Previous Page Next Page 
రాంభరోసా అపార్ట్ మెంట్స్ పేజి 25


    షైనీ, విజయ్ యాదవ్, కృష్ణమూర్తి కూడా వాన్ లో కెక్కారు. తీరా అంబులెన్స్ స్టార్ట్ చేసేసరికి వాన్ లో రాజారాం భార్య జాన్సీ లేకపోవటంతో మళ్ళీ వాన్ ఆపేసింది షైనీ.
    "ఇదిగో హమీద్ గారూ! రాజారాం గారి మిసెస్ జాన్సీని త్వరగా తీసుకురండి-" అంటూ అరిచింది.
    వెంటనే నేనూ, శంకరమూర్తీ మళ్ళీ రాజారాం ఫ్లాట్ దగ్గరకు పరుగెత్తాం. ఆ ఫ్లాట్ డోర్ వేసి ఉండడంతో డోర్ బెల్ మోగించాము. వెంటనే కన్నీళ్ళతో తలుపు తెరిచింది జాన్సీ-
    "ఏమిటి మేడమ్? మీరింకా బయల్దేరలేదేం? అంబులెన్స్ వెయిట్ చేస్తోంది" అడిగాడు శంకరమూర్తి ఆదుర్దాగా.
    ఆమె దుఃఖం ఇంకా ఎక్కువయింది.
    "ఇంకో అరగంటవరకూ నేను బయల్దేరలేనండీ! దయచేసి మీరే వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేసేయండి-" అంది బ్రతిమాలుతూ.
    "సరే అలాగే వెళ్తాంకానీ- అరగంట దాకా మీరెందుకు రాలేరు? ఎనీ హెల్త్ ప్రాబ్లెమ్?" అడిగాను జాలిగా.
    "అబ్బే- అదేం కాదండీ! ఇప్పుడు నేను రోజూ చూసే మూడుముళ్ళూ-ఏడుగుళ్ళూ టి.వి. సీరియల్ వచ్చే టైమ్- అది చూడకపోతే నేను బ్రతకలేను-అందుకని ఏమీ అనుకోకుండా మీరెళ్ళండి- అదిగో సీరియల్ స్టార్టవుతోంది" అంటూ తలుపు దభేల్ మని వేసేసింది.
    మేము షాకయి కిందకు పరుగెత్తుకెళ్ళి ఆ విషయం షైనీతో చెప్పాం- షైనీ కూడా షాకవుతూండగానే అంబులెన్స్ వెళ్ళిపోయింది.
    వెనుకే మేము కూడా స్కూటర్ల మీద హాస్పిటల్ కి చేరుకున్నాం.
    డాక్టర్లు రాజారామ్ ని పరీక్షించారు.
    "హార్ట్ ఎటాకే-మైల్డ్ గా వచ్చింది కాబట్టి బ్రతికిపోయాడు- అడ్మిట్ చేసేయండి" అన్నాడు డాక్టర్.
    "డాక్టర్ గారూ- ఒక రిక్వెస్ట్" అన్నాడు రాజారామ్ ఇంకా బాధపడుతూనే.
    "ఏమిటి?"
    "టీవీ ఉన్న రూమ్ ఇవ్వండి! లేకపోతే సీరియల్స్ మిస్సయిపోతాను-"
    మాకు మతిపోయింది.
    డాక్టరు చిరునవ్వు నవ్వాడు.
    "భలేవారే! ఆ సంగతి వేరే చెప్పాలా! అదివరకు టీవీలేని రూమ్స్ లోని పేషెంట్స్-సీరియల్స్ చూడలేకపోయామే అన్న టెన్షన్ తో చచ్చిపోతూండటం చూసి- ఇప్పుడు అన్ని రూమ్స్ లో టీవీలు పెట్టాం! హ్యాపీగా చూసుకోండి-"
    అప్పుడు రాజారామ్ మొఖంలోకి కళ వచ్చింది.
    "థాంక్యూ డాక్టర్ గారూ- అన్నట్లు అడగటం మర్చిపోయాను. నాకేమీ ప్రమాదం లేదు కదా?"
    "లేదుగానీ- ఎందుకయినా మంచిది- కొత్తగా స్టార్టయ్యే టీవీ సీరియల్స్ చూడకండి! ఎందుకంటే సగం చూశాక మీకేమయినా అయిందనుకోండి! మీ ఆత్మకు శాంతి ఉండదు-ఆ రూమ్ నెంబర్ ఫోర్ సిక్స్ సెవెన్ లో ఉండే పేషెంట్ ఇలాగే వద్దని చెప్పినా వినకుండా కొత్తగా స్టార్టయిన సీరియల్ చూడటం మొదలుపెట్టాడు. నూట పదహారో ఎపిసోడ్ వచ్చేసరికి సడెన్ గా పోయాడు. పాపం ఆ కుటుంబం వాళ్ళు ఎన్నిరకాల శాంతులు చేసినాగానీ అతని ఆత్మశాంతిస్తేనా? అదిగో చూడండి! ఆ కాకి అతనే! రోజూ ఈ టైమ్ కొచ్చి ఆ రూమ్ కిటికీమీద వాలి, ఆ రూమ్ లో ఉన్న టీవీలో ఆ సీరియల్స్ యాడ్స్ తో సహా- మొత్తం చూస్తుంది. సీరియల్ అయిపోయిన మరుక్షణం ఎగిరిపోతుంది-"
    మా అందరికీ ఆ కాకిని చూస్తే జాలేసింది.
    ఆ కాకి మాత్రం మమ్మల్నెవర్నీ పట్టించుకోకుండా కిటికీ రెక్కమీద వాలి లోపల టీవీలో వస్తోన్న సీరియల్ చూస్తోంది.
    "నిజానికి ఆ రూమ్ లో పేషెంటెవరూలేరు. అయినాగానీ ఆ కాకికోసం ఈ టైమ్ కి టీవీ ఆన్ చేసి కిటికీ తెరచి ఉంచుతాం" చెప్పింది నర్స్. "ఎంతైనా మా హాస్పిటల్లో పోయిన పేషెంట్ కదా! అందుకని ఆ మాత్రం అభిమానం ఉంటుంది"
    సరిగ్గా అప్పుడే జాన్సీ హడావుడిగా వచ్చింది.
    "థాంక్సండీ! సీరియల్ అయిపోగానే పరుగెత్తుకొచ్చాను- ఏమండీ! డాక్టర్లేమంటున్నారు?" రాజారామ్ నడిగిందామె.
    "కొత్తగా స్టార్టయ్యే సీరియల్స్ చూడొద్దంటున్నారు-"
    "అలాగా- అలా చూడకుండా ఎలావదిలేస్తాం? ప్రాణం ఉసూరుమనదూ?"
    "ఆ సంగతలా ఉండనీగానీ- ఇవాళ సీరియల్లో ఏమయింది? శ్రీకాంత్ తండ్రెవరో- అతని తల్లికి నిజం తెల్సిందా? ఆమె కాలేజ్ డేస్ నాటి ప్రియుడు ఆమె ఇంటికొచ్చాడా?" అంటూ ప్రశ్నలతో ముంచెత్తాడు.
    మేమిక మెల్లగా అక్కడినుంచి జారుకున్నాం-
    ఎందుకంటే కోటేశ్వర్రావ్ ఇంట్లో పెళ్ళి చూపుల తతంగం ఒకటి ఉందికదా...

               


    మేము మా అపార్ట్ మెంట్స్ చేరుకునేసరికి అప్పటికే పెళ్లివాళ్ళు కారు దిగుతూ కనిపించారు.
    హమీద్ మియా వారికి స్వాగతం చెప్తున్నాడు.
    "మీరన్నీ పెళ్ళీ సూపుల్ కి వచ్చినయ్యని మాకెరుక ఉన్నయ్? వెల్ కమ్. పదండి! కోటేశ్వర్రావ్ ఇంటికి వెళ్తావ్-" అన్నాడతను. అందరం కోటేశ్వర్రావ్ అపార్ట్ మెంట్ ని చేరుకున్నాం.
    ఇంటి తలుపు బార్లా తెరచి ఉంది.
    అందరం లోపలికెళ్ళాం.
    హాల్లో ఎవరూ కనిపించకపోయేసరికి పెళ్ళివారిని సోఫాల్లో కూర్చోబెట్టి "కోటేశ్వర్రావ్! ఇలారా! వాళ్లొచ్చేశారు" అన్నాడు శంకరమూర్తి.
    రెండు నిమిషాలయినా ఎవరూ రాకపోయేసరికి హనుమంతు ఇంట్లో కెళ్ళాడు కోటేశ్వర్రావ్ కోసం-
    అతనటు వెళ్ళగానే పనిమనిషి హాల్లో కొచ్చింది మంచి నీళ్ళగ్లాసులతో-
    "సార్, మంచినీళ్ళు తీసుకోండి. మీరు కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ లో ఏది తాగుతారో చెప్తే తీసుకొస్తాను-" అందామె.
    పెళ్ళికొడుకు తండ్రి పద్మారావ్ మండిపడ్డాడు.
    "ఆ సంగతి నువ్ అడగటమేంటమ్మా! కోటేశ్వరర్రావ్ గారూ, ఆయన మిసెస్ బయటకు రారేం? వాళ్ళు రిసీవ్ చేసుకోవాలి కదా మమ్మల్ని?"
    "ఇది మా అమ్మగారు టీవీ సీరియల్ చూసే టైమ్ సార్! ఇంకో పదినిమిషాలగ్గానీ ఆ సీరియల్ పూర్తవదు"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS