Previous Page Next Page 
ధర్మ చక్రం పేజి 21


                                                              25

              
    ఆ సాయంత్రం తనతో మాట్లాడడానికి వచ్చిన సత్యను అంత దూరం నుండి చూచే చూడనట్లు గబగబా తలవాల్చి నడక సాగించాడు ధర్మారావు. పిలిచినా వినిపించుకోలేదు. నడిచి పోతూన్న అతడికి ఒక కాన్ స్టేబుల్ పరుగు పరుగున వచ్చి చెప్పాడు -- "సత్యాదేవి గారు వస్తున్నారు. మిమ్మల్ని ఆగమన్తున్నారు.' అని.
    "ఓ! సారీ! నేను ఒక అర్జంటు పని మీద వెళ్తున్నాని చెప్పు" అంటూనే వెళ్ళిపోయాడు ధర్మారావు.
    ఆ ఇరువురి స్నేహం విషయం తెలిసిన ఆ వార్తాహరుడే నివ్వెర పోయాడు. సత్య నిర్ఘాంత పోయింది మొదట. కాని అంతలోనే తేరుకుని నవ్వుకొంది. అతడు హాస్యం చేస్తున్నాడనుకొని. కాని అతడి నివాసానికి అతడి ననుసరించే వెళ్ళిన ఆమెకు, ధర్మారావు తనను చూచి కూడా చూడనట్లే ఇంట్లోకి పోయి తలుపులు బిగించుకునేసరికి, నిజంగా తల తిరిగి పోయింది . కలో, నిజమో తెలియలేదు.
    ఆ ఇద్దరి మూగ బాధ అనుభవజ్ఞులకే తెలియాలి. ఇంటికి పోయిన సత్య ఆలోచనలు పరిపరి విధాల పోయాయి. ఎంత ఆలోచించినా కారణం ఊహించలేక పోయింది. కడకు అదేమిటో అడిగే తెలుసుకోవాలనే స్థిర నిర్ణయంతో అతడికి ఫోన్ చేసింది.
    "యస్. ధర్మారావు స్పీకింగ్." అవతలి నుండి వినిపించింది.
    "ధర్మారావు గారూ, నేను -- మీ సత్యను మాట్లాడుతున్నది...."
    అమె చెప్పే విషయం పూర్తీ కాకుండానే అవతల ఫోన్ పెట్టేసిన శబ్దం వినిపించింది. మరెంత పిలిచినా పలకలేదు.
    "ఏమిటీ పరీక్ష? పెదవి కదిపి మాట్లాడ కూడనంతగా , కన్నెత్తి ముఖం చూడ కూడనంతగా అసహ్యం పెరిగిందా , నా పైన?' సత్య అలా ఫోన్  పట్టుకుని ఆలోచిస్తుండగానే సుమిత్ర అటు వచ్చింది.
    "ఎవరికమ్మా , పిలుపు? ధర్మారావు కెనా?' కలుపుగోలుగా అడిగింది.
    "అవును పిన్నీ. "పరధ్యానంగా అనేసింది సత్య.
    "అయితే ఇంకా మానలేదన్న మాట , వాడితో స్నేహాలు?"
    కరకరలాడుతున్న ఆ కంఠనికి ఉలిక్కిపడింది సత్య. ఆమె సమాధానం చెప్పే లోగా తిరిగి సుమిత్రా దేవే అన్నది: "నేనన్నీ కనుక్కున్నాను. వాడొక అనాధ శరణాలయం లో పెరిగిన అప్రాచ్యుడట. ఛీ ఛీ. వాడితోనా స్నేహం నీకు?"
    "పిన్నీ!"
    "ఏమమ్మా? ఉన్నమాంటంటే ఉలుకోచ్చిందా?' హేళన.
    "అనాధ శరణాలయం లో పెరిగినంత మాత్రాన, ఏమిటి పిన్నీ, తప్పు? ఆ దోషం ఆయనదా?"
    "ఆహా! అయితే అంతవరకూ వచ్చిందనమాట, వ్యవహారం? నీ ప్లీడరీ తెలివీ, వాదనలూ నా దగ్గర కాదమ్మా. మీ నాన్న గారి దగ్గర చూపెడుదువు గాని. ఇవాళే వ్రాస్తాను మీ నాన్నకు. కూతురిని లాయరు చేసినందుకు సంతోషిస్తారు వచ్చి."
     అదిరిపడింది సత్య. "పిన్నీ! నీకు పుణ్య ముంటుంది. ఆ పని మాత్రం చేయకు. నిన్ను బతిమాలు కుంటాను." అండి చేయి పట్టుకుని.
    "ఏం? ఎంచేత? తెలియకుండా ఉంటుందా, తర్వాతైనా?"  
    "నాన్నకు అసలే ముక్కు మీద కోపం. తర్వాతఎప్పుడైనా నేను మెల్లగా చెప్పు కొంటానులే పిన్నీ."    
    "ఏమోనమ్మా! ఏమైనా తేడా వస్తే, మరి, పిల్ల నిందుకేనా మీ దగ్గరుంచిందని మీ నాన్న మా ముఖాన ఉమ్మేయడూ?"
    "తేడా లేమీ రావులే, పిన్నీ. ధైర్యంగా ఉండు."
    "అయితే ఇక వాడి ముఖం చూడకుండా వాడితో మాట్లాడకుండా ఉంటావా? ఇకనైనా బుద్దిగా ఉంటావా, మరి?"
    దిగ్భ్రాంతి తో చూచింది సత్య.
    ఉరిమింది సుమిత్ర . "ఏం? మాట్లాడవేం? ఏదీ, మాట ఇవ్వు" అంటూ చెయ్యి చాపింది.
    "అలాగే, పిన్నీ! అలాగే మరి. అతడితో .......మాట్లాడను." బలవంతంగా అని, పగిలిపోతున్న హృదయాన్ని పట్టుకుని తన గదిలో పక్క మీద పడి కుళ్ళి కుళ్ళి ఏడ్చింది.

                                   26
    రాష్ట్రం లోని జైళ్ళ అధికారు లందరూ న్యాయశాఖ మంత్రి గారి ఆధ్వర్యాన సమావేశ మయ్యారు. ఎంతో కృషి చేసి, ఆ సమావేశాన్ని సానుకూల పరిచిన ధర్మారావు ను అందరూ ప్రశంసించారు.'
    "నేను తలపెట్టిన ఈ జైళ్ళ ఒరియంటేషన్ ప్లాను ను అర్ధం చేసుకొని , నాతొ సహకరించి నేరస్తులను ఉద్దరింప బూనుకొని వచ్చిన 'లా-- జైళ్ళ-- మంత్రి గారికి, 'సోషల్ వెల్ ఫేర్' మంత్రి గారికీ, పలు ప్రదేశాల నుండి వచ్చిన అధికారుల కూ , తదితర ఆహూతుల కూ నా కృతజ్ఞతా పూర్వక వందనాలు" అంటూ తన మాటలు ప్రారంభించాడు ధర్మారావు. "తప్పులు చేసిన మానవుని శిక్షించడమే ఇంతకాలంగా జరుగుతున్నది . అయితే, నేరస్తుడు ఈ పద్దతి వల్ల మానసికంగా మరింత పతనం చెందుతున్నాడని అనడానికి నేను సాహసిస్తున్నాను. శిక్షణ వల్ల భయపడి బాగుపడడం కంటే, కర్కశ హ్రుదయులుగా, నేరాలు, పాపాల పట్ల నిర్బీతులుగా తయారవుతున్నారనేది సత్య దూరం కాదు. అయితే, తాను అనుభవిస్తున్న ఈ శిక్షా స్మృతి నేరస్తుని నిస్సహాయతతో , ప్రతీకార వాంఛతో ఉడికిపోయి రగులుకు పోయేటట్లు కాక, తాను చేసిన పనికి పశ్చాత్తాపంతో కుమిలి పోయి సిగ్గు పడేటట్లు , ఏ అధికారులు అజ్ఞా పాలనలూ లేకనే తనను తానె శిక్షించుకొని సరిదిద్దు కొనేటట్లు ఉండాలి."
    శ్రోతల చప్పట్ల తో పరిసరాలు ప్రతిధ్వనించాయి. ధర్మారావు తిరిగి ప్రారంభించాడు. "మానవ హృదయంలో పశ్చాత్తాపం కలగాలంటే ఆత్మ విమర్శ కలగాలి. నిత్యం తమ నిరర్ధక నిస్సహాయ స్థితిని తలుచుకొని ఉడికిపోతూ గడపడం కంటే, కొద్ది సేపు ఆ దృష్టి ని మళ్ళించే అవకాశం కలగాలి. వారి జీవితాలనూ, వారు ఉన్న స్థితినీ వారికి వారే సున్నితంగా, సునిశితంగా గ్రహించ గల సందర్భాలు కలగాలి. ఇందుకు సాధనాలు రెండే రెండు. తమ జీవితాలకు అన్వయించుతూ, తమ ప్రతి బింబాలను చూసి, ఉత్తమ నీతిని బోధించే సద్గ్రంధ పఠనం  ఒకటి. రెండు -- సుబోధకాలైన చక్కటి చలన చిత్రాలు. ఈ రెండే వారిలో ఆలోచనలు కలిగించి, ఆత్మ విమర్శకు దారి తీయించి, వారి జీవిత మార్గాలను దిద్ది తీర్చగల అవకాశాలున్నాయి. ఈ అన్నిటి కంటే ముందు, వారికి ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఈ వార్డెన్ , కంట్రాక్టర్ ఆహారం అందనిస్తున్నారో లేదో, పర్యవేక్షించడం అవసరం. వారిని మనుష్యులుగా చూడడం అవసరం. వేదనాత్మక హృదయం నుండి వేదాంత వైరాగ్యాలు జనించినట్లే కడుపు మంట నుండి కక్షా క్రౌర్యాలు ప్రకోపిస్తాయి. అందువల్ల ఆ కక్ష, కసాయి తనాల మీద మన ఒర్పునే పన్నీరుగా చేసి చిలకరించి చల్లార్చాలి. ఇందుకు కొన్ని ఆటంకాలు ఎదురైనా మనమందరం ఒకటై, భావ గ్రాహ్యత కలిగి, తట్టుకొని ఉత్తమ ఫలితాన్ని సాధించాలి.'
    "యస్, యస్. కరెక్ట్" అనే పదాలు వినవచ్చాయి సభాసదుల నుండి.
    "థాంక్స్. " కృతజ్ఞతలు తెలియజేస్తూ తిరిగి చెప్పసాగాడు ధర్మారావు. "అందువల్ల మనం ఒక ట్రెయినింగ్ సెంటర్ ఏర్పరచి, వార్డెన్, డిఫ్యూటీ వార్డెన్ ఖైదీల పట్ల యెట్లా ప్రవర్తించాలో నేర్పాలి. పసివాళ్ళ అల్లరి చేసినా లాలించి, మంచి మాటలు చెప్పి దారిలోకి తెచ్చే విధంగా, వారి పట్ల వీరు ప్రవర్తించే టట్లుగా బోధించాలి. ఆ ట్రెయినింగ్ కేంద్రాలలో. ఖైదీల చేత వారు వారు చేయగలిగిన పనిని చేయించు తున్నట్లే , వారి వారి అభిరుచులను పెంపొందించు కొనే ఏర్పాట్లు-- అనగా, చదువుకొనే వారికి గ్రంధాలయం ; చిత్రకళ సాహిత్య శిల్ప రచనలు వంటి కళలు తెలిసిన వారికి ఆ కళలను అభివృద్ధి చేసుకొనే ఏర్పాట్లు -- ఇట్లా వ్యక్తికీ ఆత్మవికసానికి , ఆత్మ విమర్శ కూ, దోహదం చేసేవి ఉండాలని నా అభిప్రాయం ."
    సభలో కొద్దిగా అస్పష్టంగా కలవరం రేగి, అణిగిపోయింది.
    "అంతే కాదు." సభాసదులందరి వదనాలనూ పరీక్షగా చూస్తూ చెప్పసాగాడు ధర్మారావు. "వారాని కొకరోజు వారికి పూర్తిగా ఈ చదువూ, ప్రసంగాలూ ఇత్యాది విషయాలతోనే కాలం గడిపేటట్లు అనుమతి ఇవ్వాలి. వారు తమ వారికి వ్రాసుకొనే ఉత్తరాలూ, వారిని చూడ వచ్చిన వ్యక్తులూ మొదలైన విషయాలలో వార్డెన్ అభ్యంతరాలు, ఆటంకాల వలన బాధపడకుండా చూడడం అత్యవసరం. మనకు ఇంచుమించు రెండు మూడు నెలల కోక పండుగ వస్తూనే ఉంటుంది గనుక, ఆయా రోజులలో వారు తమలో తామే నృత్య సంగీత నాటకాది వినోదాలతో కాలం గడిపే టట్లు ఏర్పాట్లు చేయాలి.
    'గౌరవనీయులూ, దయా హృదయులూ అయిన శ్రీ మంత్రి వర్యులు ఈ ఏర్పాట్ల న్నింటిని దీనులైన ఈ బందీల కు అనుమతించడ మే గాక, వారిని సంస్కరించ గల చలన చిత్రాలేమైనా వారికి ఈ జైలు ఆవరణ లోనే చూసే ఏర్పాట్లు చేయాలని నేను ఖైదీల తరపున అర్ధిస్తున్నాను. నేను వెలిబుచ్చిన ఈ అభిప్రాయాల పై గౌరవనీయులైన మంత్రి గారు, తదితరోద్యోగులందరూ కూడా సహృదయం తో తమ తమ అమూల్యాభిప్రాయాలను చెప్పి, చర్చలు సాగించి, ఈ మహా ప్రయత్నాన్ని సఫలీకృతం చేసే నిర్ణయాలు చేయమని, అర్ధిస్తున్నాను."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS