Previous Page Next Page 
నీ మీద మనసాయరా పేజి 23


    అక్కడి నుండి కిందికి దిగి పక్కనున్న గది ద్వారం దగ్గర నిలబడ్డాడు వసంత్.
    
    "ఇది డైనింగ్ రూమ్ అనుకుంటా మిమ్మల్ని ఎత్తుకుని చిన్న పసిడిగిన్నెలో పాలబువ్వను కలిపి "చందమామ రావే, జాబిల్లిరావే" అని పిలుస్తూ తినిపించాలనిపిస్తోంది స్త్రీలకు చిన్నతనమంటే చాలా ఇష్టమని ఎక్కడో సైకాలజీ పుస్తకంలో చదివినట్లు గుర్తు. ముఖ్యంగా పెళ్ళయిన స్త్రీలకు అందుకే వాళ్ళకెప్పుడూ పుట్టింటిమీదే ధ్యాస ఎక్కువగా వుంటుందట."
    
    ఇద్దరూ తిరిగి ద్వారం దగ్గరికి వచ్చారు.
    
    "మొదటిసారి ఇంటికొచ్చాను కాఫీ ఇవ్వరా ఏమిటి? పనిమనిషి చేత పెట్టించకండి. మీరే పెట్టాలి. ఒట్టి కాఫీగింజల పొడితే చేసే కాఫీ అమృతంగా మారే వైనం చప్పరించాలనుంది"
    
    చకచకా వంటగదిలోకి నడిచింది. రెండు నిముషాలకి సూర్యాదేవి కాఫీ కప్పుతో వచ్చింది.
    
    "ప్రపంచశాంతి" అంటూ తీసుకున్నాడు.
    
    థాంక్స్ కి కూడా ప్రపంచశాంతేనా అనుకుంది.
    
    అతను ఓ సిప్ చేసి "అమృతం కంటే అద్భుతమైన పదం లేక పోవడం అమృతం చేసుకున్న అదృష్టం. ఈ కాఫి దురదృష్టం"
    
    కాఫీ కప్పు కింద పెట్టాడు.
    
    "ఇక నా వ్యాపారానికి బోణీ చేస్తారా? ఇంతక్జీ ఏమిటి వ్యాపారం అని అడగరేం?"
    
    ఆమె అడగలేదు.
    
    అది గ్రహించి అతనే చెబుతున్నాడు.
    
    "ఫుడ్ కు గడవడం కష్టమైపోయింది. ఉదరపోషణార్ధం ఏం చేద్దామా అని మొన్నోరోజు హాస్టల్ బాల్కనీలో నిలబ్ది ఆలోచిస్తుంటే అప్పుడే ఆ కాలనీలోకి కూరగాయాల బండి ఒకటి వచ్చింది. అలా ఓ నాలుగుచక్రాల బండిలో పుస్తకాలు వేసుకుని ప్రతి కాలనీకి వెళ్ళి అమ్మితే ఎలా వుంటుందా అన్న థాట్ వచ్చింది. కూరగాయల్లాగా పుస్తకాల అమ్మకం జరిగే స్థాయికి దేశం ఎదిగితే ఎంత బావుండు.
    
    ఎక్కడో ఒక దగ్గర నాంది జరగాలి కదా. అందుకే నేనే ప్రారంభించాను. ఇలా కూరగాయల బండిలో పుస్తకాలు అమ్మే వ్యక్తిని బహుశా దేశంలో, మరీ మాట్లాడితే ప్రపంచంలో మొదటివాడ్ని నేనేనేమో, ఈ ఆలోచన రావడం తరువాయి ఐపిఎస్ ట్రైనింగ్ కి కట్టిన డబ్బుల్ని వెనక్కి తీసుకున్నాను. మొత్తం ఎనిమిది వేలువచ్చాయి. ఓ వెయ్యితో చక్రాలబండి చేయించాను. మిగిలిన డబ్బుని పుస్తకాలు కొన్నాను రండి చూద్దురుగానీ"
    
    అతను వీధిపక్కన ఆమె ఇంటిముందు నిలబెట్టిన బండి దగ్గరికి వెళ్ళాడు. ఆమె ఒక అడుగు ముందుకేసి ద్వారం బయటికి వచ్చి నిలబడింది.
    
    అతను చేతుల్లో ఓ పుస్తకం తీసుకుని వచ్చాడు. "రోమియో అండ్ జూలియట్ ఇదే మొదట మీకిస్తున్న పుస్తకం ఈ బోణివల్ల వ్యాపారం పుంజుకుంటే రేపు ఈపాటికి బండి రాగానే అమ్మలక్కలంతా కూరగాయల బండి దగ్గరకొచ్చినట్లు గుమిగూడుతారు. ఒక్కొక్కరు ఏమేం మాట్లాడతారో నేను  చెబుతుంటాను. అవే మాటల్ని కూరగాయాల బండి దగ్గరైతే ఎలా మాట్లాడతారో మీరు ఊహించండి. రివర్స్ పారడీ అన్నమాట" అన్నాడు.
    
    బండిచుట్టూ చేరిన స్త్రీలు ఎలా మాట్లాడతారో అతను చెబుతున్నాడు.
    
    "ఏం పుస్తకాలబ్బాయ్! నిన్నా మొన్నా కనపడలేదు. పుస్తకాలు చదవక పిచ్చెక్కిపోయిందనుకో, ఏదో నానా చెత్త చదవాల్సి వచ్చింది"
    
    అదే మాటల్ని ఆ స్త్రీ కూరగాయల అబ్బాయితో అయితే ఎలా మాట్లాడుతుందో ఆమె ఊహిస్తోంది.
    
    (ఏం కూరాయలబ్బాయ్, ఏమైపోయావు? కూరగాయలు లేక పచ్చడి మెతుకులు తిన్నాం)
    
    "ఏమిటన్నీ పాతపుస్తకాలు తెచ్చినట్లున్నారే కొత్తవి- పెంగ్విన్ పబ్లికేషన్స్ గానీ, లండన్ పబ్లిషింగ్ హౌస్ ల పుస్తకాలు గానీ రాలేదా?"
    
    (అన్నీ వాడిపోయున్నాయ్- మదనపల్లి నుంచి గోసుగానీ, బెంగుళూరు నుంచి వంకాయలుగానీ రాలేదా?)

    "సరేలే! వుండు చూస్తాను అంటూ పుస్తకాల పేర్లూ, ఊర్లూ చూస్తుంటారు"
    
    (కూరగాయల్లో పుచ్చువిగానీ ఏమైనా వున్నాయేమోనని కెలుకుతుంటారు)
    
    "ఇదిగో! నాకు డికెన్స్ నవల ఒకటి, జెప్రి అర్చర్ నవలలు రెండివ్వు"
    
    (నాకు రెండు అరటికాయలు, ఒక కిలో టమాటాలివ్వు)
    
    "ఆ నవలతోపాటు జయదేవుని గీతగోవిందం ఇవ్వకూడదూ"
    
    (ఏమిటంత ఖచ్చితంగా తూస్తున్నావ్ కొసరంత విదిలించు)
    
    "మొన్న రూట్స్ చదివాను బ్రహ్మాండం. నాకు తెలియకుండానే ఏడ్చాననుకో వదినా"
    
    (మొన్న మధ్యాహ్నం కాకరకాయల కూర చేశాను వదినా అదిరిందనుకో కానీ ఆ చేదుకి కళ్ళలో నీళ్ళు తిరిగాయనుకో)
    
    "మైదానం చదువుతుంటే మా ఆయన వచ్చాడు. రెండు పేజీలు  చదివాడో లేదో కాపురం చెయ్యడానికేనా ఇవి చదవడం అని ఎగిరిపడ్డాడు"
    
    (గుత్తివంకాయ కూరలో నిన్న కాస్తంత కారం ఎక్కువ పడింది. రెండు ముద్దలు మింగాడో లేదో ఎగిరిపడ్డాడు మా ఆయన. తినాలనే ఇలా చేశావని కసురుకున్నాడు)
    
    "చలం నవలలు ఏవీ నచ్చవ్ కదా మా వారికి మనసు పాడైపోతుందని ఒకటే నసుగుతుంటాడు. తెలుసుగదా మనిషి మరీ బోర్.  ఛాందసుడు. విశ్వనాథవి తప్ప మరో పుస్తకం చదవడు"
    
    (బంగాళదుంపంటే మా వారికి పడదు వాయువు వస్తుందని హైరాన పడిపోతుంటాడు. నీకు తెలుసు గదా గుండెనొప్పి వుందని ఆకుకూరలు తప్ప మరిదేన్నీ ఇష్టంగా తినడనుకో)
    
    అతను చెప్పడం ఆపాడు.
    
    "ఇలా స్త్రీలు పక్కింటి పిన్ని ఏం బంగారు నెక్లెస్ కొందో, ఎదురింటి వనజ ఏ రంగుచీర కొన్నదో గురించి కాకుండా ఇంతకుముందు నేను చెప్పినట్లు మాట్లాడుకునే కల్చర్ డెవలప్ చేయాలనే ఈ వ్యాపారం ప్రారంభించాను. మరి ముందుగా మీరు బోణి చేయండి" అన్నాడు తొందర పెట్టేస్తున్నట్లు.
    
    సూర్యాదేవి పుస్తకం తీఉస్కుని లోపలికెళ్ళి ద్బబుతో తిరిగొచ్చింది.
    
    దాన్ని అందుకుంటూ అతనన్నాడు.
    
    "ఈరోజు వచ్చిన లాభంతో ఆదివారం సాయంకాలం మీకు బీచ్ లో ముంతకింద బొరుగులు కొనిపెడతాను. ఖచ్చితంగా ఆరుగంటల కల్లా వచ్చేయండి"
    
    ఆమె వస్తాననలేదు.
    
    "బదులు చెప్పరేమిటి? సాయంకాలం పూట బీచ్ ఎంత సరదాగా వుంటుందో కళ్ళలోకి తెచ్చుకోండి"
    
    భూమిమీద మనిషి ఎంత అల్పజీవో తలబద్దలు కొట్టుకుని చెబుతున్నట్లు కెరటాలతో ఎగిసిపడే సముద్రమూ, పట్టుతప్పి కిందపడిపోతానేమోనన్న భయంతో అమ్మ కడుపుని కరుచుకున్న కుందేలు పిల్లలా చందమామ అయిదురూపాయలిచ్చి తన సుపుత్రుల్ని గుర్రం ఎక్కించి ఆనందించే తల్లితండ్రీ పడవచాటున తన అల్లరిమాటల్ని సిగ్గులోకి తర్జమా చేస్తున్న ప్రేయసిని, తన్మయత్వంతో చూసే ప్రియుడూ, తన అప్పులకీ, సముద్రానికీ ఏమీ తేడా లేనట్లనిపిస్తుంటే హవాయి చెప్పుల్లో తన దేహాన్ని ఈడ్చుకెళ్ళే గుమాస్తా, అలల మధ్య కదిలే విచిత్రాన్ని కాళ్ళతో తడుముతుండే కుర్రకారూ- వీటి మధ్య మనిద్దరం అలా ముంతకింద బొరుగులు తింటూ నడవడం ఎంత గొప్ప అనుభవమో తలుచుకోండి."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS