Previous Page Next Page 
ధర్మ చక్రం పేజి 24


                                          28
    ధర్మారావు ఆఫీసులో కి వెళ్లేసరికి పిడుగు వంటి వార్త-- గౌతమ్ జైలు నుండి అదృశ్య మయ్యాడు! కిటికీ ఊచలు వంచి రాత్రికి రాత్రి పారిపోయాడు!
    "సార్ సార్! అక్కడే ఈ ఉత్తరం కూడా దొరికింది సార్!"
    వార్డెన్ తెచ్చి అందించిన ఉత్తరాన్ని నివ్వెర పోయి నిలుచున్న ధర్మారావు యాంత్రికంగా అందుకున్నాడు.
    "చిరంజీవులు ధర్మారావు గారికి ----
    మీ పధకాన్ని పాడుచేసి పారిపోయానని భావించకండి. నేనంత నీచుడిని కాను. ఎవరు నమ్మినా నమ్మక పోయినా మీరు నమ్ముతారని నాకు నమ్మక ముంది, నేను నిజంగా దేశ ద్రోహిని కాను. కాని మీరన్నట్టు ఖర్మ వశాత్తు ఆ నిందను మోసి, ఓర్పుతో శిక్ష ననుభవిస్తున్నవాడిని. స్వార్ధం ఒక్కడిది; దేశం పలువురిది-- ఈ విషయం బాగా తెలిసిన వాడిని నేను. నాకు నా పై స్వార్ధం లేదు. కాని నావారి పై , నా దేశం పై ఉన్నది. అందుకే అనేక కష్ట నిష్టూరాలకు తట్టుకొని, ఇక్కడ నిలబడుతున్నాను.
    "నేను ఇలా పారిపోవడం చట్టాన్ని దిక్కరించడమే అవుతుంది. కాని ఒక ప్రయోజనం కోసం ఈ పని చేస్తున్నాను. దేశ క్షేమం ముందు ఈ నేరమూ, నా ప్రాణమూ కూడా చాలా అల్పమైనవిగా భావిస్తున్నాను. దయతలచి నాకోసం వెతకవద్దు. నేను వెళ్ళిన పని సక్రమంగా అయిపోతే తిరిగి నా అంతట నేనే వచ్చి పోలీసులకు లొంగి పోతాను. ఇదివరలో నేను రెండు సార్లు జైలు నుంచి పారి పోయినప్పుడు అంతే జరిగింది. నా అంతట నేనే తిరిగి వచ్చి జైలు లో ప్రవేశించాను. కాని, నన్నేవ్వరూ పట్టుకోలేదు. ఇప్పుడూ అంతే. నన్ను పట్టుకోవడం మానవ సాధ్యం కాదు. నేను వెళ్ళిన ఈ కార్యం అతి కష్ట మైనది. వివరంగా ఇప్పుడు చెప్పలేను. కాని ఆనతి కాలం లోనే అందరికీ ఇందులోని అంతరార్ధం తెలియగలదు. అయితే, ఈ కార్య సాధనలో నా ప్రాణాలే పోవచ్చు. ఒక సత్కార్యానికి దైవం ఇచ్చే ప్రతిఫలం అదే అయితే సంతోషంగా స్వీకరిస్తాను. కాని, నేను దేశ ద్రోహిని కాననీ, దేశం కోసం ఎవ్వరూ చెయ్యని త్యాగాన్ని చేసి, నిష్కారణంగా ఈ నిందను మోసి, ఈ శిక్ష ను ఇంతకాలం భరించా ననీ మాత్రం లోకానికి తెలియగలదు. అదే నా సంతృప్తి.
    "బాబూ! మళ్ళీ మిమ్మల్ని చూడగలనో, లేదో! ఇప్పుడే మిమ్మల్ని మనసారా ఆశీర్వదించి పోతున్నాను. దైవం మిమ్మల్ని చల్లగా చూడాలి. లోకానికే ఆదర్శ పురుషుడుగా చేయాలి. ఎన్ని అగ్ని పరీక్షలు ఎదురైనా నీతినీ, న్యాయాన్నీ విడనాడవద్దు. అప్పుడే నేనెక్కడున్నా నాకు తృప్తి. కాని, తండ్రి! ఒక్క హెచ్చరిక. అనుభవజ్జుడు గా , మీ హితైషిగా చెబుతున్నాను. ఈ లోకం లో ఎవ్వరినీ , ఎంత ఆప్త మిత్రుడైనా, గుడ్డిగా నమ్మవద్దు. అనర్ధాల పాలు కావద్దు. అడుగడుగునా జాగ్రత్తగా ఉండాలి. నీతి, న్యాయం, ధర్మాలకు నిలబడద మంటే కత్తి మీద సాము వంటిది. మీ మీద ఎందరో పగ బూని ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. ఇవే నా ఆశీర్వచనములు.'
                                                                                                 --గౌతమ్"
    క్రక్క దలిపోయిన ధర్మారావు ఒక్క క్షణం కళ్ళు మూసుకుని, మనో నిగ్రహం పొందాడు. కర్తవ్యం నిర్ణయించు కున్నాడు. కనులు తెరిచి ఒక్కసారి చుట్టూ కలయ జూచిన అతడి చూపులకు తట్టుకోలేక వార్డెన్లు, ఖైదీలు అందరూ కలవర పడ్డారు.
    "అబ్బే. ఈ వెధవల మీద జాలిపడ కూడదండీ..." అదను దొరికిన వార్డెన్ ఏదో చెప్పబోయాడు.
    'షటప్!' ధర్మారావు గర్జనకు అందరూ ఉలికిపడ్డారు.
    తమ నందరినీ ఏమంటాడో అనే భయ సందేహాలతో వణికి పోతున్న ఖైదీలను నిస్సహాయ పూర్వకమైన జాలితో తిలకించాడు.
    "ఒకరు చేసిన తప్పిదానికి అందరూ బాధ్యులు కాకపోయినా, ఇది అలుసుగా తీసుకో వద్దని అందరినీ హెచ్చరించ వలసి ఉంటుంది. సరే. జాగ్రత్తగా ఉండండి. ఎవరు తప్పించుకున్నా ఎక్కడికీ పోలేరు. ఎప్పటికైనా మళ్ళీ మాకు చిక్కేవాళ్ళే. జాగ్రత్త!' అంటూ జైలర్, వార్డెన్ , సార్జెంట్ లను చూస్తూ అన్నాడు: "మీరు అతి జాగ్రత్తగా కాపలా కాయవలసి ఉంటుంది. అవసరమైతే కొత్త పద్దతులను మనవచ్చు. కాని, అదను చిక్కింది కదా అని వాళ్ళను అనవసరంగా బాధలు పెట్టవద్దు."
    "యస్ సార్!' జైలర్ అయిష్టంగానే అంగీకారం తెలిపాడు.
    "అన్నట్టు గౌతమ్ దస్తూరీ తెలిసిన వాళ్లైవరైనా ఉన్నారా?"
    "మాకు తెలుసండీ." ముగ్గురు నలుగురు ముందుకు వచ్చారు.
    "అయితే ఈ దస్తూరీ అతడిదేనా?" ఉత్తరం చూసి ప్రశ్నించాడు.
    "అవునండీ."
    "యస్ సార్. అతడిదే." వార్డెన్ కూడా అన్నాడు.
    విషయం తెలిసిన పోలీస్ సూపరింటెండెంట్ , సబి న్సేక్తర్లు -- అందరూ అక్కడికి వచ్చేశారు. అప్పటికప్పుడే రిపోర్టు లు తయారై పోయాయి. రాష్ట్రం లో అన్ని పోలీస్ స్టేషనులకూ వార్తలు పంపే  ఏర్పాట్లు జరిగి పోతున్నాయి.
    విధి నిర్వహణ లోపం వల్ల జైలర్, సార్జెంట్ , వార్డెన్ లను తాత్కాలికంగా సస్పెండ్ చేశారు.
    "ఇది అన్యాయం." జైలర్ ధైర్యంగా అన్నాడు, అధికారులు అందరి ఎదుట.
    "ఏమిటది?' అర్జున్ ప్రశ్న.
    "దీనికి మేమంతమాత్రం బాధ్యులం కాదు," పెద్ద గొంతుతో అరిచాడు జైలర్.
    "ఖైదీల పై దయ అనీ, దాక్షిణ్యమనీ విప్లవం లేవదీసి, వాళ్ళ చేత వెర్రి గంతులు వేయించారు. అలుసు తీసుకొని వాడు పారిపోయాడు. ఈ తప్పు ఎవరిది? మీరూ మీరూ బాగుండాలి. మధ్యన మా ఉద్యోగాలకు స్వస్తి చెబుతారా?"
    "షటప్, ఈడియట్!" ధర్మారావు లో అంత కోపం కూడా ఉండడం చూచి, అర్జున్ తో సహా అందరూ ఆశ్చర్య పోయారు. "ఖైదీలను దయగా చూడడానికీ, నువ్వు డ్యూటీ ని విస్మరించి, ఆదమరిచి నిద్ర పోవడానికి ఏమిటి సంబంధం? ఖైదీ ఊచలు విరిచిన అలికిడి కాని, గోడ దూకిన శబ్దం గానీ తెలియకుండా ఏమయ్యారు , ఇంతమందీ?"
    "..........."
    "మాట్లాడరేం?"
    జైలు గోడలు కూడా దద్దరిల్లిన ఆ గర్జింపు తో అదిరిపడిన సార్జెంటు , "గస్తీ తిరుగుతూనే ఉన్నా ఏమీ వినపడ లేదండీ" అన్నాడు బెదురుతూ.
    "ఆ ఆ! అదే చెప్పేది. ఎందుకు వినపడలేదని? ఎప్పుడో రాత్రి వేళ జరిగిన నేరం. కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నాయి వంగిపోయిన ఊచలు. ఖైదీ లేడు! అయినా విషయం తెల్లవారి ఇప్పటికి గాని గుర్తింపు లేదంటే ఏమనాలి?"
    ఎవరి నుండీ సమాధానం లేదు. తలలు వాల్చి నిలబడ్డారు.
    "గౌతమ్ ఇప్పుడే కాదు. వెనక కూడా రెండు సార్లు పారిపోయినట్టు రికార్డులలో ఉంది. అప్పుడూ మీరేనా ఈ ఉద్యోగాలలో ఉన్నది?"
    "..........."
    "పలకరెం?' జైలంతా మరోసారి దద్దరిల్లింది.
    "చిత్తం . మేమే. "వార్డెన్ అన్నాడు.
    'అప్పుడేవరి పై వేశారు బాధ్యతను. నింద నూ?" హేళనపూర్వకమైన క్రోధం!
    మౌనమే సమాధానం!
    "సరే.' స్థిరంగా గంబీరంగా ఉంది ధర్మారావు కంఠం. "ఇదంతా ఒకరి ప్రయత్నాలకు ఆటంకమో, మరొకరి ప్రయత్నాలకు బలమో -- ఏమైతే నేం మొత్తం మీద కధ మాత్రం పెద్దదే. నేనెంత మెత్తని వాడినో, కర్తవ్య నిర్వహణ లో అంత కాఠినుడిని కూడా. ఈ లోపం ఎక్కడ ఉన్నా, కూకటి వేళ్ళతో పెకలించి పారేస్తాను. జాగ్రత్త. వెళ్ళండి."
    మరెవ్వరూ నోరెత్త లేదు.
    గౌతమ్ ను అన్వేషించటానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేసి వెళ్ళిపోతూ మరొక్కసారి ఖైదీ లను హెచ్చరించటానికి వెళ్ళాడు ధర్మారావు. తమ తమ పనులలో లీనమైన ఖైదీ లందరూ కూడా గౌతమ్ ను గురించీ, అతడి అదృశ్యాన్ని గురించీ రకరకాలుగా తమకు తోచిన రీతిని చెప్పుకొని వ్యాఖ్యా నిస్తున్నారు. నిశ్శబ్దంగా దూరాన నిలబడి ఆ మాటలను వినసాగాడు ధర్మారావు.
    "సెప్పె దొకటీ, సేసే దొకటీ. ఈ సదువు కొన్నోల్లూ, నీతులు సెప్పె పెద్దోల్లు అంతా ఇట్టాగే ఉంటారు లేరా, ఎంకా!"
    "ఆహే, ఊర్కో. గౌతమ్ బాబు మాత్రం అట్టాంటోడు గాదు. ఏదో పెద్ద కారణమే ఉండాల. మనకు తెల్దు. అంతే."
    "పెద్ద పెద్ద గునపాల నే అవలీలగా ఇరగదీస్తేసే బలంరా ఆయనది. గోడలకు గోడలు , చెట్లకు చెట్లు సూస్తుండగానే సునాయాసంగా దాటేస్తాడు. ఎనక యుద్ద కాలంలో సైన్యం లో పెద్ద ఉద్యోగమే సేశాడట!"
    "అవును. పాపం ఊరికె ఇంకెవరో ఏదో నేరం సేసి అది ఈయన పై పెట్టేసేరుట. నిష్కారణంగా ఈయనకీ శిక్ష ఎసేరట! పాపం! ఊరికే యిచారించడమే గాని, ఆయనకి పారిపోవాలని లేదురా , ఎప్పుడూ , ఏదో పెద్ద యవ్వారమే ఉండి ఉండాల."
    ధర్మారావు అన్ని విధాల వ్యాఖ్యానిస్తూన్నా బలరాం మాత్రం నిర్లిప్తంగా , మౌనంగా ఉండి పోవడం చూచిన ధర్మారావు కు కొంచెం ఆశ్చర్యమే అయింది.
    "నిన్న గౌతమ్ ధోరణి ఎట్లా ఉంది? మీరెవరైనా గమనించారా?" ధర్మారావు ప్రశ్న విని ఖైదీలు పనులు ఆపి నిల్చున్నారు.
    "ఇలా పారిపోబోతున్నట్లు గాని, మరే విషయ మైనా గాని మీ ఎవరితో నైనా చెప్పాడా?"
    "ఒక ఖైదీ ఏదో చెప్పబోయి తిరిగి జంకుతూ అటూ ఇటూ చూచి ఊరుకున్నాడు.
    "చెప్పు. భయం లేదు. మీ నేరం లేనంత సేపు మిమ్మల్నేవరినీ ఏమీ అనము." అభయ హస్తం ఇచ్చాడు.
    దానితో ఖైదీ కి ధైర్యం కలిగింది.
    ఒకతడు చెప్పాడు: "వారం రోజుల కిందట అయన పేపరు చదివి విశేషాలు మా కందరికీ చెబుతున్నారండీ......."
    "ఊ.....అయితే?"
    "ఏదో ఒక వార్త చదువుతూ చదువుతూ నే అయన ఖంగారు పడిపోయారు."
    "ఏం వార్త, అది?"
    కొంత తడవు ఆలోచించాడు ఖైదీ . తల గోక్కుంటూ అన్నాడు: "తెలియదు, బాబూ. కానీ అది ఏదో యుద్ధం వార్త. అంతవరకూ చెప్పగలను."
    "ఊ. తర్వాత?"
    'అది చూస్తూనే అయన ఖంగారు పడ్డారు. ఇక మా కేవరికీ ఏ వార్తలు , విశేషాలూ చెప్పలేదు. 'అలా జరగకూడదు. ప్రమాదం. ఘోరం. దేశాన్ని చూస్తూ చూస్తూ ఖర్మానికి వదిలి పెట్టను." అని గొణుక్కుంటూ , శివ మెత్టినట్టు అటూ ఇటూ పచారు చేశారు."
    విపరీతాశ్చ్జర్యం తో వింటున్నాడు ధర్మారావు.
    "ఆ తర్వాత మా ఎవరితోనూ కూడా అయన పూర్వం లాగా మాట్లాడలేదు. ఎప్పుడూ ఏదో అలోచిస్తున్నట్లే ఉండేవారు."
    మరో ఖైదీ అందుకున్నాడు : "అసలీ మధ్య అయన ఎక్కువగా ఏమిటో విచారంగా, తనలో తాను బాధపడుతూ, దుఃఖిస్తూ ఉంటున్నారు."
    ధర్మారావు కేమీ పాలుపోలేదు. అటు గౌతమ్ పై కోపమూ, తెచ్చుకోలేకుండా ఉన్నాడు; ఇటు అతడి చర్యను క్షమింపనూ లేకుండా ఉన్నాడు. ఇది తన ప్రయత్నాల కోక పెద్ద ఆటంకం. ఈ విషయం లో అధికారుల నుండి రకరకాల వ్యాఖ్యాలూ, విమర్శ లూ వినవలసి వస్తుంది. "ఏమిటి, గౌతమ్ ఇలా చేశాడు?' వ్యక్తిగతంగా అతడి పై సానుభూతి కలిగిందే కాని, వ్యవహారికంగా ఉద్యోగి గా మాత్రం అతడి గురించి ఏ విధంగా నూ సానుభూతి తో ఆలోచించ లేకపోయాడు. ఎన్నడూ కలగనంత అగ్రహవేశాలతో ఊగి పోయాడు.
    కారాగారం లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ పారిపోయినందుకు కోర్టులో కేసు రిజిష్టరయింది. దేశం క్లిష్ట పరిస్థితులలో ఉండగా ఒక దేశ ద్రోహి పారిపోవడ మనేది అధికార వర్గాలలో తీవ్రమైన అలజడి ని లేవదీసింది.
    ధర్మారావు ఆదర్శాలూ, సంస్కరణ లూ నచ్చక బాధపడిన వారందరూ తమకు దైవికంగా లభించిన ఈ అదనును అన్ని విధాలా తమకు అనువుగా ఉపయోగించుకుని కక్ష తీర్చుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.  


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS