వెంటనే మణి "ఆ! జ్ఞాపకం వచ్చింది....ఆ కవరు లో ఏం ఉంది నే చెప్పనా?....నాకో మాటు బాబయ్య చెప్పాడు......ఏముందంటే ..." అంది...."ఏముంది ? అన్నాడు శంకరం . "ఏముందా? చెప్పనా? అంది మణి. సావిత్రి ":ఏవిటే అంత మురిపించుకు పోతావు ?....చెప్పు" అంది విసుగ్గా శంకరం కూడా మణి కేసి సీరియస్ గా చూశాడు.
దాంతో మణి భయపడిపోయి "ఈ కవరు లో పిన్ని ఉంది " అంది. సావిత్రి, శంకరం ఆ సమాధానం విని ఒక్క మాటు "ఆ" అని విస్తుపోయారు. వెంటనే సావిత్రి నవ్వుతూ 'ఏడిసినట్టుంది, కవర్లో పిన్ని ఉండడ మేవిటే నీ మొహం ?....ఏ పిన్ని ?" అంది.
"గోపాలం బాబయ్య పిన్ని-- నిజం!....నాకు బాబయ్య చెప్పాడు ఈ కవరులో పిన్ని ఉందని" అంది మణి అమాయకంగా-
"ఏడిసినట్టుంది ...తెలివి తేటలు నానాటికీ క్షీణిస్తున్నాయి . వెళ్ళు వెళ్ళు" అంటూ మణి ని కసురుకున్నాడు శంకరం.
మణి బిక్క మొహం వేసుకుని నిలబడింది.
"దాన్ని ఎందుకండీ మధ్యన తిడతారు ?....చెప్పింది అతనయితే......చిన్నపిల్ల దానికేం తెలుసు?......కవరుల్లో మానుషులే ఉంటారో మనుష్యుల కు సంబంధించిన సంగతులే ఉంటాయో దానికేమైనా తెలుసునా?..... ఇంతకీ ఆ కవరులో ఏముందో?....ఇందులో పిన్ని ఉందని గోపాలం అన్నాడు కనుక బహుశా గోపాలానికి నచ్చిన ఏ అమ్మాయి ఫోటో అయినా ఉండొచ్చు.....కవరు చింపండి చూద్దాం" అంది సావిత్రి.
"వాడి కవరు మనం ఎందుకు చింపడం? అందులో ఫొటోయే వుందో మరేదైనా రహస్యమైన సంగతే వుందో"
"మనకి తెలియని రహస్యాలు ఏముంటాయండి గోపాలానికి?....తను చేసుకోబోయే భార్య గురించి ఏడైనా రాసుకుని ఉంటాడు . అందుకే ఇందులో పిన్ని ఉంది అన్నాడు."
"అలా వాడి మనస్సులో ఉన్న విషయం ఏదో తెలిస్తే మంచిదే ?....వాడికి నచ్చిన పిల్లనే పెళ్లి చెయ్యవచ్చు "
'అందుకే కవరు చింపండి అంటున్నా చూద్దాం" అంది సావిత్రి.
అయిష్టంగా కవరు చింపి అందులో వున్న కాగితాన్ని తీసి చదవ సాగాడు శంకరం.
"ఈ ఉత్తరాన్ని విజయ ని వివాహమాడే వ్యక్తిని ఉద్దేశించి నేను రాస్తున్నాను. ఆ వ్యక్తీ ఎవరవుతారో నాకు తెలియదు. ఎవరయినా వారు విజయని పెళ్లి చేసుకోడానికి ముందు దాని గురించి పూర్తిగా తెలుసుకోవలసిన అవసరం ఉంది . పూర్తిగా తెలుసుకుని ఆ తర్వాత పెద్ద మనసు చేసుకొని ఉదారంగా ఆమెను వివాహం చేసుకోవాలనే నా ఆకాంక్ష .విజయ వివరాలు తెలియకుండానూ, తెలిసి కోవలసిన అవసరమేనా లేకుండా నూ ఎవరేనా దాన్ని పెళ్లి చేసుకోడానికి సిద్దపదవచ్చు. కాని అది శ్రేయస్కరం కాదు. అన్నీ తెలిసి చేసుకొనే వివాహమే దృడమైంది. అందుకే విజయకి సంబంధించిన ఒకటి రెండు సంగతులు ఇక్కడ రాస్తున్నాను. ఈ సంగతులు తెలుసుకున్నాక కూడా విజయ ని వివాహం చేసుకొనే ఉత్తముడూ, సంస్కరణాభిలాషి ఉండక పోడని నా విశ్వాసం. అసలు అలాంటి వ్యక్తీ అని నాకు నమ్మకం కుదిరేకే నేనీ ఉత్తరాన్ని అతనికి సీల్డు కవరులో పెట్టి అందించాలి అనుకుంటున్నా -- అటువంటి వ్యక్తీ ని నేను కోరుకొనేది ఒక్కటే ....ఈ జన్మలో విజయ కి ఈ సంగతు లేవీ తెలియనియ్య వద్దని , తెలిస్తే దాని లేత మనస్సు క్రుంగి పోతుంది.
ఇక-- విజయ విషయం -- విజయ నా చెల్లెలి కుమార్తె -- నా చెల్లెలూ నా బావమరిది పరమ ఛాందసులు. సంప్రదాయం కోసం ప్రాణాలయినా వదిలేసేటంతటి సనాతనులు-- నేనెంత ప్రార్ధించినా వినకుండా విజయ కి మూడో ఏట, నలభై ఏళ్ళ చయసులు అనే ఒకాయనకి మూడో భార్యగా వివాహం చేశారు. చయనులికి అంతక్రితమే ఒక ఉంపుడు కత్తే తో బాహాటమైన సంబంధం ఉండేది. రహస్యంగా తాగుడు, జూదం మొదలైన సర్వ సద్గుణాలు ఉన్నట్లు ప్రతీతి. అటువంటి వాడికి మూడేళ్ళ విజయ ని పెళ్లి చెయ్యడాన్ని చూడలేక పెళ్లి ఇంట్లో తగువు పెట్టుకుని నేను వచ్చేశాను ఆ తర్వాత పేకాట లో తగాదాలు వచ్చి ఉంపుడు కత్తే ఇంటిలో చయనునిని కొందరు రౌడీలు చంపేశారు. అప్పటికి విజయకి నాలుగేళ్ళు నిండలేదు. ఈ విధంగా విజయ బాల వితంతువు అయింది.

ఆ తర్వాత బెంగతో మా బావమరిది చనిపోవడం, నేను మా చెల్లెల్నీ నా దగ్గరికి వచ్చి ఉండమంటే "నువ్వు బ్రహ్మ సమాజ మతస్తుడివి , చచ్చినా నీ దగ్గరికి వచ్చి, నా సంప్రదాయమైన జీవితాన్ని నాశనం చేసుకోనని నిష్కర్షగా చెప్పేయడం జరిగింది. ఆ తర్వాత నా చెల్లెలు, విజయ ఎంటువంటి నికృష్టమైన జీవితం అనుభవించారో నాకు తెలియదు. డబ్బు కోసం నీతిమాలిన జీవితాన్ని చేపట్టిందనీ తిండి లేకపోవడంతో మంచీ మర్యాదా నా చెల్లెలు మరచి పోయిందనీ కొందరు స్నేహితులు చెబుతూ వచ్చారు. కాని నాకు నేటి వరకూ నమ్మకం లేదు. బ్రహ్మ సమాజ మతస్థుడైన అన్నగారి దగ్గరికి రావడానికే సందేహించిన వ్యక్తీ, తన సనాతన ధర్మాన్ని వదిలి అంత నీచంగా బ్రతుకుతుందా ?....ఏమో ? ..దేశంలో అనప్రద మాత్రం అది. ఆ తర్వాత పది సంవత్సరాలకి మా చెల్లెలి జాబు చూసుకొని నేను వెళ్ళడం, మరణ శయ్య మీద ఉండి నా చెల్లెలు విజయ నీ దాని భవిష్యత్తు ని బాధ్యతనీ నాకు అప్పగించడం జరిగింది.
ఇలా విజయ జీవితం చుట్టూ రెండు నీలి తెరలు ఉన్నాయి. ఒకటి ఆమె బాల వితంతువు -- రెండు ఆమె తల్లి జీవితాన్ని గురించి లోకంలో ఉన్న అపప్రధ -- ఇవి తప్ప తక్కిన విజయ జీవితం అంతా వెలుగు బాటే -- విజయ చాలా తెలివైనది-- చురుకైనది .. అందంలో కాని, గుణం లో కాని, శీల సంపద లో కాని ఎవరూ వేలెత్తి చూపించడానికి వీలులేని దీపం లాంటి పిల్ల అది --
అందువలన సంస్కార భావములున్న వ్యక్తీ , నాలాగే ఆ అపపదని విశ్వసించక, ఆ పైన విజయ బాల వితంతువని కూడా సంకోచించక ఆమెని వివాహం చేసుకొని నా యావదాస్తి కి హక్కుదారి కాగలడని ఆకాంక్షిస్తున్నాను.
విజయ జీవితానికి సంబంధించిన ఈ వివరాలని నేను ఎంత దూర దృష్టి తో వివాహానికి ముందుగానే తెలియ జేయాలని సంకల్పించానో , అదే దూర దృష్టి తో ఈ వివరాలు తెలుసుకున్న వ్యక్తీ కూడా, ఆమెకి తెలియపరచడని విశ్వసిస్తున్నాను.
విజయా, ఆమెని వివాహం చేసుకునే ఆ సంస్కార వంతుడైన యువకుడూ చిరకాలం హాయిగా జీవించాలని నిరాకారుడైన ఆ భగవంతుని సదా ప్రార్ధిస్తూ .
రామనాధం.
ఉత్తరం పూర్తీ చేసేసరికి శంకరం ముఖం ఎర్రగా అయిపొయింది. కోపంతో ఒళ్ళు అంతా వణికి పోతోంది. కళ్ళు చింత నిప్పులు లా ఖణఖణ లాడుతున్నాయి. ఆ స్థితిలో ఉన్న శంకరాన్ని చూసి భయం వేసి గట్టిగా అమ్మ చెంగు పట్టుకుంది మణి. "ఏం అఘాయిత్యం చేస్తారో' అని నిలువెల్లా వణికిపోతూ మణిని దగ్గరగా తీసుకుని నిలబడి ఉంది సావిత్రి.
"విధవా వివాహం చేసుకునే తమ్ముడు బతికి ఉంటె ఏం, చస్తే ఏం? .....దానికీ వాడికీ ఇప్పుడే ఉత్తరాలు రాసేస్తాను, మీకు మాకూ ఇంకా ఎటువంటి సంబంధం లేదని" అన్నాడు గట్టిగా శంకరం.
'తొందరపడతారెవిటండీ!" అంది సావిత్రి నెమ్మదిగా.
'నువ్వు నోరు ముయ్!....నేను తొందర పడుతున్నానంటావేమిటి?.... ఆ వీరేశలింగ బోధలన్నీ తల కెక్కి , రామనాధం కబుర్లన్నీ పని చేసి ఇవాళ ఒక మహా సంస్కార వంతుడు బయలుదేరాడు , తోళ్ళు ఒలిచేసేవాడు లేక ఇందంతా ఆ శేషయ్య వల్ల వచ్చింది . నేనే రాజమండ్రి లో ప్రాక్టీసు పెట్టి దగ్గరుండీ చదివిస్తే ఇలా తగలడి పోనా వాడు?....హు! ...ఈ సంగతేదో తేలుస్తా ' అంటూ పక్క గదిలోకి పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వెళ్ళాడు శంకరం. గోపాలానికీ, విజయ కీ ఉత్తరాలు రాయడం కోసం -----
