Previous Page Next Page 
దీప శిఖ పేజి 21


    ఓ గంట గడిచింది.
    ఇటు శంకరానికి, నిద్దర పట్టడం లేదు , అటు గోపాలం నిద్దర పోవడం లేదు. అప్పటికి గోపాలం పద్యాలు చదవడం పూర్తీ చేసి , లేచి కూర్చుని మోకాళ్ళ మీద గెడ్డం ఆన్చి ఆలోచిస్తూ పక్క మీద కూర్చుని ఉన్నాడు. తను విజయ ను చేసుకోవడం అన్నయ్యకి ఇష్టం లేదని తేలింది. అయితే తనిప్పుడు ఏం చెయ్యాలి? విజయని వదులుకోవడం అనేది కల్ల. ఇంక పొతే ఈ విషయం మీద అన్నయ్యతో విరోధం అయినా తెచ్చుకోవాలి. లేదా తను గుట్టు చప్పుడు లేకుండా విజయ ని వివాహం చేసుకొని ఊరుకోవాలి, తర్వాత ఏది ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది.
    రాత్రి పన్నెండు కావస్తూన్న తమ్ముడు పడుకోకుండా ఆలోచిస్తూ కూర్చుని ఉండడం చూసేసరికి శంకరానికి జాలేసింది. వాడి మనస్సు పాపం ఏం క్షోభ పడుతోందో ఏమో? చిన్నప్పటి నుంచీ తల్లీ తండ్రి అనే అయి పెంచాడు వాడిని. వాడి బాధ ఏవిటో తనే చూడకపోతే ఎవరు చూస్తారు?.....అలాగని విజయని, అంత పెద్ద పిల్లని , వాడు పెళ్లి చేసుకోడానికి ఒప్పుకోవడమా.........రేప్పొద్దున పల్లకీ లో కూర్చుండగా పదిమందీ  , "ఈ అమ్మాయి ఏమిటి పెళ్లి కూతురు ఏమిటి?" అని ముక్కు మీద వేలేసుకోరూ?...అయితే. ఆ కొరడా బిల్లో, చట్టు బండల బిల్లో ఏదో వచ్చి తగలద్దాక ఇప్పుడు వాడికి చిన్న పిల్లని ఇచ్చి చేసే ప్రసక్తే లేదు కదా?....ఈడేరిన పిల్లనేచెయ్యాలి. ఇంకా ఆ కాడికి పదిహేడేళ్ళెవీటి పాతికేళ్ళ విటి? అంతా ఒకటే- ఏవిటో తన మనస్సు అంగీకరించడం లేదు అంత పెద్ద పిల్లని పెళ్లి కూతురుగా ఊహించడానికి-- కాని మార్గాంతరం లేదు.
    "విజయ ని గోపాలం వివాహం చేసుకోవడం అనేది నెమ్మదిగా అలోచించి నిర్ణయించవలసిన సంగతి." ఈ మాటే శంకరం, లేచి గోపాలంతో అన్నాడు.
    గోపాలం హృదయం  ఆనందంతో నిండిపోయింది.
    అన్నయ్య ఎంత మంచివాడు ?
    ఇట్టే కోపం తెచ్చుకున్నా మళ్ళీ ఇట్టే సర్దుకుని మంచీ చెడ్డా ఆలోచిస్తాడు. ఆ కొంచెం కోపమే కనక లేకపోతె అన్నయ్య అంతటి ఉదాత్తమైన వ్యక్తీ మరొకడున్నాడా?....నాలాగే అన్నయ్య కూడా ఇప్పటి దాకా నిద్దర పోలేదన్న మాట?.....
    "ఇందాకా నువ్వు చదివిన పద్యాలు ఎక్కడివి రా, చాలా బాగున్నాయి " అన్నాడు శంకరం.
    "భక్తా చింతామణి అని-- ఈ ఊరు ఆయనే వడ్డాది సుబ్బారాయుడు గారని-- అయన రాశారు."
    "బజారులో దొరికితే నాకో పుస్తకం కొను"
    "కొనడం ఎందుకు ....నా దగ్గరున్న పుస్తకం పట్టికేళ్ళు. కావలిస్తే నేను కొనుక్కుంటాను లే తర్వాత."
     "నీ దగ్గరది ఎందుకూ?...."
    "ఎందుకేవిటి పట్టి కెళ్ళు. నా దగ్గరున్న పుస్తకం పట్టి కెళ్ళడానికి ఆలోచన ఏమిటి అన్నయ్యా నీకు?"
    "ఆలోచన కాదురా!....ఊ.....సర్లే...అలాగే చెయ్యి....వెళ్ళేటప్పుడు జ్ఞాపకం ఉంచుకుని నా సంచిలో పెట్టు. మరిచిపోయేవు సుమా?"
    "అంత ఎందుకు వచ్చింది. ఇప్పుడే నీ సంచిలో పెడతా సరా?" అంటూ గోపాలం లేచి భక్త చింతామణి పుస్తకం అన్నయ్య సంచి లో పెట్టి వచ్చి కూర్చున్నాడు. అన్నయ్య తనని అడిగిందే చాలు అనే సంతోషంతో " ఈ పెళ్ళిళ్ళూ కబుర్లూ వీటిలో పడి , అసలు నేను ముఖ్యంగా ఇప్పుడు ఈ ఊరు ఎందుకు వచ్చానో చెప్పలేదు. ఎందుకు వచ్చానంటే ..." అని మొదలెట్టి మునసబు కి, శేషయ్య కి వచ్చిన తగువులాట , అమ్మవారు మొదట ఆగడం దగ్గర వచ్చిన పట్టుదల లూ దెబ్బలు తగిలి ఓ వారం రోజులు తీసుకుని వెంకడు ఎలా చనిపోయిందీ ఇవన్నీ వివరంగా చెప్పి.......ఇంతకీ చెప్పొచ్చేదేవిటంటే నువ్వు శేషయ్య వైపు వకాల్తానామా పడేసి, వాదించి , ఎలాగైనా మన శేషయ్య పక్షం నేగ్గేలాగ చూడాలి. లేకపోతె ఊళ్ళో తలెత్తుకోలేనని శేషయ్య పాపం ఏక ఇదవుతున్నాడు" అంటూ ముగించాడు శంకరం.

                    
    శంకరం ఇంకా మాట ముగించ కుండానే "అదెలా కుదురుతుందీ?" అన్నాడు గోపాలం. గోపాలం అన్న ఆ మాటలో అహంకారంతో కూడిన నిర్లక్ష్యం ధ్వనించింది శంకరానికి-- అందుకే కోపంగా "ఏం.....? ఎందుకు కుదరదు ?....ఎందుకు కుదురదంట?" అంటూ గద్దించి అడిగాడు శంకరం.
    "అది కాదు అన్నయ్యా - నేను ఇంత క్రితమే మునసబు తరపున వాదించడానికి వకాల్తా నామా కోర్టులో పడేశాను" అన్నాడు గోపాలం.
    "ఆ" అని శంకరం ఒక్క క్షణం నివ్వెరపోయి తిరిగి వెంటనే సర్దుకుంటూ "పడేస్తే పదేశావు లే!....ఆ వకాల్తానామా 'కేన్సిల్ చేసి కొత్తగా శేషయ్య వైపున పడెయ్యి -- మనకి మునసబు కంటే శేషయ్య ఆప్తుడు " అన్నాడు శంకరం.
    గోపాలం అన్నయ్య కేసి విసుపోయి చూసి "అదేవిటి అన్నయ్యా ఎంత ఆప్తుడై తే మాత్రం. అతని కోసం మన వృత్తి ధర్మం నాశనం చేసుకుంటామా ?.....అలా ఒక్కనాటికి చెయ్యను. శత్రుడయేది మిత్రుడయేది - కేసు తీసుకున్నానంటే కడకంటా కష్టపడి చెయ్యవలసిందే -- మధ్యలో మనేది లేదు" అన్నాడు దృడమైన కంఠం తో--
    తమ్ముడి పెంకి సమాధానం వినేసరికి శంకరానికి ఒళ్ళు మండు కొచ్చింది.
    "వృత్తి ధర్మమా?...అసలు నీ వృత్తి ఏవిటిరా నాకు తెలియకడుగుతాను, అబద్దాన్నీ నిజంగానూ, నిజాన్ని అబద్దం గానూ ప్రదర్శించటమేగా నీ వృత్తి?.....అటువంటి వృత్తికి ఓ ధర్మం కూడానా?"
    "అన్నయ్యా!" అని గట్టిగా అరిచి ఆ పైన కోపంతో పెదిమను వణుకుతూ ఉండగా ఏం అనలేక శంకరం కేసి ఎర్రగా చూస్తూ, ఆగిపోయాడు గోపాలం.
    "తెలివితక్కువ ఆలోచనలు పెట్టుకోక నేను చెప్పినట్టు చెయ్యి-- రేపే వెళ్లి శేషయ్య తరపున వకాల్తా నామా పడెయ్యి ....ఏం వినిపిస్తోందా?...."
    గోపాలం సమాధానం ఏం చెప్పలేదు.
    "నీ అంతటి గొప్ప వకీలు శేషయ్య కి దొరక్క కాదు....ఏదో తెలిసిన వాడివి కావలసిన వాడివి బాధ్యతగా చూస్తావు అని కాని, లేకపోతె ఈ రాజమండ్రి పట్నం లో వకీళ్ళ లోటై కాదు."
    "అటువంటప్పుడు ఇంకొకర్ని పెట్టుకోవచ్చు కదా నన్నే ఒత్తిడి చెయ్యడం ఎందుకు?"
    "ఎందుకా, బుద్ది లేక ?...."
    "అలా కనిపిస్తోంది" అనుకున్నాడు మనస్సులో-----
    "ఆరోజున నీ చదువు కోసం, నిన్ను ఎఫ్.ఏ. లో చేర్పించడం కోసం శేషయ్య అంత ప్రయాసపడి నీతో వచ్చి తన స్నేహితుల్ని పట్టుకొని నీకు కాలేజీ సీటు ఇప్పించి నీ భవిష్యత్తు కి పునాది వేస్తె నువ్వీ రోజున ఈ చిన్న ఉపకారం అతనికి చెయ్యడానికి ఇంత హంగామా చేస్తున్నావు. కృతజ్ఞత ఉన్న వ్యక్తీ  చెయ్యవలసిన పనేనా ఇది?"
    "నిజంగా నేను కృతజ్ఞత చూపించడం అంటూ వస్తే రామనాధం గారికి చూపించాలి -- ఇదంతా అయన పెట్టిన భిక్ష -- అయన చలవ-- ఇందులో శేషయ్య చేసిందేం లేదు-- అతను చేసిందల్లా తన కొడుకుని నువ్వు మృత్యు ముఖం నుంచి కాపాడావు కనుక -- నీ తమ్ముడిని రామనాదం గారికి పరిచయం చేయడానికి రాజమండ్రి వచ్చాడు. అంతే -- ఉపకారానికి మరో చిన్న ప్రత్యుపకారం చేశాడే కాని అతను చేసిన త్యాగం ఏం లేదు ఇందులో -- ఇంకా చెప్పాలంటే నిన్ను తన స్వార్ధానికే ఉపయోగించు కున్నాడు-- నా నిమిత్తమై నువ్వు పట్నానికి ఎక్కడ వచ్చేస్తావో , వచ్చేస్తే తనకీ తన వాళ్ళకీ ఇన్ని మండు నీళ్ళు ఇచ్చే దిక్కు ఎక్కడ ఉండదో అని నిన్ను మంచి మాటలు చెప్పి ఆ పల్లెటూళ్ళో నే ఉంచేసి శాశ్వతంగా నీ భవిష్యత్తు అంతా బూడిద పాలు చేశాడు-- ఈ నాలుగు మాటలూ గట్టిగా ఉద్రేకంతో గబగబా అనేసి భారంగా శ్వాస వదులుతూ కూర్చున్నాడు గోపాలం.
    తమ్ముడి మాటలూ, ఆ మాటల వెనక ఉన్న వక్రమైన భావాలు, ఇంత ఉపకారం చేసిన శేషయ్య పట్ల ప్రదర్శించిన కుత్సితపు బుద్దీ ఇవన్నీ చూసేసరికి శంకరానికి పట్టలేనంత అసహ్యం అంతకు మించిన ఆగ్రహం వచ్చింది గోపాలం మీద--
    'ఒరేయ్ !....ఒరేయ్ !..... పెద్దవాడివి అయ్యావు కదా అని నోటికి వచ్చినట్లల్లా వాగకురా-- నీ ప్రవర్తనా నీ వ్యవహారం చూస్తె కావలసిన వాడిని నేనే హర్షించ లేకపోతున్నాను-- ఇంక తక్కిన వాళ్ళెం హర్షిస్తారు. భగవంతుడెం హర్షిస్తాడు?....శేషయ్య మన కుటుంబానికి ఎంత కావలసిన వాడురా!..నిన్నూ నన్నూ సోదరుల కంటే ఎక్కువగా చూసుకుంటాడే -- వాళ్ళ వాసు కంటే కూడా మన మణి నే ప్రాణానికి ప్రాణం లా భావిస్తాడే ?....అలాంటి శేషయ్య నా నువ్వు తృణీకరించడం ....నువ్వు అతని తరపున కేసు కనక, వాదించేవు మానేవు. కాని ఇప్పుడు మాత్రం అతని గురించి అలా మాట్లాడితే విని నేను సహించేది లేదు-- వయస్సు వచ్చిన వాడివి కనక ఊరుకున్నాను. ఇదే నాలుగైదేళ్ళ క్రితం అయితేనా నాలుగు తన్ని నోరు మూయించేవాడిని ఇలా మాట్లాడి నందుకు" అన్నాడు శంకరం. గోపాలాన్ని కళ్ళతో తినేస్తూ------
    "నువ్వు నన్ను తన్నడమే కాదు , సంపూర్ణంగా నాతొ ఉన్న సంబంధం అంతా తెంపేసుకున్నా నేను ఆశ్చర్య పోను , ప్రస్తుతం శేషయ్య ప్రభావం నీమీద అంత ఉంది. తియ్యని కబుర్లు చెబుతూ నీ దగ్గరికి చేరి నామీద నీకు కోపం, కక్షా పెరిగేలాగా చేస్తున్నాడు. నేను అంతా కనిపెడుతూనే ఉన్నాను."
    "ఓరి అప్రాచ్యుడా! నీ హృదయంలో ఎంత విషం ఉందిరా . నేను నీ మీద కోపం కక్షా పెట్టుకుంటూన్నానా!...అందుకు శేషయ్య దోహదం చేస్తున్నాడా?....ఛీ ఛీ ఎంత హీనంగా ఆలోచిస్తున్నావురా?....శేషయ్య నీకు చేసిన ఉపకారాలేవో తెలుసా నీకసలు ?.....శేషయ్యే పూనుకోకపోతే ప్లీడర్ చదువు మద్రాసులో పూర్తీ అయేది కాదు. తెలుసా? నువ్వు మనియార్డర్ తిప్పెశావని నేను కోపగించి ఊరుకొంటే , అవతల నువ్వెక్కడ మాదిపోతావో అని నెలేనేలా నా దగ్గర డబ్బు తీసుకుని , నీకు మని ఆర్డర్ కట్టి నీ చదువు కి విఘ్నం రాకుండా కాపాడాడు. ఆ బాధ్యత అతను తీసుకోపోతే నాకు నేనై నీకు డబ్బు పంపి ఉండకపోయే వాణ్ణి. నువ్విరోజున ఇలా నల్లకోటు వేసుకుని నలుగురిలో "ఓహో" అనిపించుకుంటూ ఉండక పోయేవాడివి."
    గోపాలం శంకరం ముఖం లోకి ఆశ్చర్యంగా చూశాడు.
    అవునురా అలా తెల్లబోతావేమిటి?.....నువ్వి మద్రాసు లో ఉన్న రెండేళ్ళూ నాదగ్గర నెలనెలా డబ్బు తీసుకుని నీకు మని ఆర్డరు చేసినది శేషయ్యే!' అన్నాడు శంకరం.
    గోపాలం ఒక్క క్షణం ఆగి, వికృతంగా నవ్వి "శేషయ్య నాకు డబ్బు పంపాడా ?....అది పెట్టి నేను రెండేళ్ళూ చదువుకున్నానా?....చాలా బాగుంది కధ!" అన్నాడు వ్యంగ్యంగా.
    కధా?...అవునులే ...... అన్నయ్య లాగ కాకుండా తండ్రి లాగ చూసుకున్నాను కదూ ఇన్నాళ్ళూ ?....అందువల్ల నేనుచేసిన ప్రతి పనీ కధ లాగే కనిపిస్తుంది నీకు........."
    గోపాలం ముఖం సీరియస్ గా పెడుతూ "ఇందులో నిన్ను అన్నదెం లేదు. నువ్వు కష్ట పెట్టుకోడానికి. నువ్వు నన్ను ఎలా చూశావో నాకు తెలుసు. ఆ ఋణం నేను ఈ జన్మలో తీర్చుకోలేనని కూడా తెలుసు. నువ్వు నాకు బి.ఎ. దాకా చదువు చెప్పించావు, నీ సొమ్ము తోనే చదువుకున్నాను, అప్పటి  దాకా. కాని నా "లా" చదువుకి మాత్రం నీది ఒక్క దమ్మిడీ తీసుకో దలుచుకోలేదు. తీసుకోలేదు. ఇతరత్రా ఇంకొకరి సాయం వల్ల జరిగింది నా లా చదువు అంతా" అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS