ఆమె రెండేళ్ళ నుంచి సూర్యాదేవి తల్లి యింట్లో సేద్యగత్తెగా వుంటోంది. ఎనిమిది వరకు చదువుకుంది. ప్రపంచ జ్ఞానం ఇంకా ఎక్కువగానే వుంది.
అప్పుడప్పుడూ తను రాలేనప్పుడు కూతుర్ని చూసి యోగక్షేమాలు కనుక్కురమ్మని పంపిస్తుంటుంది సూర్యాదేవి తల్లి.
"ఏవీ శనగుండలు తీయ్"
సంచీలోంచి ఒకటి తీసిచ్చింది చామూ.
సూర్యాదేవి దాన్నందుకుని కొరికింది. తీయగా తగిలింది నాలుకకి. తన ఇల్లూ, తల్లీ, తమ పొలాలు అన్నీ కళ్ళముందు నిలిచాయి ఆమెకి.
అంతకు ముందున్న ఆందోళనంతా ఎగిరిపోయింది. ఏదో ప్రశాంతత మనసంతా అల్లుకుంది.
చిన్నప్పుడు ఆమె తలనొప్పిగా ఉందంటే నడివీధిలోకి వెళ్ళి కాస్తంత మట్టిని తీసుకొచ్చి దిష్టి తీసేది తల్లి. దిష్టివల్లో, లేక అభిమానానికి ఆలోచనలు మరోవేపుకు డైవర్టు అయ్యేయో తెలియదుగాని తలనొప్పి పోయేది. ఇప్పుడూ అలాగే శనగుండలు తింటూ ఊరూ, ఊర్లో తమ ఇల్లూ, ఇంటి పెరట్లో వుండే కొబ్బరిచెట్లూ, వాటి ఆకులు పట్టుకుని గెంతే చందమామా, పంటపొలాల నుండి వచ్చేగాలీ- ఇవన్నీ గుర్తొచ్చి మనసంతా తేలికయిపోయింది. జ్వరం తగ్గిన తరువాత రసం అన్నం తింటూ ఆ రుచిని శాంతంగా అనుభవించినట్లు అనిపిస్తోంది.
ఏదో తెలియని హుషారు శరీరంలో ఇమడలేక గుండెను గంతులేయిస్తోంది. నిముషం ముందు తనను కంగారు పెట్టిన సమస్యను తలుచుకుంటుంటే నవ్వొచ్చేంత ఈజ్ అయిపోయిందామె.
"చామూ! ఇంట్లోకి వెళ్ళి ఈ బ్యాగ్ పెట్టిరా జాలీగా అలా తిరిగొద్దాం" అంది.
"కార్లోనే" చాముండి కళ్ళను పెద్దవి చేసింది. కార్లో వెళ్ళడమంటే ఆమెకి మహాసరదా.
"ఆఁ"
ఒక్క గెంతులో కిందకు దూకి బ్యాగ్ ను లోపలపెట్టి తిరిగొచ్చి కూర్చుంది.
కారు బయలుదేరింది.
"ఇంకేమిటి చామూ విశేషాలు?" సూర్యాదేవి చిన్నగా డ్రైవ్ చేస్తూ అడిగింది.
"ఏవో చిన్న చిన్న సరదాలూ, సంఘటనలూ తప్ప ఏం వుంటాయి సూరమ్మా"
"అవే చెప్పవే"
"ఓ ఆర్నెల్లపాటు ఒరిస్సాలో వున్న రఘురాముడు వూరికి తిరిగొచ్చాడు"
"వస్తే అదేం పెద్ద విశేషం కాదే"
"వచ్చి పెద్ద కథే నడిపాడు"
"ఏం చేశాడేమిటి?"
"చెబుతానమ్మా" అని చెప్పసాగింది చామూ.
"ఒరిస్సాలో ఏవో ఇళ్ళు కట్టాలని ఆర్నెల్లక్రితం రఘురాముడు, చక్రధర్ వెళ్ళారు. ఇద్దరూ మేస్త్రీలే కదా బాగా డబ్బు వస్తుందని వెళ్ళారు.
ఆరునెలల్లో ఒకరోజు కూడా వచ్చి భార్యల్ని చూడలేదు. అంత బిజీలో పడిపోయారు.
ఇళ్ళ పని పూర్తయింది.
ఇద్దరూ ఊరు తిరిగొచ్చారు. ఎలా వున్న భార్యలు అలానే వున్నారు. తమకోసం బెంగ పెట్టుకుని చిక్కి సగం అయి వుంటారని ఊహిస్తూ వచ్చిన వాళ్ళకు నిగనిగలాడుతూ తుమ్మచెట్లలా యెదురొచ్చిన భార్యల్ని చూసి నిర్ఘాంతపోయారు. వారిలో ఇంతకుముందు కంటే కూడా కొత్త కళ వచ్చింది. కళ్ళల్లో మెరుపొచ్చింది. బుగ్గల్లో నిగారింపు వచ్చింది.
ఏం జరిగిందో వాళ్ళకి అంతుబట్టలేదు. డబ్బు చేతుల్లో ఆడుతున్నా ఎంజాయ్ చేయలేకపోయారు. తాములేని యీ ఆర్నెల్లలో ఏం జరిగిందో తెలుసుకోవాలన్న ఆతృత ఎక్కువయింది.
కానీ ఎలా తెలుసుకోవడం? సిగ్గు విడిచి ఎవర్ని అడగడం?
ఇద్దరూ కలిసి ఆలోచించారు. విడివిడిగా ఆలోచించారు. ఆలోచించగా ఆలోచించగా చివరికి బ్రహ్మాండమైన ఐడియా తట్టింది వాళ్ళకి.
"అయితే మన భార్యల మధ్య ఎలా గలాటా పెట్టడం?" అని అడిగాడు రఘురామ్ చక్రధర్ ని.
"ఎక్కువభాగం కొట్లాటలు వచ్చేది డబ్బువల్లే. కాబట్టి నేను నిన్ను మోసం చేసి ఒరిస్సాలో ఎక్కువ డబ్బు కొట్టేశానని నువ్వు నీ భార్యతో చెప్పు నేనూ అలానే నా భార్యకు చెబుతాను. ఇలా చెప్పిన మరుక్షణం గలాటాకి దిగిపోతారనుకో" అన్నాడు చక్రధర్.
అనుకున్నట్లుగానే ఇద్దరూ భార్యలకు చెప్పారు. రెండోరోజు రఘురామ్ పెరట్లోని నీళ్ళు తన యింటిముందు నిలబడిపోయాయని చక్రధర్ భార్య రఘురాముడి భార్యను నిలదీసింది.
ఆ సమయంలో భర్తలిద్దరూ ఎవరింట్లో వాళ్ళున్నారు.
సన్నటి చినుకులు ప్రారంభమై, చివరకు తుఫానుగా మారిపోయినట్లు వీధిలో స్త్రీలిద్దరూ తగువుకు దిగారు. ఒకరినొకరు శాపనార్ధాలు పెట్టుకుంటున్నారు.
"పోయే తిరుగుబోతా" అంది రఘురాముడి భార్య పద్మ ఆవేశంలో.
అదిగో దాన్ని పట్టుకొంది చక్రధర్ భార్య చిత్ర.
"ఏమే! నన్ను తిరుగుబోతు అంటావా? ఎవరే తిరుగుబోతూ- నువ్వా నేనా? నీ మొగుడు ఒరిస్సాకు రైలెక్కిన వారానికల్లా ఒకడు దిగాడే. మా చిన్నాయన కొడుకని నువ్వు చెప్పినా ఆ వచ్చినవాడు ఎవరో మాకు తెలియదా వాడి పుట్టుపూర్వోత్తరాలంతా మంగమ్మత్త నాయుడుపేటలో విచారించుకుని వచ్చి చెప్పలేదూ వచ్చిన ఆ వెధవ నీ బావ. షోడాబుడ్డి అద్దాలూ వాడూను. ఇద్దరూ సిగ్గులేకుండా సినిమాకని టౌన్ కి బయల్దేరి రెండోరోజు తెల్లారిగదూ మీరిద్దరూ వచ్చింది. రాత్రంతా పూజ చేశాము దేవుడికి అని నువ్వు నంగినంగిగా చెప్పినా ఇద్దరూ కలిసి లాడ్జింగ్ లో యేం పూజచేశారో మాకు తెలియదా..."
ఇక ఆపుకోలేకపోయింది పద్మ ఉక్రోషంతో గొంతు వణుకుతుంటే చిట్టా విప్పింది.
"సరే నేను పూజే చేశానో, నువ్వు చెప్పినట్లు లాడ్జింగులో తైతక్కలాడానో ఆ దేవుడికి తెలుసు. నేనయినా వారం వరకూ ఆగాను. నువ్వు మూడోరోజే పుట్టింటికి టపా కట్టెయ్యలేదూ. పెళ్ళికి ముందు గుట్టలంటా, పుట్టలంటా తిరిగినవాడితో పిల్లలకోసం మొక్కుకు రావాలని షోళింగర్ కి చెక్కెయ్యలేదూ. వారం రోజులు ఆ సత్రంలో మీ పొర్లింపులూ, దొర్లింపులూ ఎవరికి తెలీదు...."
వింటున్న భర్తలిద్దరికీ మతిపోయింది. అరగంటయినా వాళ్ళ మాటలకి బ్రేక్ పడలేదు.
వాళ్ళ మాటలంతా రాసుకుని వుంటే పెద్దబాలశిక్ష పుస్తఃకం అంత అయ్యుండేది.
తాము తెలుసుకోవాలన్న రహస్యాలు బట్టబయలు కావడం కోసం తాము వేసిన ఐడియా సక్సెస్ అయినందుకు సంతోషించాలో, ఇలాంటివి వినాల్సి వచ్చినందుకు ఏడ్వాలో అర్ధం కాని పరిస్థితి.
ఇద్దరూ మరో పదినిముషాలకి అంగడి దగ్గర కలుసుకున్నారు. ఇద్దరి ముఖాల్లోను కత్తివేటుకి నెత్తురుచుక్కలేదు.
"ఏం చేస్తాం?"
"అక్కడ మనం ఇళ్ళు కట్టాం. ఇక్కడ ఇళ్ళు కూలాయి"
"మరి నిలబెట్టాలంటే ఏం చేయాలి?"
"ఇద్దరం ఇళ్ళకి వెళ్ళి ఒకే మాట అనాలి"
"ఏమిటది?"
రఘురామ్ చెప్పాడు.
