Previous Page Next Page 
దీప శిఖ పేజి 23


    ఇలా నిర్ణయించుకొని శేషయ్య ముఖం లోకి ఒక్కమారు తేరిపార చూసి "కూచోండి శేషయ్య గారూ -- మీతో ఒక్క విషయం మాట్లాడాలి" అన్నాడు శంకరం.
    "ఏవిటి చెప్పండి" అన్నాడు కూర్చోకుండానే శేషయ్య.
    "గోపాలం మద్రాసు లో "లా" చదువుతున్న రోజుల్లో నేను మీకు నెలనెలా వాడికి పంపమని వందేసి రూపాయలు ఇచ్చేవాడిని జ్ఞాపకం ఉందా?"
    "అవును...."
    "అందులో ఒక్క వంద కూడా వాడికి చేరలేదు అంటున్నాడు గోపాలం!
    "ఆ! ...అదేవిటి ?....అబద్దం"
    "అబద్దమో నిజమో -- వాడన్న మాట అది"
    "అంటే సరిపోతుందా?...."
    'ఆ....అదే నేనూ అన్నాను. అంటే సరిపోతుందా?....శేషయ్య గారి వద్ద పోస్టలు రసీదులు ఉండవా?" అని అయన చూపించినపుడు నువ్వు నోరు మూయవలసి వుండదా అని"
    "పోస్టలు రశీదులా?....అవి నాదగ్గర లేవే."
    "అదేవిటి .....ఏమయ్యాయి ? ....మరి డబ్బు మీరు కట్టలేదా."
    "నేను కట్టలేదు. రామనాధం గారికిచ్చి అయన చేత కట్టించాను. నెలనెలాను పంపించిన రశీదులు, గోపాలం సంతకం అయి వచ్చిన రశీదులు అన్నీ అయన దగ్గరే వుండాలి."
    "ఓహో....చనిపోయిన రామనాధం గారా?...బాగానే ఉంది "
    "అందలేదని అతనంటే మీరెలా వూరుకున్నారు? ఒక్క మనిఆర్దరూ అందకుండా రెండేళ్ళు మద్రాసు లో ఎలా కాలక్షేపం చేశావోయ్ పెద్దమనిషి అని గద్దించి అడక్క పోయారూ?"
    "నయం-- అడగలేదు. కనకే మన పరువు నిలబడింది. అడిగానే అనుకోండి. వాడు లేదంటే , లేదంటా వేమిటి యివిగోనోయ సాక్ష్యాలు అంటూ వాడికి చూపించడానికి మీదగ్గర పోస్టల్ రశీదులు కూడా లేవంటూన్నారు కదా!....
    "నా దగ్గర లేకపోతె మాత్రం రామనాధం గారి కాగితాలు వెదికితే దొరకవ్?"
    "ఏమో.....పోనీ దొరికాయే అనుకోండి. దొరికినా అవి మీరు పంపించిన డబ్బు బాపతునే అని నిర్ధారణ ఏముంది?....గోపాలానికీ ఆయనకీ ఉన్న స్నేహం కారణంగా అయన స్వంత డబ్బే పంపాడేమో గోపాలానికి?.....ఆ రశీదులు ఆ బాపతువేమో...! మనకి కావలసింది అదికాదుగా?....మీరు ఆయనకి డబ్బు ఎంత వరకు యిచ్చారని కదా కావలసింది...ఇచ్చానని మీరు అంటున్నారు. అవునని కాని కాదని కాని అనడానికి అయన ఈ లోకంలో లేరు=-- పొతే మూడో వ్యక్తీ ఎవరూ లేరు. "ఇందులో నిజం యిది" అని చెప్పడానికి . అవునా?"
    "లేకేం?"
    "మరింకనేం? అయితే ఆ మూడో వ్యక్తీ చేత సాక్ష్యం చెప్పించి గోపాలం నొరు మూయిద్దాం ఒక్క దెబ్బతో."
    "కాని....ఆ మూడో వ్యక్తీ లేడు ఇప్పుడు , అతని చేతే పంపేవాడిని డబ్బు అతనికే తెలుసు ఇందులో నిజం "
    "ఎవరతను?"
    "వెంకడు."
    ఇంటి పై కప్పు ఎగిరిపోయేలాగ నవ్వేడు శంకరం.
    "భలేవారండి శేషయ్య గారూ!.... ఇన్ని కోర్టు వ్యవహారాలూ తెలుసు కదా మీకు?....ఓ చనిపోయిన వ్యక్తికీ ఇంకో చనిపోయిన వ్యక్తీ ద్వారా సొమ్ము పంపానంటే ఎవరేనా నమ్ముతారుటండీ?....."
    శంకరం నవ్వుతున్న ధోరణి ని, అంటూన్న మాటల తీరుని చూసి చకితుడయ్యాడు శేషయ్య. కాస్సేపటికి సంభాళించుకొని "ఇతరులు ఎవరు నమ్మకపోతే ఏం లెండి . మీరు నమ్మితే చాలు, మీరు అనుమానించరు కదా నన్ను ?" అన్నాడు.
    అందుకు శంకరం ఏం సమాధానం చెప్పలేదు. శంకరం మౌనాన్ని చూసి శేషయ్య తెల్లబోయాడు. తను ఆ మాట అన్న తర్వాత కూడా శంకరం మాట్లాడక ఊరుకున్నాడేవిటి?....బహుశా వినిపించుకోలేదేమో?....అందుకే మళ్ళీ అన్నాడు "దేహాలు వేరైనా ప్రాణాలు ఒకటిగా ఉంటూన్న ,మన ఇద్దరి మధ్యనా అనుమానాలూ అపనమ్మకాలూ ఉంటాయని కాదు-- ఆహా-- చెబుతున్నా.
    'అలా అనకండోయ్ శేషయ్య గారూ-- ఏమో-- స్నేహం ఉంది కదా అని పూర్తిగా నమ్మాలని ఏం ఉంది ?....అపనమ్మకం ఉంటె ఉండనూ వచ్చూ -- ఇప్పుడు చూడండి -- మీరు రాజమండ్రి వెళ్ళమన్నారని నేను వెళ్లాను. అక్కడ నేను చిత్తశుద్ది గా మీ తరపున మా తమ్ముడి తో గట్టిగా మాట్లాడానో లేదో మీరు చూడ వచ్చారా?.....ఏమో మాట్లాడ లేదేమో -- ఏమంటారు?"-- చూపుల్లో వేటకారాన్ని మాటల్లో వ్యంగ్యాన్ని దట్టించి అంటున్న శంకరం పద్దతి చూసేసరికి చిరాకేసింది శేషయ్య కి.
    "ఇంతకీ మీరేం అంటారు ?........."
    "ఆహా!..అలాంటి అనుమానం మీకు ఉందా లేదా నా మీద "
    "అలాంటి అనుమానమే నామీద మీకు ఉంది అంటారు, అవునా?"
    శంకరం మాట్లాడలేదు.
    "డాక్టరు గారూ -- ఇంకెందుకు ? ఇన్ని సంవత్సరాల మన స్నేహాన్ని విస్మరించి అ రెండు వేలూ నేనే తీనేశానని కనుక మీరు అనుమనిస్తుంటే , ఆ డబ్బు ఇచ్చేస్తాను తీసుకోండి" అన్నాడు బాధగా శేషయ్య.
    శంకరం పేలవంగా నవ్వి "హు! .ఇప్పుడు నేనా డబ్బు కోసమే కూచున్నాను!...." అన్నాడు.
    "కూచున్నారో లేదో-- అది వేరే విషయం . నా నిజాయితీ ని శంకించారా లేదా ?....అది చాలు"
    "మీరు మాత్రం నన్ను శంకించలేదేమిటి?" ఇంటి పైకప్పు కేసి చూస్తూ అన్నాడు శంకరం --
    "సరే --ఎందుకు లెండి . మాటకు మాట పెరుగుతుంది. ఇన్నాళ్ళూ ఏక గర్బ వాసులుగా ఉన్నాం-- అనుమానా లేర్పడి అభిప్రాయబేధాలు వచ్చాయి ఈనాటికి. కలతలు ఏర్పడిన మనసులు కలుసుకోవడం కష్టం ఏవంటారు?"
    "మీ ఇష్టం."
    "సరే అయితే వస్తా -- మీ రెండు వేలూ మీకు పంపిస్తా త్వరలో- తీసుకోండి ."
    "ఆ పని మాత్రం చెయ్యకండి. మీరు పంపిస్తే ఆ డబ్బు మీకే తిరిగి పంపవలసి వస్తుంది."
    "అదేవిటి లెండి , అంటూ బరువు గుండెతో బయలుదేరాడు శేషయ్య బాధగా మెట్లు దిగుతున్న శేషయ్య తో "డబ్బు పంపవద్దు" అన్నాడు శంకరం. శేషయ్య వెనక్కి తిరిగి చూశాడు. తన ముఖం లో లాగే శంకరం ముఖంలో కూడా విషాదం నల్లగా పేరుకుని ఉంది. వెంటనే ముఖం తిప్పేసుకుని భారంగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు శేషయ్య . అతను వెళ్లిన దిక్కుగానే శూన్యంగా చూస్తూ వుండిపోయాడు శంకరం. వెళుతూ వెళుతూ శేషయ్య ఓమారు కండువా దులుపుకుని తిరిగి భుజం మీద వేసుకుంటూ విసురుగా వీధి మలుపు తిరగడం దూరం నుంచి చూసి, తల పంకించి శంకరం కళ్ళలోని యెర్రని జీరలు, ఉజ్జ్వలమైన జ్వలితజ్వాలలులా ప్రజ్వ లితమమాయి శంకరం ఆరోజంతా గదిలో పచార్లు చేస్తూనే ఉండిపోయాడు. ఎవరొచ్చినా "ఇప్పుడు నన్ను పలకరించకండి" అంటూ విసుక్కున్నాడు. కంపౌండరు రెండు మూడు సార్లు వచ్చి "పేషెంట్స్ మీకోసం కూర్చున్నారంటే మందులిచ్చి పంపించేయ్యి నాకు వంట్లో బాగోలేదు హాస్పిటల్ కి రానివాళ" అంటూ చెప్పి పంపేశాడు. భోజనానికి లేవండి అన్న సావిత్రిని చీదరించు కున్నాడు. మళ్ళా వస్తే నేనివాళ అసలు భోజనం చెయ్యను పొమ్మన్నాడు" శంకరం మెదడంతా భాధగానూ చీదర గానూ ఉంది ఆ రోజంతా.
    ఆలోచించిన కొద్దీ శంకరానికి శేషయ్య మీద కోపం ఎక్కువ కాసాగింది. స్నేహం వల్ల ఇన్నాళ్ళూ తెలియలేదు కాని శేషయ్య ఎంత పొగరుబోతు ...ఇన్నాళ్ళ స్నేహాన్ని ఎంత సులువుగా రెండు ముక్కల్లో తెంపేసుకుని వెళ్ళిపోయాడు డబ్బు సంగతి ఎత్తేసరికి పౌరుషం వచ్చింది. విసురుగా తలాదించు కుంటూ వెళ్ళిపోయాడు. ..నిజాయితీ ని శంకించానని కోపం వచ్చింది కాబోలు ! నాకు తాలేదేవిటి నా చిత్తశుద్ది ని శంకించి నప్పుడు -- తమ్ముడుప్రార్దిస్తున్నా వినకుండా నానా మాటలు అని తన కోసం విరోధం పెట్టుకొని వచ్చేశానే! తమ్ముడు కంటే తను ముఖ్యం అనుకున్నానే!....అలాంటి నాన్నా అనుమానించడం ?....అలాంటప్పుడు తనకే అంత పౌరుషం వస్తే నాకెంత రావాలి?...............
    ఆ మాట కొస్తే నేనన్న దాంట్లో సబబు ఉంది! అవును -- డబ్బు పంపాను అంటాడు. రసీదులు మాత్రం లేవంటాడు. ఇదేవరేనా నమ్మే మాటే?....సరేనయ్యా ..ఏదో కక్కుర్తి పడ్డాడు. సరిపోయింది- "బావగారూ ...ఏదో అవసరం వచ్చి వాడుకున్నాను-- మరోలా అనుకోకండి "  అనవచ్చే. తను అలా అంటే నేను ఎమందునో-- అదీ లేదు ఇదీ లేదు -- పౌరుష పడతాడేవిటి పౌరుషం !......
    పంపేస్తాడట!..ఇంతా అయ్యాక తను పంపితే ఎవడికి కావాలి, పంపకపోతే ఎవడికి కావాలి !.......ఇంతకీ తనని పంపమని ఎవరన్నారు?.....ఉన్న విషయం ఇదీ అని చెబితే ఇంత ముఖం చెండుకోవాలా?........"
    "ఆ! ........సాగితే సరి !.....ఇవతల వాళ్ళు వెర్రి వాళ్ళు అయితే ఇంకా సాగిస్తాడు నాటకం .....ఇన్నాళ్ళ స్నేహాన్ని మరిచిపోలేక కాని............నేను చూపించలేనా వైరం. అసలు నేను పట్టుదల మొదలెడితే అగగలడా తను?.....అది కాదు -- ఆశ్చర్యం వేస్తుంది తన కొడుకుని రక్షించానా?......తనకీ, తనకి కావలసిన వాళ్ళకీ మంచికీ చెడ్డకి అవుతున్నానా?--- ప్రాణ స్నేహితుడిలా చూసు కుంటున్నానా?.....తన కోసం తమ్ముణ్ణి కూడా చెందనాడు కున్నానా? .....ఇలా ఎంతో ఇదిగా నేనుంటే , నా డబ్బు వాడుకోవడమే కాకుండా -- అదేవిటి అంటే అంత ఎత్తు ఎగురుతాడా ?.......సరే కానియ్యి...  ఇది ఎలా వస్తుందో ఎంతవరకూ వస్తుందో నేనూ చూస్తాను. ఈ విశ్వాస ఘాతకుడి కోసం, అయిన తమ్ముడిని కూడా అవతలకి నెట్టాను. నేనలా కోపంగా వచ్చేసి నందుకు వెర్రి నాగన్న వాడెం మనస్సులో బాధ పడుతున్నాడో !....రేపే ఓ ఉత్తరం రాస్తాను. లేదా వాడిని రామ్మంటాను . అవసరం అయితే నేనే వెళతాను ఇంకో మాటు ........మామిడికాయ చెక్కల లాగ వాడికి నేను నాకు వాడు . మేం ఇద్దరం."
    ఈ ఆలోచనతో శంకరానికి "ఇప్పటి నుంచి మీరు ఇద్దరు కాదు అన్నదమ్ములు , మనం ముగ్గురం " అన్న శేషయ్య వాక్యాలు జ్ఞాపకం వచ్చి మనస్సు కలుక్కుమంది-'
    ఇన్నాళ్ళ నుంచీ శేషయ్య కి , తనకీ మధ్య ఉంటూ వచ్చిన దృడమైన ఈ హటాత్పరిణామానికి బాధపడుతూ సాయంత్రం మనస్సంతా తిక్కగానూ చికాకు ఉండడం తో గది దాటి బయటికి వచ్చాడు. శేషయ్య తోటి వ్యవహారం ఇలా అయిపొయింది. ఇతని కోసం తమ్ముణ్ణి కూడా ఈసడించుకొని వచ్చాను. వాడి మనస్సు ఏం బాధ పడిందో ఏమిటో ?....ఇప్పుడే ఉత్తరం రాస్తాను . నువ్వు తీసుకున్న నిర్ణయం , పాటిస్తూన్న నియమం చాలా మంచిదని. ఎంతో సంతోషిస్తున్నాను అని అన్నట్టు-- వాడి పెళ్లి విషయం కూడా రాయాలి. ఈ శారదా బిల్లు ఒకటి తగలడ్డక ఎలాగ వయస్సు వచ్చిన పిల్లనే చెయ్యాలి గదా -- అటువంటప్పుడు అన్ని విధాలా లక్షణంగా ఉన్న ఆ విజయని చేసుకోడానికి అంగీకరిస్తే ఏం పోయింది ?.....అవును ఆ పనే చేస్తాను ...... అలాగే రాస్తాను....వాడూ సంతోషిస్తాడు- కుర్ర నాగన్న -- నామీద ఎంత గౌరవం వాడికి?....ఎంత ప్రేమాభి మానాలతో చూశాడు మొన్న తను వెళ్ళినప్పుడు........... భక్త చింతామణి పుస్తకం ఒకటి కావాలిరా అని తను అడగడం తరవాయి దగ్గరున్న పుస్తకం ఇచ్చేశాడు ......ఆ........మనస్సు ఇలా చికాకుగా ఉన్నప్పుడు అందులో వాక్యాలు పద్యాలు చదువుతుంటే కొంత ప్రశాంతంగా ఉంటుంది ఏమో --
    ఇలా అనుకోని శంకరం భార్యని పిలిచి "ప్రయాణం నుంచి వచ్చినపుడు తెచ్చిన సంచీ ఎక్కడ పెట్టావు?" అని అడిగాడు.
    'చెయ్యి ఊరుకోక మణిని దాచామన్నాను. ఎక్కడ పెట్టిందో ఏమో?" అంటూ సావిత్రి మణిని కేకేసింది.
    మణి తెచ్చిన సంచి లోంచి భక్త చింతామణి పుస్తకం తీసి పేజీలు  త్రిప్పుతుంటే , సీల్డు కవరు కింద పడింది ......
    "ఈ సీల్డు కవరేమిటి ?" అంటూ వంగుని తీశాడు శంకరం. సావిత్రి "ఆ కవరేవిటండీ?' అంది. మణి ఏదో జ్ఞాపకం తెచ్చుకోడానికి ప్తయత్నిస్తోంది.
    "అరె !....దీని మీద ఎవరి ఎడ్రస్ లేదే!....ఇదేదో గోపాలం ఈ పుస్తకంలో పెట్టి మరిచి పోయినట్టున్నాడు . ఏం ముఖ్యమైందో ఏమో! ...ఇందులో ఏముందో ?' అన్నాడు శంకరం ........


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS