అప్పటికప్పుడే మా అపార్ట్ మెంట్స్ లోని పాతికమంది ముందుకొచ్చి వాళ్ళ పిల్లల్ని తలో దెబ్బవేశారు.
"సార్! మమ్మల్నీ అరెస్ట్ చేయండి"
ఇన్ స్పెక్టర్ కి పిచ్చెక్కిపోయింది.
అందర్నీ లాకప్ లోకి తోసేశాడు.
మర్నాడు అందర్నీ కోర్ట్ లో నిలబెట్టారు.
"మీరు నేరం చేశామని ఒప్పుకుంటున్నారా?" అడిగాడు జడ్జీగారు.
"ఒప్పుకుంటున్నాం సార్. కానీ చిన్నప్పటినుంచీ పిల్లలను మందలించకుండా, అవసరమయితే రెండు తగిలించి మంచి దారిలో పెట్టకపోతే వాళ్ళు రేపు ఏమౌతారో మీకూ తెలుసు! గూండాలు, తాగుబోతులు, మర్డర్లు, రేపిస్ట్ లు, కిడ్నాపర్లు అవ్వరా? అప్పుడు వాళ్ళ వల్ల సమస్య మా కుటుంబాలకే కాదు......సమాజానికి, దేశానికీ ముప్పే!" అంది కనకం.
"ఔన్సార్! మావాడు తప్పుచేశాడని కొట్టాను. ఇప్పుడు వాడిని భయపడేలా చేయకపోతే రేపు వాడు టెర్రరిస్ట్ గానీ, వీరప్పన్ గా గానీ అవడని మీరెవరైనా నాకు గ్యారంటీ ఇస్తారా?"
కోర్టులో అంతా ఘొల్లుమని నవ్వారు.
"ఆర్డర్....... ఆర్డర్" అన్నాడు జడ్జిగారు.
"అయినాగానీ ఒక చట్టం ఉన్నప్పుడు దాన్ని గౌరవించటం పౌరుల విధి!"
"చదువు, సంస్కారం, క్రమశిక్షణా నూటికి నూరుమంది పాటించే చోట్ల అలాంటి చట్టాలకు అర్ధం ఉంటుంది సార్! ముందూ వెనుకలు ఆలోచించకుండా, సెంటిమెంట్ పట్టించుకోకుండా, సోషల్ ఎన్విరాన్ మెంట్ చూడకుండా ఎవరికి తోచిన చట్టాలు వాళ్ళు తేవటం తప్పు కాదంటారా?" అడిగాడు శంకరమూర్తి.
"ఇలాంటి చట్టాలు అమెరికాలో కూడా ఉన్నయ్! అక్కడ ప్రజలంతా వాటిని అనుసరిస్తున్నారు. ఆ విషయం మీకు తెలుసా?" అడిగారు జడ్జిగారు.
షైనీ ఓ అడుగు ముందుకేసింది. "తెలుస్సార్! అందుకే అక్కడి పిల్లలు ఎలా తయారవుతున్నారో మీరే చూడండి. అయిదో క్లాస్ లో విద్యార్దినులు ప్రెగ్నెంట్! ఆరోక్లాసులోనే విద్యార్ధులు తాగుడు, సిగిరెట్లు! పదోక్లాస్ లో డ్రగ్స్! గన్స్ తీసుకొచ్చి క్లాసులో మిగతా పిల్లలందరినీ పిట్టల్ని కాల్చినట్లు కాల్చటం! కాలేజ్ లెవల్ కొచ్చేసరికి ఎయిడ్స్! జాబ్ లో చేరేసరికి నాలుగు పెళ్ళిళ్ళు, ఆరు విడాకులు. వాళ్ళకు ఇక్కడలాగా బంధుత్వాలుండవ్! సెంటిమెంట్స్ ఉండవ్. తల్లిదండ్రులెక్కడో పిల్లలెక్కడో- ఎవరికివారే అనాథలు! ఏ రోడ్ మీద ఎప్పుడెప్పుడు ఎవడిని కాల్చి చంపుతాడో తెలీదు. దీన్నా మనం ఆ దేశం సాధించిన

ఘనత అంటుంది? అలాంటి సామాజిక వ్యవస్థనా మనం ఆదర్శంగా తీసుకోవాల్సింది? అలాంటి దిక్కుమాలిన లైఫ్ నా మనం ఎన్నుకోవలసింది? గురువుని గౌరవించటం, తల్లిదండ్రుల్నీ, తోడబుట్టినవారినీ ప్రేమించటం, జీవితాంతం వారితో బంధాలను ఏర్పరచుకోవటం...... ఇలాంటి మన సంస్కృతి మనకొద్దా?" షైనీ ఆవేశంగా అనేసరికి జడ్జి కూడా స్టన్ అయిపోయారు.
"చూడమ్మా! నువ్ చెప్పినదంతా ఒప్పుకుంటాను. కానీ ఈ చట్టాలు తెస్తోందెవరు? మీరే! మీరంటే మీ ప్రజాప్రతినిధులు. ఆ చట్టాలు తెస్తున్నప్పుడే మీరు మీ వాణి వినిపించాలి!"
"మా మాట పట్టించుకునేదెవరు సార్! అసలు ఈ చట్టాలు కోరుకుందెవరు? మేమెవ్వరం కాదు! ఇలాంటి చట్టం ఒకటి ఉంటుందని సగటు మనుషులకు తెలీదు. సోషల్ ఆర్గనైజేషన్స్ పేరుతో డబ్బున్న వాళ్ళు దేశంమీద రుద్దుతోన్న అరాచక చట్టాలివి! అద్దాలమేడల్లో కూర్చుని మందుకొట్టి, క్లబ్బుల్లో పేకాటలాడుతూ, పబ్బుల్లో డాన్స్ లు చేసే కొంతమంది చేస్తోన్న నిర్వాకమిది! మనదేశ జనాభాలో మెజారిటీ ఉన్న మధ్యతరగతి మనుషులుగానీ, క్రింది తరగతి వర్గాల వారికి గానీ ఈ చట్టాలు తెచ్చే ప్రక్రియలో ప్రమేయం ఉండదు" ఆవేశంగా అన్నాడు విజయ్ యాదవ్.
జడ్జిగారు కొద్దిక్షణాలు ఆలోచనలోపడి పోయారు. ఆ తర్వాత వినిపించింది.
"కేస్ ఈజ్ ఎడ్జర్న్ డ్".
