27

అర్ధరాత్రి వేళ మెలుకువ వచ్చిన ధర్మారావు నిద్రపట్టక అటూ ఇటూ దోర్లుతుండగా ఏవో గుసగుసలు వినిపించాయి. ఆశ్చర్యపోతూ కొద్ది క్షణాలు అలాగే పక్క మీద ఉండే విన్నాడు.
ఎవరో స్త్రీ , ఎడుస్తున్నట్లు ఉండి ఉండి వెక్కిళ్ళు వినిపించ సాగాయి.
"నేనీ బాధ భరించలేను. ఇక్కడ ఉద్యోగం వద్దంటే మీరు విన్నారు కాదు.' దయామయి గొంతు స్పష్టంగా వినిపించింది.
"ఏమిటి, రాజ్యలక్ష్మీ దేవీ? మీరు నా ఉపాయాన్ని గ్రహించ లేకుండా ఉన్నారు." సౌమ్యంగా నచ్చ చెబుతున్నట్టున్న నారాయణ స్వామి కంఠం!
"రాజ్యలక్ష్మీ ! ఈమె ఎవరు?' వింటున్న ధర్మారావు కౌతుకం పట్టలేక సవ్వడి చేయకుండా లేచి వెళ్లి, కిటికీ లో నుండి హాలులోకి చూచాడు. అక్కడ దయామయి , నారాయణ స్వామి మినహా మరెవరూ లేకపోవడంతో మరింత ఆశ్చర్యపోవలసి వచ్చింది. 'అయితే దయామయి అసలు పేరు రాజ్యలక్ష్మీ అన్న మాట! పైగా 'కరుణా" అని పిలిచే నారాయణస్వామి ఆమెను "మీరు, "అండి" అని గౌరవిస్తున్నాడు ! ఏమిటి వింత? ఎంతటి రహస్యాలు!' ఆశ్చర్యంతో స్థాణువే అయ్యాడు ధర్మారావు. ఏడుస్తూనే దయామయి అన్నది: 'అయన ఇక్కడే ఉన్నారు. నన్ను గుర్తు పట్టారు. ఒకనాడు సాయంత్రం రహస్యంగా కలుసుగొని అడిగాడు, ధర్మారావు ఎవరని? ఏం చెప్పను?" ఆమె దుఃఖం అధికమయింది.
"ఆ! గుర్తు పట్టాడా, మిమ్మల్ని?" ఉలిక్కిపడ్డాడు నారాయణస్వామి . "ఏం చెప్పారు మరి?"
"ఏమీ చెప్పలేదు. ఇన్నాళ్ళకు కలుసుకుంటే నాకు దుఃఖం వేల్లువయింది. ఇంతలో ఎవరో అటు వస్తున్న అలికిడయి విడిపోయాము."
నిట్టూర్చాడు నారాయణ స్వామి. "మీరు విచారించవద్దు. విషయాలన్నీ చెప్పి వేయవలసిన రోజులూ దగ్గర పడుతున్నాయి . అయితే అందుకనువైన సందర్భం కోసమే చూస్తున్నాను."
విస్మయంతో చూచింది దయామయి. "అంత తేలికగా మాట్లాడుతున్నారేమిటి? అధికారులకు తెలిస్తే అది ధర్మారావు కు ఎంత తలవంపు? ఎంత ప్రమాదం?"
వింటున్న ధద్మరావు ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు.
"ఏమీ ప్రమాదం లేదు. మీరు నిశ్చింతగా ఉండండి. కాని, మీరు ఆయనతో మళ్ళీ మాట్లాడే అవకాశం మాత్రం రానీయవద్దు. క్షమించాలి, ఇలా చెబుతున్నందుకు."
"ఫర్వాలేదు. అర్ధం చేసుకో గలను."
"మరి పడుకుంటాను. వెళ్లి పడుకోండి. అబ్బాయి నిద్ర పోయాడా?"
"అవును, లేపుతాను, ఉండండి. అన్నట్లు మరో మాట."
"ఏమిటి?"
"దైవ ఘటన అంటారు, ఇదే కాబోలు. ఆ సుయోధన్ కూతురు సత్య ఇక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్. దానితో ఇతగాడికి స్నేహం . ఎలా వద్దని చెప్పాలో నాకు తెలియడం లేదు. మీరు కాస్త ఆ విషయం లో అతడిని హెచ్చరించాలి."
తల పంకించాడు నారాయణస్వామి. "నేనూ విన్నాను, ఆ విషయం . సరే, తొందర దేనికి? ధర్మారావు కూడా తెలివైన వాడె. అంతగా విషమించ బోతే అప్పుడే చూడవచ్చు."
"అబ్బాయిని లేపుతాను." దయామయి అలా అంటుండగానే ధర్మారావు త్వరగా పోయి పక్క మీద పడ్డాడు.
"ఎందుకు లెండి. ఉదయం మాట్లాడుకో వచ్చు" అని నారాయణస్వామి అనడం కూడా అతడికి వినిపించింది.
ఇదంతా ఏమిటో అయోమయంగా ఉంది అతడికి. ఎంత ఆలోచించినా ఏమీ అంతు చిక్కలేదు. అయితే ఒకటి మాత్రం నిర్ధారించు కున్నాడు. 'దయామయి ఒక ఖైదీ భార్య అన్నమాట! బహుశః అతడు గౌతమ్ అయి ఉండాలి! ఆమె ఇక్కడ ఈ విధంగా ఉండడం , మధ్య తనకేమైనా హాని కలిగించగలదని భయపడుతున్నది! అంతేకాదు! ఆమెను తనను గురించి , సత్య ను గురించీ అన్నీ తెలుసు! కాని ఎందుకో అవన్నీ దాచి పెడుతుంది! ఏమిటో బాధ పడుతున్నది!' ఆలోచనలు ఎటూ తెగక ముందే నిద్ర ఆవహించింది.
ఉదయం లేస్తూనే ఏమీ తెలియనట్టు పలకరించాడు ధర్మారావు నారాయణ స్వామిని-- "ఎప్పుడు వచ్చారు, బాబుగారు? కులాసానా?' అని.
నారాయణస్వామి శరీరమంతా కళ్ళు చేసుకుని చూశాడు ధర్మారావు ను. ఆనందంతో మాట్లాడలేక పోయాడు. అలా రెండు నిమిషాలు చూచి చూచి, అమాంతం ఆలింగనం చేసుకుని ఆనంద బాష్పాలోలికించాడు -- "ధర్మారావు! నా ఆశలు నిజమయ్యాయి. నా కలలు పండుతున్నాయి" అంటూ.
"అంతా మీ చలవే, బాబుగారూ" అన్నాడు ధర్మారావు నమ్రతగా.
"నిత్యం మీ నామస్మరణే" అన్నది దయామయి.
లోలోన ఆశ్చర్యపోయాడు ధర్మారావు. ఈ మధ్యకాలం లో ఆమె ముఖంలో అటువంటి కళ చూడలేదు.
"అమ్మలేని ఆశ్రమం ఎలా ఉంది , బాబుగారూ ?' అన్నాడు నవ్వుతూ ధర్మారావు.
"అమ్మలేని ఆశ్రమం అమ్మ లేని ఇల్లు లాగే ఉంటుంది, ధర్మరావ్! ఎలా ఉందని వేరే అడగడం దేనికి?" అంటూ 'అవునా, కరుణా?' అన్నాడు దయామయిని.
నీరసంగా నవ్వింది దయామయి. "నీ అభిమానం అటువంటిది కాని, ఆశ్రమానికి ఈ ఒక్క సేవిక లేనిదే ఏం లోపం, బాబుగారూ?"
"రాత్రి సంభాషణ ధోరణి కి, ఈ సంభాషణా ధోరణికీ ఎంత తేడా!' లోలోన ఆశ్చర్య పోయాడు ధర్మారావు.
"అయితే నలుగురూ 'సెభాష్' అనేట్టు చేస్తున్నావట, ఉద్యోగం! వింటుంటే చాలా సంతోష మౌతుంది , బాబూ" అన్నాడు నారాయణస్వామి.'
అలా మాట్లాడు కుంటుండగానే ఖైదీలు ధర్మారావు రాకకు వేచి ఉన్నట్లు రెండు కబుర్లు వచ్చాయి.
"వెళ్ళు, బాబూ. తర్వాత మాట్లాడుకుందాము" అన్నాడు నారాయణ స్వామి.
"మీరూ కూడా రావాలి, బాబుగారూ" అన్నాడు ధర్మారావు, ఆఫీసు దుస్తులు వేసుకుంటూ.
నారాయణస్వామి ఖంగారు పడ్డాడు. "నేనెందుకు? నాకు పనులున్నాయి. నువ్వు వెళ్ళిరా."
"కాదు, బాబుగారూ . మీరు వచ్చే తీరాలి." ధర్మారావు గారాలు పోయాడు.
"ఆయనెందు కక్కడికి? ఏదో పని ఉందంటూన్నారుగా?" కొంచెం విసుగుగా అంది దయామయి.
కాని ఒక విధమైన సంతోషం లో ఉన్న ధర్మారావు అదేమీ గుర్తించ లేదు.
"సాధారణంగా అన్ని కారాగారాలూ ఎలా ఉంటాయి ? కాని మన ఖైదీలు అలా కాదు. వారిలో మార్పు, నేను చేసిన సంస్కరణ లు మరి స్వయంగా చూడరా, బాబుగారూ?"
మరి తర్కించితే ధర్మారావు మనస్సు నోర్వగలదని నారాయణస్వామి , "సరే, పద" అన్నాడు ఏమో ఆలోచిస్తూ.
"జాగ్రత్త! అయన గుర్తు పడతారేమో?' దయామయి రహస్యంగా , ఎదర నడుస్తున్న ధర్మారావు కు వినిపించ కుండా.
"ఆ . ఆ నాకు తెలుసు." రహస్యంగా నే జవాబు ఇచ్చి వెళ్ళిపోయాడు నారాయణ స్వామి.
* * * *
ఖైదీలందరూ ఒకచోట బుద్దిగా నిలబడి ఉన్నారు. "బాబుగారూ, రండి, రండి" అనీ బలరాం ఎదురు వచ్చాడు. లోపలికి పోయి చూచినా ధర్మారావు . అక్కడి దృశ్యాన్ని చూచి అమితంగా ఆనందించాడు ; ఆశ్చర్య పోయాడు కూడా.
జైలు ఆవరణలో ఎదుట ఒక పక్కగా నాలుగు కర్రలు పాతి పైన ఆకులతో పందిరి లాగా వేసి మామిడి తోరణాలు కట్టారు. లోపల చక్కటి శ్రీనివాసుని పటం పూజలకు ఎదురు చూస్తున్నది. శంఖు చక్ర గదాదారి అభయ ముద్రతో నిలుచున్నాడు. ధర్మారావు ముఖం ఆనందంతో కళకళ లాదిపోయింది. వెల్లువలా ప్రవహించి పోతున్న ఆనందంతో, "నా ప్రయత్నాలు ఫలించాయి." అంటూ అననత నేత్రుడై భక్తీ పురస్పరంగా చేతులు జోడించి నిలబడ్డాడు.
"పూజ చెయ్యండి, బాబుగారూ. మీ చేత్తో ఈ మొదటి రోజున పూజ ఆరంభించి దీపం వెలిగించండి. ప్రతి రోజూ ఉదయమే ఆ ఏడు కొండల వాడికి మేమందరమూ ఒక్కసారి దండం పెట్టుకుని మరీ పనుల్లోకి పోతాము. మా పాపాలకు విరుగుడు బోధించిన మీరే ఈ పూజ ప్రారంభించి మాకు ప్రసాదం పెట్టాలి." అన్నాడు బలరాం.
ధర్మారావు పై వారందరికీ ఉన్న ప్రేమాభిమానాలకు నారాయణ స్వామి కనులు చెమరించగా ఆర్ద్ర నయనాలతో అందరినీ తిలకిస్తూ నిలుచున్నాడు.
ధర్మారావు చిరునగవు తో ఖైదీలతో అన్నాడు :"మీకు నా మీద ఉన్న అభిమానానికీ కృతజ్ఞుడిని. కాని మీరు నాకిచ్చిన ఈ గౌరవాన్ని నేను శ్రీ నారాయణ స్వామి గారికి ఇచ్చి వారే ఈరోజు పూజ చేసి మనలను ఆశీర్వదించాలని కోరుతున్నాను. వారు నా జీవితాన్ని తీర్చి దిద్దిన మహామహులు. మరెందరి జీవితాలకో దారి చూపుతున్న దాతలు. వారు నాకు తల్లీ, తండ్రి, గురువూ , దైవం -- అన్నీ . నేడు ఈ సమయం లో దైవికంగా వారు ఇక్కడకు రావడం మన అదృష్టం."
"చిత్తం , బాబూ . తమ ఇష్టం. "ఖైదీలు వెంటనే అంగీకరించారు.
నారాయణస్వామి ఆనందం వర్ణనాతీతం. పుష్పాలతో ఆ దేవుడి పటాన్ని పూజించి, అరిటి పండ్లు ప్రసాదం ఉంచి, జ్యోతి వెలిగించాడు. ఖైదీలందరూ భక్తిగా, వీనుల విందుగా దైవ సంకీర్తన చేశారు. అనంతరం ఒక్కొక్కరూ వచ్చి నారాయణ స్వామి ఇచ్చిన ప్రసాదం స్వీకరించి భక్తితో నమస్కరించారు. తెల్లని గెడ్డంతో, నలుపు తెలుపు కలిసిన గిరజాలతో, ధవళ వస్త్రాలతో , ప్రశాంత వైర్మల్యా లోలికించు తున్న వదనంతో , కళా దీప్తి మంతమైన కనులతో, శాంతి దూతలా ఉన్న నారాయణ స్వామిని చూచిన ఖైదీలందరికీ ఎనలేని భక్తీ భావం కుడురుకున్నది.
నిశ్శబ్దంగా తననే వీక్షిస్తున్న వారందరినీ సంబోదిస్తూ చెప్పాడు నారాయణ స్వామి: "నేను దైవం ఎదుట వెలిగించిన ఈ జ్యోతి మీ జీవితాలకే జ్యోతి కావాలనీ, ఈ జ్యోతి ప్రసాదించిన వెలుగు బాటలలో మీరు మీ జీవితాలను తీర్చి దిద్దుకోగలరనీ, ఆశిస్తున్నాను. అధ్యాత్మీక చింతన మానవుని ఊహలను మంచి మార్గం లోకి తిప్పడమే కాక, మనస్సుకు ఆనాటి కానాడు అధిక సుఖ శాంతులను ప్రసాదిస్తుంది. అధికారుల మధ్య , మీ మధ్య ఉన్న ఇటువంటి సామరస్యమే ఎల్లెడలా, ఎల్లవేళ లా నెలకొంటే ఇక ఈ భువి స్వర్గమే కాగలదు. మీ ఈ సద్వర్త నానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఆ భగవంతుడు మీ పట్ల దయగా వర్తించాలని ప్రార్ధిస్తున్నాను."
"ధర్మారావు గారికీ జై. బాబుగారికీ జై." ఖైదీలు సంతోషాన్ని జయ జయ ధ్వానాలతో వెలిబుచ్చు తుండగా నారాయణ స్వామి, ధర్మారావు వెళ్ళిపోవడానికి దారితీశారు.
"ఇంతకూ ఈ బొమ్మ ఎవరు వేశారు? చాలా బాగుంది" అన్నాడు ధర్మారావు.
"గౌతమ్ గారు. "ఖైదీల సమాధానం.
"సరే. మనం వెళ్దాము . పద.' నారాయణ స్వామి ఆ విషయం పట్టనట్లు త్వరపడ్డాడు. అదేమీ గమనించని ధర్మారావు 'అయన, గౌతమ్ అని-- నిజంగా చెప్పుకోదగిన వ్యక్తీ .' అంటూ అటు చూచాడు. గౌతమ్ అందరికీ దూరంగా ఒక చెట్టు నానుకొని నిలబడి, కనుబొమలు ముడి వైచి , ఏదో పరిశోదిస్తున్నట్టు తీవ్రమైన పరిశీలనా దృక్కులతో నారాయణ స్వామిని తదేకంగా తిలకిస్తున్నాడు. కాని అప్పటికే నారాయణ స్వామి జీపును సమీపించడం చూచి, తాను కూడా వడివడిగా అటు వెళ్ళిపోయాడు ధర్మారావు.
ఆ సాయంత్రం స్వప్రదేశానికి వెళ్లి పోవడానికి సిద్దమయ్యాడు నారాయణ స్వామి.
'అప్పుడే వెళ్తారా? మిమ్మల్ని మా మిత్రుడు పోలీసు సూపరింటెండెంట్ కూ, వాళ్ళకూ పరిచయం చేయాలను కున్నాను.' అన్న ధర్మారావు కు సమాధానంగా , అతి తీవ్రంగా సమాధానం చెప్పాడు నారాయణ స్వామి.
"చూడు, ధర్మరావ్. నాకు ఏ అధికారులనూ నీవు చూపనక్కర లేదు. నీ అధికారాన్ని నీవు అతి జాగ్రత్తగా నిలుపుకొంటే నా కదే చాలు. తర్వాత.......నువ్వు ఇది నా శాసనంగా గుర్తుంచుకో. ఎప్పుడూ ఏ పోలీసు అధికారినీ నా దగ్గరకు గానీ, నేను నడుపుతున్న ఆశ్రమానికి గాని తీసుకు రావద్దు; చూపవద్దు; నా ప్రసక్తి వారి వద్ద తేవద్దు.'
ధర్మారావు వర్ణనా తీతమైన ఆశ్చర్యానికి లోనయ్యాడు. తాను పసి బాలుడుగా ఉన్న నాటి నుండి ఈనాటి వరకు అయన సన్నిధినే పెరిగి పెద్దవాడయ్యాడు. కాని ఎన్నడూ అయన వాక్కు ఇలా శాసనంగా వెలువడడం గాని, స్వరం లో అంతటి కాఠిన్య గంబీర్యాలు తొణికిసలాడడం గాని తనకు అనుభవం లోకి రాలేదు. అలాగే విస్మయంతో తననే తిలకిస్తూ నిలబడిన అతడి నేత్రాలలోని ప్రశ్నను అర్ధం చేసుకున్న నారాయణస్వామి కొద్దిగా గాంబీర్యం సడలించి, చిరునగవు తో అన్నాడు: "నేను చెప్పినది ఆచరించడమే నీ కర్తవ్యం. ఏమిటీ, ఎందుకూ అనే ప్రశ్నలు వద్దు. నేను నీ క్షేమాభిలాషిననే విషయం నీకూ విదితమే."
'అలాగే, బాబుగారూ!" తలవాల్చి , నమ్రతతో అన్నాడు ధర్మారావు.
కాని నారాయణస్వామి వెళ్ళిపోయి నాలుగు రోజులైనా ధర్మారావు మనస్సులో సందేహ నివృత్తి కాలేదు. ఒక సందేహం కాదు. ఒక భావం కాదు. తన చుట్టూ , తాను పెరిగిన ఆశ్రమం చుట్టూ, తనను పెంచిన దయామయి , నారాయణ స్వాముల చుట్టూ ఏదో తనకు తెలియని వింత విషయ చక్రం పరిభ్రమిస్తున్నట్లు అనిపించిందే కాని, ఆ చక్రం రూప మేమిటో, ఆ చక్రానికి అకులేలా ఏర్పడ్డాయో , ఇరుసు ఏమిటో, చట్రమిటో -- ఇన్నింటి లో తాను ఏమిటో , తన స్థానం ఎటువంటిదో అతడి కేమీ అంతు చిక్కలేదు.
"ఈసారి వీలు చూచుకుని ఇదేమిటో నారాయణ స్వామి గారిని అడిగి వేయాలి' అని కూడా అనుకున్నాడు.
