Previous Page Next Page 
మొగలి పొదలు పేజి 22


    శ్రీనివాస్ అన్నాడు! 'యెందుకు బెంగ? నిన్ను నేను యేవీ అనలేదు రాజేశ్వరీ , నాకు కోపం దేనికి మధ్య, నీ సుఖం నీ ఆనందం కన్నా నాకు కావలసింది ఏముంటుంది?'
    'యేమో మీకు మాత్రం కోపం వచ్చింది.'
    'లేదోయ్.'
    శ్రీనివాస్ కోపం క్షణం లో యెగిరి పోయింది.
    రెండు మూడు రోజులు అయేసరికి రాజేశ్వరి వుద్యోగం లో సుఖం గ్రహించింది. యింటి పట్టున వుండి వేళకు వండి భర్త కు కోసం యెదురు చూస్తూ వుండడం లో వున్న అందం బయటికి వెడితే రాదనీ గ్రహించింది. భర్త ముందు తను నిజం వొప్పుకుంటే తేలికై పోతానేమో అని శ్రీనివాస్ అడిగే ప్రశ్నలకి నవ్వుతూ సమాధానం యిచ్చి ఆఫీసులో క్లర్కుల గురించి తెగ చెప్పుకు పోయేది . చిన్న కంపెనీ లో నిరంజనం షేర్ హోల్డర్. రాణీ గంజ్ లో కొంచెం దూరంలో ఒక గది తీసుకుని అందులోనే పెట్టారు. ఎనిమిది మంది వాటాదార్లు. రోజులో నాలుగైదు సార్లు వరస క్రమంగా యిద్దరు చొప్పున అరగంట కోసారి రావడం పనివాళ్ళని, గుమస్తా లనీ, రిప్రజెంటేటివ్ లనీ గజగజ లాడించేసి బర్ మనే కారు హోరులో అంతర్ధానం కావడం ఇలా జరుగుతుంటే రాజేశ్వరి నవ్వుకుంటుంటుంది. రాజేశ్వరి కోసం అతను యిల్లు కూడా మార్చాడు సికింద్రాబాద్ వైపు.
    'మీవారు యీ కంపెనీ లో చేసిందుకు ఎలా వొప్పుకున్నారు?' రామారావు అడిగాడు.
    'అయన వొప్పుకోక పోయిందుకేం వుంది యిందులో.'
    "మీరు విలియం గారిని చూశారా?'
    'వూ.'
    'అతను.'
    'ష్' నీకేద్నుకు రామారావ్. పెద్ద వాళ్ళ విషయాలు,' నాగరాజు కస్సు మనగానే తగ్గిపోయాడు రామారావు.
    కుతూహలంగా అడిగింది రాజేశ్వరి 'ఏవిటండీ అది?'
    'యేవీ లేదు' నాగరాజు నవ్వాడు.
    'అయితే ఏదో వున్నదన్న మాట.' రాజేశ్వరి వాక్యం పూర్తి కాలేదు. ఆకుపచ్చని విమానం లాంటి కారు రోడ్డు మీద రెక్కలు చాపుకుని ఆగింది. యెవరి స్థలాల్లో వాళ్ళు నిశ్శబ్దంగా కూర్చుండి పోయారు.
    'మీకు నెలనెలా ఫస్టు కే జీతాలు యివ్వడం లేదనీ, మీ మీద పనిలో మాకు నమ్మకం లేదనీ నలుగురూ కలిసి గూడు పుటానీ లాంటివి చేయడం నాకు నచ్చదు. మన సంస్థ బాగుపడాలంటే అందరం వొకటిగా మెలిగి వొళ్ళు వొంచి పని చేయాలి. ఎనిమిది గంటల వరకూ కంపెనీ లోనే వుండాలి. ప్రొద్దున్నే ఎనిమిదన్నరకి తలుపులు తెరవాలి. వింటున్నారా , 'శాస్త్రి గొంతు ఖంగు మంది.
    భాగాస్వాముల్లో విలియం, శాస్త్రి , నిరంజనం, భీమ శంకరం యెక్కువగా వస్తుంటారు. అందరి లో నలుగురి కష్ట సుఖాలూ కొంచెం ఆకళించుకుని, అవసరంలో ఆడుకోవడం గానీ, మంచి సలహాలు యివ్వడం లో గానీ శాస్త్రిదే పై చేయి. అతను మాట్లాడడు. ఉపన్యాసం లా దంచేస్తాడు గంటల తరబడి. అతని వాగ్దోరణిలో చేయవలసిన పనులు నెలలకి వాయిదాలు పడిన అందులో ఆశ్చర్య పడనవసరం లేదు.
    'చూడండి. రాజేశ్వరి గారూ మీరు పది గంటలకి వస్తూ ఐదు గంటలకి వెళ్ళుతుంటారని చాలాసార్లు విన్నాను. నిరంజనం రికమెండు చేశాడని యేవీ అనలేక పోతున్నాను, కంపెనీ రూల్స్ కొంచెం గ్రహించాలి.'
    'నేను చాలా దూరం నుంచి వస్తున్నాను సార్. బస్సులు యిన్ టైం లో దొరకవు.'
    తొందరగా లేచి రావాలండీ.'
    'త్వరగానే వస్తున్నాను. కానీ రష్ వల్ల.......
    'డానికి మేము బాధ్యులం కాము. మీరు సాయంత్రం ఐదు గంటలకే వెళ్ళిపోతే మీకు యిచ్చే జీతం మాకు దండుగ క్రిందే వస్తుంది.'
    'నేను టైపు చేస్తూనే వున్నాను సార్.'
    'ఏం చేయడమో. కార్బన్ పేపర్లు మొత్తం రెండు నెలలు రాలేదు. దస్తా కాగితాలు సగం పైన చెత్త కుండీ లోనే వుంటున్నాయి. మీరు పది నుంచి అయిదు గంటల వరకూ చెసే పనిలో నాలుగు లెటర్స్ వుండడం లేదు. మీరు వెళ్ళాక నిరంజనం, విలియం రాగానే మరీ యెక్కువయ్యే ఆ టైపింగ్ వర్కంతా నేను చేస్తున్నాను.'
    'నేను నిరంజనం గారితో అలాగనే చెప్పి చేరాను సార్'
    'మీకు నెలకు డెబ్బై అయిదు యిస్తున్నాం. కావాలంటే జీతం పెంచుతాం. మీరిలా కంపెనీ టైముకు సరిగ్గా రాకపోతే మీ వల్ల మాకు లాభం వుండదు. నేను నిరంజనం తో కన్సల్ట్ చేస్తే లాభం వున్న మనుషులైతే......
    'మీకంత కష్టంగా వుంటే నేను రిజైన్ చేస్తాను. మాటలనవసరం' రాజేశ్వరి కటువుగానే అంది.
    రామారావు నీ, నాగరాజు ని యిలా పేరు పేరునా శాస్త్రి న్యాయం గానో, అన్యాయం గానో పెట్టవలసిన చివాట్లు పెట్టేసి స్కూటర్ మీద క్షణం లో వెళ్లి పోయాడు, కారు విలియం కోసం వుంచి , రాజేశ్వరి మొహం యెరుపు రంగు కి మారిపోయింది. ఇన్నాళ్ళ నుంచీ కాపురం చేస్తుంటే శ్రీనివాస్ ఒక్క మాట అనలేదు. యివాళ శాస్త్రి యెన్ని మాటలన్నాడు. తన భర్త తమాషా కి కూడా యేవీ అనేవాడు కాదు.
    'కంపెనీల్లో అంతేనండి. మీరు చిన్న బుచ్చుకోవలసిందేవీ లేదు' ముగ్గురు క్లార్క్ల్ లూ యేక కంఠం తో అంటుంటే రాజేశ్వరి మౌనంగా వుండిపోయింది.
    వారం రోజులు దాటిపోయినా జీతం యివ్వలేదు. కంపెనీ కి పార్సేల్స్ వచ్చిన చెక్కే పెట్టెలు గుట్టలుగా పడి వున్నాయి. కొత్తగా వచ్చిన మేనేజరు నిరంకుశత్వం తో ముగ్గురి క్లర్కుల ప్రాణం విసిగి వేసారి పోయింది. బీద కుటుంబాల్లోంచి వచ్చిన ముగ్గురికీ రోజు గడవడమే కష్టంగా వుంది.
    'మీరు నమ్మండి రాజేశ్వరి బస్సులకి మిగలడం లేదు. ఎక్కడి రాణీ గంజ్ యెక్కడ చార్ మినార్ యింత దూరం నడిచి వెళ్లాం : మీరు యీ మాట మరెవరి దగ్గరా అనకండి.'
    'యే మాట?' రాజేశ్వరి కి అర్ధం కాలేదు.
    కంపెనీ పూర్తిగా డస్ట్ తో నిండి పోయింది. మేము శుభ్రం చేస్తాం. అది పని వాడితో చేయించాం అని చెబుతాం. ఆ డబ్బు మేం తీసుకోబడంలో తప్పేముంది ?' నాగరాజు అన్నాడు.
    'మీ యిష్టం.'
    'కష్టపడుతున్నాం పనికి ప్రతిఫలం యివ్వమని న్యాయంగా అడుగుతే వాళ్ళు యివ్వడం లేదు. మీరు మాతో యేకీభవిస్తే.'
    'నన్ను ఏం చేయమంటారు?'
    'యిక్కడి విషయాలు మామీద దయుంచి నిరంజనం గారి దగ్గర అనకండి.'
    'ఛ! నేనలాంటి డాన్ని కాను.'
    'యిన్ని చెక్క పెట్టెలు వృధా గా రోడ్డు మీదికి పోతున్నాయి. దారిన పోయేవాళ్ళు అందినన్ని చేత పట్టుకు పోతున్నారు. వున్నవాటిలో కొన్ని అమ్మేయాలని వుంది.'
    'నిరంజనం గారికి మన మీద అభిప్రాయం పోతుంది.'
    'తలుపులు మూసేందుకు అడ్డంగా వున్నాయని ఆయనే బయట పెట్టమన్నారు. రాత్రి యెవరో కొట్టేశారు కొన్ని. యిప్పుడైనా మనం వాటిలో కొన్ని అమ్మేస్తే ఏం ,' రామారావు అంటుంటే రాజేశ్వరి విని వూరుకుంది.
    శాస్త్రి మాటలు చెవుల్లో రింగు,మన్నా రాజేశ్వరి లెక్క చేయలేదు. ఐదు గంటలకే యింటి దారి పట్టింది. కంపెనీలో జరిగే విషయాలు పూర్తిగా విని నవ్వాడు శ్రీనివాస్. 'నీ యిష్టం నాదెం లేదు నీకు పనిచెయ్యాలని వుంటే చేయి....
    'మరో వారం చూసి తేల్చు కుంటాను; రాజేశ్వరి కి యేవీ పాలుబోలేదు. అసలు యీ వుద్యోగం అసంతృప్తి గా అనిపించింది ఆవిడ ప్రాణానికి.

                            *    *    *    *
    నిరంజనం కళ్ళు చిట్లించి రాజేశ్వరి కి గజం దూరం లో నిలుచుని అన్నాడు. 'నీ కన్నా మంచివాళ్ళు ఎంప్లాయ్ మెంట్ నుంచి వచ్చారు. కానీ ఏడో ఆర్ధిక చిక్కుల్లో వున్నావని నీకు యిప్పించాను యీ వుద్యోగం.'
    రాజేశ్వరి బుర్ర వంచుకుంది.
    నిరంజనం వెళ్ళిపోయాక రాఘవరావు అన్నాడు : 'మీరు యీ కంపెనీ లో పని చేయద్దు. మీవల్ల మాకు నష్టం యేమీ లేదు. ఆ ముఠా అంత మంచిది కాదు. నేను చెప్పేది వినండి.'
    'రాజేశ్వరి మౌనంగానే వింది.
    'ఈ కంపెనీ లో పని చేయాలనుకునే వాళ్ళు అధికారుల అధీనం లో వుండాలి. మీరలా వుండలేరు. కాదంటారా'
    'అవును నేను బానిసగా వుండలేను.'
    'ఏం చేయాలను కుంటున్నారు.'
    రాజేశ్వరి వ్రేళ్ళు టైపు మిషన్ మీద టకటక శబ్దం చేస్తున్నాయి.
    'నేను కూడా వెళ్లి పోవాలను కుంటున్నాను . యిక్కడ నాకేవీ తృప్తిగా లేదు' రామారావు అన్నాడు.
    రాజేశ్వరి కాగితాన్ని తీసి రాఘవరావు కిచ్చింది. 'మీతో యిన్నాళ్ళు పనిచేశాను. అనుభవంగా యీ వుద్యోగం జీవితం అంతా గుర్తు వుంటుంది మరి వస్తాను.'
    ముగ్గురూ క్లార్కులూ సాగనంపారు.
    శనివారం మధ్యాహ్నం వొంటి గంటకి వచ్చిన శ్రీనివాస్ రాజేశ్వరి ని చూసి ఆశ్చర్య పోయాడు. శ్రీనివాస్ ని చుట్టేసి బావురుమంది : 'నేనింక పని చేయను.' అంటూ శ్రీనివాస్  ఆవిడ తల మీద చేయి వేసి 'నిన్నిప్పుడు యెవరు చేయమన్నారోయ్. మనం హాయిగా వుంటే అంతే చాలు. అతని మాటల మధ్యలోనే నెలలు నలిగి పోయాయి. రాజేశ్వరి వుద్యోగం పోయాక సంసారం మొదటికే వచ్చింది మళ్ళీ.
    పేకాట వేస్తూ అంది: 'మీరు నమ్ముతారా,' అని.
    'యేవిటి?'
    'నేను యిక్కడికి మొదట్లో వచ్చే ముందు దేవదాసు దగ్గరికి వెళ్లాను.'
    'యే దేవదాసు ?' శ్రీనివాస్ కి అర్ధం కాలేదు.
    'హర్మోనిస్ట్ .' అన్నయ్య కోసం వచ్చే వాడూ.'
    'వాడి దగ్గరకా.' నమ్మలేనట్టుగానే వుంది అతని స్వరం. ప్రభాకరం యేన్నోసార్లు అంటుంటే విన్నాడు. దేవదాసు మరో మనిషి కలిసి అర్ధరాత్రి యెవరో ఆడపిల్ల గొంతు కోశారని.
    'యిప్పుడు రాజమండ్రి జాంపేట లో పెద్ద మేడ కూడా వుంది అతనికి.'
    'వాడికా ' శ్రీనివాస్ కి దేవదాసు తో పరిచయం బాగానే వుంది.
    'అవును దానవాయి పేటలో వుండే ఆ కొంప కీ, యీ మెడకీ ఎంత తేడా వుందో చూశారా...'
    'అదృష్టం కలిసి రావాలి రాజేశ్వరీ అతని భార్య.....'
    'అయ్యో రామ పెళ్లి కాలేదండీ. సినిమాలో ప్లే బాక్ యిచ్చి ఆరేళ్ళ ల్లోనే మేడ కొన్నాడు.'
    'అవును అతను బాగా పాడేవాడు. అవధాని గారు నాతొ అంటుంటేవారు.' అతని గొంతులో సంగతులు పలకవు గానీ మనుషుల్నీ ముగ్దుల్నీ చేసేస్వరం అని.'
    'అవును నేనూ విన్నాను మీ గురించి దేవదాసు అంటుంటే.'
    'యేమని'
    'కష్టపడి మూడో కంటి వాళ్ళకైనా తెలియకుండా శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకున్నారని.'
    శ్రీనివాస్ పెదవుల మీద చిరునవ్వు మెదిలింది కాస్సేపు. 'అమ్మకి సంగీతం అంటే యిష్టం . అందుకే నేర్చుకో గలిగాను.'
    'నాతొ చెప్పారు కారు.'
    'నీకు తెలిసే వుంటుందని చెప్పలేదు.'
    'అన్నట్లు దేవదాసు దగ్గరికి యెందుకు వెళ్ళానో మీరు అడిగారు కాదు.'
    'నువ్వు చెబుతూనే వున్నావు కదోయ్.'
    'బాబాయి ఆ రాత్రి కేకలు వేయగానే అన్నయ్య కి మీలాంటి స్నేహితుడే అని వెళ్లాను. తనని పెళ్లి చేసుకుని వుండి పొమ్మన్నాడు.'
    'నువ్వు ఏమన్నావు?'
    'అనేందుకు ఏం వుంది? కొంచెం డబ్బు సర్దమని అడిగాను. యిచ్చాడు. దానితోనే వచ్చాను యిక్కడికి.'
    '............'


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS