Previous Page Next Page 
రాంభరోసా అపార్ట్ మెంట్స్ పేజి 24


                   
    
    ఆరోజు మా అపార్ట్ మెంట్స్ లో ఉదయం నుంచే హడావుడి మొదలయిపోయింది. 'సి' బ్లాక్ లో ఉండే కోటేశ్వర్రావ్ వాళ్ళమ్మాయికి ఆ రోజు పెళ్ళిచూపులు!
    ఆ తతంగం చాలా గ్రాండ్ గా జరపాలని కోటేశ్వర్రావ్ కోరిక. అందుకు మా కమిటీ మెంబర్స్ సహాయ సహకారాలు కావాలని అడగటం వల్ల మేమంతా కూడా ఆ ఫంక్షన్ లో పార్టిసిపేట్ చేయాలని డిసైడ్ చేశాం. ఎందుకంటే ఆ పెళ్ళికొడుకు తల్లిదండ్రులు మా అపార్ట్ మెంట్స్ లోనే ఉండే హనుమంతు బంధువులు. పెళ్ళికొడుకు, అతని తరపువారు అమ్మాయిని చూడ్డానికి సాయంత్రం ఆరుగంటల సమయంలో రాబోతున్నట్లు ఎస్ ఎం ఎస్ వచ్చింది కోటేశ్వర్రావ్ కి.
    కోటేశ్వర్రావ్ షాకయ్యాడు.
    "అదేంటి సార్- సాయంత్రం ఆరింటికొస్తానంటారేంటి? ఆరింటి నుంచీ, ఏడింటి వరకూ వర్జ్యం కదా-" అన్నాడు కంగారుగా.
    వెంటనే అందరం మధ్యవర్తి హనుమంతుడిని పిలిచాం.
    హనుమంతు వాళ్ళకు ఫోన్ కొట్టాడు.
    "ఆరు నుంచి ఏడుదాకా వర్జ్యం ఉంది కదండీ! ఆ టైములో వస్తే ఎలా? పోనీ ఏ నాలుగింటికో, అయిదింటికో రండి-" అన్నాడతను.
    "అలా కుదరదండీ!" అన్నాడు పెళ్ళికొడుకు తండ్రి పద్మారావ్.
    "ఎందుక్కుదరదు?"
    "నాలుగింటి నుంచీ అయిదింటివరకూ మా రెండోవాడు స్పోర్ట్స్ ఛానెల్ చూస్తాడు. చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అది."
    "స్పోర్ట్స్ ఛానెల్ చూస్తాడా? చూస్తే చూడనీండి- మీరు రావచ్చు కదా-"
    "మా రెండోవాడు లేకుండా మేమెలా వస్తామండీ! వాడిక్కాబోయే వదినను తనూ చూడాలని ఉంటుంది కదా!"
    "అవునవును ఉంటుంది" ఒప్పుకున్నాడు హనుమంతు.
    "పోనీ ఏడు తర్వాత రమ్మనండి!" అడిగాడు కోటేశ్వర్రావ్.
    ఆమాటే పద్మారావ్ తో చెప్పాడు హనుమంతు.
    ఆ సజెషన్ వింటూనే పద్మారావ్ భార్య బిగ్గరగా అరవటం- ఆ ఫోన్ ద్వారా మా అందరికీ వినబడుతూనే ఉంది.
    "ఏడింటికెలా వెళ్తామండీ! 'మొగుడి పెళ్ళి- పెళ్ళాం నిశ్చితార్ధం' సీరియల్ వచ్చే టైమ్ కదా! ఆ టైమ్ లో ఎవరయినా ఇల్లు వదిలి వెళ్తారా?" అంటూ తనే ఫోన్ లాక్కుని మాట్లాడింది.
    "చూడయ్యా హనుమంతూ 'మొగుడి పెళ్ళి- పెళ్ళాం నిశ్చితార్ధం' సీరియల్ వచ్చే టైమ్ లో ఎవరయినా పెళ్ళిచూపులకెళ్తారా? అక్కడ పెళ్ళి కూతురి తల్లి మాత్రం ఆ సీరియల్ చూసే టైమ్ కాదూ? మేం ఇబ్బందిపడి వాళ్ళను ఇబ్బంది పెట్టడం మంచిది కాదుగదా-"
    "కానీ ఆవిడ ఆ సీరియల్ చూడరంటమ్మా! వేరే ఛానెల్లో ఎనిమిదింటికొచ్చే 'మంగళ సూత్రం అలజడి- పారాణి సవ్వడి' సీరియల్ చూస్తారట!
    "ఛీ-అదేం బావుంటుందీ? తలాతోకా లేని కథ-"
    "మిగతా సీరియల్స్ గురించి మరీ ఆవిడదీ అదే అభిప్రాయం! అయినా ఆవిడకలాంటి కథలే ఇష్టమేమో-"
    "సరే- నేనయితే ఏడింటికి రాలేను. కావాలంటే ఎనిమిదింటికొస్తాం-" అందామె తెగేసి చెప్తూ-
    ఆ మాట వింటూనే కోటేశ్వర్రావ్ కంగారుపడ్డాడు.
    "ఎనిమిదింటికి మా మిసెస్ సీరియల్ చూసే టైమ్ కదా- ఆ టైమ్ లో పిడుగులు పడినా టి.వి. ముందునుంచి లేవదు" అన్నాడు గాబరాగా.
    దీంతో చర్చల్లో ప్రతిష్టంభన తప్పలేదు.
    సాయంత్రం వరకూ హనుమంతు రెండు వేపులా సరిపోయే టైమ్ కోసం నానా తంటాలూపడ్డాడు. చివరకు రాత్రి తొమ్మిదింటికి ప్రోగ్రాం ఫిక్స్ చేశారు అందరూ కలసి.
    సరిగ్గా అప్పుడే ఏ బ్లాకువేపు 108 వాహనం పెద్దగా శబ్దం చేసుకుంటూ వచ్చింది. అక్కడ ఎవరికేమయిందో అర్ధంకాక అందరం అటువేపు పరుగెత్తాం.
    "ఎవరు కాల్ చేశారు?" అడిగాం డ్రైవరుని-
    "ఏ బ్లాక్ లో ఫ్లాట్ నెంబర్ త్రీ జీరో టూ నుంచి సార్"
    అందరు రాజారాం ఫ్లాట్  వేపు పరుగెత్తాం.
    "ఏమిటి మేడమ్? ఏమ్ జరిగినయ్" అడిగాడు మా ప్రెసిడెంట్ హమీద్ మియా గాబరాగా.
    "ఆయనకు సడెన్ గా గుండెనొప్పి వచ్చిందండీ! హార్ట్ ఎటాకేమోనని భయంగా ఉంది-" అంది రాజారాం భార్య సునీత కన్నీళ్లు తుడుచుకుంటూ.
    షైనీ ఆమెను ఓదార్చింది.
    "మీరేం బాధపడకండి! ఆయనకేం జరగదు-మేము కూడా హాస్పిటల్ కొస్తాం-" అందామె.
    అందరూ రాజారామ్ ని అంబులెన్స్ లోకి చేర్చాం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS