శంకరం అదిరిపడి "ఆ....మరయితే నేను శేషయ్య కి ఆ రెండేళ్ళూ నెలనెలా ఇచ్చిన డబ్బు ఏం అయింది?.....అతను పంపిన మనీ అర్దరులు ఏమయ్యాయి?"
"నువ్వు అతనికి డబ్బు ఇచ్చిన సంగతి ఏమో ?....నాకు మాత్రం అతను ఒక్క మనీ ఆర్డరు పంపించలేదు. నేను తీసుకోలేదు. -- లేదా చూపించమను నా సంతకం వున్న ఒక్క రసీదు "
గోపాలం ఇంత దృడంగా చెబుతూ వుంటే శంకరం అతని మాటల్ని నమ్మకుండా ఉండలేక పోయాడు. మరయితే డబ్బు ఏమైనట్టు ?... శేషయ్య ఆ డబ్బుని తమ్ముడికి పంపకుండా ఏం చేసినట్టు....శంకరానికి ఏం అర్ధం కాలేదు. ఇటు గోపాలం మాట నిజమా? అటు శేషయ్య మాట నిజమా........ ఇద్దర్లో ఎవరిని నమ్మేట్టు?........ఏమో.......ఇదంతా అయోమయంగా ఉంది.......శేషయ్య చెప్పేది కూడా వింటేనే గాని ఎటూ నిర్ణయించడానికి వీలులేదు. అందాకా దీని విషయం ఆలోచించకుండా ఊరుకోవటం మంచిది అని ఇలా ఓ నిర్ణయానికి వచ్చి--
సరే-- ఇప్పుడా గొడవకేం కాని ఈ సంగతేదో చెప్పు "
"ఏ సంగతి ."
"అదే....శేషయ్య తరపున వకాల్తా నామా తీసుకోవడం "
"కుదరదు"
"ఎందుకు కుదరదు."
"చెప్పాను కదా?.... అది నా నియమానికి విరుద్దం అని"
"నిన్ను ఒప్పిస్తానని శేషయ్య కి మాట ఇచ్చి వచ్చాను. ఇప్పుడతన్ని ఏ మొహం పెట్టుకుని చూడడం ? అవతల నా మాట ఏమవుతుంది?"
"అయితే నీ మాట కోసం నా నియమాన్ని మార్చుకో మంటావా?"
"అబ్బే, నీకు అన్నయ్య కంటే ఆప్తుల కంటే నీ పట్టుదలే ముఖ్యం అయినప్పుడు ఎందుకు మార్చుకోమంటాను ?.....నీ నియమం పోగొట్టుకుని నువ్వు ఇడవడం ఎందుకులే . నా మాట నిలబెట్టుకోలేక నేనే గాడిదనవుతాను."
నువ్వు అనవసరంగా నన్ను అపార్ధం చేసుకుని కోపం తెచ్చుకుంటున్నావు కాని నా తప్పేం లేదు ఇందులో."
"తప్పు నీది కాదురా. నాది. తమ్ముడు నేను చెప్పినట్లు వినడా. వాడిని ఒప్పించే పాటి చనువు నాకు ఉండదా అనే తెలివి తక్కువ నమ్మకంతో ఇంత దూరం బయలుదేరి రావడం, ఎప్పుడూ లేంది ఈ పని చేసి పెట్టాలిరా అని నిన్ను ప్రాధేయపడి అవమానం పొందడం ఇదంతా నాది తప్పు."
ఈటెల లాంటి అన్న మాటల్ని వింటూ నిస్సహాయంగా నిలబడి ఉండిపోయాడు గోపాలం.
'చక్కని గుణ పాఠం నేర్పావు. చాలు చాలు. చాల సంతోషం . కడుపు నిండిపోయింది. వస్తా" అంటూ సంచీ తీసుకుని లేచి నిలబడ్డాడు శంకరం.
అది చూసిన గోపాలం కంగారుగా "సంచీ తీసుకుని ఎక్కడికి ఇంత అర్ధరాత్రి వేళ ?" అన్నాడు.
"ఎక్కడికా?..... అవమానించకుండా ఆదరించే చోటుకి"
"అన్నయ్యా! అంటూ ద్వార బంధానికి అడ్డుగా నిలబడ్డాడు గోపాలం.
"నామీద కోపగించి ఈ రాత్రి వేళ ఎక్కడికి వెళ్తావు?"
"అది నీకు అనవసరం -- ముందు తప్పుకో ..ఊ...నిన్నే."
"సరే-- వెళ్ళు....వెళ్ళు అన్నయ్యా ....కాని ...కాని ....నువ్వు కోపం తెచ్చుకుని వెళుతున్నావు తప్పిస్తే -- నిజంగా ఇందులో నా తప్పేం లేదు సావకాశంగా కూర్చుని ఆలోచిస్తే నీకే అర్ధం అవుతుంది. ప్రతి వ్యక్తీ నీతి నియమాలు , నిర్దిష్టమైన ఋజువర్తనా ఉండాలి. ఏ పరిస్థితులలోనూ మనిషి ఆ ఋజుమార్గాన్ని వదలకూడదు అని నువ్వు అప్పుడప్పుడు అనే మాటలని మననం చేసుకుంటూనే జీవితంలో కొన్ని నియమాలు ఏర్పాటు చేసుకొని నేను ఉంటున్నాను. అందువలననే నువ్వుచేప్పిన డానికి అంగీకరించి నమ్మించిన మనసబుని మోసం చెయ్యనన్నాను. శేషయ్య దగ్గర నీ మాట ఓటయినా "సరే" అనుకున్నాను. నువ్వు చూపిన ఆ నిర్దిస్ట్ట మార్గంలో నడుస్తున్నా. నీకు నామీద కోపం వచ్చిందంటే అది నా దురదృష్టం ...సరే....వెళ్ళు....." అన్నాడు గోపాలం ద్వార బంధానికి అడ్డంగా పెట్టిన చేతులు తీసేస్తూ.
గోపాలం మాటలు విని గడప బయట కాలు పెట్టబోయే వాడల్లా ఆగి, ఒక్కమాటు గోపాలం కేసి చూసి మనస్సులో నిశ్శబ్దంగా "తమ్ముడూ," అని బరువుగా బాధపడి, "సరే, నీ ఇష్టం వచ్చిన నియమాల ప్రకారం నువ్వుండు, కాని ఒక్క విషయం. ఆశయాలూ, అభిప్రాయాలూ, అలవాట్లూ అన్నీ పరస్పరంగా భిన్నంగా వున్న మనిద్దరికీ ..." అని ఆ పైన 'అతకదు" అనే మాట తన నోటితో అనలేక మండుతున్న గుండెల్ని గుప్పెట పట్టుకుని ఆ చీకట్లో దూసుకు వెళ్ళిపోయాడు శంకరం.
శంకరం లీనం అయిపోయిన ఆ చీకట్లో కి శూన్యంగా చూస్తూ కొంచెంసేపు ఉండిపోయి కళ్ళు వట్టుకొని బరువుగా ' ఆ...న్న...య్యా" అంటూ కుర్చీలో కూర్చుండి పోయాడు గోపాలం.
9
ఇలా గోపాలం తో ముఖం చెండుకుని వచ్చేసినంత సులభంగా, జరిగిన ఆ ఆసంఘటన ని ఆ సందర్భంలో గోపాలం అన్న మాటల్ని మరచి పోలేక పోతున్నాడు శంకరం, మెదడంతా ఆలోచనలతో గజిబిజి గా ఉంది. ప్రాణంలో ప్రాణంగా పెంచుకున్న తమ్ముడి తో, మళ్ళీ మొహా మొహాలు చూసుకోనంతగా దెబ్బలాడి వచ్చేశాడు తను, ఇంతకీ వాడు చేసిన దాంట్లో తప్పేం ఉంది? చెప్పిన దాంట్లో ఆక్షేపణ ఏం ఉంది? ...ఒకళ్ళ తరుపున వాదిస్తానన్న తర్వాత ఇంక మాట తిరగను ఆడిన మాట తప్పను అన్నాడు. అందుకు అభినందించవలసినది పోగా ఆగ్రహించి వచ్చేశాడు తను!.... తనకి ఒళ్ళు తెలియనంత కోపం వచ్చింది వాడి సమాధానాలు వింటే. అవును -- రాదు మరి -- తనేమో ఇవతల శేషయ్య కి మాట ఇచ్చాడాయేను-- ఎలా గయినా తమ్ముడి తో జరిగినది చాలా దురదృష్టమైన సంఘటనే-- ఏవిటో అలా జరిగిపోయింది అదంతా--
చేతులు వెనక కట్టుకుని ఇలా ఆలోచిస్తూ కటకటా లలో పచార్లు చేస్తున్న శంకరం రోజూ కంటే ఎక్కువ చిరాగ్గా ఉన్నాడు - ఏదో చెప్పవచ్చిన కంపౌండరు మీద విసుక్కున్నాడు. చలాకీగా పాటలు పాడుతూ గంతులు వేస్తూ ఇల్లంతా తిరుగుతున్నా ప్రత్యేకంగా పిలిచి గట్టిగా చివాట్లు పెట్టి ఒకటి అంటించి పంపించాడు-- "రాజమండ్రి వెళ్లి వచ్చినప్పటి నుంచీ ఏవిటి అలా ఉన్నారు?....ఏం జరిగింది అని ఎన్ని మార్లు అడిగినా చెప్పరేం ?"....అని ఒకటికి రెండు సార్లు అడిగిన సావిత్రిని చీదరించుకున్నాడు. ఎవళ్ళ తోటీ మాట్లాడకుండా , ఏ పనీ చెయ్యకుండా శేషయ్య వచ్చే దాకా తీవ్రంగా ఆలోచిస్తూ అలా కటకటాల్లో పచార్లు చేస్తూనే ఉన్నాడు శంకరం --
శేషయ్య వస్తూనే నవ్వుతూ "ఏం బావగారు ....వెళ్ళిన పని ఏమయింది ?.... పండిందా ? .....గోపాలం ఒప్పుకున్నాడా?....నాకు తెలుసులెండి మీరు వెళ్లి వచ్చాక ఒప్పుకోక ఏం చేస్తాడు ?...అందుకే నేను రాకుండా మిమ్మల్ని పంపించా" అన్నాడు--
శంకరం తలఎత్తి శేషయ్య కేసి చూసి వెంటనే దించేసుకున్నాడు . మూల నున్న స్టూల్ లాక్కుని అంది మీద కూర్చుంటూ "ఊ...ఇంకా ఏవిటి విశేషాలు?' అన్నాడు శేషయ్య - శంకరం ఏం సమాధానం చెప్పలేదు
"అలా ఉన్నారేమిటి ?" అన్నాడు శేషయ్య.
"అవును గానీ !....మనం ఏ న్యాపతి సుబ్బారావు గారినో మన తరపున పెట్టకూడదూ?" అన్నాడు శంకరం.
"ఆ ఆలోచన ఎందు కిప్పుడూ?"
ఆహా! గోపాలం తప్ప మనకెవరూ దొరకరా?..... సమర్ధులైన వకీళ్ళకి రాజమండ్రి ఏం గొడ్డు పోయిందా?"
"గొడ్డు పోయిందనా?.....గోపాలం అయితే సమర్ధుడు -- ఇటు సివిల్ అటు క్రిమినల్ రెండూ బాగా చేస్తున్నాడు. అన్నింటి కంటే మనకి ఆప్తుడు కావలసిన వాడు బాధ్యతగా చేస్తాడు. మన వాడని కదూ!"
హు!..... మనవాడు!..... అని మనం అనుకోవడమే?"
"అదేవిటి అలా అంటున్నారు ?......ఏం జరిగింది ?.....గోపాలం ఒప్పుకోలేదా?"
"ఉహూ !!
"ఏవిటి !...మీరు చెప్పినా ?.... నేను నమ్మను."
"నిజం బావగారూ?..... నేను సహస్ర విధాల చెప్పి చూశాను. వాడు వింటేనా ! ...ఒకటే పట్టుదల "
"మీరు ప్రత్యేకం పనికట్టుకుని వెళ్ళినా వినకపోవడం ఏమిటి ?....చిత్రంగా వుందే?.....ఎవంటాడు."
"ముందు మునసబు తరపున వకాల్తా నామా దాఖలు చేశాను. చేసినది తిరగదీసుకునే ప్రసక్తి లేదు. అన్నమాట తిరగను " అంటాడు.
"ఆ!....మన గోపాలం అవతల పార్టీ మునసబు తరపున అప్పుడే వకాల్తానామా పడేశాడా?......అవులెండి ...మీరు వెళ్ళడమే అటూ ఇటూ అంటూ వారం రోజులు జాప్యం చేశాడు , ఈలోగా మునసబు వెళ్లి గోపాలాన్ని పట్టేశాడన్నమాట."
"అన్నీ చూస్తూ బావగారూ మీరు కూడా అలా అంటారేమిటి . నేను కావాలని జాప్యం చేశానా?..... చావు బతుకుల్లో వున్న వెంకడిని వదలి వెళ్ళడానికి వీల్లేక కదూ మనం ఆ వారం రోజులు ఆగింది ?"
"ఊ....అయిందేదో అయింది, పోనీ ఇప్పుడేనా మునసబు వకాల్తా నామా తీసి అవతల పడేసి మన తరపున కోర్టులో చేయ్యమనక పోయారూ?"
"శేషయ్య గారూ?..... పోనీయండి ఎందుకొచ్చింది . దాఖలు చేసిన వకాల్తా నామా తియ్యను, ఆడిన మాట తప్పను. వృత్తి ధర్మం వరకు శత్రుడయేది మిత్రుడయేది ఒకటే. అంటూ ఏవో కొన్ని నియమాలు పెట్టుకొని వాడు నడుస్తున్నాడు. వాడి నిమయాలు మన మెందుకు పాడు చెయ్యాలి కనుక?..... నిజానికి అలా కొన్ని నియమాల ప్రకారం జీవితం నడవడం కూడా మంచిదే !....కానీయండి ....మనకు వాడు కాకపొతే వాడి తలదన్నిన మరో లాయరు వస్తాడు , ఏమంటారు?" అన్నాడు శంకరం. ఆశ్చర్యం అనుమానాలతో ఆ మాటలు అన్నీ ఒక్కొక్కటే విని కళ్ళ చివర నుంచి శంకరం వైపు అనుమానంగా ఒక్క చూపు విసిరి , తల పంకించి , బరువుగా శ్వాస వదిలాడు శేషయ్య. కొంతసేపటి దాకా ఎవ్వరూ మాట్లాడలేదు.
'సరే--బాగానే ఉంది. చివరికి ఇలా చేయించారన్న మాట " అంటూ లేచాడు శేషయ్య.
"అప్పుడే లేచారేం ?.....కూచోండి కాస్సేపు ' అన్నాడు శంకరం .
"అబ్బే!....కూచుంటే ఎలాగ?....ఈ మారైనా సరియైన అప్తుడి ని ఎవరినో రాజమండ్రి పంపడమో, లేదా నేనే వెళ్లడమో చేసి ఈ కేసు వ్యవహారమేదో చూసుకోవాలి గాని...." అన్నాడు వ్యంగ్యంగా శేషయ్య.
శేషయ్య మాటల్లో ధ్వనించిన విపరీత అర్ధాన్ని విని శంకరం గతుక్కుమన్నాడు. ఈ మారైనా సరి అయిన అప్తుడంటే ?....ఇంత క్రితం వెళ్ళిన "తను" కాదనేగా అర్ధం!....ఇన్నేళ్ళ తమ ఆత్మీయత ని అవతలకి నెట్టి ఎంతలో తేలిపోయాడు ఈ శేషయ్య?....తను అలాగే ప్రవర్తించాడా?....ఇన్నాళ్ళ నుంచీ సోదరుడు అంటే ఎక్కువగా చూసుకుంటున్న అతని కోసం తమ్ముడితో కూడా తగువు పెట్టుకున్నాడే!....ప్రాణానికి ప్రాణంగా ఉన్న తనని ఇంత చప్పున తీసి పడేస్తాడా?....అంటే అతని అభిప్రాయం ఏవిటి?....తను సద్భావంతో వెళ్లి మనస్పూర్తిగా తమ్ముడిని ఒప్పించడానికి ప్రయత్నించ లేదనేగా అనుమానం?....ఇంత నిష్కల్మషంగా ఉన్న తన నిజాయితీ ని శంకించి ఈ ఏడెనిమిదేళ్ళ నుంచీ తమ మధ్య విస్తరించుకొని ఉన్న ఆ స్నేహా బంధాన్ని ఒక్క మాటతో తెగ్గోటేస్తాడా? సరే....నా నిజాయితీ ని శంకించిన వ్యక్తీ నిజాయితీని మన్నించవలసిన అవసరం నాకేం ఉంది....అనక ఎలా వస్తే అలావస్తుంది....ఆ రెండు వేల సంగతి ఏదో కనుక్కుంటాను......తమ్ముడు అందలేదంటూన్నాడుగా?....ఈ శేషయ్య పంపాడో లేదో తేలుతుంది . ఇంతదాకా వచ్చాక ఇంత అనుమానం ఎందుకు?....అడుగుతాను-- కోపం వస్తుంది?....రానీ....అతను అన్న మాటకి తనకి రాలేదేవిటి కోపం ?....
