Previous Page Next Page 
మొగలి పొదలు పేజి 23

   
    
    "నా మొదటి జీతంలో ముప్పై మీకు చెప్పకుండా పంపించాను. క్షమిస్తారా నన్ను.'
    'యిప్పుడు అడుగుతున్నావా.' శ్రీనివాస్ కి కోపం వచ్చింది.
    'ఎందు కంతలోనే కోపం తెచ్చుకుంటారు?'
    'చూడు రాజేశ్వరీ నీకు న్యాయంగా ధర్మంగా అనిపించి వుండవచ్చు ను. నేను భర్తని నీకు. నా చాటుగా నువ్వు అటువంటి పనులు చేస్తుంటే నీకు తెలియదు నా మనసు యెంత నిగ్రహించుకున్నా కుతకూత లాడుతోంది.'
    'నేనిప్పుడు కాని పనేం చేశాను.
    'నువ్వు దేవదాసు కి డబ్బు పంపే ముందు ఆ మాట నాతొ అని వుంటే యెంత ఆనందించే వాడిని?' అతని చేతిలో పేక ముక్కలు చెల్లా చెదరై పోయాయి. నేల మీద అర్ధం లేనట్టుగా పరుచుకుని పగిలి పోయిన జీవితం లా కనిపిస్తున్నాయి. శ్రీనివాస్ మరి మాట్లాడలేదు. అతని అంతరంగం వుడికి పోతోంది. యెంత సరిపెట్టుకుందాం అనుకున్నా పద్మావతి కళ్ళ ముందు కదులుతోంది. భర్త పోయాక యిద్దరు పిల్లలున్న పద్మావతి కక్కుర్తి పడితే రాజేశ్వరి అలా చేయదని నమ్మకం యేవిటి?' అతని మనసు యీ శంక తోనే కొట్టుకు లాడి పోతోంది. స్త్రీని యెంత వరకూ నమ్మాలో కూడా అవగాహన కాలేదు. అతని గుండెల్లో మంటలు బయలుదేరుతున్నాయి. వాటిని మనసు రెచ్చగొడుతూ ఉదృతంగా ఆకాశానికి ఎత్తుతోంది. రాజేశ్వరి అతని కాళ్ళ మీద చేయి వేసి కూర్చో గానే అతని వేదనంతా పటాపంచలై పోయింది. పొదివి పట్టుకుని ఆవిడని దగ్గర కు తీసుకోగానే అతని మనసు పాలరాయి లా స్వచ్చంగా మారిపోయింది. అనుమానం లాంటి పిశాచాన్ని నిర్మల్యం కొట్టేసింది. అతను నెమ్మదిగా అన్నాడు. 'చూడు రాజేశ్వరి . యింకేప్పుడూ నాకు దూరంగా రహస్యాలూ వుంచుకుని నన్ను నీ శరీర భాగం లోంచి విడగొట్టకు.' అలా అంటుంటే వెచ్చని కంటి  నీటి చుక్క జారి ఆవిడ నుదుట మీద పడింది.
    'నేను....నేను యింక యెప్పుడు చేయను. దైవసాక్షి ' రాజేశ్వరి అంది.

               

                                   11
    వర్షాకాలం గోదావరి కట్టలు తెంచుకుని వురకలు వేస్తూ పరుగులు పెడుతోంది వుప్పొంగి పోతూ. వరదలు ఘాటుగా వున్నాయి. కొబ్బరి కాయలు దింపించేసి ఎగుమతీ చేసి యింటికి వచ్చేసి వీధి వాకిట్లో మంచం మీద మాధవిని గుండెల మీద పడుకోబెట్టుకుని అడిస్తున్నాడు ఫకీరు.
    అతని గొంతు లోంచి బయలుదేరిన మంట గుండెల్లోంచి కడుపులోకి వ్యాపిస్తోంది. చుట్ట తాగినా, సారా తాగినా తపన చల్లారలేదు. ఈదురు గాలి వచ్చి శరీరాన్ని తాకుతోందే గానీ అంతర్భాగాన్ని ముట్టుకోవడం లేదు.
    'దాదా నాకు బిండం యివ్వలేదు.' మాధవి వేలు పట్టి చూపించింది రత్తాల్ని.
    'ఏం ఎందుకివ్వలేదేసే , ఫకీరు కళ్ళు యెరుపు రంగుకి మారి పోయాయి.
    రత్తాలు యింక కాస్సేపట్లో ఫకీరు చేత చావు దెబ్బలు తింటుందన్న మాట. సుభద్ర కలిపించుకుని 'వూరికే పిల్ల మాట పుచ్చుకుని బాదేయడం గొప్ప కాదు ఫకీర్. రాత్రంతా వొళ్ళు పెలిపోతోందనేగా మస్తాను యింటికి వెళ్లి మాత్రలు పట్టుకోచ్చావు. యిప్పుడు ఈ వర్షం లో చలిగాలిలో బొండం నీళ్ళు తాగిగే వాతం కమ్మేయదూ' అంది.
    'అవును రాణీ. రాత్రంతా నీకు జొరం వచ్చింది. పది రోజులాగు నేను తీసిత్తాను,' ఫకీరు చల్లబడ్డాడు. సుభద్ర అంటే అతనికి క్రమేణా గౌరవం కలిగింది. అయినింటి పిల్లను వాడుకుంటే అదేదో శాపం తగుల్తుందేమో అన్న శంక పీడిస్తూనే వుంది అతన్ని.
    ఫకీరు లేచి నిలుచుని మాధవి ని భుజం మీద వేసుకుని పచార్లు ప్రారంభించాడు.....! 'చూడు రాణీ అమ్మ దగ్గరికి ఎల్తావా' మాధవి యేడుపు లంకించు కుంది.
    సుభద్ర కోపంగా అంది. 'వూరికే అతని వెంట తగులుకున్నావు. వరద రోజులు కనుకనే నీ ఆటలు సాగుతున్నాయి. రేపు పట్నం వెళ్ళిపోతే ఎడుద్దువు గాని తీరికగా.'
    'కేకలేయమాకు సుభద్రా. సంటిదానికి మాలిమి అయిపొయింది. యెందుకలా యేడిపిత్తావు,' రత్తాలు నెమ్మదిగా అంది సుభద్ర యింకేమీ అనలేదు.
    'సుభద్రా', ఫకీరు గట్టిగా పిలిచాడు. ఆవిడ యింతవరకూ యెన్నడూ యెరుగదు. ఫకీరు పెట్టిన కేక గుండెల్లో గునపాలతో పొడిచి నట్లుగా వుంది.
    'పిల్లని తీసుకో.' అప్పటి కప్పుడే ఫకీరు వాంతులు చేసుకుంటున్నాడు. చేత్తో సైగ చేస్తూ 'దూరంగా తీసుకెళ్ళు.' అన్నాడు. సుభద్ర చేతిలో పిల్లని దూరంగా దింపేసి రత్తాల్ని పిలిచి ఫకీరు ని మంచం మీద పడుకో బెట్టింది.
    రాత్రి తెల్లవార్లూ ఫకీరు ని చూస్తె యెటువంటిదో ఆ మరణ వేదన తేలికగా గ్రహించారు రత్తాలూ, సుభద్రా. రత్తాలు గోడు గోడున ఏడుస్తూంటే సుభద్ర కి భవిష్యత్ శూన్యం అయిపోయినట్లనిపించింది.
    'సుభద్రా,' తూరుపు రేఖలు తెల్ల బడుతుంటే ఫకీర్ నెమ్మదిగా పిలిచాడు.
    మంచం మీదికి వొంగి 'ఏం కావాలి?' అంది. మాధవి పట్ల అతను చూపిన  అనురాగానికి యివాళ ఋణం తీర్చుకోవాలని వుంది సుభద్రకి.
    'నిన్ను అన్నాయం చేశాను. నీకు యిట్టం అయితే .....నామాట కాదనవు గానీ నేను పోయాక.' ఫకీరు నోటిని సున్నితంగా మూసేసింది.
    'ఛ! ఏం మాటలవి. మాధవి కోసం అయినా నువ్వు బ్రతుకుతావు ఫకీరు. నీకు యెంత కోరిక పట్నం లో రెండు జడలు వేసుకుని రబ్బరు తాళ్ళు చేతుల్లో పెట్టుకుని తెల్లకోట్లు భుజాన వేసుకుని హాస్పిటల్ వైపు నీరాణి వెడుతుంటే చూడాలని.'
    ఫకీరు నవ్వాడు గుబురు మీసాల్లోంచి. అతని కన్నుల్లో ఆశ చావలేదు. తన బంగారు తల్లి, వజ్రాల తునక పట్నం లో పెద్ద డాక్టరమ్మ కావాలి .' అతన్ని మైకం చుట్టేస్తోంది. నిరాశ అతన్ని గుప్పెట్లో బిగించింది. అతను బందీ అయిపోయాడు.
    ';లేదు సుభద్రా. ఆ ఆశ లేదింక. పదెకరాలు నువ్వు జాగరత్తగా సూడు. రత్తాలు వట్టి పిచ్చిది. దాని కింత కూడు పడేత్తే అది నీ కాళ్ళ కాడ పడుంటుంది. రాణిని డాక్టరమ్మని చెయ్యి. నీకు నేను సేసిన అన్నాయం నేను సచ్చాక అనుబవిత్తాను.'
    'ఏం మాటలవి ఫకీరు. నా ఖర్మ అది. డానికి నువ్వేం చేస్తావు? నువ్వు కాకపోయినా మరొకళ్ళు కొనేవారు నన్ను. నేను నీదగ్గర సుఖంగానే వున్నాను. సుభద్ర కళ్ళల్లో నీళ్ళు  తిరిగాయి. 'ఏం సుఖం యిది?' అంతరాత్మ పీక నొక్కేసింది మనసు.
    'రత్తాలు నేనేల్లి పోతుండాను,. సుభద్ర నీ, రాణీని సూత్తావు కందే'....ఫకీరు ఆఖరి మాటలు గాలిలో కలిసి పోయాయి. రత్తాలు దిక్కులు ముక్కలయ్యేలా యేడుస్తోంది. ఆరో యేట పెళ్లి చేసుకుని వచ్చిన రత్తాలు ఫకీరు ను పోగొట్టుకుని బికరిదై పోయింది. మాధవి ని కౌగిట్లో కి తీసుకుని శోకాలు పెడుతుంటే యిరుగు పొరుగులు వచ్చేసి రత్తాల్ని పరామర్శిస్తున్నారు. సుభద్ర శిలలా మారిపోయింది. 'ఉంచుకున్నది పెళ్ళామూ, పెంచు కున్నోడూ కొడుకూ అవుతారెంటి,' ప్రతివాళ్ళూ యిదే మాట అంటుంటే సుభద్ర రెండు చెవులూ మూసుకుంది. భర్త పోయినప్పుడు ఏడ్చింది. జగదీశ్ వెళ్లిపోయినపుడు గుండెలు అవిసిపోయేలా బావురుమంది. మాధవరావు కనుమరుగై ఫకీరు ప్రత్యక్షం అయినపుడూ యేడ్చింది. ఈ యేడుపులతో రక్తం నీరై ప్రవాహం లా పూర్తిగా బయటికి రాగానే నీళ్ళు లేని కఠిన శిలగా మారిపోయింది. కళ్ళల్లో చుక్క నీరు రాలేదు అందుకే. ఫకీరు శవం మీద పడి యేడుస్తోంది మాధవి. రత్తాలు ఏడుస్తూంటే బిక్క మొహం వేసి. తెల్లావారక పన్నెండు గంటల ప్రాంతంలో యీది గాళ్ళు నలుగురూ పోగై ఫకీరు శవాన్ని స్మశానం వైపు తరలించి గోదావరి లో స్నానం చేసి యింటి ముఖం పట్టారు.
    ఫకీరు లేని యిల్లు గోడలు కూలిపోయి శిధిలావస్థకు సిద్దంగా ఉన్నట్లుగానే అనిపించింది. 'అమ్మా దాదా ఏడీ.' రోజంతా మాధవి కలవరిస్తూనే వుంది. 'అమ్మా దొడ్డమ్మ ఏడుస్తోందే', సుభద్ర ఆరిపోయిన కళ్ళల్లో మరేవీ కనిపించలేదు. నెమ్మదిగా లేచి కూర్చుని రత్తాలికి దగ్గిరగా వచ్చి అంది: 'ఉపవాసం వుండడం, అయన కోసం ఏడవడం నీరసించి పోతున్నావు. కొంచెం యెంగిలి పడు.'

                   
    'మీకు తెలీదండి అమ్మాయి గారూ. సావాసాల వల్ల సెడిపోయాడు గానండి ఆడిదెంత మంచి మనసండి,' రత్తాలు భర్తను గురించి ఒక్కొక్క మాట నొక్కి నొక్కి చెబుతోంది.
    'కాదని నేను అనలేదు. నువ్వు యెంగిలి పడు. లే', సుభద్ర బలవంతం మీద కంచం ముందు నించి లేచింది రత్తాలు. కనుచూపు వేళ అవుతుంటే రత్తాలు తాలూకు బంధు వర్గం అంతా దిగారు. నెమ్మదిగా ప్రారంభించిన శోకాలు యిల్లు కప్పులు యెగిరిపోయి వీధుల్లో గుండా గోదావరి  కొంచెం దూరంలో వున్నా స్మశానం వైపు కూడా మళ్ళి ఫకీరు చెవుల్లో బహుశా రింగు మంటున్నాయేమో.
    రత్తాలు శోకాలు తీసొంది. చిలవలు పలవలుగా : నా మొగుడు నన్నిడిసి పెట్టేల్లి పోయాడో. ఈ యింటి నెవరు సూత్తారరో.'
    'నీకు నేను వున్నాను అప్పా. నువ్వేం బెంగ పెట్టుకో మాకు. మనం సఖినేటి పల్లి యెల్లి పోదాం. నీకు యిక్కడెం ఖర్మ, నీ మరదలు నిన్ను పువ్వుల్లో పెట్టి పూజిస్తుంది.'
    'రత్తాలు శోకాలు అపుజేసి అంది: 'ఒద్దులే తమ్ముడూ అయిన కాడికి కొబ్బరి కాయ పడుతూనే వుంది. అరటి తోట బాగానే వుంది. నాకు ఆడి గుర్తుకు యీ యిల్లు, వాకిలీ వుంది. యివి యిడిసి పెట్టి నా పేణం వుండగా రాను.
    రత్తాలు తమ్ముడు వెంకటాద్రి దృష్టి సుభద్ర వైపు కూ చిన్నారి మాధవి వైపూ మళ్ళింది. 'ఆ మద్దె యిటేపు వచ్చినోళ్ళు ఎవళ్ళో అంటే ఎందోలె అనుకున్నాను అప్పా. అడుంచుకుని నీ పాణం తీస్త యీ రాణేనా.'
    రత్తాలు గొంతు ఖయ్యి మంది. 'ఎంత మాటంటే అంత మాటనీ సేయడమే. ఆడేదో కక్కుర్తీ తో అమ్మాయి గారిని తీసుకు వచ్చి గొంతు కొస్తే ఆవిడేదటే ఏం మాటలయి?'
    'లేసిపోయి వచ్చాక అందరూ ఒకటే అప్పా గోప్పోళ్ళూ, బీదోళ్ళూ ఏంది? నువ్వేటి డానికి మద్దతు యిత్తున్నావు.'
    'వూరుకో యెంకటాద్రి. పిల్ల మీద మనసుతో ఆడి పాణం కొట్టుకు పోయింది. ఆ పిల్లనేం అనకురా.'
    వెంకటాద్రి చుట్ట వెలిగించి అన్నాడు' 'అయ్యో అప్ప యిట్టాంటి ముండలు పట్నం లో శానా మందుంటారు. నీలా సత్తే కాలం మడుసులు యెవరూ వుండరే. నీ మరదలైతే నన్నూ దాన్నీ గూడా ఎల్లగోట్టేదీపాటికి.'
    'వూరుకోరా యెంకటాద్రి. అమ్మాయిగారు యిన్నారంటే బాగుండదు. నిజం చెప్పొద్దూ అప్పచేల్లెలి కన్నా ఎక్కువగా వుండేవారు. యిప్పుడు ఆడు లేడని అంతలేసి మాటలనడం న్నాయం కాదురా.'
    'ఏవిటో ' వెంకటాద్రి నిట్టూర్చాడు: 'నీ కన్న ఆ భూమి కూడా దాని పేర రాసేసి దాని పంచనే వుండిపో. అనక నీ మరిది వత్తే సేద్దువు గాని భారత నాట్టెం.' రత్తాలు గుండెల్లో బాకులాంటి మాట గుచ్చాడు వెంకటాద్రి. ముసిముసి నవ్వులు లోలోపలే వొలక పోసుకుంటుంటే అంది రత్తాలు. 'నువ్వుండి సూసుకోరా తమ్ముడూ. నేనూ వచ్చేత్తాను సఖినేటి పల్లి. ఆడి బాధలు నే పల్లెను.' ఫకీరు తమ్ముడు రత్తాలు కళ్ళల్లో కదులుతుంటే జ్వరం వచ్చిన దానిలా వోణికి పోయింది. సుభద్ర అన్ని మాటలూ వింది. రత్తాలు వోణికి పోతుంటే చూసి కంపించి పోయింది. మర్నాడు వొంటేద్దు బండీ గుమ్మం లో ఆపాడు సింహాచలం. ఫకీరు కన్నా రెండు అంగుళాలు యెక్కువగా యించు మించు ఫకీరు లాగే వున్న అతాన్ని చూసి మాధవి రెప్పవేయలేదు. సుభద్ర పిల్లను గుండెలకి అడుముకుని దూరంగా లాక్కుపోయింది. రత్తాలని పెరట్లో కి పిలిచి కంటి నీరు పెట్టింది. చూడు రత్తాలూ నన్ను వోక్కదాన్నిచేసేసి వెళ్ళిపోతే నేనూ పాపా ఏమై పోవాలి? నీకు చాకిరీ చేస్తాను అదంటే నీకూ ప్రేమ వుంది. నన్నూ దాన్నీ వదిలేసి యింకా నా జీవితం పుల్లిస్తర చేయకు. ఫకీరు వున్నా లేకపోయినా నన్ను చెల్లెలిగా చూసుకున్నావు.' రత్తాలు కరిగిపోయింది. సింహాచలం యెదురుగా పర్వతం లా కనిపిస్తుంటే దిగజారి పోయి అంది. 'ఆడి సంగతి మీకు తెల్డండమ్మాయిగారూ ఫకీరున్నాడని యిన్నాళ్ళూ ఆడీ గడప తొక్కలేదు. ఆడు ఖూనీకోరు. సిన్నప్పట్నించీ ఆడో కన్నెసుంచాడు. నన్నేం సేయమంటారు? నన్నేగ్గలేను ఆడితో. సుభద్ర రత్తల్నీ పరికించి చూసింది. గళ్ళగల్ల ముదురు రంగు చీరలు గోచీ పోసి కట్టి వెండి ఆభరణాలతో ఘల్లు మంటూ బిగించిన రవికలో వన్నె తరగని యౌవ్వనాన్ని యిన్నేళ్ళు వచ్చినా దాచుకున్న రత్తాల్నీ మరీ మరీ యివాళ ఏవిటో కొత్తగా చూడాలని సుభద్ర కే అనిపించింది. ముక్కెర, అడ్డ బాస, బేసరి, మంచి తల కట్టుకి అందంగా వుంచిన చంద్ర వంక , సూర్య వంక జడ బిళ్ళ...ఫకీరు వున్నప్పుడు రత్తాలు కధల్లో యెంకి లా కదులుతూ వచ్చేది. ఆ రత్తాల్నీ సింహాచలం నిఘా వేసి వుంచాడంటే ....నిజమే యెంతైనా అర్ధం వుంది.. మగవాడు సింహాచలం ' సుభద్ర అనుకుంది మనసులో. అయినా ఏదో ఆశ పీడిస్తుంటే అడిగింది. 'పోనీ నన్ను నీతో తీసుకుపో. నీ కాళ్ళ దగ్గర పడి వుంటాను.'


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS