27
శాంతినికేతనంలో పనిచేసే ఒకవడ్రంగి కొడుకు 'రాధూ'. పదేళ్ళవాడు. అప్పుడప్పుడు శాంతికి కావలసిన చిన్న చిన్న పనులు చేస్తుంటాడు. శాంతికి కూడా ఎందుకో రాధూ అంటే అభిమానం. అప్పుడప్పుడూ డబ్బులిస్తూంటుంది.
వాడే యిప్పుడు శాంతి దగ్గరకు పరుగు పెట్టుకుంటూ వచ్చాడు. శాంతినికేతనంలో సాయంకాల ప్రార్ధనాగీతం ముగిసింది. సందడి తగ్గి నిర్మలత ఆవరించసాగింది. పరధ్యానంగా కిటికీ దగ్గర నిల్చున్న శాంతి, రాధూ పిలుపుకు వెనక్కు తిరిగింది.
"ఏమిరా?" అంది నవ్వుతూ.

చేతిలోని చంగల్వపూలమాల శాంతికి యిచ్చి, "గోవిందరావు" అని చెప్పి పారిపోయాడు వాడు.
ఆశ్చర్యంగా, సంతోషంగా తీసుకుంది శాంతి. జడలో తురుముకోవడానికి వీలుగా ఆ మాలను మడుస్తూంటే చిన్న చీటీ జారి పడింది. ఆశ్చర్యంగా తీసి విప్పింది. 'మాట్లాడవలసిన పని ఉంది. ఒకసారి బయటకురా. తూర్పు చివర పొన్నచెట్టు క్రింద ఉంటాను.' సంతకం లేదు.
ఆ చీటీ చేతిలో ఉండగానే మనోరమ వచ్చింది. "ఒక చేతిలో పూలమాల, మరొక చేతిలో తెల్లకాగితం! రెంటికీ పొత్తు ఏమిటబ్బా?" హాస్యంగా వ్యాఖ్యానిస్తూ స్వతంత్రంగా ఆ కాగితం తీసుకుచూచింది. ఆలోచనా తరంగాలలో ఉన్న శాంతివదనం పరీక్షించింది. అర్ధమైనట్టు తలపంకిస్తూ "గోవిందరావేనా?" అనడిగింది.
'అవు'నన్నట్లు తలాడించింది శాంతి. కాని లోలోపల విసుక్కుంది. 'ఈ మనోరమ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియదు. ఇప్పుడే రావాలా? ఏమైనా కలగన్నదేమిటి?'
"ఏం నిశ్చయించుకున్నావ్?" అనడిగింది మనోరమ.
"వెళ్తాను!"
"శాంతీ!"
"అవును ఏం?"
"చాలా తొందర పడుతున్నావ్! అతడెలాంటి వాడో తెలియదు. అదీకాక ఎవరికైనా తెలుస్తే ఎలాగుంటుంది?"
"ఇందులో తప్పూ, రహస్యమూ ఏమున్నాయి? కొద్ది రోజులు పోయాక ఎలాగూ అందరకూ తెలుస్తుంది. అందరికీ ఆహ్వానాలు వెళ్తాయి."
"మంచిదే. కాని ఆ సమయం రాణీ. అంత వరకూ ఎటువంటి తొందరా ఉండకూడదు."
"బాగానే ఉంది. అది నిర్ణయించుకోవటానికైనా మాట్లాడుకోవాలిగా?"
కొద్ది సేపాలోచించింది మనోరమ. "ఒక పని చెయ్యి. నువ్వు ముందుగా వెళ్ళిపో. కొద్ది సేపటికి ఎందుకో వచ్చినట్లుగా అటు నేను వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను."
శాంతి ముఖం కొంచెం మాడింది. "నేను మరీ చంటిపిల్లను కాను లెద్దూ."
"అయితే అతడి కెలాగున్నా ముందు నీకే యిష్టం లేదన్నమాట నేను రావడం? 'ప్రేమ గ్రుడ్డి' దంటే యిదే గాబోలు!" అంది మనోరమ, శాంతిని నిశితంగా చూస్తూ.
శాంతి మాట్లాడలేదు.
కొద్దిసేపటికి "నేను వెళ్తున్నాను" అంటూ స్లిప్పర్లు తొడుక్కుని చకచకా వెళ్ళిపోయింది, మనోరమ వైపు చూడనైనా చూడకుండా మనోరమ నివ్వెరపోయింది. అయితే ఆమెకు కోపం రాలేదు. 'పోగాలము దాపురించినవారు మిత్రుని వాక్యమును, అరుంధతీ నక్షత్రమును, దీపనిర్వాణ గంధమును వివరు, కవరు, మూర్కొనరు..." నీతివాక్యం మనస్సులో మెదిలి జాలిగా నవ్వుకుంది.
* * *
"మల్లెపువ్వువంటి నీకు మల్లెపువ్వులలాటి దుస్తులే ఇష్టమా, శాంతీ?" పలుకరించాడు గోవిందరావు.
సిగ్గుతో తలవాల్చి అతడికి కొద్ది దూరంలో కూర్చుంది శాంతి, పచ్చికలో.
అతడు కళ్ళతోనే ఆమె సౌందర్యాన్ని రెప్ప వేయకుండా త్రాగేస్తున్నాడు.
పక్షుల కిలకిలలో ఏవో అస్పష్ట రాగాలాపనలు వినవస్తున్నాయి. సూర్యుడు పూర్తిగా అస్తమించాడు. ఇంకా కొద్దిగా సంజ వెలుగులు మాత్రం లోకాన్ని చుట్టి ఉన్నాయి. చంపకం విరగబూసినట్లుంది. ఆ సౌరభం తక్కిన సుమ సౌరభాలన్నిటినీ అధిగమించి స్వేచ్చా విహారం చేస్తూంది. చిరుగాలి చిగురుటాకులతో సరస మాడుతూంది.
"ఎందుకు కబురంపించారు?" ఎలాగో అడిగింది తలెత్తి శాంతి.
నవ్వాడు గోవిందరావు. "ఎందుకో తెలియధా?"
తిరిగి శాంతి కండ్లు లజ్జాభారంతో క్రిందికి వాలాయి. 'ఇతడిని అందగాడు కాదంటుందేమిటి, మనోరమ? హుందాగా లేకపోవచ్చు. మేలిమి పసిమిఛాయతో మెరియకపోవచ్చు. కాని ఆ నవ్వు, ఆ నేత్రాల తీక్ష్ణత ఎంత ఆకర్షణీయాలు!'
"చెప్పమంటావా, శాంతీ, ఎందుకో?" చిలిపిగా కళ్ళు చికిలించాడు.
కళ్ళెత్తి నవ్వింది శాంతి.
"సమక్షంలో శాంతి లేకపోతే అశాంతి రేగుతోంది. అందుకూ" అన్నాడు ఆమె ముఖం లోకి సూటిగా చూస్తూ.
శాంతి మాట్లాడలేదు కాని, ముఖం అరుణిమ దాల్చింది. పెదవులపై మందహాసం లాస్యమాడింది.
"నా మనస్సుకు శాంతి లభించాలంటే శాంతి నాదవ్వాలి" అన్నాడు ఒత్తి పలుకుతూ.
"ధన్యురాల్ని!" మైమరపుతో అంది శాంతి.
"ఆఁ! నిజమా, శాంతీ?" ఆశ్చర్యానందాలతో ముందుకు వంగి ఆమె చేయి పట్టుకున్నాడు. శాంతి అలాగే కూర్చుంది, ఏవోవిచిత్ర లోకాలలో తేలిపోతూ. చెయ్యి విడిపించుకోలేదు.
అంతలో మనోరమ అటుగా వచ్చింది, "శాంతీ" అంటూ.
ఇద్దరూ ఉలిక్కిపాటుతో చూచారు. సంధ్య వెలుగు లంతరించి చీకట్లు అలముకున్నాయి. విశ్వభారతి విద్యుద్దీప కాంతికిరణాలు ఆ చీకట్లను పూర్తిగా పారద్రోలలేకపోతున్నాయి. కళాభవనం నుండి ఎవరో ఆలపిస్తూన్న కాంభోజిరాగం వినవస్తూంది.
"నీకేదో టెలిగ్రాం వచ్చింది, శాంతీ" అంది మనోరమ.
శాంతి అయిష్టంగానే లేచి మెల్లగా మనోరమను అనుసరించింది, గోవిందరావు వద్ద సెలవు తీసుకుని.
శాంతితో వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మనోరమ, "క్షమించండి, గోవిందరావుగారూ" అంది.
"నో మెన్షన్" అన్నాడేకాని అతడి చూపు అప్రసన్నంగా ఉన్నట్టు మనోరమ గ్రహించింది.
హాస్టల్ లో ప్రవేశిస్తూ మనోరమ అంది: "క్షమించాలి, శాంతీ నువ్వు వద్దనుకున్నా స్నేహితురాలుగా నీ క్షేమం పై శ్రద్ధ చూపించకుండా ఉండలేకపోయాను. కోపంరాలేదు కద?"
శాంతి ముఖంలో క్రోధరేఖలు స్పష్టంగా తాండవిస్తున్నాయి. "ఇప్పుడు నా క్షేమానికేమొచ్చింది? నువ్వు శ్రద్దవహించి రక్షించే దేముంది ఇందులో?" క్రోధభావం స్పష్టంగా ద్యోతకమౌతూంది.
"అలాగా?" నవ్వింది మనోరమ భావగర్భితంగా. "ఎప్పటినుండో పెద్ద చనువూ, స్నేహమూ ఉన్నట్టు చెయ్యిపట్టుకు మాట్లాడుతున్నాడు. అంతకంటే ఆపద ఏముంది తెలుసుకుంటే?"
"......"
"క్షమించాలి, శాంతీ. అందుకే 'టెలిగ్రాం' సృష్టించాను, నిజం కాదు."
"ఆఁ!" ఆశ్చర్యపోయింది శాంతి.
"నీకు కోపమొచ్చినాసరే చెప్పేస్తున్నాను. నేనూ నీ వెనుకనే వచ్చాను. మాలతీ పొద చాటు నుండి అంతా విన్నాను. అతడి సంగతు లేమీ తెలుసుకోకుండానే అతడి మాటలకంత పరవశమై పోతావేమిటి? ఇద్దరు వ్యక్తులు వివాహం చేసుకోదలుచుకున్నప్పుడు ఒకరి కుటుంబం సంగతి ఒకరు క్షుణ్ణంగా తెలుసుకోవద్దూ?"
"నాక్కావలసింది అతడు. మిగిలినవేమీ నా కక్కర్లేదు." నిష్కర్షగా సమాధానమిచ్చింది శాంతి మరో దెసగా చూస్తూ.
హేళనగా నవ్వింది మనోరమ. "అవి కథ లలో, కావ్యాలలో సంగతులు, బంగారు కలల భావాలు. కాని ఇలాతలంలో అది అసాధ్యం, శాంతీ. ఇది నిజ జీవితం. అలా కళ్ళు మూసుకు గ్రుడ్డిగా ప్రవర్తిస్తే తర్వాత బాధపడవలసి ఉంటుంది."
శాంతి నవ్వింది. అందులో తిరస్కారభావం స్పష్టంగా ప్రదర్శితమైంది. "గోవిందరావుతో నా పెళ్ళి నిశ్చయం. అనవసరంగా నన్ను భయపెట్టకు: నువ్వు భయపడకు. ఇంతవరకూ నేననుకున్న పని ఏదీ జరుగకపోలేదు. నాలో కోరిక కలగాలేకాని అది తీరకపోవడమంటూ ఉండదు." సగర్వంగా అంది.
"అదృష్టవంతురాలవు! నీ ఆత్మ స్థైర్యానికీ, స్థిర గంభీర నిశ్చయానికీ నిజంగా ముగ్ధురాలనవుతున్నాను, శాంతీ. కాని నీ అవివేకానికి జాలిపడుతున్నాను కూడా. ఇంతవరకూ నీ కోరిన కోరికలు తీరడానికి కారణం నన్ను కంటిపాపగా కాచుకొనే నాన్నగారివల్లా, నిన్ను నేల నడవనీయకుండా పెంచిన తల్లి వాళ్ళా, నిన్ను ప్రాణప్రదంగా చూచుకునే అన్నయ్యవల్లాను. వీరంతా ఎవరు? నీ స్వజనం! నీ కత్యంత ఆత్మీయులు! ఇంత కాలమూ నీ కోరికలను నిన్ను కని పెంచిన ప్రేమాభిమానాలు తీర్చాయన్నమాట! కాని గోవిందరావు నీవాడు కాడు."
"నావాడిని చేసుకుంటానుగా?"
"అదే చెప్పేది, అంత తేలిక కాదని! ఇతడు నీవాడు కాడు. కావడం అంత సులభం కాదు. అయినా అనేక సమస్యలు ఉంటాయి. అవన్నీ ముందే తర్కించి అలోచించి నిర్ణయించి అన్నిటికీ సిద్దమై దిగాలి వ్యవహారంలోకి" అంటూండగానే టెలిగ్రాం వచ్చింది.
"తర్వాత జరుగబోయే విశేషాలు ముందుగానే నోటినుండి పలుకుతాయి ఏదోవిధంగా. ఈ ప్రపంచపు మాయలలో యిదొకటి! ఇందాక నేను అవసరార్ధం టెలిగ్రాం వచ్చిందని అబద్దమాడాను. ఇప్పుడు నిజంగా వచ్చింది" అంది మనోరమ టెలిగ్రాం విప్పుతూ. చదివి చూచుకుని ఒక్కసారిగా ఆకాశంలోకి గెంతి దిగి వచ్చింది మనోరమ, "మా బావ రేపు వస్తున్నారట" అంటూ.
"అభినందనలు" అంది శాంతి. "అయితే రేపు నీ డాన్సు ఎంతవరకూ వచ్చిందో పరీక్షించి చూస్తారన్నమాట!" అని నవ్వింది.
"లేదు, శాంతీ, బావ ఎంత మంచివాడు! నిజానికి నేనేమీ నేర్చుకాకపోయినా నన్నేమీ అనడు." మాట్లాడుతూందేకాని మనోరమ నేత్రాలు ఎక్కడో చూస్తున్నాయి. మనస్సెక్కడో విహరిస్తూంది.
"అయితే, మనోరమా, నీకంత నమ్మకమేమిటి? మీ బావ అమెరికా వెళ్ళి ఏమాత్రం మారలేదంటావా?"
నవ్వింది మనోరమ. "మంచి ప్రశ్నే. నా కిప్పుడు ఇరవై యేళ్ళు. బావకు ఇరవై యేడేళ్ళు. పుట్టినదారి బావ అమెరికా వెళ్ళేవరకూ, అంటే రెండు సంవత్సరాల క్రితం వరకూ కలసి మెలసి ఉన్నాం. మాకు ఒకరి అంతరాత్మలు ఒకరికి తెలుసు. నేనిక్కడా, అతడు అమెరికాలోనూ జీవితాంతం ఉన్నా ఇక అతడిలోగాని, నాలోగాని మార్పు రాదు. జన్మ జన్మలకూ మేమిద్దరమే ఒకరికొకరం. ఇంకెవరికోసమూ కాదు మేము."
"ఓహో! మరి అటువంటి నమ్మకమే నాకూ ఎందుకుండదు?" సూటిగా అడిగింది శాంతి.
"ఎలా? పునాది ఏదీ?"
"అయితే అర్ధం చేసుకోవడానికి పూర్వం పాతిక ముఫ్ఫై ఏళ్ల పరిచయం ఉండాలన్న మాట?"
"అలా నిరసించకు, శాంతీ. నిజానికి నీకు గోవిందరావుతో ఉన్న పరిచయమే పాటిది చెప్పు?" అనునయంగా అంది మనోరమ. "నాకూ, నీకూ పోలికే లేదు. మరి నేను వెళ్తాను. అన్నీ సర్దుకోవాలి. బావ పైవారంలో వస్తారనుకున్నాను. ఎందుచేతో అప్పుడే వచ్చేస్తున్నాడు."
శాంతి, మనోరమ చేయి పట్టుకుంది. "అయితే యిక నువ్వు వెళ్ళిపోతావన్నమాట?" అంది దిగులుగా.
దానితో సంభాషణ క్రొత్తమార్గం త్రోక్కింది. "అవును, శాంతీ." మనోరమ కూడా విచారంగానే అంది. "ఇంత సంతోషంలోనూ నీ స్నేహం పోతోందన్నదొకటే నాకు విచారం." చాలాసేపు మౌనంగా కూర్చుండిపోయారు.
"తప్పదు కదా, శాంతీ! విచారం దేనికీ? ఉత్తరాలు వ్రాస్తూంటానులే. కాని ఒక్కటే విచారం, గోవిందరావు విషయంలో నువ్వు తొందరపడకూడదని. ఎందుకో అతడి విషయంలో నా మనస్సు శంకించుతోంది" అంటూ లేచి వెళ్ళిపోయింది మనోరమ.
