Previous Page Next Page 
శాంతినికేతన్ పేజి 23


    వింటూనే కనుబొమలు ముడివేసింది మనోరమ. చాలాసేపు ఆలోచించింది. "అయితే నీతో ఈ విషయం సమగ్రంగా మాట్లాడే అవకాశ మిస్తావా నాకు?" అనడిగింది శాంతిని.
    "మరి మనం ఇప్పుడు మాట్లాడుకొనేదేమిటి? క్రొత్తగా అడుగుతున్నావ్?"
    "అది కాదు. ఇంకా అనేకం మాట్లాడవలసి ఉంటుంది. నీకు కోపం రాకూడదు."    
    "సరే. చెప్పు, ఏమిటో."
    "ఇక్కడ కాదు. అలా చెట్ల క్రిందికి పోదాం పద."
    సంధ్యాతపం సుందరంగా ఉంది. ఆకాశంలో అందమైన ఇంద్రధనుస్సు చెదిరిపోయింది. గాలి తేమను మిళితం చేసుకుని విహరించసాగింది. నాగమల్లి క్రింద కూర్చున్నారు శాంతీ, మనోరమా. మెల్లగా ప్రారంభించింది మనోరమ. "చూడు, శాంతీ. చలనమంటూ లేని నీ మనస్సులో స్పందనం ప్రారంభమైంది. నిజానికి నేను ప్రయత్నించింది కూడ అందుకే. అంతేకాని గోవింద చావునూ, నిన్నూ దగ్గర చెయ్యాలని కాదు నా ప్రయత్నం."
    "అదేమిటి, మనోరమా?" నిర్ఘాంతపోయింది శాంతి.
    "అవును, శాంతీ తొందరపడకుండా సాంతం విను. మెల్లమెల్లగా వచ్చే ప్రవాహం వేరు. ఒక్కసారిగా ఉప్పెనలా ఉధృతంగా వచ్సిపడే వరదవేరు. ఆ వేగానికి కట్టాలే బ్రద్దలై పోతాయి. ఇప్పుడు నీ మనఃస్థితి అలాగుందని నా భావం. మంచి చెడ్డలు, ఉచితానుచితాలు, కీడు మేళ్ళు ఎంచకుండా ఊళ్ళను వూళ్ళను తుడిచిపెట్టే స్తుంది వరద ఆ వేగంలో. తర్వాత వరద తీసి పోతుంది. నది ఎప్పటి రూపం ధరిస్తుంది. కాని ఒకనాటి వేగోద్రేకంలో అది చేసిన అపారనష్టం మాత్రం అలాగే కన్పిస్తుంటుంది."
    "ఏమిటిదంతా, మనోరమా?" విసుగ్గా అడిగింది శాంతి.
    "విసుక్కోకు, శాంతీ. నీకు వయస్సుందన్న మాటేగాని లోకజ్ఞానం బొత్తిగా లేదు. బహుశః అమ్మా నాన్నగార్ల అతిగారాబం, అన్నయ్య అతిలాలన నిన్నలా చేశాయనుకుంటాను. ఒక విషయం చూడు. గోవిందరావు నీకు యిక్కడ పరిచయమైనవాడు. అదైనా అంత విశేషమైన పరిచయం కాదు. అతడి గుణా లెటువంటివో, అలవాట్లు ఏమిటో, స్వభావం ఎటువంటిదో నీకు ఏమీ తెలియదు. కొన్ని సంవత్సరాలకాలం అతి సన్నిహితంగా ప్రవర్తించినవైకే తమ స్నేహితుల, ఆప్తుల స్వభావాలు కొన్ని కొన్ని విషయాలలో ఆగమ్యగోచరంగా వుండిపోతాయి. ఇక వూరికే నాలుగు రోజులు నాలుగు మాటలాడి, ఒకనాడు ఒక అంతసేపు అతడితో నాటకం వేసినంత మాత్రాన నీ కతడి అంతరాత్మలో వీసమెత్తు కూడ గ్రహించగల అవకాశం వుండదు."
    "మరి అతడికీ, నాకూ గల స్నేహాన్ని గూర్చి మొన్న రకరకాలుగా వ్యాఖ్యానించావ్?" నిష్టురంగా అడిగింది శాంతి.
    "అవును కాని, అది నిజం కాగల అవకాశాలు తక్కువని చెపుతున్నాను. గాలిమేడల పునాదులు బహునీరసమైనవి. ఒక్కసారిగా నువ్వుమూర్ఖంగా గ్రుడ్డిదానవైపోకుండా నీకే తెలియని నీ మనస్సును మెల్లమెల్లగా పొరలు తొలగించి నువ్వు గ్రహించేట్టు చేశాను. నన్ను నమ్ము, శాంతీ. నేను నీ మేలుకోరే స్నేహితురాల్ని."
    "అయితే యిప్పుడు నా కర్తవ్యమేమిటి?"
    "నువ్వు రాజాను ఎందుకు తిరస్కరించావు?"
    "అతడిపై నాకాభావంకలుగలేదంతే. అయినా ఇప్పుడా ప్రసక్తి దేనికీ?" చికాగ్గా అంది శాంతి.
    "అవును. అతడిపై ఆ భావం కలుగలేదు- అతడిది తొందర స్వభావం కాదుగనుక: ఎప్పుడూ అనుచితంగా ప్రవర్తించలేదు గనుక. కాని మొన్న గోవిందరావు ప్రవర్తనను గురించి తిండి కూడ మానేసి వెక్కెక్కి పడి ఏడ్చావ్? ఇంతలో నీ కతడిపై అంత గురి ఎలా కుదిరిపోయిందబ్బా?"
    "అయినా అతడు చాలా మంచివాడన్పిస్తోంది, మనోరమా." జాలిగా అంది శాంతి. స్వప్నజగతిలో యదార్ధవాదానికి స్థానం ఉండదు!
    "అయితే మంచిదే. కాదని నేననడం లేదు. కాని అతడు మంచివాడైనంత మాత్రాన, నీకిష్టమైనంత మాత్రాన సరిపోదు. ఇంకా అనేకమైన ఆటంకాలు ఉన్నాయి. అతడు మహారాష్ట్రుడు. నువ్వు ఆంద్ర యువతివి. తల్లిదండ్రుల చాటుదానవు. నీకూ, అతడికీ వివాహం చేయగలంత సంస్కార కుటుంబమా మీది?"
    "నా ఇష్టాన్ని ఎవ్వరూ కాదనను. అన్నయ్యకు నేనంటే ప్రాణం. నాన్నగారికి ప్రాణాధికం!" గర్వంగా చెప్పింది శాంతి.
    "అందుకని ఆ ఆధారాభిమానాలను సద్వినియోగం చేసుకోకుండా యిలా ప్రవర్తిస్తావా? వారు నీపట్ల చూపే ప్రేమాభిమానాలకు నువ్విచ్చే ప్రతిఫలం యిదా?"
    ఛర్రున కోపం వచ్చింది శాంతికి. "ముందు మాట యిచ్చాను గనుక సరిపోయింది. కాని ఎంత ఆప్తులైనా నా విషయంలో యింత చనువుగా మాట్లాడడానికి సాహసించలే దింతవరకూ."
    నవ్వింది మనోరమ. "తెలుసు, శాంతీ, నీక్కోపం వస్తుందని. నిజం ఎప్పుడూ నిష్టురంగానే వుంటుంది. కాని పసిపిల్లలు ఏడ్చినంత మాత్రాన వాళ్ళను మట్టిలో ఆడుకోనీయం. తీసుకొచ్చి శుభ్రమైన చోట కూర్చోబెట్టే బాధ్యత పెద్దలది. అలాగుంది ప్రస్తుతం నీ పరిస్థితి. పసిపిల్లలా ఆలోచించకు. నీకు బాధ కలిగించడం యిష్టంలేక మీవాళ్ళంగీకరించారే అనుకో. కాని వాళ్ళెంత బాధపడతారో, ఎన్ని హేళనావమానాలకు గురి ఔతారో ఆలోచించావా? ఆ పని తప్పని కాదు నేననేది. కాని ఎంత చదివినా, ఎన్ని చూచినా మన సంఘ సంస్కారం కుల మత జాతి భేదాల నధిగమించగల సాహస పరిస్థితికి రాలేదింకా. మున్ముందు తప్పక వస్తుంది. అందువల్ల ఆ భావాలను నీలోనే ముందుతరంకోసం దాచిపెట్టు పదిలంగా. మొక్కవేసిననాడే కాయకాయదుగదా!"
    "ఏమిటో ఒక విషయంలోనుంచి ఇంకొక దానిలోకి దిగుతున్నావ్. నేను నిశ్చయించుకున్నాక యిక నానా ఆటంకాలేమీ వుండవు. నే నెవ్వర్నీ లెక్కజేయను."
    "ఆదలావుంచు. నువ్వింత అందాల బొమ్మవు కదా! గోవిందరావు నల్లగా మోటుగా నీప్రక్కన ఎలాగుంటాడో ఆలోచించుకో."        
    కూర్చున్న స్థలంలోనే అటూ యిటూ యిబ్బందిగా కదిలింది శాంతి. 'నిజమే! ఇదేమిటి? నాకింతవరకూ అతడి అందం గురించిన ఆలోచనే రాలేదు! అందం లేదనుకో. కాని ఆ కళ్ళలో ఎంత తీక్షణత. ఎంతాకర్షణ!' అనుకొంది శాంతి.
    "ఏం సమాధానం చెప్పవ్? ఆ విషయం ఇంతవరకూ నువ్వాలోచించలేదు కదూ? అంత స్నిగ్ధ సుకుమారమైన దన్నమాట నీ ప్రేమ! కాని అతడది అందుకోగలంత సహృదయు డంటావా? నీ ఆందానికి తగడని యిప్పుడైనా అన్పించడంలేదూ నీకు?"
    కోపంగా లేచి నిల్చుంది శాంతి. "చనువున్నది కదా అని హద్దుమీరి మాట్లాడకు, మనోరమా. భగవన్నిర్ణయమైన సౌందర్య కురూపాలకు మన మేం చేయగలం? ఆ విషయమై నేనింతకు ముందూ ఆలోచించలేదు; ఇప్పుడూ ఆలోచించదలచుకోలేదు. నిర్మల ప్రేమకు అంతఃకరణ శుద్ధీ, ఆత్మసౌందర్యం ప్రధానంకాని శారీరక సౌందర్య మేపాటిది? అందాలరాణి డెస్డెమోవా ఒధెలలోను చేసుకొంది. ఒధెల్లో ఎవరు? నీగ్రో! ఆ ప్రణయ మొక మహాకావ్యమైంది. ఎవరేం చెప్పగలరు? కేవలం అందంబట్టే నిర్ణయించితే ఈ ప్రపంచంలో ఎన్ని పెళ్ళిళ్ళు జరుగగల వంటావ్?"
    పోతున్న శాంతి చెయ్యిపట్టి ఆపి తనూ లేచి పడక సాగించింది మనోరమ.
    దినకరుడు దినచర్య విరమించి దిగంతాల మాటుకు విశ్రాంతికి సాగిపోతున్నాడు. పక్షులన్నీ గూళ్ళు చేరుకుంటున్నాయి. తిరిగి నీలా కాశంలో అక్కడక్కడా మేఘశకలాలు చేరుకుంటున్నాయి. సంధ్యారుణ కాంతులలో విశ్వభారతి వింతగా ప్రకాశించసాగింది. చెట్ల క్రింద తిరుగుతున్న విద్యార్ధులు తమ తమ నివాసాలు చేరుకుంటున్నారు.
    హాస్టల్ గదిలోకి వచ్చి కూర్చున్నారు శాంతీ, మనోరమా. కొద్దిసేపు మౌనమే రాజ్యం చేసింది. క్రమంగా భూతలంపై చీకట్లు ముసురుకో సాగాయి. చంద్రోదయ మౌతుంది.
    లైటు వెలిగించి వచ్చి శాంతి దగ్గర కూర్చంది మనోరమ. "చూడు, శాంతీ. నిజంగా నీ మాటలు వింటూంటే నాకు పరమానందంగా వుంది. బాహ్యసౌందర్యంకంటే హృదయ సౌందర్యానికి ప్రాధాన్యం యిచ్చిన నీ కోమల హృదయ సౌందర్యానికీ, సౌకుమార్యానికీ అంజలి ఘటిస్తున్నాను. కాని, నువ్వు రాజా నేందుకు చేసుకోవు? అందుబాటులో ఉన్న పాయసాన్ని వదిలి ఆకసంలోని అపరంజి పాత్రకోస మెందుకు ప్రాకులాడుతావు? ఇంతకూ ఆ పాత్రలో అమృతముందో, హాలాహల ముందో ఎవరెరుగుదురు? రాజా సౌందర్యం, ముగ్ధమోహనమైన అతడి సంభాషణ, గౌరవ ప్రవర్తన మొదటి పరిచయంలోనే నాకెంతో గౌరవాన్ని కలిగించాయి. మరి నువ్వెందుకు తృణీకరిస్తున్నావు?"
    "అబ్బ! రాజాపక్షమైపోయా వేమిటి నువ్వు? అంధగాడైనంతమాత్రాన ఆకర్షింపబడాలేమిటి?"
    "అలా తీసిపారేయకు, శాంతీ. అతడు నిండు కుండ."
    "అందుకే నాకిష్టం లేదు. ఆవేశంగా ఉత్సాహంగా వుంటాడు గోవిందరావు ఎప్పుడూ. అతడి కతడే సాటి."
    "సరే, అయితే." నిట్టూర్చింది మనోరమ. "నీ ప్రేమ ఎంత బలమైనదో పరీక్షించతనికె యింత ప్రయత్నించాను నేను. ఇక నీ విషయంలో నాకు సందేహం లేదు. కాని అటు పక్షం కూడ అంత బలంగానూ ఉండాలి. లేకుంటే యిటువంటి వివాహాలు సఫలం కాగలవు. అందుచేత ఒక్క కోరిక, శాంతీ."    
    "ఏమిటది?"
    "నీ విషయంలో నాకేం సందేహం లేదు. కాని తీరికగా మరో నాలుగురోజు లాలోచించుకో. అప్పుడూ యిదే నిర్ణయమైతే మెల్లగా అతడిని గురించి అన్నీ  తెలుసుకో. కాని ఎక్కువ చనువుగా మాత్రం ఉండకు. వివాహం చేసుకుంటూ డేమో అడుగు. అంగీకారమైతే అప్పుడు మీ పెద్ధల్ని ఒప్పించాలి: వారు పెళ్ళి చేయాలి. అంతవరకూ ఎటువంటి చనువూ పనికిరాదు."
    "మనోరమా!"
    "అవును. నామాట పాటించు. అతడికి నువ్వు తిరిగి గ్రీటింగ్ కార్డ్ కూడ యివ్వద్దు. అంతే!"
    చంద్రుణ్ణి మబ్బులు కప్పివేయసాగాయి. తిరిగి వాన కురిసే ప్రయత్నమేమో గాలి వీచసాగింది. ఆ గాలికి చంపకవృక్షం బలంగా అటు యిటు ఊగడం కిటికీనుండి కన్పించింది.

                                     26

    సాలవృక్షం క్రింద పచ్చికపై కూర్చున్నారు విధ్యార్దులంతా. ఆదునిక చిత్రకళకూ, ప్రాచీన చిత్రలేఖనానికీ గల భేదాలు, ప్రాక్పశ్చిమ చిత్ర లేఖనాలలోని పోలికలు సవిస్తరంగా చర్చిస్తూ బోధిస్తున్నారు ఆచార్యులవారు. అక్కడ ఉన్న దన్నమాటే కాని శాంతి చెవికీ ఒక్కమాట సోకడంలేదు. పరధ్యానంగా కూర్చుని ఆనతి దూరంలోనే చెంగు చెంగున గెంతుతూన్న ఉడుతల జంటను చూడసాగింది.
    పరధ్యానంగా ఉన్న శాంతిని ప్రొఫెసర్ పిలిచాడు. ఒక పిలుపుకు ఆమె పలుకనేలేదు. రెండవసారి పిలిచేసరికి కలవరంతో లేచి దగ్గరకు వెళ్ళింది. ప్రొఫెసర్ ఆమె చేతి కొక చీటీ యిచ్చారు, 'అత్యవసరంగా యిప్పుడే కలుసుకోవాలి - శ్రీహరి.' ఆశ్చర్యపోయింది శాంతి. 'ఇవ్వాళ ఆదివారం కాదే? ఎలా తీరుబాటైంది? ఏమిటంత తొందర?' అనుకుంటూ లేచి వెళ్ళింది.
    కమలావృక్షం క్రింద శ్రీహరీ, రాజా నిల్చుని ఉన్నారు. 'గెస్ట్ రూమ్' లోకి దారి తీస్తూన్న శాంతిని ఆపాడు శ్రీహరి. "ఇక్కడే కూర్చుందాం, బాగుంది" అని అక్కడే పచ్చికపై కూర్చున్నాడు. శాంతీ, రాజా కూడ కూర్చున్నారు.
    "ఎలా ఉన్నావ్?" అడిగాడు శ్రీహరి. ఆ కంఠంలో ఆప్యాయత లోపించినట్లు అనిపించింది శాంతికి.
    "బాగానే ఉన్నాను. ఇవ్వాళ మీ ఆఫీసుకు సెలవా?"
    రాజా చెప్పాడు: "రాజీనామా యిచ్చాడు. రేపు మెయిల్లో వెళ్ళిపోతున్నాడు."
    ఆశ్చర్యంగా చూచింది శాంతి. "ఇంత హఠాత్తుగా ఏమిటి?"
    "హఠాత్తుగానూ, అనుకోనిదీ కాదు. కావాలనే. ధవళేశ్వరం పి. డబ్ల్యు. డి. లో వచ్చింది ఉద్యోగం. నాన్నగారి ఆరోగ్యం బాగుండడం లేదట. దగ్గరలో ఉందామని."
    "నాన్నగారి ఆరోగ్యానికేం? బాగానే ఉన్నానని వ్రాస్తున్నారు ఉత్తరాలు?" అయోమయంగా అడిగింది శాంతి.
    "వ్రాయడానికేం? నీ సంతోషం కోసం ఏమైనా చేస్తారనుకో. అలా వ్రాయడమే ఒక విశేషమా?" అన్నాడు శ్రీహరి.
    శాంతి మాట్లాడలేదు. "ఇంతకూ అనారోగ్యమేమిటి?" అనడిగింది తర్వాత.
    "ఏమని చెప్పటానికీ నాకొకటి తెలుసు గనుకనా? కాని ఒకటి మాత్రం చెప్పగలను. అనవసర తాపత్రయంతో, మెత్తదనంతో ఆయన అనేక అనర్ధాలను కొని తెచ్చుకుంటున్నారు. కానీయ్. స్వయంకృతాలు. ఎవరేం చేయగలరు? చేరువలో ఉండి కాస్త మంచి చెడ్డలు కనుక్కుమ్తూ పుత్రుడుగా బాధ్యత నెరవేర్చుకుందా మనుకుంటున్నాను."
    అందలి శ్లేష గ్రహించిన శాంతి ముఖం మాడిపోయింది.
    "మీ అన్నయ్య నీమధ్య విదేశాలకు పంపటానికి ఎన్నుకొన్నారు" అన్నాడు రాజా.
    శాంతి వదనం ప్రఫుల్లమైంది. "అయితే ఎప్పుడు వెళ్ళడం?" అనడిగింది సంతోషంగా.
    "వెళ్ళడం లేదు. నిరాకరించాడు. నాన్నగారికి దగ్గర్లో ఉండాలని......"
    "ఆఁ!" ఆశ్చర్యపోయింది శాంతి.
    "అవును, శాంతీ." గంభీరంగా అన్నాడు. శ్రీహరి. "ఆ విషయం చెప్పటానికే వచ్చాము. జాగ్రత్తగా ఉండు. తరుచు ఉత్తరాలు వ్రాస్తూండు. ఇక నేను యిలా రాలేను కదా! అంటూ లేచాడు శ్రీహరి.
    "ఉండన్నయ్యా." చెయ్యి పట్టుకుంది శాంతి. "నేనూ వస్తాను."
    "ఎక్కడికి?"
    "రేపు నిన్ను ట్రెయినెక్కించి తిరిగి వచ్చేస్తాన్లే."
    "వద్దు" అన్నాడు శ్రీహరి ఖచ్చితంగా. "మళ్ళీ ఒక్కత్తెవూ రావాలి."    
    "పోనీ, నా స్నేహితులు ఎవర్నైనా తీసుకువస్తాను."
    "ఎవరు?"
    'గోవిందరా' వని చెప్పడానికి సాహసించలేక పోయింది శాంతి. "మనోరమ" అంది.
    "ఎందుకూ? ఆవిడా నీలాటి ఆడపిల్లేగా? అయినా ఎందుకంత యిబ్బంది? నువ్వు నాకు స్టేషన్ కొచ్చి వీడ్కోలు యివ్వనంతమాత్రాన మర్యాదలోపం రాలేదులే."    
    "పోనీ, పాపం, రానీయ్ శ్రీహరీ. నేను దిగబెడతానులే" అన్నాడు రాజా.
    "వద్దన్నానుగా? అక్కర్లేదు" అంటూ సాగిపోయాడు శ్రీహరి. రాజా అనుసరించాడు, నివ్వెరపోయి నిలబడిన శాంతిని తిరిగి తిరిగి చూస్తూ.
    మరి పాఠం వినడానికి పో బుద్ధి కాలేదు శాంతికి. ఒంటరిగా కూర్చుని ఆలోచించ సాగింది. 'అన్నయ్య తెలివి తక్కువవాడా, మంచివాడా? ఎందరి పిల్లలు దూరదూరాలలో ఉండి ఉన్నత విద్య లభ్యసించడంలేదు? ఎందరు ఉన్నతోద్యోగాలలో లేరు? తల్లినీ, తండ్రినీ కనిపెట్టుకుని ఉండటమేమిటి? వృద్దులకోసం చిన్నవాళ్ళు అభివృద్దిని పాడుచేసుకుంటారా? అందరికంటే గొప్పవాడా అన్నయ్య? అయినా నాన్నగారి ఆరోగ్యం బాగుండకపోవడ మేమిటి? నాకు ఉత్తరాలు బాగానే వ్రాస్తున్నారే?'
    ఆలోచన ఎటూ తేలలేదు. 'ఆఁ. పట్టి తెలివి తక్కువవాడు. వదినను విడిచి వెళ్ళలేక వెళ్ళడం లేదు. అందుకే రాజమండ్రిలో ఉద్యోగం సంపాదించుకున్నాడు. నాన్నగార్ని అడ్డుపెట్టుకుంటున్నాడు మహా ఘనుడులాగ!' అని తేలికగా నిర్ణయించేసుకుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS