Previous Page Next Page 
ధర్మ చక్రం పేజి 22


    ధర్మారావు చేసిన ప్రతి పాదనల పై నాలుగు రోజుల పాటు చర్చలు జరిగాయి. ఏ ఒకరిద్దరో మినహా, మిగిలిన అందరూ ధర్మారావు అభిప్రాయాలతో ఏకీభవించారు.
    "జైళ్ళు మరీ ఇంత స్వర్గ దామాలైపొతే, జీవికకు కాస్త ఇబ్బంది పడే ప్రతివాడూ ఇక ఏదో ఒకనేరం చేసి, ఇక్కడికి వచ్చి హాయిగా గడిపెస్తాడేమో?' ఒక ఆఫీసర్ బలమైన అభ్యంతరం లేవతీశాడు.
    ధర్మారావు సమాధానం చెప్పాడు : "లేదు. ఈ ఏర్పాట్లు చేస్తే జైళ్ళు నరక పరాయాలు కాకుండా ఉంటాయే కాని, స్వర్గ ధామాలు ఎంత మాత్రం కావు. అదీగాక, పైన, అధికారుల మంటూ మనం ఎప్పుడూ ఉండనే ఉంటాము. మన ఈ సమావేశాలను ఆరు నెలల కొకసారి ఏర్పాటు చేసుకొని, మన ప్రయత్నా ఫలితాలను, సాధక బాధకాలను , పరిస్తితు లను సక్రమంగా పరిశీలించి, సందర్భానుసారంగా మార్పులు చేసుకోలేక పోము."
    "అవును.' మంత్రి గారితో పాటు అనేకులు ఆమోదం తెలిపారు ధర్మారావు మాటకు.
    అభ్యంతరం వీగిపోయింది.
    "ఇంతకూ ఈ ఏర్పాట్లన్నీ మనం శ్రమపడి చేస్తే ఫలితాలు బాగుంటాయో, వికటిస్తాయో? వాళ్ళు మననే వాజమ్మలను చేస్తే?' మరో ఆఫీసర్ మరొక బలమైన అభ్యంతరాన్ని ప్రవేశ పెట్టాడు.
    ధర్మారావు లేచాడు సమాధానం చెప్పడానికి. "అవును. ఈ అనుమానం కలగడం సహజమే. కాని ఫలితం బాగుండ గలదని ఆశించడానికి నా వద్ద ఆధారాలున్నాయి. బలరాం అనే ఖైదీ విషయం నేను ఇదివరకే మీకు చెప్పాను . సరే, 'ఇక్కడ, నేను పనిచేస్తున్న ఈ జైలు లోని ఖైదీలందరినీ మీరూ చూచారు. వారిలో మార్పూ మీకు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. అది మీకింకా స్పష్టం గా రుజువు కాగలదు. అదుగో మీ గౌరవార్ధం ఖైదీలు ఇస్తున్న ప్రదర్శన ను చూడండి."

        1
    ఒక బోయవాడు అతి క్రూరంగా పిట్టల దగ్గర నుండి, మనుష్యుల వరకు వేటాడు తున్నాడు. పాపం, పుణ్యం, అనే రెండు పదాలకు అర్ధం తెలియకుండా బతుకుతున్నాడు. ఒకనాడు నారద మహర్షి, ఆ దారిన వెళ్ళుతున్నాడు. జంతువులకూ, మానవుడి కి, మానవుడికీ, మహర్షి కి కూడా బేధం తెలియని ఆ బోయ , నారదుని విషయం లో కూడా మామూలుగానే ప్రవర్తించాడు. నారదుని కి ఆ కిరాతుని జీవితం దిద్దాలనే సద్భావం కలిగింది.
    "అయితే ఎందుకిలా నీకీ అక్రమ మార్గం?' అని ప్రశ్నించాడు.
    "మరి ఆలు బిడ్డలను పోషించేదేలా?"
    "అందుకీదొక్కటే మార్గమా?"
    "మరి నాకిదే వచ్చు."
    "మరి నీ భార్య బిడ్డలు నీ సంపాదన తో పాటు, పాపాలను కూడా పుచ్చు కుంటారేమో కనుక్కో."
    "ఎందుకు పుచ్చుకోరు? నా వాళ్ళేగా?"
    "పోయి అడిగి రా."
    "ఇప్పుడే అడుగుతాను!" నమ్మికతో గర్వంతో ఇంటికి వెళ్ళాడు బోయవాడు.

            2
    "వట్టి చేతులతో వచ్చావెం? ఏది, ఈనాటి నీ సంపాదన?' అంటూ ఎదురువచ్చి నిలదీసి ప్రశ్నించింది కిరాతుడి భార్య.
    "ముందు ఇది చెప్పు. రోజూ నేను ఎన్నో పాపాలు చేసి తెచ్చిన సంపాదన తింటున్నావు గదా? అ సంపాదనతో పాటు, ఆ పాపాలను కూడా స్వీకరిస్తావా?"
    "నాకేం పని, నీ పాపాలతో? ఎంతమాత్రం స్వీకరించను."
    "నా సంపాదన తింటున్న పిల్లల్లారా ! మీరైనా నా పాపాలు పుచ్చుకొని నన్ను విముక్తుడి ని చేస్తారా?"
    "పోపో. పాపాలు మాకెందుకు? ఆలు బిడ్డలను పోషించడం నీ విధి. ఎలా తెచ్చావో మా కక్కరలేదు."
    నిర్ఘాంత పోయిన కిరాతకుడు దుఃఖిస్తూ ముని పాదాల పై పడి జరిగినదంతా నివేదించుకున్నాడు.
    "వెర్రి వాడా! ఇంతే లోకం! ఎవరి కెవరు? ఎవరికి వారే! అందుకే ఈ పాపాలు మాని వేయి. నీకు తారక మంత్రోపదేశం చేస్తాను."
    ముని నోటి నుండి 'మర' అనే పరమ పవిత్ర పదం వెలువడి, తన చెవుల సోకగానే కిరాతకుడు మారిపోయాడు. సర్వం మరిచి , ఆ తారక మంత్రాన్నే జపించు తుండగా నారదుడు నిష్క్రమించాడు.

            3
    దీర్ఘకాలానంతరం తిరిగి ఆ దారిన కార్యర్దియై వెళ్ళుతున్న నారదునికి ఒక వల్మీకం నుండి "మర మర మర' అంటూ తారక రాముని నామస్మరణ వినరవడంతో , ఆశ్చర్యంగా అటు చూచి ఆ శబ్దం వస్తూన్న చోట పెద్ద పుట్టనూ, చెట్ల నూ తొలగించి చూచాడు. ఏళ్ళ తరబడి ఇహలోక మెరుగని ఆ పున్యాత్ముడే నారద వచన ప్రకారం 'వాల్మీకి' అయి రామాయణం వ్రాశాడు.
    నారదుడు గా జగపతీ, కిరాతుడుగా బలరాం మహా ఘనంగా ఒప్పించారు.
    
                              *    *    *    *
    ఖైదీలే ప్రదర్శించిన ఆ ప్రహసనం చూచిన అధికారులూ, మంత్రులూ -- అందరూ ముగ్ధులై పోయారు. మంత్రిగారు తమ ముగింపు ప్రసంగం లో ధర్మారావు తలపెట్టిన ఆ మహోన్నత సంస్కరణ ను అభినందిస్తూ అతడు ప్రవేశ పెట్టిన అన్ని తీర్మానాలనూ తాను ప్రభుత్వం వారికి నివేదించి సాధ్య మైనంత వరకు సానుకూల మయ్యేటట్లు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఈలోపుగా ఖైదీలకు ఏమైనా మంచి పుస్తకాలు ఇవ్వడం, కొలది వినోదాలు ఏర్పాటు చేసుకోవడం వంటి చిన్న చిన్న విషయాలలో సందర్భానుసారం ప్రవర్తించే అధికారాన్ని ధర్మారావు కు ఇస్తూ ఖైదీ లనుద్దేశించి లా మంత్రి గారు అన్నారు:
    "ప్రభుత్వం వారికి సిఫారసు చేసేముందు మీ ప్రవర్తన పై నేను చేస్తున్న చిన్న ప్రయోగం ఇది. దీని ఫలితాల మీదనే సంస్కరణా , మీ భవిష్యత్తూ ఆధారపడి ఉంటాయి. మీ ప్రవర్తన ఏమాత్రం వికటించి ఎదురు తిరుగుతున్నట్లు కనిపించినా, వెంటనే గట్టి జాగ్రత్త లు తీసుకోవలసి ఉంటుంది."లా, సోషల్ వెల్ ఫేర్ మంత్రి గారు చేసిన ఆ హెచ్చరిక ఒక్క ఖైదీ లేక్ కాక, తమకూ నని గ్రహించారు ధర్మారావు, అర్జున్ ప్రభ్రుతులు.
    ఈ నాలుగు రోజుల సమావేశాల లోను, రెండు మూడుసార్లు మిత్రాతో సత్య అక్కడికి రావడం సంభవించింది. కాని సత్య, ధర్మారావు ఎవరి మట్టుకు వారే మరొకరి వైపు సాధ్యమైనంత వరకూ చూడకుండా ఉండడానికే ప్రయత్నించారు, అంతరాంతరాలలో రంపపు కోత అనుభవిస్తూ. సత్యతో మాట్లాడవలసి వస్తుందనే భయంతో ధర్మారావు మిత్రాతో కూడా మాట్లాడడం మానేశాడు. మిత్రా తానంత తాను ఏమైనా అడిగితె తప్పనిసరిగా జవాబు చెప్పి ఊరుకునే వాడు ధర్మారావు. తననేక్కడ పలకరిస్తాడో అనే భయంతో సత్య ఎవరితోనూ కావాలని మాటలు కల్పించుకొని దూరదూరంగా వెళ్ళిపోయేది.
    దినచర్య అంతా పూర్తీ అయి, ఇల్లు చేరి శయ్య పై వాలుతూ తనలో తాను అపరిమిత మైన బాధతో కుమిలి పోయేవాడు ధర్మారావు, 'అడుగడుగునా నీ సలహాను, ప్రతి పనికీ ప్రశంసా పూర్వకమైన నీ చిరుహసాన్ని అందుకొనే అదృష్టం అందకుండా పోయింది. నేను దురదృష్ట వంతుడిని, సత్యా!' అనుకుంటూ.
    సత్య రాత్రింబవళ్ళు తనలో తాను కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నది. "పినతల్లి వైతే ఎలా అయినా ఒప్పించ గలను. కాని ధర్మారావే నా ముఖం చూడకుండా పోయారు. అంత పాపం నేనేం చేశాను?' అనీ, 'నన్ను మా పిన్ని అంక్ష పెట్టినట్లే ఆయనను అయన తల్లి అజ్ఞాపించిందేమో?' అనీ ఊహించి సరిపెట్టుకోనేది. ధర్మారావు తో కలిసి జంటగా తిరిగిన ఏకాంత నిర్జన ప్రదేశాలూ , కొండ రాళ్ళూ , నదీ తీరాలూ ఇప్పుడు ఒంటరిగా వెళ్ళుతున్న ఆమెను పరిహసిస్తున్నాయి. అదీకాక ఆనాడు ఆ కత్తి విసిరిన వాళ్ళెవరో , మళ్ళీ ఏమి ప్రమాదం జరుగుతుందో అనే భయం ఒక వంక ఆమెను దహించి వేస్తున్నది. 'ఒక్కసారి ముఖా ముఖి అడిగి వేద్దునా?' అనుకుంటుంది. అంతలో తర్వాతి పరిణామాలను ఊహించి , అదిరి పడి ఆ ప్రయత్నం విరమించు కుంటుంది.
    ఒకదినం మిత్రాతో మాట్లాడి వెళ్ళిపోతున్న అర్జున్ ను ఆపింది సత్య. "ధర్మారావు గారూ , మీరూ దగ్గర స్నేహితులనుకుంటాను. ఒకమాట అడగనా?"
    ఆశ్చర్యపోయాడు అర్జున్. "అడగండి. అతడూ, మీరూ ప్రాణ స్నేహితులేమో!" అని ఎదురడిగాడు.
    సత్య సమాధానం చెప్పలేదు. కొద్దిసేపు ఊరుకుని చివరకు మెల్లగా చెప్పింది ; "ఒకనాడు సాయం కాలం నేనూ, ధర్మారావు గారూ మాట్లాడు కొంటుంటే అక్కడ ఒక కత్తి వచ్చి పడింది."
    "అవును. ఆ విషయాలన్నీ ధర్మారావు గారు చెప్పారు."
    "ఓహో! మీకు చెప్పారన్న మాట?' సంతోషాశ్చ్యర్యాలు మిళితమయ్యాయి సత్య మాటలలో "అయన ఆరోజే , అప్పుడే మీకు చెబుతా నన్నారు. కాని నేనే వద్దన్నాను, అనవసరమైన క్లలోలమని."
    అర్జున్ మౌనంగా వింటున్నాడు.
    సత్య తిరిగి చెప్పింది: "కాని ఇప్పుడు అనుకుంటున్నాను--- మీవంటి వారికి తెలిస్తే మంచిదని, ఆయనకు మరేమీ ఫర్వాలేదంటారా? ఇంకెవరూ ఏమీ కుట్రలు పన్నడం లేదుకదా?"
    అర్జున్ అంతరంగం లో మహా ఆశ్చర్య పోయాడు. "ఓ! అయితే ఈమె కేమీ తెలియదన్న మాట!'
    పైకి ప్రకాశంగా అన్నాడు: "లేదమ్మా ఆయనకేమీ ఫర్వాలేదు. ఆ విషయం అప్పుడే చెప్పాడు నాకు ధర్మారావు. ఆ వ్యక్తులను ఆరాతీసి వాళ్లకు వార్నింగ్ కూడా ఇచ్చాను. ఇంకేమీ జరగదనే అనుకుంటున్నాను."
    "థాంక్స్ . నా మనస్సు కుదుట పడింది."
    అర్జున్ ఏదో అడగబోయి వెనకాడాడు , తటపటా యిస్తూ.
    "వాళ్ళెవరు, అర్జున్ గారూ? ఎవరి కాయన పై అంత కక్ష?"
    "ఎందుకు లేండమ్మా , మీకు? అదంతా రహస్యంగా జరిగిపోయింది,. మరి వాళ్ళు తలెత్తరు. మరి సెలవు."
    తర్వాత ధర్మారావు ను కలిసినప్పుడు అర్జున్ నవ్వుతూ ప్రశ్నించాడు : "అయితే , మిస్టర్! లోకో ద్దరణ హడావుడి లో స్వజనాన్ని మరిచి పోయారేమిటి?"
    ధర్మారావు అర్ధం కాక చూచాడు.
    "సత్యాదేవి పాపం చాలా ఆత్రం ప్రకటించారు. మీ విషయం లో. ఆరోజున కత్తి, ఉత్తరం ఉదంతమంతా చెప్పారు. ఆ తర్వాత మీరెందుకు కలుసుకోలేదు?"
    తల్లి మాటలను బట్టి, తాను ఒకప్పుడు సత్య విషయం లో పడిన అనుమానం నిరాధారమని తేలగానే ధర్మారావు చాలా బాధపడ్డాడు. "ఆ విషయం మీతో నన్ను చెప్పవద్దన్నది. ఆమె చెప్పిందా?" అన్నాడు.
    అర్జున్ సందర్భాన్ని మరొక రీతిగా అర్ధం చేసుకున్నాడు. బిగ్గరగా నవ్వేస్తూ , "కలహాలు సాధారణమే కాని , వాటిని కలకాలం కాపురం చేయనీయకండి, ధర్మారావ్! సింపుల్ గా తేలిపోవాలి" అంటూ నవ్వి వెళ్ళిపోయాడు.
    ధర్మారావు సిగ్గుతో, బాధతో క్రుంగి పోయాడు. సత్య విషయం అతడి కోక తీరని సమస్య అయిపొయింది.
    "ఛ! ఇక్కడికి వస్తూనే అన్ని రకాల సమస్యలూ ఎదురయ్యాయోయ్ నీకు, ధర్మరావ్!' అని తన పై తానె జాలిపదేవాడు . 'ఛ! ఎవరి పై వారు జాలిపడడం కంటే దీనదశ మరొక్కటి లేదు' అని మళ్ళీ అసహ్యించుకొనే వాడు. పూర్తీ అశాంతి కి స్థావరమై పోయింది అతడి మనస్సు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS