Previous Page Next Page 
నీ మీద మనసాయరా పేజి 22


    "ఈ నైటీ తీసేస్తాను. వెన్నెల నింపిన స్విమ్మింగ్ ఫూల్ లా కనిపిస్తోంది మనడాబా" అని నడుం కాస్తంత పైకిలేపి జిప్ అందుకోబోయింది.
    
    "వద్దు స్త్రీ నగ్నంగా వున్నప్పుడు చూస్తే దరిద్రమట. నాకు చాలామంది చెప్పారు"
    
    ఆమె నిశ్శబ్దంగా అలానే కిందకు వాలిపోయింది పాత చింతకాయ పచ్చడికి ముక్కూ, నోరు, చెవులు తగిలించినట్లు అనిపించాడు అతను. శరీరానికి, మనసుకి మధ్యనున్న అనుభూతి లింకు తెగింది అవి రెండూ వేరయిపోవడంతో శరీరం కుంచించుకు పోయింది. మనసు ముడుచుకుపోయింది.
    
    అతను ఎటో అంటున్నా ఆమెకి స్పష్టంగా వినిపించడం లేదు. స్వర్గ ప్రవేశాన్ని నిరాకరించి ఎవరో తనని కిందకి తోసేసినట్లు ఆమె తనలో తానే దాక్కొంటోంది.
    
    అతను యధాలాపంగా ఆమె మీదకి ఒరిగాడు. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతున్నట్లు అతను ఆమెను ఆక్రమించుకున్నాడు.
    
    శరీరానికి ఏమవుతోందో ఆమె మనసుకి తెలియడం లేదు. మనసుకి ఏమవుతోందో శరీరానికి తెలియడం లేదు. మరో పదినిముషాలకి అతను ఆమె నుంచి విడివడి పక్కకి ఒత్తిగిల్లాడు. అప్పుడు చూసింది ఆమె అతని వీపుకింద వేలెడంత సైజులో వున్న తోకని.
    
    "ఏమండీ! మీ వెనక తోక మొలిచిందండీ" అంది ఆందోళనతో సూర్యాదేవి.
    
    "తోకా!!"
    
    ఆమె మరింత ముందుకి వంగి పరీక్షగా చూసి "అవునండీ తోకే" అంది.
    
    అతను జడుసుకున్నాడు.
    
                                              8
    
    గూటిలోని పక్షి తనను పెంచుకుంటున్న మనిషి దగ్గరికి రాగానే కూసినట్లు కాలింగ్ బెల్ మ్రోగడంతో తలస్నానం చేసి వెంట్రుకలను ఆరబెట్టు కుంటున్న సూర్యాదేవి పైకి లేచింది. అంత ఉదయం పూట ఎవరొచ్చారో ఊహకు అందడం లేదు.
    
    వెళ్ళి తలుపు తెరిచింది. ఎదురుగా నిలుచున్న వ్యక్తిని చూస్తూనే చిన్న జర్క్ ఇచ్చింది.
    
    "ప్రపంచశాంతి"
    
    "మీరూ..." అంటూ ఆగిపోయింది.
    
    అది కాలో నిజమో తెలియనట్టు కళ్ళు ఆర్పడం కూడా మరిచిపోయింది.
    
    "మీరు నన్ను చూసి మాటలు కూడా దొరకనంత ఆశ్చర్యపోతారని ముందే నాకు తెలుసు. అందుకే మీ ఇంటికి వెళదామా వద్దా అని కాసేపు తర్జనభర్జన పడ్డాను. చివరికి సెంటిమెంటే గెలిచింది.
    
    జీవితంలో మొదటిసారి వ్యాపారం ప్రారంభించాను. ఐపీఎస్ అటకెక్కి పోయింది కదా, మరి భుక్తి జరగద్దూ అందుకే చిన్న వ్యాపారం ప్ర్రారంభించాను. నా వ్యాపారాన్ని మీతో బోణీ చేయిద్దామని ఇలా వచ్చాను" అన్నాడు వసంత్. సూర్యోదయం తన పెదవుల మధ్యే అవుతున్నట్లు చిన్నగా నవ్వుతూ.
    
    ఆమె అప్పటికీ తేరుకోలేదు.
    
    జగదీష్ వచ్చి ఇతనెవరని అడిగితే ఏం చెప్పడం? భయం ఆశ్చర్యాన్ని మింగేయడంతో గిర్రున తలతిప్పి ఇంట్లోకి చూసింది. మరుక్షణంలో గుర్తొచ్చింది. అతను అరగంట క్రితమే వర్క్ స్పాట్ కి వెళ్ళిపోయిన విషయం హమ్మయ్య అనుకుంది.
    
    "మీరు ఇలా ద్వారం దగ్గర నిలుచునేసరికి రోజూ చూసే పగలు కొత్తగా అనిపిస్తోంది. రెండు రాత్రుల మధ్య పగలు. శరపరంపరల మధ్య డాలు అని తిలక్ అన్నది గుర్తుకొస్తోంది" ఆమెను కళ్ళల్లో కలిపేసుకుంటున్నట్లు సూటిగా చూస్తూ అన్నాడు.
    
    ఆమెకి ఏమీ పాలుపోవడం లేదు. మెదడుకి రక్తప్రసరణ ఆగిపోయినట్లనిపిస్తోంది.
    
    "లోపలికి రానివ్వరా ఏమిటి?" అంటూ ఆమె పక్క నుంచి ముందుకి నడిచాడు.
    
    ఇంట్లోకి వెళితే గన్ మెన్ కాల్చేస్తారని తెలిసినా అతను అంతే నిర్ణయంగా నడుస్తాడనిపించింది. మెల్లగా కలలో అడుగులు వేస్తున్నట్లు అనుసరించింది.
    
    "మీ ఇల్లు ఇలానే వుంటుందని ఊహించాను. తాజ్ మహల్ దీన్ని చూస్తే చిన్నబోతుందనుకుంటా"
    
    ఆమె అతన్ని కూర్చోమనలేదు.
    
    మౌనంగా అతని వేపే చూస్తోంది.
    
    "ఇంత శుభ్రతను భరించలేకపోతోంది మనసు. అందుకే సిగరెట్ తాగుతాను" అని జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించుకున్నాడు.
    
    "ఈ పొగ పట్టకపోతే చెప్పండి ఆర్పేస్తాను. మిమ్మల్ని చూశాకే ఇది అలవాటైంది. మీ ఊహలతో బరువెక్కిపోయే హృదయాన్ని డైల్యూట్ చేయడానికే స్మోక్ చేసేవాడ్ని భరించలేని ఆనందం కలిగినా, గుండె పగిలిపోయే దిగులేసినా సిగరెట్ తాగాలనిపిస్తుంది. మీలాంటి వాళ్ళని ప్రేమించాక ఆ రెండింట్లో ఏదో ఒకటి ఎప్పుడూ వుంటుంది. అందుకే నేను చైన్ స్మోకర్ ని" అన్నాడు వసంత్.
    
    రామా ఈజ్ ఎ గుడ్ బాయ్ లాగా బుద్దిమంతుడిలా వుండే జగదీష్ ని చూసి ఆ కళ్ళతో అంత విశృంఖలంగా వుండే అతన్ని చూడడం ఎప్పుడూ బస్సెక్కని పసిపిల్ల ఒక్కసారిగా బోయింగ్ విమానం ఎక్కితే ఎలా వుంటుందో అలాగుంది ఆమెకి.
    
    "మీ ఇల్లు చూపిస్తారా?" అని అతనే చొరవ తీసుకుని ముందుకి కదిలాడు.
    
    ఆమె వెనకే నడుస్తోంది హాల్లోంచి పైకున్న మెట్లెక్కి తొలుత వున్న గదిలోకి దూరాడు.
    
    "కొళాయిలు, బాత్ టబ్- ఇవేవీ లేకుంటే ఇది బాత్రూమ్ అంటే నాలాంటివాళ్ళు నమ్మరేమో మీరు ప్రతి ఉదయం ఆరుగంటలకల్లా ఇక్కడికే వస్తారనుకుంటా. అదిగో ఇక్కడ నిలబడి నైటీ విప్పుతారు. పక్కలో నలిగినా రాత్రినంతా ఇక్కడ వదిలేసి పగటిని చుట్టుకోవడానికి పూనుకుంటారు. అందుకే రాత్రి గౌనుకి నైటీ అని పేరు పెట్టారనుకుంటా.
    
    మీరెంత నాజూగ్గా స్నానం చేస్తారో చూడాలనిపిస్తోంది. అదిగో అలా కోపంగా చూడకండి. ఏం సబ్బు ఇది? చందమామ మీ సబ్బు పెట్టెలో దాచిపెట్టేసినట్లు కనిపిస్తోంది.
    
    ఫారిన్ సోప్ కదూ ఈ దుబ్బు తువ్వాలుతో మీరు ఒంటిని తుడుచుకుంటారను కుంటా. అందుకే మీ హబ్బీ కంటే కూడా ఈ టవల్ అంటే ఎక్కువ ఈర్ష్య కలుగుతుంది. దానికి కారణం వుంది. చెప్పమంటారా? ఒద్దులెండి- నా ఎడమచెంప క్షేమంగా వుండాలనుకుంటున్నాను"
    
    అటూ ఇటూ చూసి పక్కగదికి వెళ్ళాడు.
    
    "ఇది బెడ్ రూమ్ అనుకుంటా, ఎప్పుడూ చదవని ప్రబంధాన్ని అల్మారాలో పెట్టేసినట్లు కిటికీలు ఎందుకు మూసేశారు. మన్మధుడికి వాహనము వుందో లేదో తెలియదుగానీ వుంటే మాత్రమే అది వాయువే అయి వుండాలి. అందుకే మన్మధుడు ఆవహించాలంటే కిటికీలు తెరిచి పెట్టాలి. ఆహాఁ మీ బెడ్ ఎంత అద్భుతంగా వుంది. వసంత ఋతువుల్లో పూల తోటలా వుంది. ఇక ఇక్కడ నుండి వెళ్ళిపోదాము, కారణం చెప్పను"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS