Previous Page Next Page 
నీ మీద మనసాయరా పేజి 24


    "నేను రాను" ఇంతసేపటికి మాట్లాడగలిగిందామె. అది తన ఖచ్చితమైన నిర్ణయమైనట్లు వెళ్ళబోయింది.
    
    "లేదు మీరొస్తున్నారు. మీకోసం ఆరుగంటలకల్లా బీచ్ లో వెయిట్ చేస్తుంటాను"
    
    ఆ మతాలకి ఆమెకి కోపం వచ్చింది.
    
    "చెబుతున్నది మీకు కాదు మీరు తలకిన్దల తపస్సు చేసినా నేను రాను" విసురుగా అంది.
    
    వెంటనే ఆమె ముందుకి కదిలి, "నేనేం చేస్తే మీరొస్తారో తెలిసిపోయింది. మీకోసం తలకిన్దులా తపస్సు చేస్తాను. ఆరుగంటలకి మీరు రాకపోయిన మరుక్షణం బీచ్ క్యాంటీన్ కు ఎడమవైపున, నిర్మానుష్యంగా వుండే ఆ ప్రదేశంలో తలకిందులా తపస్సు చేయడం ప్రారంభిస్తాను.
    
    ఏమీ ఆధారం లేకుండా తలకిందులుగా వుండడం వీలుకాదు. అందుకే ఇసుకలో గుంత తవ్వి మెడవరకు పూడ్చేసుకుంటాను. అప్పుడైతే బ్యాలెన్స్ కుదురుతుంది. మరి ఇసుకలో మెడవరకు పూడ్చుకుంటే గాలి ఎలా అందుతుందో నాకు తెలియదు.
    
    నా చిన్నప్పుడు మా ఊర్లో ఒక మోడీవాడు భూమిలో గుంత తవ్వుకుని తలను అందులో పెట్టేసి రెండు మూడు గంటలు పడుకుండిపోయే ఫీట్ చేశాడు. అతనికి గాలి ఎలా అందిందో తెలియదు. అతను రెండుగంటల పాటు బతికాడు కాబట్టి నేనూ అరగంటో, గంటో బతుకుతాననుకుంటా.
    
    ఎప్పుడైతే గాలి అందదో అప్పుడు ప్రాణం గాలిలో కలిసిపోతుంది మీకోసం బతుకైనా చావైనా రెండూ బాగానే వుంటాయి" అన్నాడు.
    
    అతను కొంచెంసేపు ఆగి మళ్ళీ చెప్పాడు.
    
    "రోమన్ చక్రవర్తి ఆరీబియస్ 'మనం చేసే ప్రతి ఆలోచనా ప్రతి చర్యా ఈ లోకంలోంచి నిష్ర్కమించేందుకు సర్వసన్నద్ధంగా వున్నట్లు నిరూపించగలగాలి' అన్నాడు. ఆ కొటేషన్ అంటే నాకు  చాలా ఇష్టం. జీవితం పట్ల అంత నిర్లక్ష్యం, జీవన విధానముపట్ల అంత గాఢతా వుండాలని నేను కోరుకుంటాను. అందుకే మీకోసం తలకిందులా తపస్సు చేస్తాను. నేను చివరి శ్వాస విడిచేలోపు మీరొస్తారని నా నమ్మకం"
    
    ఆమె అలా నిలబడిపోయింది.
    
    వీధి చివరకు బండి తోసుకుపోతున్న అతను చుక్కలా తేలుతున్నాడు ఆమె కళ్ళల్లో.
    
                                             9    

    వసంత్ వెళ్ళిపోయినా ఇంకా అతను తన ఇంటి చుట్టూ తిరుగుతున్నట్లే వుంది సూర్యాదేవికి. తనకు శరీరమే లేనట్టు, వున్నదల్లా మనసే అన్నట్లు ఆలోచనలు తప్ప తనకు మరో అస్తిత్వం లేనట్లు ఫీలవుతోంది. ఏ పని చేయాలన్నా కుదరడం లేదు.
    
    బతుకుమీద మమకారం కలిగించేది ఏదైనా సరే దాన్ని పూర్తిగా ఆస్వాదించాల్సిందే.
    
    ఇలాంటి స్థితి తను ఎప్పుడెప్పుడు అనుభవించిందీ ఆమె గుర్తుకి తెచ్చుకుంది.
    
    ఇంటర్ మీడియట్ చదువుతున్నప్పుడు ఎన్ సీసీ క్యాంపు కింద ఓ గ్రామానికి వెళ్ళారు స్టూడెంట్స్. ఆ ఊర్లో శ్రమదానంతో రోడ్డు వేయాలన్నది కార్యక్రమం. ఉదయమే వ్యాన్ లో వెళ్ళారు. రోడ్డు వేసే కార్యక్రమం మొదలైంది. సూర్యాదేవి గునపం తీసుకుని మట్టిని పెకలిస్తోంది. జీవితం మొదటిసారి అంత కష్టమైనపని చేస్తోంది. అదీ జనం కోసం.
    
    ఎంత థ్రిల్లింగా అనిపించిందో ఆ క్షణం. శ్రమైక సౌదర్యం ఎలా పుట్టిందో అర్ధమైంది. ఇతరుల కోసం పనిచేయడం ఎంత ఆనందంగా వుంటుందో తెలిసింది. అందుకే చెమటతో శరీరం ముద్దయిపోయినా, కాళ్ళూ చేతులూ ఇక పని చేయలేమని మొరాయించినా పట్టువదల లేదామె భావనల తోటే ఉక్కిరి బిక్కిరై పోయింది.
    
    అదిగో ఆ తరువాత ఇంత కాలానికి ఇప్పుడు అంతటి భావోద్వేగానికి గురవుతోంది.
    
    తన కోసం ఓ యువకుడు తనకంటే వయసులో చిన్నవాడు తల క్రిందులా తపస్సు చేస్తానంటున్నాడు. కోటిసార్లు తన పేరు రాశాడు. ఐపిఎస్ చదువుని ఎందుకూ పనికిరాదని విసిరికొట్టేశాడు.
    
    కానీ తనిప్పుడు ఏం చేయాలి? జీవితమంతటి పెద్ద ప్రశ్న కళ్ళముందు కత్తిలా వేలాడుతోంది. దీనికి ఎవరూ జవాబు చెప్పలేరు, సలహా చెప్పేందుకు కూడా సాహసించరు. ఎవరి బతుకు వాళ్ళది. ఎవరి అనుభవాలు వాళ్ళవి. ఇదిగో ఇలాంటప్పుడు ఇలానేచేయాలని రూలేం లేదు. ఇలా చేస్తే ఈ లాభాలు కలుగుతాయని చెప్పడం మూర్ఖత్వమే.
    
    ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి ఇతరుల అనుభవాలు తను నడవాల్సిన మార్గాన్ని నిర్దేశించక పోయినా, కొంతవరకు ఏ దారిలో నడవాలో హింట్ ఇవ్వచ్చు. కానీ పెళ్ళయిపోయాక ఓ అబ్బాయి ఐ లవ్ యూ అంటే ఏం చేయాలో చెప్పే పుస్తకము వుంటే బావుండు. ఇంతకి ఆదివారం సాయంకాలం ఆరుగంటలకి బీచ్ కి పోకపోతే ఏమవుతుంది? అతను ఊపిరాడక చచ్చిపోతాడా?
    
    ఆ ఊహే సూర్యాదేవి భరించలేక పోయింది. అందుకే అంతవరకు వచ్చిన ఆలోచనను బలవంతంగా తుంచేస్తుంది.
    
    సాయంకాలం వరకు ఎలాగో గడిపింది గానీ ఇక ఆ తరువాత ఇంట్లో వుండలేకపోయింది. ఎటయినా అలా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళదామని నిర్ణయించుకుంది. డ్రెస్ మార్చుకుని కిందకు వచ్చింది. కారు స్టార్ట్ చేయబోతుండగా గేటు తీసిన చప్పుడయితే అటు చూసింది.
    
    తమ ఇంటి సేద్యగత్తె వూరునుంచి వచ్చింది.
    
    "ఏయ్ చామూ" అంటూ పిలిచింది.
    
    ఆమె పరుగులాంటి నడకతోవచ్చి-
    
    "ఏం సూర్యమ్మా! బావున్నావా? అమ్మ పంపించింది" అంది.    

    "బావున్నాను అమ్మా నాన్నా- అంతా బావున్నారా?"
    
    "ఊఁ ఇదిగో ఈ శనగుండలు చేసిచ్చింది అమ్మ. సేద్యం పనులు వల్ల రాలేకపోయింది. నన్ను పంపించింది" అని చేతికున్న సంచిని చూపించింది.
    
    "ఇలా రా" అంటూ డోర్ తెరిచింది.
    
    చాముండి అటెళ్ళి కూర్చుంది. ఆమె సూర్యాదేవికన్నా రెండేళ్ళు చిన్నది. ఇరవై ఆరేళ్ళుంటాయి. బాగా పనితనం తెలిసిన శిల్పి నల్లటి రాయితో చెక్కిన శిల్పంలా వుంటుంది. ఆ శరీరపు రంగూ, ఆమె పర్సనాలిటీ సెక్సీగా వుంటాయి. నలుపులో అంత అందంగా వుండడం అరుదు. బ్రహ్మదేముడు ఆమెను తయారుచేశాక తెల్లటి వస్త్రాన్ని రంగునీళ్ళలో ముంచినట్లు, సెక్సీతనంలో ముంచి లేపినట్లయింది.
    
    ఆమెలో అన్ని అవయవాలూ పెద్దవే. చిన్నదేదయినా వుందంటే ఆమె నడుమే. ఏ అవయవానికి ఏ లక్షణం వుంటే సెక్సప్పీల్ వస్తుందో ఖచ్చితంగా ఆ లక్షణాలే వున్నాయి. కళ్ళు డ్రీమీగా కలలను జారుస్తున్నట్లుంటాయి. ముక్కు కొనదేలి నగలిలా వుంటుంది. కన్రెప్పలు బండి చక్రపు పంపుల్లా వుంటాయి. ఎద సంపద గడ్డి మేయకుండా ఎద్దుల నోటికి కట్టిన బుట్టల్లా వుంటాయి. నడుము ముల్లుకర్రలా వుంటుంది. బొడ్డు విత్తనలు వేసే రంధ్రాల చక్రంలా కనిపిస్తుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS