ఆ బిగి కౌగిలిలో వూపిరాడక కొట్టుకుపోయిన నేను వీధిలో పడ్డాక గుండెల్నిండా వూపిరి పీల్చుకున్నాను. ఎదురుగ్గా వస్తున్న ఎద్దుల మెడలోని గంటల శబ్దం జలతరంగిణిలా వినిపించిందంటే నేను ఎంత అద్భుతమైన థ్రిల్లింగ్ లో వున్నానో ఊహించు.
ఇంటికి వచ్చాక కూడా ఆ ముద్దు స్పర్శ నన్ను వదలలేదు. ఆ సమయంలో నేను గనుక దుకాణంలో వుండుంటే బహుశా పదిరూపాయలకి సామానంతా ఇచ్చేసుండేదాన్ని. వెన్నెల రాత్రి వెనక మన నీడ వచ్చినట్లే ఏం చేస్తున్నా ఆ ముద్దు తాలూకు పులకరింత నన్ను ఓ రకమయిన గగుర్పాటుకు గురిచేసేది. ఆ రాత్రి నేనేం తిన్నానో అన్నది ఎప్పటికీ గుర్తులేని విషయం.
సుగుణా వాళ్ళింట్లో కలుసుకోవడం కూడా ఎక్కువ కాలం సాగలేదు. మూడోసారి నేను బయల్దేరబోతుంటే అమ్మ అడ్డుకుంది.
"దానింటి దగ్గర నీకేం పని? అదంత మంచిదికాదు. ఇంకెప్పుడయినా పోయావంటే వూరుకోను"
అలా అక్కడికెళ్ళడం బంద్ అయిపోయింది రెండు మూడు నెలలు కేవలం చూపులతోనే గడిచిపోయాయి.
పండగనెల వచ్చింది. గొబ్బెమ్మలు ప్రారంభమయ్యాయి. నేనూ ఓ గ్రూప్ లో చేరిపోయాను. సాయంకాలం ఏడుగంటలకు గొబ్బెమ్మను ఎత్తుకుని యింటింటి దగ్గర గొబ్బీలు తట్టి తొమ్మిదిగంటల ప్రాంతాన ఇంటికి చేరుకునేవాళ్ళం.
గొబ్బీలు ప్రారంభమైన రెండోరోజు బావి దగ్గర సుగుణ కనిపించింది.
"ఆ మనోహర్ కి ఏం మంత్రం వేశావో ఏమోగానీ నీకోసం కలవరించి చచ్చిపోతున్నాడనుకో" అంది.
ఠక్కున నాకో ఐడియా తట్టింది.
"రాత్రికి ఎనిమిది గంటలకు మన వూరి బయటున్న శివాలయానికి రమ్మను నే వస్తాను" అని చెప్పి, బిందె ఎత్తుకుని వచ్చేశాను.
ఆ రాత్రి గొబ్బిళ్ళు ప్రారంభమయ్యాయి. మూడిళ్ళ వరకు నేనూ గొబ్బీలు తడుతూ పాటలు పాడుతున్నాను. మూడో యిల్లు దాటగానే తలనొప్పిగా వుందనీ, ఇంటికెళతాననీ మిత్రురాళ్ళతో చెప్పి, బయటపడ్డాను. వీళ్ళేమో ఇంటికెళ్ళామనుకుంటారు. అమ్మావాళ్ళేమో గొబ్బీ తడుతున్నాననుకుంటారు. కాబట్టి ఈ మధ్యకాలంలో నేనెక్కడికి వెళ్ళానో ఎవరికీ తెలీదు. అది నా ప్లాన్!
మిత్రురాళ్ళను వదిలి, సందులోంచి మలుపు తిరిగి చీకట్లో కలిసిపోయి శివాలయం దగ్గర చేరాను అది శిథిలాలయం. ఎవరూ వుండరక్కడ వూరికి కూడా చాలా దగ్గరే. అది మేం కలుసుకోవడానికి మంచి ప్లేసనుకున్నాను.
నేను వెళ్ళేసరికి మనోహర్ రెడీగా వున్నాడు. నన్ను చూడగానే ఒక్కసారిగా బరస్ట్ అయిపోయాడు కాబోలు నన్ను పట్టుకుని ముద్దుల్తో ముంచెత్తాడు.
అలానే వరండాలో కూర్చున్నాం. అతని చేతులు ఎక్కడెక్కడో కదులుతున్నాయి. అన్నీ టైట్ గా వున్నాయి. జాకెట్ దగ్గర్నుంచి పావడా ముడివరకు ఏదీ వూడి రావడం లేదు.
అతని ప్రయత్నమంతా ఎందుకో తెలుస్తోంది. తన విరహాన్నీ వియోగాన్నీ అంతటినీ నన్ను పొందడంలో తీర్చుకోవాలనుకున్నాడు కాబోలు నాకు వూపి రాడకుండా చేస్తున్నాడు.
ఏదో మత్తు నన్ను లొంగదీసుకుంటోంది. మరేదో కావాలన్న ఆరాటాన్ని తెలియజెప్పడాని కన్నట్లు రక్తం పరుగులు పెడుతోంది. కానీ చిన్నప్పట్నుంచీ విన్న నీతిసూత్రాలు, సంఘం చేతిలో బెత్తం పట్టుకుని చెప్పిన జాగ్రత్తలు, అమ్మా నాన్నలు ఘోషించిన నైతిక విలువలు నన్ను తట్టి మరీ లేపాయి.
నేను సుతారంగా అతన్ని విడిపించుకున్నాను.
మధురమైన ఆ అనుభవం పొందకుండా నేను చాలా పవిత్రంగా బయటపడ్డానని అప్పుడు గర్వంగా ఫీలయినా, నా పెళ్ళయ్యాక మాత్రం అదెంత పొరబాటో నాకు తెలిసింది.
పెళ్ళివరకు రావాలంటే ప్రేయసీ ప్రియుల మధ్య ఈ అనుభవం తప్పక వుండాలంటాను. సంఘాన్ని ఎదిరించి పెళ్ళి చేసుకోవాలంటే ఇద్దరి మధ్యా బలమైన ఆకర్షణ వుండాలి. సెక్స్ కంటే గొప్ప ఆకర్షణ మరొకటి లేదనుకుంటాను. అందులోనూ స్త్రీ - ఈ అనుభవం లేకపోతే ఎంత గొప్పగా ప్రేమించనీ, చివరికి అతన్ని చాలా సులభంగా వదిలిపెట్టగలదు.
ఆ అనుభవం లేకుంటే తామిద్దరూ ఎన్నిసార్లు సినిమాలకు వెళ్లుండనీ, ఎన్నోసార్లు కలిసి హోటళ్ళకు తిరగనీ దేన్నీ లెక్కపెట్టదు. ఆ అయిదు నిముషాల అనుభవం ఏర్పడితే మాత్రం ఆ మగవాడ్ని స్త్రీ అంత నిర్లక్ష్యంగా వదిలిపెట్టదు.
ఇదంతా నా పైత్యం అనుకోవద్దు. పెళ్లయినా చాలామంది ప్రేయసీ ప్రియులకు పెళ్ళయ్యాక జరగాల్సిన శోభనం పెళ్ళికిముందే జరిగిపోయి వుంటుంది. అది కాకుంటే ఏ జంటా పెళ్ళి వరకు రాదు.
చాలా ఇబ్బందిగా నన్ను వదిలి పెట్టాడు మనోహర్. ఆ సమయంలో స్త్రీని వూరకనే వదిలిపెట్టడం వీలయ్యేది కాదు. కానీ మనోహర్ మెత్తటి స్వభావం కలవాడు.
నేను విముఖత చూపించగానే వెనక్కి తగ్గాడు.
ఆ తర్వాత గొబ్బెమ్మలు వున్న రోజులంతా మేమిద్దరం శివాలయం దగ్గర కలుసుకునేవాళ్ళం. రెండు ముద్దులు మూడు కౌగిలింతలు, నాలుగు గాఢమైన నిట్టూర్పులు తప్ప మరోదానికి నేను ససేమిరా ఒప్పుకోలేదు.
పండగనెల అయిపోగానే నాకు ఓ పెళ్ళి సంబంధం వచ్చింది. నాకు తప్ప అందరికీ ఆ సంబంధం వచ్చింది. నాకు తప్ప అందరికీ ఆ సంబంధం నచ్చింది. మా నాన్న కయితే మరీ నచ్చింది. వరకట్నం అడక్కుండానే పైపెచ్చు కన్యాశుల్కం ఇస్తానంటే పేకాటలో అప్పటికే బాగా లాస్ అయిపోయిన తండ్రికి నచ్చకుండా ఎలా వుండగలదు?
పెళ్ళి ఖర్చులంతా తానే భరించి, ఓ ఇరవై వేల రూపాయలు ఎదురిస్తామన్నాడు పెళ్ళికొడుకు. పెళ్ళి చూపులకు అతనొక్కడే వచ్చాడు. ఆ రాత్రి ఇదంతా చెప్పి పెళ్ళికొడుకు వెళ్ళిపోయాడు.
నన్ను పిలిచి నా ఇష్టం ఏమిటో అడిగింది అమ్మ.
"నాకు వద్దంటే వద్దు! పెళ్ళాం చచ్చి ఓ బిడ్డ తండ్రి అయి నలభై అయిదేళ్ళ వయసులో తగుదునమ్మా అంటూ పెళ్ళికి తయారయిన ఆ దోక్కును చేసుకోనుగాక చేసుకోను. ఇంకొక్క మాట మనోహర్ ని అదే చిననాయుడి కొడుకుని పెళ్ళి చేసుకుంటాను. మన కులం కాదనీ మీరు అడ్డు చెప్పినా విననుగాక వినను"
పెంపుడు మేకకి పలుపుతాడు వేసి లాక్కొస్తున్నప్పుడు అది రాకుండా మొరాయిస్తే అదిలించడానికి వెనక్కి తిరిగి చూస్తే, పెద్ద పులిలా కనిపించినప్పుడు ఎలా అయిపోతామో అలా అయిపోయింది అమ్మ. తాడును వదిలి పరుగెత్తినట్లు నాన్న దగ్గరికి పరిగెత్తింది. ఆ రాత్రంతా వాళ్ళిద్దరూ గట్టిగా మాట్లాడుకుంటే ఒట్టు. తెల్లవారే వరకు అలా గుసగుసలాడుకుంటూనే వున్నారు.
రెండోరోజు రాత్రి నాన్న నన్ను తన గదిలోకి పిలిపించుకున్నాడు. లాలించి చెబుతున్నట్లు రెండు పెళ్ళిళ్ళలోని లాభనష్టాలను బేరీజు వేసి చెప్పాడు. దాదాపు గంటదాకా నిరాఘాటంగా అన్నీ ఏకరువు పెట్టి చివరికి ఇలా అన్నాడు.
"నువ్వు కులాన్ని మంటలో కలిపేసి, ఈ ఊర్లో, బంధువర్గంలో మమ్మల్నంతా తలదించుకుని బతకమంటావో, ఇరవైవేలు ఎదురిచ్చి ప్రాణప్రదంగా చూసుకుంటానని అంటున్న ఆ మోతుబరి రైతుని చేసుకుని మమ్మల్ని గర్వంగా తలెత్తుకుని జీవించమంటావో చెప్పు. నీ ఇష్టం ఇక"
