Previous Page Next Page 
మొగలి పొదలు పేజి 24


    'ఎంతమాట అంటున్నారు? యెంకటాద్రి తో సెప్పి తీసు కేల్తాను లెండి.' రత్తాలు వాగ్దానం నిలవలేదు. సింహాచలం భారీ శరీరాన్ని గుమ్మానికి అడ్డంగా పెట్టి సుభద్ర ని అడుగు ముందుకు వేయనీయ లేదు. వెంకటాద్రి తీసుకు పోతానని కూడా అనలేదు. సుభద్ర ఏడుస్తూంటే రత్తాలు అబలై పోయింది. సానుభూతి చూపించేందు కైనా రత్తాలు శరీరంలో వూపిరి లేకుండా పోయింది సింహాచలాన్ని చూస్తుంటే. గాడి తప్పిన రైలు బండి పట్టాలు మార్చే ప్రయత్నం లో ముందూ వెనుకా చూసుకోవడం లేదు. నాలుగు చక్రాల మీద నిలిచేందుకు ఆసరాగా రెండు పట్టాలు యెన్ను కుంటోంది ఎప్పటి కప్పుడే. కానీ భరోసా లేని పట్టాలు వుండి వుండి దోర్లించేయడం కొంత దూరం నడిచిన రైలు పెట్టి మరో జత పట్టాల ఆశ్రయం కోరే ప్రయత్నం లో మళ్ళీ మొదటికే రావడం జరుగుతోంది. సుభద్ర వెక్కి వెక్కి ఏడుస్తూంటే 'ఏటీ వగలమారి మా అన్నలా నేన్లేనూ' సింహాచలం చాలా మోటుగా బండ బూతులు తిడుతున్నాడు. నాలుగు గోడల మధ్య యిరుక్కు పోయింది సుభద్ర అతని గుండెల్లో నిర్దాక్షిణ్యంగా నలిగి పోతూ.

                          *    *    *    *
    సాయంత్రం నాలుగు గంటలు కాగానే బెల్లు మోగింది శ్రీనివాస్ ని లేపుతూ. ముకుందం అతనికి కబురు చేశాడు . ముకుందం రాజమండ్రి లో నాటకాలు వేస్తుండేవాడు ఆ రోజుల్లో. దేవదాసు ఆ నాటక సమాజం లోనే హర్మోనిస్ట్ గా ఉండేవాడు. సరదా కి శ్రీనివాస్ అప్పుడప్పుడు ప్రభాకరం తో వెళ్ళేవాడు కూడా. అవధాని గారు పట్టుపట్టడంతో శ్రీనివాస్ నాటక సమాజం లో నాయక పాత్ర ధారులకి కంఠం యెరువు యిచ్చేవాడు. ముకుందం వున్నట్టుండి పనిగట్టుకుని అతని స్కూలు అడ్రసు తెలుసుకుని మరీ కబురు పెట్టాడు.
    ముకుందం మర్యాదస్తుడు : 'చూడు శ్రీనివాస్ నీ కోసం వాకబు చేసే సరికి తల ప్రాణం తోకకు వచ్చిందనుకో. నీతో చాలా ముఖ్య విషయం మాట్లాడాలి.'
    'యేవిటోయ్ అది?' ముకుందాన్ని చూడగానే శ్రీనివాస్ ముఖం సంతోషాన్ని పులుముకుంది.
    'ఖంగారు పడకు మరి. నీకోసమే వచ్చాను యిక్కడికి.'
    'చెప్పు ఖంగారు దేనికి?'
    చెప్పేందుకు భయంగానే వుంది. అయినా తప్పదు. ఆవిడ....మీ పిన్నిట.'
    శ్రీనివాస్ ఆత్రంగా అడిగాడు. 'ఏదీ? ఎక్కడుంది ? ఎవరింట్లో? నన్ను అడిగిందా?అందుకే వచ్చావా?'
    'యిన్ని ప్రశ్నలు కాదు. ఒకటే చెబుతాను విను. దేవదాసు మేడలో వుంది. ఫకీరు తమ్ముడు దేవదాసు దగ్గర వుంచాడు.'
    'ఫకీరు ఎవరు? వాడు అక్కడెందుకు వుంచాడు.'
    ముకుందం నవ్వాడు శ్రీనివాస్ అమాయకత్వానికి! 'దేవదాసు బ్రోకర్......'
    'అందుకని పిన్ని?'
    'ఆవిడ మోసపోయింది. నీకోసం కబురు పెట్టింది నాకు తెలుసునని తెలిసి. ఆవిడ ప్రాధేయపడుతూ పిల్ల మెళ్ళో గొలుసు యివ్వబోయింది. నిన్ను చూసినట్లు వుంటుందని పించింది. రామదాసు గారింట్లో అడిగి తెలుసుకున్నాను.'
    'నువ్వెలా తెలుసును ఆవిడకి?'
    'దేవదాసు చెప్పి వుంటాడు.'
    'రామదాసు చెప్పాడా అడ్రసు.'
    'అతన్ని టోపీ వెయ్యడం యెంత సేపు. నాకు బాకీ పడ్డావని చెప్పాను. మీరంటే యిక్కడ వున్నారు గానీ అన్ని వార్తలు తెలుస్తున్నాయి. రాజేశ్వరీ గారిని నువ్వు చేసుకోవడం లాంటివి!' మాట్లాడుతూ, మాట్లాడుతూ శ్రీనివాస్ యింటి వరకూ తీసుకు వచ్చాడు. రామదాసు బుర్ర వక్రించక పూర్వం ,ముకుందానికి రాజేశ్వరి ని యిద్దాం అని కూడా అనుకున్నాడు.
    రెండు రోజులున్నాక అన్నాడు ముకుందం : 'మనం వెడదాం శ్రీనివాస్. ఆవిడ యే యిబ్బందుల్లో వుంటుందో ' రాజేశ్వరి నిండుగానే సాగనంపింది.
        
                          *    *    *    *
    మర్నాడు పది గంటలకు ముందే రాజమండ్రి చేరుకున్నారు ముకుందం, శ్రీనివాస్. దేవదాసు యింటికి వెళ్ళిందుకు అతని మనసు బాధపడింది. అయినా పిన్ని కోసం తనిన్నాళ్ళూ కలవరిస్తున్న మనిషి కోసం, తన భవిష్యత్ ని తీర్చి దిద్దిన, తను ఆరాధిస్తున్న వ్యక్తీ కోసం యేమైనా చేయాలి అనుకున్నాడు.
    మేడ మెట్లు యెక్కుతూ రకరకాలుగా ఆలోచిస్తున్నాడు. పిన్ని యెన్ని అవస్థలు పడి యెవరి ద్వారా యీ యింటికి చేరిందో?
    మెళ్ళో వొంటి పేట గొలుసూ, కుడి చేతికి మూడు, ఎడం చేతిని రెండూ వుంగరాలు, బంగారు బెల్టున్న మంచి వాచీ , గ్లాస్కో చొక్కా, తెల్లగా మిసమిస ;లాడుతూ శ్రీనివాస్ కే ఆశ్చర్యంగా కనిపించాడు. అలనాటి హర్మోనిస్ట్ దేవదాసు, దశ యెలా మారిపోయింది? అతను ఆశ్చర్యాన్ని పైకి కనిపించ నివ్వకుండా నిలదొక్కు కున్నాడు.
    'రండి. కూర్చోండి. ఈ వూరు వదిలి వెళ్లి పోయావన్నారు.' రెండో మాట శ్రీనివాస్ ని వుద్దేశించి వేశాడు.
    ముకుందం మెల్లగా చేత్తో పొడిచి సైగ చేశాడు పక్కనే వున్న శ్రీనివాస్ కి.
    'మా పిన్ని నీ దగ్గర వుందని అన్నారు ఎవరో. నాతొ పంపిస్తావా దేవదాస్.'
    'ఆవిడ....ఆవిడ' దేవదాసు కాలరు సర్దుకుని అన్నాడు : సింహాచలం నాకు పర్మినెంట్ గా యివ్వలేదు. పేచీ పడి తీసుకు వెళ్లి పోయాడు.
    శ్రీనివాస్ హతాశుడై పోయాడు. 'ఎక్కడికి తీసుకు వెళ్ళాడు?' 'వాడికో స్థలం లేదు. వాడి కంపెనీ లో చాలా మంది ఆడంగులున్నారు యింకా ....' యింక శ్రీనివాస్ వినిపించుకోలేదు. అతను ఏదో మిడి మిడి ఆశతో వచ్చాడు. తీరా యిక్కడికి వచ్చాక అతనికి అపజయం యేడురైంది. శ్రీనివాస్ తనను తాను తిట్టుకున్నాడు. యిందుకు మూలకారణం తనేనెమో అని అంతరాత్మ పీడుస్తూనే వుంది.
    ముకుందం దగ్గర సెలవు తీసుకుని స్టేషన్ వైపు వెడుతుంటే అతని కాళ్లు అయస్కాంత శక్తికి కట్టుబడి పోయాయి. దానావాయి పేటలో వున్న ఆ యింటి ముందే అతని దృష్టి ఆగిపోయింది.
    అరుగు మీద కూర్చుని గీతా పారాయణం చేస్తుంటే అన్నపూర్ణ వింటోంది భర్త కంచు కంచు కంఠాన్ని. అయన దూరం నుంచే గుర్తుపట్టారు. శ్రీనివాస్ వస్తున్నాడు అన్నూ' అన్నాడు కళ్ళజోడు లోంచి చూస్తూ.
    అన్నపూర్ణ నిండుగా నవ్వింది 'వాడు రాకుండా ఎక్కడికి పోతాడు?' భోజనాలు చేశాక శ్రీనివాస్ ని మరీ మరీ అడిగి పాదించు కున్నారు 'రాధికా కృష్ణా' అష్టపది . శ్రీనివాస్ కంఠం లో మునిగి తేలేసరికి రైలు దాటిపోయింది. ప్రయాణం వాయిదా పడింది మర్నాటికి.

                         *    *    *    *
    రాజేశ్వరి అతన్ని చాలాసేపు వూరడించింది. శ్రీనివాస్ చిన్నపిల్లాడి మాదిరే యేడ్చాడు.
    'పిన్ని శిధిలం అయిపొయింది. వున్న ఒక అవకాశం కూడా జార విడుచుకున్నాను. యింక యీ జన్మకి కనిపించదు.' అతన్ని గుండెల్లోకి తీసుకుని రాజేశ్వరి మౌనంగానే వుండి పోయింది. కాస్సేపాగి తన వైపు తిప్పుకొని 'నాకు యేమో తినాలని వుంది. యిన్నాళ్ళూ రెండు మూడు రోజులే అనుకోండి, యెప్పుడూ వస్తారా అని యెదురు చూశాను' శ్రీనివాస్ ఆశ్చర్యపోయాడు: 'తను యింత దుఃఖం లో వుంటే రాజేశ్వరి నోరెలా వచ్చింది అడిగేందుకు?' అతని చెవిలో గుసగుస లాడింది. 'మీరు తండ్రి కాబోతున్నారు.'
    శ్రీనివాస్ శరీరం పులకరించింది. రాజేశ్వరి ని అపార్ధంచేసుకున్నాడతను. నిజానికి తనని భగవంతుడు చూస్తూనే వున్నాడు. ఈ నిరాశ లో తను తండ్రి కాబోతున్నాడనే విషయం అతన్ని కొండంత సంతోషంతో, సముద్రం అంత వుత్సాహంతో నింపేస్తోంది. అతని రక్తం పొంగి పోతోంది. రాజేశ్వరి ని కౌగిట్లో బందించేసి 'నేను అదృష్ట వంతుడి నోయ్' అన్నాడు.
    రాజేశ్వరి సిగ్గుగా తలదించు కుంది. 'యేవండీ ' నీకు యేమేం తినాలని వుందో, ఏమేమి చూడాలని వుందో లిస్టు రాసి నేను రోజూ స్కూలు నుంచి రాగానే చూపించాలి. నీకుమంచి మంచి పుస్తకాలు లైబ్రరీ నుంచి తీసుకు వస్తాను. వింటున్నావా?'
    ఆహా.'
    'ప్రస్తుతం ఏం కావాలి చెప్పు?'
    'తమాషా చేశాను. నాకు యేవీ తినాలని లేదు. ఏది తినాలన్నా వెగటు గానే అనిపిస్తోంది.'
    శ్రీనివాస్ మనసులోనే అనుకున్నాడు. ఒకరికి యిద్దరూ, యిద్దరికీ మగ్గురు సంసారం పెద్దదౌతోంది. పిల్లడిని మంచి క్రమశిక్షణ లో పెంచాలి. మంచి మంచి బట్టలు కొనాలి. సంసారం పొదుపుగా చేయాలి. రామదాసు బాకీ తీర్చాలి.
    నెలా తిరిగేసరికి చేతికి వంద రూపాయలే వచ్చాయి. పిల్లల ఫీజు రోజూ బస్సు చార్జీలకే సరిపోయేది. ఆ ఫీజు బాపతు ముప్పయి ఆరు రూపాయలూ కట్టే యగానే ఖచ్చితంగా వందే మిగిలాయి. రామదాసు కి మనియార్డర్ చేయగా వస్తూ వస్తూ దానిమ్మ పళ్ళూ, ద్రాక్ష పళ్ళూ, మల్లె పూలూ తీసుకున్నాడు. మనస్సు నిరుత్సాహంతో కుంగి పోయింది. రాజేశ్వరిని సంతోష పెట్టాలనే అనుకున్నాడు. కాని యిలా అయోపోయిందేవిటి?
    'ఇప్పుడివన్నీ దేనికి తెచ్చారు? మనం ఖర్చులో వున్నాం కదా. రోజూ యిలా తెస్తుంటే మనం అప్పుల్లో పడిపోమూ.'
    రాజేశ్వరి సహజంగా అన్నా అతని మాటలు అతనికి వప్ప జెప్పుతున్నట్టు గానే వుందని పించింది. తమాయించుకుని అన్నాడు : 'మనం యెప్పుడూ యిలా ఖర్చుల్లో వుండి పోము. మళ్ళీ మళ్ళీ యిటువంటి వేడుకలు చేయగలమో? లేమో? ఇంటికి దీపం లా మొదటి బిడ్డకి చేయవలసిన ముద్దు ముచ్చట్లు మనం చేయాలి. ఆ టైములో మొదటిసారి నీకు కావలసినవి యిచ్చే బాధ్యత నామీద ఎంతైనా వుంది.' అని 'దానికేం గాని సినిమాకు పద,' అంటూ బలవంతం చేశాడు.
    రాజేశ్వరి ని కంటికి రెప్పలా అడుగువేస్తే కంది పోతుందే మోననే భ్రమలో అపురూపంగా చూసుకోవడం ఈ సమయంలో శ్రీనివాస్ కి మహా ఆనందంగా వుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS