Previous Page Next Page 
రాంభరోసా అపార్ట్ మెంట్స్ పేజి 22


    అంతా మొహిందర్ ని బలపరచారు.
    అప్పటికే షైనీ పోలీస్ స్టేషన్ ముందు నిర్వహిస్తున్న ధర్నా ఉధృతమయింది.
    షైనీకి లైటు కొడుతున్న యూత్ మామూలుగానే పోలీసుల మీద రాళ్ళు విసరటం ప్ర్రారంభించారు.
    పోలీసులు మరుక్షణంలో టియర్ గ్యాస్ బరస్ట్ చేశారు. అందరం పరుగెత్తాం.
    అప్పటికే టివి ఛానెళ్ళు మా రామ్ భరోసా అపార్ట్ మెంట్స్ గురించి పెద్ద ఎత్తున విజువల్స్ చూపిస్తూ, గృహహింస గురించి డిస్కషన్ లూ, చట్టం డెఫినిషన్లూ టెలికాస్ట్ ప్ర్రారంభించాయ్.
    కొంతమంది పిల్లలను ఇంటర్వ్యూ చేస్తూంటే, కొంతమంది తల్లిదండ్రులను ఇంటర్ వ్యూ చేస్తున్నారు.
    సాయంత్రానికల్లా మా అసోసియేషన్ వాళ్ళు హనుమంతరావ్ ని బెయిల్ మీద విడిపించడానికి ప్రయత్నాలు మొదలెట్టారు.
    మా అపార్ట్ మెంట్స్ లోనే ఉంటున్న ఒక లాయర్ని సంప్రదించాం ముందు.
    "నా ఫీజు ఇరవై వేలు" అన్నాడతను.
    "అంత ఫీజా?"
    "అవునండీ! బెయిల్ అంటే అందరికీ మామూళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది"
    ఎవర్తోనయినా ఆర్గ్యూ చేయవచ్చు గానీ లాయర్స్ తో ఆర్గ్యూ చేయగూడదనేది మా వాళ్ళందరికీ బాగా తెల్సిన విషయమే.
    "ఇప్పుడు మీకు ఇరవై వేలు ఇవ్వటం కంటే పోలీసులకు పదివేలిస్తే మా వాడిని వడిలేయటమే కాకుండా అసలు కేస్ కూడా లేకుండా చేస్తామని అన్నారు కదా"
    "అయితే అక్కడికే పోండిమరి. ఇక్కడి కెందుకొచ్చారు?"
    "లంచాలివ్వటం ఇష్టం లేక"
    "మీకేం దమాకున్నదా లేదా? లంచాలు ఇవ్వనోడు ఇండియాలో బతుకుతాడు వయ్యా"
    బయటికొచ్చి మళ్ళీ మీటింగ్ పెట్టాం!
    హమీద్ మియా మాట్లాడాడు.
    "భాయియో, బెహనో..... మన ఇండియన్ పబ్లిక్ కి ఏదైనా అన్యాయం, అక్రమం జరిగితే రెండే రెండు చాయిస్ లు ఉన్నాయ్! ఏక్....... పోలీస్ కే పాస్ జానా...... దో..... కోర్ట్ కో జానా, మగర్ ఆ రెండు జాగాల్లో అన్యాయం జరిగితే పబ్లిక్ ఎక్కడికెళ్తాయ్?"
    ఆ పాయింట్ మీద చాలాచర్చ జరిగింది.
    చివరకు షైనీ సజెషన్ ఇచ్చింది.
    "న్యాయవ్యవస్థలో కూడా ఫేవరిటిజం, లంచాలు ఉంటే ఉండవచ్చు. కానీ అవి కొంతమందికే పరిమితం. ఓవరాల్ గా చూస్తే మన రాజకీయ వ్యవస్థకంటే న్యాయవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తోంది. కనుక మనం మన ప్రాబ్లెం ని కోర్ట్ లో తేల్చుకోవటమే మంచిది"
    ఈ గొడవంతా చూసి హనుమంతరావ్ భార్యకు చిరాకేసుకొచ్చింది.
    "మా ఆయన్ని ఎలా విడిపించుకోవాలో నాకు తెలుసు" అంటూ శ్రీనుగాడి చేయి పట్టుకుని పోలీస్ స్టేషన్ వేపు వెళ్ళింది.
    "ఆమె ఏం అఘాయిత్యం చేస్తుందో ఏమో! పదండి మనం కూడా వెళ్దాం" అంది షైనీ. అందరం స్కూటర్స్ మీద పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాం.
    అప్పటికే ఇన్ స్పెక్టర్ తో వాదిస్తోంది హనుమంతరావ్ భార్య. "చూడండి! సంసారం అన్నాక భార్యాభర్తల మధ్య గొడవలొస్తయ్! ఒకోసారి భర్త భార్యను కొడితే, ఒకోసారి భార్యే భర్తను కొడుతుంది. కొట్టుకున్నారని ఇద్దరినీ జైలుకి పంపిస్తారా? విడాకులు మంజూరు చేసి సంసారాలు కూల్చేస్తారా? అలాగే పిల్లలను మంచి సిటిజెన్స్ గా తయారు చేయడానికి తల్లిదండ్రులు ఒకటి రెండు తగిలించాల్సి వస్తుంది. అంతమాత్రాన తల్లిదండ్రుల్ని జైల్లోకి తోసేస్తారా? ఆ పిల్లల్ని అడుక్కుతినేవాళ్ళుగా మారుస్తారా" అంటూ నిలదీస్తోంటే అందరం చమట్లు కొట్టాం!
    "వీళ్ళను బ్రతిమాలేదేంటీ? శిక్షపడితే పడనీ చేసింది తప్పని చస్తే ఒప్పుకోను!" లాకప్ నుంచి హనుమంతరావ్ అరిచాడు.
    "విన్నారు కదా! సరే, ఆయన్ని జైల్లో పెట్టారు కదా! మరిప్పుడు నన్నూ మా అబ్బాయిని ఎవరు పోషిస్తారు? గవర్నమెంటా? మీ డిపార్ట్ మెంటా? కోర్ట్ లా?"
    "ఆ సంగతి కూడా కోర్ట్ నే అడగండి! మమ్మల్నడిగితే ఏం లాభం?"
    "అలాగా! అయితే నన్నూ లాకప్ లో పడేయండి! జైలుశిక్ష వేసేయండి" ఆవేశంగా అని లాకప్ వేపు దూసుకెళ్ళబోయింది.
    "ఏంటమ్మా ఇది! ఆగు! మీ భర్త నేరం చేశాడు కనుక అరెస్ట్ చేశాం! నువ్వేం నేరం చేయందే ఎందుకరెస్ట్ చేస్తాం?"
    "అంటే? ఆ మాత్రం నేరం నేను చేయలేనా?" అంటూ శ్రీనుగాడిని లాగి వాడి చెంపలు గట్టిగా వాయించేసింది.
    "చూశారా! నేనూ గృహహింస చేసేశా! ఇప్పుడు లాకప్ లో పడేయండి"
    "రాజూ! ఆమెను కూడా అరెస్ట్ చెయ్" అన్నాడు ఇన్ స్పెక్టర్ కోపంగా.
    "మమ్మీ! నేను కూడా జైల్లోకొస్తా! జైల్లో ఉండటమంటే నాకెంతో ఇష్టం!" ఉత్సాహంగా అన్నాడు శ్రీను.
    "నువ్వెలా వెళ్తావ్ రా జైల్లోకి.. పో ఇక్కడనుంచి" అరిచాడు ఇన్ స్పెక్టర్.
    వాడు కోపంగా చూశాడు.
    "నేనెక్కడికెళ్తాను? మా డాడీ, మమ్మీ ఇక్కడే ఉన్నారు కదా?"
    "సార్! ఆమెను అరెస్ట్ చేశామంటే ఈ పిల్లగాడిని స్టేషన్ లోనే ఉంచుకోవాలి! బయటకు గెంటితే టీవీ ఛానెల్స్ లో వాడిని చూయించి సెంటిమెంట్ ఎక్స్ ప్లాయిట్ చేస్తారు. ట్రబుల్లో పడతాం" అన్నాడు హెడ్ కానిస్టేబుల్.
    "సరే.... ఆవిడ్నీ, వీడినీ పంపెయ్"
    "ఏమిటి? నన్ను బయటకు పంపుతారా? ఎలా పంపుతారండీ! మా ఆయన చేసిన నేరమే నేనూచేశాను కదా! ఆయన్ని జైల్లో వేసి నన్నెలా వదిలేస్తారు?"
    ఇన్ స్పెక్టర్ ఆవేశం పట్టలేక బూతులు మాట్లాడటం మొదలుపెట్టాడు.
    "థూ! నీయవ్వ! పొద్దుటేల్ పొద్దుటేల్ ఎవడి మొఖం చూశానో! ఈ ఫాల్తూ కేస్ దొరికింది. ఇదిగో చూడమ్మా! మీ ఆయన్ని కూడా వదిలేస్తాగాని అయిదువేలయినా ఇవ్వాలి"
    హనుమంతరావ్ లాకప్ నుంచి అరిచాడు "ఇవ్వకు కనకం! అయినా ఈ కేస్ ఎలా క్లోజ్ చేస్తావయ్యా? రిజిస్టర్ చేయటం, కేన్సిల్ చేయటం అంతా నీ ఇష్టమేనా?"
    దాంతో కనకం కూడా తిరగబడింది.
    "ఇదిగో......నేను నేరం మీ ఎదురుగ్గానే చేశా? నన్ను అరెస్ట్ చేస్తారా లేదా?"
    "మేం చెయ్యమమ్మా"
    "నన్ను అరెస్ట్ చేయకపోతే నీ డ్యూటీ నువ్ చేయలేదని కేస్ పెడతా!"
    "ఆమె పెట్టుకున్నా మేము పెడతాం" అన్నాడు మొహిందర్ ముందుకొచ్చి.
    అప్పుడే ఇన్ స్పెక్టర్ సెల్ మోగింది.
    "హలో! ఏంటే ఇప్పుడు ఫోన్ చేశావ్? ఏంటి? రెండోవాడు సెల్ ఫోన్ కొనలేదని టి.వి. పగలగొట్టాడా? దొంగనాకొడుకు. ఇప్పుడే వస్తున్నా! బెల్ట్ తో వీపు వాయకొడ్తా ఎదవని!"
    అంటూ హడావుడిగా బయటకు వెళ్ళబోతే షైనీ అడ్డువచ్చి నిలబడింది.
    "అంటే మీ పిల్లలు అల్లరి చేస్తే బెల్ట్ తో చితకబాదుతారా? అదే మేము చేస్తే శిక్షవేయిస్తారా? లేకపోతే వేలకు వేలు లంచాలు గుంజి వదిలేస్తారా?"
    ఇన్ స్పెక్టర్ కి ఒళ్ళు మండిపోయింది.
    "ఏయ్! మీరంతా పోండి బయటకు. రాజూ అందర్నీ స్టేషన్ కి దూరంగా గెంటండి" అన్నాడు కోపంగా.
    అప్పుడే శంకరమూర్తి వాళ్ళబ్బాయిని లాక్కొచ్చి నెత్తిమీద ఒక్కటిచ్చాదు.
    "సార్! నేనూ గృహహింస చేశా! నన్నూ అరెస్ట్ చేయండి"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS