయి.
కళ్ళు తెరిచింది.
భయంతో, ఆనందంతో , ఆశ్చర్యంతో , సంభ్రమాశ్చర్యలతో ఉప్పెనతో సంద్రం లా పొంగింది. మెల్లిగా లేచి దొడ్లోకి వెళ్ళింది. నేనూ ఆమెను అనుసరించాను. దొడ్లో నారింజ లూ, సపోటా లూ, మామిడి మొక్కలూ తల విరబోసుకున్న దయ్యాల్లా నిలబడి ఉన్నాయి. తోట మధ్యలో ఒకే ఒక రావి చెట్టు ఆ కాళరాత్రికి అధిపతి అయినట్లు. తలఎత్తి నిలబడి రాజ్యం చేస్తున్నది.
రావి చెట్టు కింద గచ్చు అరుగు మీద కూర్చున్నాం. కీచురాళ్ళు, నక్కలూ సంగీతం పాడుతున్నాయి. పైన మహాంధకారంగా నా నరాల్లో వెచ్చదనం చిక్కబడి నన్ను లొంగ దీస్తుంది.
"ఎందుకొచ్చారు ?' అంది మెల్లిగా.
"నీకు తెలియదా?' అన్నాను.
"తెలుసు."
"మరి తెలిసి ఉండి ఎందుకు అడుగుతున్నావ్?"
"అందుకోసమే వచ్చారా?"
"ఔను."
"తప్పి కాదా?"
"కాదు."
"నేనంత పలచటి మనిషి ననుకున్నారా?"
"కోపం వచ్చిందా?'
"కోపం రాదా?"
"ఎందుకు రావాలి? ఏం చేశానని?"
"ఎందుకొచ్చారు మరి?"
"నీకు తెలుసుగా?'
"మీరింతకు తెగిస్తారను కోలేదు!"
"నువ్విలా ప్రవర్తిస్తావనుకోలేదు."
"రాగానే మీద పడతానను కున్నారా?"
"అద్రిస్తావనుకున్నాను."
'ఆదరించటం అంటే అర్ధం అదేగా మీకు!"
నవ్వాను,
"ఎందుకు నవ్వుతున్నారు?"
"నవ్వక ఏం చేయను?"
"ఏమీ చెయ్యలేరా?"
"అంటే?"
"నవ్వటం కోసం అంతదూరం నుంచి ఇంతదూరం వచ్చారా ?"
చేతులు ఆమెను చుట్టుకున్నాయి. విదిలించు కుంది. తోక తొక్కిన త్రాచులా బుసలు కొట్టింది.
"కోపం వచ్చిందా?" అన్నాను లాలనగా.
"రాదా?"
"మరెందుకు రమ్మన్నావు?"
"నే రమ్మన్నానా?"
"రావద్దని వ్రాయక పోయావా?"
"మీరు మంచి వారను కున్నాను. కాని...."
"ఊ....కాని...."
"ఎంత పొగరు?"
"పలావా పెడతానన్నావుగా మీ ఇంటికి వస్తే ...'
నవ్వింది సుమబాల. పువ్వుల జల్లు కురిసింది. ఆమె శరీరం చీకట్లో మెరిసింది. "పాపం" అంది.
"ఏం?' అన్నాను.
"మిమ్మల్ని చూస్తె జాలేస్తుంది."
"ఎందుకని?"
"నా దగ్గిర ఏముందని ఇంతదూరం వచ్చారు?"
నేను సమాధానం చెప్పలేదు.
"కోపం వచ్చిందా ?' అంది.
మాట్లాడలేదు నేను. లేచాను.
"వెళ్లి పోతున్నారా?' అంది.
"ఔను."
"మీ మనస్సు నొప్పించాను కదూ?"
"నీ ఆతిధ్యం అద్భుతంగా ఉందిలే."
దగ్గిరికి వచ్చింది సుమబాల. చేత్తో తల నిమిరింది.
"ఎంత వెర్రి వాడివి , బాబూ? నీలాంటి వాళ్ళతో వేగటం చాలా కష్టం.... మీ ముక్కు, గడ్డం ఇంత వాడిగా ఉన్నాయి గనకనే , మీ కంత కోపం . మిమ్మల్ని ఎవరు కట్టుకుంటారో గానీ, ఆవిడ అణగారి పోతుంది" అంది సుమబాల.
"నన్ను పెళ్లి చేసుకునే దేవరు?"
"ఎవరైనా చేసుకుంటారు కళ్ళ కద్దుకుని."
"నా మొహం వెలుతురులో నువ్వు చూడలేదు."
"ఎంత గర్వం అందంగా ఉన్నానని! మంచిది కాదయ్యోయ్."
"నువ్వు ఎప్పుడు పెళ్లి చెసుకుంటావ్?"
"ఎప్పుడు చేసుకో మంటావ్?"
"నన్నడగటం దేనికి?"
"నిన్ను కాక ఇంకెవర్ని అడుగుతాను? నువ్వు ఎప్పుడు చేసుకో మంటే అప్పుడు చేసుకుంటాను. ఎవర్ని చేసుకోమంటే వారిని చేసుకుంటాను."
"నన్నే చేసుకోమంటే?"
మెరుపు మెరిసి దివ్యకాంతుల్ని విరజిమ్మింది.
సుమబాల వణికి నాపై వాలిపోయింది.
