"అదేంటి? ఈ టైమ్ లో ఆమె ఏ సీరియల్ చూడకుండా ఖాళీగా ఉంటుందని ఆమేగా చెప్పింది?" చిరాగ్గా అడిగింది పద్మారావ్ భార్య కీర్తి.
"ఆ మాట నిజమే గానమ్మా- ఇవాళ క్రికెట్ మాచ్ ఏదో తగలడిందని సీరియల్ లేటుగా మొదలుపెట్టారు-"
"పోనీ మీ అయ్యగారికిని రమ్మను- ఆయనొచ్చి మాట్లాడ్డానికేమయింది?" చిరాగ్గా అన్నాడు పద్మారావ్.
అప్పుడే అక్కడికొచ్చిన హనుమంతు అసలు సంగతి చెప్పాడు.
"కోటేశ్వర్రావ్ మేడమీద తన ఆఫీస్ రూమ్ లో కూర్చుని టీవీలో 'డాన్స్ లేడీ డాన్స్' చూస్తున్నాడండీ! ఇంకో అరగంటలో ఆ ప్రోగ్రాం అయిపోతుందట. అవగానే వచ్చేస్తానన్నాడు. ఈలోగా మీకేం కావాలన్నా అన్నీ అరేంజ్ చేయమని ఆ పనిపిల్లకి చెప్పాడంట-"
ఆ మాటతో పద్మారావ్ భార్య కీర్తికి వళ్ళు మండిపోయింది.
"అంతసేపూ మేమిక్కడ ఏం చేయాలి? ఆ సంగతిముందే చెప్తే మేమూ ఇంకాసేపు 'నీ ఇల్లు తగలడిపోనూ' రియాలిటీ షో చూసుకుని బయల్దేరే వాళ్ళం కదా" అంది నిష్టూరంగా.
"ఆ టీవీ ప్రోగ్రామ్స్ ఇక్కడే చూసుకోవచ్చుకదమ్మా! మీకే ఛానెల్ కావాలో అడిగి ఆన్ చేయమని అమ్మగారు చెప్పారు. ఏ సీరియల్ చూస్తారమ్మా?" అడిగింది పనమ్మాయ్ మల్లిక.
"రెండు కాపురాలు-ముగ్గురు పెళ్ళాలు సీరియల్ పెట్టు" అందికీర్తి. వెంటనే మల్లిక ఆ సీరియల్ వచ్చే ఛానెల్ ను మాకెదురుగా ఎల్ సీడీ టీవీలో ఆన్ చేసింది.
దాంతో పెళ్ళికొడుక్కి వళ్ళు మండిపోయింది.
"మా అమ్మగారికి ఒక టీవీ పెడితే సరిపోయిందా? ఇంటికి గెస్ట్ లొచ్చినపుడు కనీసం రెండు టీవీలయినా హాల్లో ఉంచాలన్న కర్టెసీ కూడా తెలీదా మీ యజమానులకు? ఇప్పుడు నేను ఐపిఎల్ మాచ్ చూడాలంటే ఎలా?" అన్నాడతను విసుగ్గా.
"ఇవాళ పెళ్ళిచూపులు కదండీ! ఈ రోజు ఐపిఎల్ మర్చిపోండి" అన్నాడు హనుమంతు పెళ్ళికొడుక్కి నచ్చజెప్తూ.
"సరేనండీ మీ మాటమీద ఐపిఎల్ వదిలేస్తాం! కానీ ఇండియన్ ఐడల్ సంగతేంటి. ఆ ప్రోగ్రాం కంపల్సరీగా నేను చూసి నా ఓటు ఎస్.ఎమ్.ఎస్. చేయాలి కదా! దానికయినా టీవీ ఉండాలికదా?"
ఈలోగా కోటేశ్వర్రావ్ వచ్చాడు హడావుడిగా.
"సారీ సార్! కొంచెం లేటుగా స్టార్టయింది మా ప్రోగ్రాం- అదేంటి? టీవీ ఆన్ చేసుకోలేదు?" అన్నాడు ఆశ్చర్యంగా.
"పాపం ఒకటే టీవీ ఉంది కద్సార్! వాళ్ళకి కనీసం రెండు టీవీలయినా అవసరం! అయినా నేను మీ ఇంట్లోపనిలో చేరినప్పటి నుంచీ చెప్తూనే ఉన్నా హాల్లో గెస్ట్ లకోసం కనీసం రెండు టీవీ లుండాలని! పాపం పెళ్ళికొడుకుగారు ఇండియన్ ఐడల్ ప్రోగ్రాం చూడాలంటున్నారు- వాళ్ళమ్మగా రేమో వేరే సీరియల్ చూడాలి. ఎలా ఇప్పుడు?" అంది పనిపిల్ల.
"నిజమే- వెంటనే ఒకటి కొందాం! ఇంకా పోస్ట్ పోన్ అబ్బాసు పాలవుతాం" ఒప్పుకున్నాడతను.
ఈ సర్వెంట్ మెయిడ్ కి కూడా ఇండియన్ ఐడల్ ప్రోగ్రామంటే చాలా ఇష్టం! ఎస్.ఎం.ఎస్ చేయటం రాక మమ్మల్ని చంపుకు తింటోంటుంది" అన్నాడు కోటేశ్వర్రావ్.
పెళ్ళికొడుకు షాకయ్యాడు.
"ఏమిటి? సర్వెంట్ మెయిడ్ అయ్యుండి ఆ ప్రోగ్రాం లైక్ చేస్తోందా? షి ఈజ్ గ్రేట్" అన్నాడు అభినందిస్తూ.
"ఇంతకూ మీ మిసెస్, మీ అమ్మాయిరారేం? కార్యక్రమం త్వరగా ముగిస్తే బాగుంటుంది కదా!" అన్నాడు పెళ్లికొడుకు తండ్రి పద్మారావ్.
"మా మిసెస్ చూస్తున్న సీరియల్ ఇంకా అవలేదులెండి- మధ్యలో మనం అరచి గీపెట్టినా రాదు- ఎందుకంటే ఆ సీరియల్ తన ఎనిమిదో ఏట నుంచే చూస్తోంది"
పెళ్ళికొడుకు తల్లి అర్ధం చేసుకుంది "అవున్లెండి! నా కిష్టమయిన సీరియల్ మధ్యలో నన్ను రమ్మంటే నేనూ రాను కదా" అంది సానుభూతితో.
"అయితే ఓ పని జేద్దాం. తల్లి తరువాత మాట్లాడుతుందీ గానీ, ఈలోగా అమ్మాయిని పిలిపించండి, మా అబ్బాయి, అమ్మాయి మాట్లాడుకుంటారు" అన్నాడు పద్మారావ్.
"అమ్మాయి ఈ టైమ్ లో తన రూమ్ లో స్టార్ ఛానెల్లో తనకిష్టమయిన సీరియల్ చూస్తుంటుందండీ! ఎవరు పిలిచినా రాదు- అందుకని మనమే ఆమె గదికి వెళ్తే అక్కడే మాట్లాడుతూ పెళ్ళిచూపుల తతంగం ముగించేయవచ్చు" అన్నాడు కోటేశ్వర్రావ్.
ఆ ఐడియా అందరికీ నచ్చింది.
అందరూ కలసి మేడమీదున్న గదిలోకెళ్ళారు.
పెళ్ళికూతురు హాపీగా బెడ్ మీద పడుకుని ప్రోగ్రాం చూస్తోంది. అందరూ వచ్చి బెడ్ పక్కనే ఉన్న సోఫాల్లో కూర్చున్నా ఆమె టీవీ నుంచి కళ్ళు తిప్పలేదు. బెడ్ మీద నుంచి లేవలేదు.
"సంజితా- పెళ్ళివారొచ్చారమ్మా" అన్నాడు తండ్రి.
"యా-వెల్ కమ్" అంటూ తల తిప్పకుండానే మాట్లాడింది తనకు సంబంధం లేనట్లు.
"మీరేం చదివారు? అడిగాడు పెళ్ళికొడుకు.
"డబ్లూడబ్లూడబ్లూ సంజితా డాట్ కామ్ లో నా వివరాలన్నీ ఉన్నాయ్. చూడండి"
"నీకు వంటపని వచ్చామ్మా?"
"వచ్చు కానీ చేయను- జాబ్ తర్వాత టీవీ ముఖ్యం నాకు. వంటమనిషిని పెట్టుకోవాల్సి ఉంటుంది" అంది సంజిత తల తిప్పకుండానే.
"మీరు టీవీ సీరియల్ చూస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయటం మంచి మేనర్స్ కాదని నాకు తెలుసుగానీ ఆల్టర్ నేటివ్ లేదు. మనం కాసేపు కొన్ని విషయాలు మాట్లాడుకుంటే బావుంటుంది" అన్నాడు పెళ్ళికొడుకు.
"మా ఆఫీస్ లో వెబ్ కెమెరా ఉంది. రేపు లంఛ్ టైమ్ లో ఇద్దరం ఒకర్నొకరు చూసుకుంటూ మాట్లాడుకోవచ్చు" అందామె.
"యాయా- దటీస్ ఫైన్" అన్నాడు పెళ్ళికొడుకు.
"అన్నట్లు మీరే సీరియల్ లైక్ చేస్తారు?" అడిగాడు తను.
"ఇదే స్టార్ లో వస్తోంది కదా! సబ్ పాగల్ హై' అనే సీరియల్. ఆ సీరియల్ 24 గంటలూ చూపించేట్లయితే నాకసలు పెళ్ళీ పెటాకులూ కూడా అక్కర్లేదు- అదంత ఇష్టం" అంది సంజిత.
పెళ్ళికొడుకు మొఖంలో రంగులు మారాయ్.
"అదేంటి ఇండియన్ ఐడల్ ని మీరులైక్ చేయరూ?"
"అదంతా ఒక బుల్ షిట్" అందామె.
దాంతో పెళ్ళికొడుక్కి కోపం వచ్చింది.
"వ్వాట్! అది బుల్ షిట్టా! దాన్ని బట్టే తెలుస్తోంది- నీ టేస్టేంటో ఇదిగో ఇప్పుడు నువ్ చూస్తున్న సీరియల్ ఉంది చూడు. దీన్ని మా ఆఫీస్ లో అందరూ 'నట్స్' అంటారు తెలుసా?"
"డోంటాక్ రాట్- అలా అన్నవాళ్ళే నట్స్" అందామె మండిపడుతూ మేమంతా మధ్యలో ఇంటర్ ఫియర్ అవకతప్పలేదు.
"సీరియల్స్ అన్నాక అభిప్రాయ భేదాలుంటాయ్ బాబూ వాటిని సీరియస్ గా తీసుకోకూడదు"
"అమ్మాయిని మీరేమయినా అడగాలంటే అడగండమ్మా?" పెళ్ళికూతురు తల్లితో అన్నాడతను.
