25
వర్షం జోరుగా కురుస్తూంది. చిత్ర లేఖనంపై మనస్సు కుదరక నవలాపఠనం సాగించింది, శాంతి. నౌకాప్రమాదం. ఎంతటి మహత్తరమైన నవల! కమల, రమేష్, డాక్టర్ నళివాక్ష, హేమానళిని, అక్షయబాబు - ప్రతి ఒక్కరూ మానవత్వంలోని మమతకూ, మంచితనానికీ ప్రతిరూపాలు. అందలి ఒక్కో సంఘటన జీవితంలోని ఒక్కో కఠోర సత్యాన్ని, ప్రతి బింబింపజేస్తుంది. వ్యక్తికి కాదు-'భర్త' అనే పదానికి, ముఖమైనా ఎరుగని భర్తకు మనోమందిరంలో పీఠం నెలకొల్పి పూజించే కమల: నీతికీ, మమతకూ, మంచితనానికీ ఆలవాలమైన రమేష్; ప్రాచీన పాతివ్రత్య రక్తంతో, అధునాతన విజ్ఞానంలో స్థిర గంభీర వ్యక్తిగా, ఉత్తమ శీలవతిగా రూపొందింపబడిన హేమానళిని: వివాహ వేదికపై తాను చూడని భార్యను, మరణించిన దనుకొనే ఆమెనే హృదయంలో బంధించి మరొక స్త్రీని తలపెట్టని ఉత్తమ పురుషుడుగా నళినాక్ష: వృద్దుడై ఉండీ యువక హృదయాల రాగభావాలనూ, ప్రేమ లోతులనూ అర్ధం చేసుకోగల అక్షయబాబు - వీరందరూ మానవత్వం లోని ఒక్కో అపూర్వ సుగుణానికీ, అద్వితీయ మైన విశిష్టతకూ ప్రతీకలు. కాలం ఎన్ని మెలికలు త్రిప్పినా ప్రేమబలం గెలుస్తుంది: పవిత్రత సగర్వంగా నిలుస్తుంది: నైతిక విలువకు మించిన విలువలేదు - అని చాటిచెప్పే నవల. దేశ కాల పరిమితుల నధిగమించి చిరస్థాయిగా సర్వ ప్రామాణికమై నిలిచిన నవల.
కాలక్షేపం కోసం చదివితే కథ మనసు ఊర్ధ్వ లోకాలకు తీసుకుపోతుంది. అందలి వ్యక్తులతో స్వర్గసీమలలో ఆడుకుంటాం. అనిర్వచనీయానందంతో అంతరంగం లాస్యం చేస్తుంది. కాని విమర్శనాదృష్టితో చదివేవారికి నవలలోని ఒక్కో పాత్రా కళ్ళెదుట సజీవంగా నిలుస్తుంది. ఒక్కో సంఘటనా చదువరి స్వీయ జీవితంలోని ఒక్కో ఘట్టాన్ని సూటిగా స్ప్రుశించుతుంది. ఒక్కొక్క పాత్రౌచిత్యం పాఠకుని హృదయ గత భావాలకు అన్వయిస్తుంది. వెయ్యి మాట లెందుకు? నవల చదువరి మనః సామ్రాజ్యంపై ఆధిపత్యం వహిస్తుంది. కథ యందలి కల్పనా మాధుర్యంతో అల్లుకుపోయిన వాస్తవ జీవిత నిష్ఠుర సత్యాలు హృదయాన్ని మథిస్తాయి.

ఆ రవీంద్రుని 'నౌకాభంగం' నవలా పఠనం ముగించిన శాంతి మనస్సు విపరీతంగా చలించింది. మదిలో అనిర్వచనీయమైన భావాలు చెలరేగాయి. 'ఎక్కడ చూచినా ప్రేమ, ప్రేమ! ఇంతకు మించిన లోకమే లేదా? మానవ జీవితానికతి సన్నిహిత సంబంధంగల సాహిత్య సామ్రాజ్య మంతా అనురాగపూరితం, ప్రేమమాయం. వీటినే రసవత్ ఖమ్దాలని కీర్తిస్తారు: దేశదేశాల ప్రజలూ ఆదరిస్తారు. ఏమిటీ లోకం? ఎందుకీ సంబంధాలు? ఎక్కడివి ఈ అనుబంధాలు?'
ఆలోచనలలో తేలిపోతూ లైబ్రరీకి బయల్దేరింది, శాంతి. వరుణదేవుని పొందునందిన వసుందర కమ్మని వాసనలు వెదజల్లుతున్నది. మలయమారుత తరంగాలు సుమసౌరభాలపహరిస్తూ స్వేచ్చావిహారం చేస్తున్నాయి. తడిసిన చెట్లపై కూర్చుని పక్షులు రెక్కలు విదిలిస్తున్నాయి. మేఘనిర్ముక్తమైన ఆకాశంలో తిరిగి సూర్యుడు ప్రకాశించసాగాడు. వర్షాగమనం వలన ధూళి ధూపరమైన తరుపత్రాలు ఆ సాంధ్యా సూర్యరశ్మిలో తళతళ మెరయ సాగాయి. ఊహావలయం వర్ణరంజితమై ఆకృతి దాల్చినట్టు విశాలాంబరంలో సుందర మైన ఇంద్రధనుస్సు వెలసింది.
లైబ్రరీ ద్వారంలోనే ఎదురుపడ్డాడు గోవింద రావు, శాంతికి.
"ఏం, శాంతీ, రెండు రోజులనుండీ దర్శనమే లేదు?"
ఆలోచనలలో ఉన్న శాంతి వెంటనే సమాధాన మివ్వలేక పోయింది. సద్యోవికసితమైన అరుణ పద్మమైంది వదనం. సూటిగా చూచే ఆ కళ్ళలోకి ఆమెకు నిశితంగా చూడగల శక్తి ఉండదు.
"వంట్లో బాగుండక" అంది కడకు మెల్లగా.
"ఒంట్లోనా, మనస్సులోనా?" అలాగే సూటిగా చూస్తూ నవ్వాడు.
ఒక్కసారి శరీరం జలదరించింది శాంతికి. మనోరమ మాటలు చెవులతో గింగురుమంటున్నాయి.
"ఇదుగో, క్రిస్ మస్ గ్రీటింగ్, నిన్ననే యిద్దామంటే మీరు కన్పించలేదు." నవ్వుతూ కవరు అందించాడు గోవిందరావు.
శాంతి ఉత్సాహంగా అందుకుంది. "విష్ యు ఆల్సో ఎ హాపీ క్రిస్మస్!" అంది వెళ్ళిపోతూ.
"అబ్బ! ఎంతందంగా వున్నావ్, శాంతీ, ఈ తెల్లని దుస్తులలో!" చిత్రమగ నవ్వుతూ వెళ్ళిపోయాడు గోవిందరావు.
తెల్లని దుస్తులు ధరించిననాడు రాజా ఒకసారి అలాగే అన్నాడు. అప్పుడు తనకు కోపం వచ్చింది. కాని ఎందువల్లో యివ్వాళ ఆగ్రహం లేదు సరికదా, హృదయం సంతోషపూరితమై పోతూంది. మనోరమ మాటలు నిజమేనేమో! అతడిపై అభిమానమే లేకుంటే రాయిలాటి తన మనస్సు ఎందుకిలాగైపోతుంది?
పెదవులపై చిరునగవు లాస్యం చేసింది. దూరాన కోయిల కూసింది. 'చంపకం పూత మొదలు పెట్టిందే!' సౌరభాలు విరజిమ్ముతూన్న ఆ పుష్ప సౌందర్యాన్ని తన్మయతతో చూస్తూ గది చేరుకుంది శాంతి.
ఎదురుగా చిత్రఫలకంపై వున్న 'కళాతపస్వి' వినూత్న సౌందర్యంతో చూపట్టింది. జగమే సుందరమయంగా, సుందరవనంగా గోచరించింది. ఎప్పుడూలేని వింత వింత ఊహలతో మనస్సు ఉరకలు వేయసాగింది.
గోవిందరావు యిచ్చిన కవరు తీరికగా విప్పి చూచింది. నిర్మలమైన రంగులతో చిత్రింపబడిన రతీమన్మథులు! 'టు మై స్వీట్ హార్ట్, బై గోవింద్' అని వ్రాశాడు. నవ్వుకుంది. అతడిచ్చిన చిత్రాన్నే తదేకంగా తన్మయత్వంతో చూస్తూ మనోరమ రాకను గమనించనేలేదు.
"ఓ అభినందనలు" అంది శాంతి చేతిలో ఉన్న గ్రీటింగ్ కార్డు పరిశీలిస్తూ మనోరమ.
ఉలిక్కిపడి చూచింది శాంతి. "రా, కూర్చో" అంది మెల్లగా.
"ఏం, నా మాట నిజమేనా?" అడిగింది మనోరమ నవ్వుతూ.
శాంతి మాట్లాడలేదు. సిగ్గుతో తలవాల్చింది.
"అబ్బో! అది సరేకాని, మరి నువ్వేమిచ్చావ్?"
"ఏం లేదు" అంది శాంతి అమాయకంగా.
పకపకా నవ్వింది మనోరమ. "శాంతీ, ఎంత అమాయకురాలవు నువ్వు! ఓ పని చెయ్యి. ఆ కళా తపస్వి అతడి కిచ్చెయ్యి."
అర్ధం కానట్టు చూచింది శాంతి.
"ఏం అలా చూస్తావ్?" అడిగింది మనోరమ.
"అయితే అలా బహుమతి యిచ్చినవాళ్ళకు మళ్ళీ యివ్వాలా?"
"ఇదేం ధోరణి, శాంతీ?" ఆశ్చర్యపోయింది మనోరమ. "అది కానుక కాదు, గ్రీటింగ్. గ్రీటింగ్ కూడా కాదు నిజానికి - అతడి మనస్సు! అంగీకారంకూడా ఆవిధంగానే తెలుపమంటున్నాను."
చాలాసేపు ఊరుకుని మెల్లగా అంది శాంతి: "మనోరమా! నీకు ఆరోజు మా అన్నయ్యను కాక మరొకాయనను పరిచయం చేశాను. గుర్తుందా?"
కొంచెం ఆలోచించి, "రాజశేఖరం కదూ? రవీంద్రుని చిత్రం వేశారు?" అంది మనోరమ.
"అవును" అంటూ శాంతి అతడి విషయమంతా చెప్పింది మనోరమకు. "అతడు కానుకగా యిచ్చిన చిత్రాలను, పుస్తకాన్ని తీసుకోవటమే కాని ఎప్పుడూ నేను తిరిగి ఏమీ యివ్వలేదు. అయితే అది మూర్ఖత్వమంటావా?"
