కలెక్షన్ డల్ గా వున్నా సినిమాలు వేస్తూనే వున్నాడు. ప్రతి వారం వంద రూపాయల నష్టం వస్తోంది. ఇలా ఆయితే బాగా లాస్ అవుతాడనిపించింది.
ఆరోజు యథాప్రకారం సినిమా కెళ్ళిన నేను 'ఇక సినిమాలు ఇలా వారం వారం వేయకు. ముందులా నెలకోసారి వేయి ఈమధ్యలో మనం ఎలానో కలుసుకోవచ్చులే' అన్నాను.
నేను అలా మాట్లాడేసరికి షాక్ తిన్నాడు. లోనుంచి తన్నుకొస్తున్న ఆనందం అతని ముఖాన్ని సాగదీసింది. అలా చెప్పాను కానీ అతన్ని ఎలా కలుసుకోవాలో తెలిసింది కాదు. మా నాన్న చాలా స్ట్రిక్టు మనిషి అందుకే నన్ను టెన్త్ క్లాస్ తో ఆపించేశాడు.
నేను కనపడక పోయేసరికి అతను గింజుకుపోయాడు. ఓరోజు సుగుణను రాయబారం పంపించాడు. ఆమె అవీ ఇవీ మాట్లాడాక "ఏమిటి సంగతి? ఆ మనోహర్ నువ్వు కనపడడం లేదని చాలా ఇదయిపోతున్నాడు" అంది.
ఆమె ఇలా రాయబారాలు మోస్తుందని తెలుసు. అందుకే ఆమె చెడ్డదని అంతకు ముందు వరకు అనుకునేదాన్ని కానీ ఇప్పుడు రాయబారం తెచ్చింది నాకు గనుక ఇతరుల కష్టాన్ని తీర్చడానికి కంకణం కట్టుకున్న మంచిదానిలా అనిపించింది. మంచికీ, చెడ్డకీ తేడా అదేననుకుంటా.
"ఏం చేయను? మా నాన్న - ఆయనికి తెలియకుండా ఎలా కలుసుకోవడం?"
"అయితే ఓ పని చెయ్. రేపు మధ్యాహ్నం మా ఇంటికిరా ఆ సమయానికి మనోహర్ ని రమ్మంటాను. ఎవరికీ డౌట్ రాదు"
"అలానే"
సుగుణ వెళ్ళిపోయింది.
నెక్స్ట్ డే మధ్యాహ్నం అమ్మావాళ్ళు అలా బడలికతో నడుం వాల్చాక నేను సుగుణ ఇంటికి బయలుదేరాను. రహస్యంగా చేసే పనుల్లో వుండే ఆనందం అనుభవించడం ప్రారంభించాక యిక ఆగవు.
కొత్త కొత్త పద్ధతుల్ని మనమే అన్వేషించుకుంటాం. లేకుంటే నేను అలా దొంగతనంగా సుగుణ దగ్గరికి వెళ్ళటం వూహించలేని విషయం.
ఆ ఇంటిని చేరుకున్నాను.
అది చిన్న గుడిసె. లోపలంతా మసక వెలుతురు మధ్యాహ్నమే ఆపాటి వెలుగుంటే ఇక సాయంకాలాలు, రాత్రులు చీకటి గుహలా వుంటుందేమో.
అదురుతున్న పాదాలతో లోపల అడుగుపెట్టాను. నన్ను చూడగానే ఏదో మాట్లాడుతున్న సుగుణ ఆగింది. మరో వ్యక్తి మనోహర్ అని గుర్తించాను.
"రారా! నీకోసం పాపం మనోహర్ చాలా ఇదైపోతున్నాడు" అంది సుగుణ.
అందుకే కాబోలు ఇలాంటి విషయాలకు మధ్యవర్తి వుండాలనేది. ఈ అవసరాన్ని గుర్తించే కాబోలు మేఘాలతోను, చిలుకలతోనూ పూర్వం రాయబారాలు పంపారు.
నేను ఇంటి మధ్యలోనున్న గుంజను పట్టుకుని నిలబడ్డాను.
మనోహర్ లేచి నిలుచున్నాడు. ఏం మాట్లాడాలో తోచనట్లు మౌనంగా వుండిపోయాను.
"మీ మధ్య నేనెందుకులెండి. అలా వెళ్ళొస్తాను" అని సుగుణ తలుపు వేసింది. గొళ్ళెం పెట్టిన చప్పుడు వినిపించింది.
అంతే బయట వాళ్ళకు ఇంట్లో ఎవరూ లేరనిపిస్తుంది. ఇలాంటి విషయాలు ఇలా జరుగుతాయని నాకప్పటి వరకూ తెలియదు.
ఏం ఆశించి సుగుణ ఇంత సహాయం చేస్తూ వుంటుంది? మా ఇద్దరి దగ్గర ఏమైనా పొందడానికి వుండచ్చు, ఏదో రహస్యంలో మనం పాలుపంచుకున్నామన్న థ్రిల్లింగ్ కావచ్చు. ఎదుటివాళ్ళు చెడిపోవాలన్న దుగ్ధ కావచ్చు లేదా ఆ మాత్రం సహాయపడడం మనవ ధర్మంగా ఫీలవ్వచ్చు. అందులో వెనుకనున్న ఉద్దేశం ఏమిటా అని ఆలోచిస్తున్న నేను మనోహర్ మరింత దగ్గరగా రావడం గుర్తించలేదు.
"కనిపించవ్....మాట్లాడవు.....నేనెంత బాధపడిపోతున్నానో తెలుసా?"
తల పైకెత్తలేకపోతున్నాను. చీకటింట్లో అలా కలుసుకోవడం కొత్త ఒళ్ళంతా అదురుతోంది.
నేను ఏమీ మాట్లాడ లేకపోయేసరికి నా చుబుకాన్ని పట్టుకుని పైకి లేపాడు.
"మా నాన్నకి తెలిసిందంటే పెద్ద గొడవయిపోతుంది. అందుకే భయం"
"మనం పెళ్ళి చేసుకుందాం" ఠక్కున అన్నాడు.
ఆ చీకటింట్లో మరింత చీకటైపోయినట్లు భయపడిపోయాను. కులం - అమ్మా నాన్నా - వూరు - వీటి నన్నిటినీ ఎదిరించి పెళ్ళి చేసుకోవడం సాధ్యమా? మా పెళ్ళి జరుగుతుందన్న ఆశ ఏ కోశానా లేదు. అసలు ఆ ఊహే భయం గొలుపుతోంది.
"ఏం మాట్లాడవు?"
"పెళ్ళా! అది జరిగే పనా?"
"ఎందుకు జరగదు! దూరంగా వెళ్ళిపోయి పెళ్ళి చేసుకుందాం"
"చూద్దాం. ముందు ఇక్కడ నుంచి వెళ్ళాలి"
పెళ్ళి ప్రస్తావన రాకుండా వుంటే మరికొంతసేపు వుండేదాన్నేమో ఇక అక్కడ వుండడం ఇంపాజిబుల్ అనిపించింది. అందుకే తొందరపడిపోతున్నాను.
నా కంగారుని పసిగట్టినట్టున్నాడు. "సరే! ఎల్లుండి మధ్యాహ్నం ఇక్కడికే రా" అన్నాడు.
నా మొర దేవుడు ఆలకించినట్లున్నాడు సుగుణ వచ్చి తలుపు తీసింది.
నేను వెళ్ళాలనుకునేసరికి ఖచ్చితంగా ఆమె వచ్చి తలుపు తీయడం దేవుడి పనేకాక మరేమిటి?
ఆ యింటి నుంచి ఎలా బయటపడ్డానో, మా ఇంటికి ఎలా చేరుకున్నానో తెలియదు. ఒళ్ళంతా చెమటతో తడిసి ముద్దయిపోయింది.
వారం తఃరువాత అనుకుంటాను మరోసారి సుగుణ వాళ్ళింట్లో కలుసుకున్నాం. ముందున్న జంకు కాస్త వదిలింది. అందుకే సుగుణ బయట గొళ్ళెం పెట్టగానే చాప మీద కూర్చున్నాను.
మనోహర్ నా చేతులు రెండూ పట్టుకుని మాట్లాడడం ప్రారంభించాడు. అప్పుడే కాదు ఎప్పుడు ఏమేమి మాట్లాడుకున్నామో నాకిప్పటికీ గుర్తే. అయితే ఆ మాటలేమిటో ఇప్పుడు చెప్పమంటే చెప్పలేను. ఏవేవో స్వీట్ నాన్సెన్స్ అంతా దొర్లేది.
"నిన్న సాయంకాలం మీ ఇంటివేపు వచ్చాను నువ్వు కనిపించలేదు. రాత్రంతా నిద్ర లేదనుకో"
అద్దంలో చూసుకుంటూ తిలకంబొట్టు పెట్టుకుంటుంటే వెనక నువ్వు చేరి చూస్తున్నట్టే వుంటుంది" ఇలాంటి మాటలు ఒకదానికొకటి సంబంధం లేని మాటలు.
అయితే వీటినన్నిటినీ ఒకదాని కొకటి కలిపేది - ప్రేమ అందుకే అంత మధురం.
ఆరోజు వచ్చేటప్పుడు మనోహర్ నన్ను గట్టిగా కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు నేనేమయిపోయానో నాకే తెలియదు. ఆ చిన్న గుడిసెకు ఠక్కున రెక్కలు మొలిచి ఇంద్రలోకాలకు ఎగురుతున్నట్లు అనిపించింది.
