చిన్నతనంలో తమ్ముడికి దెబ్బ తగిలితే గిజగిజలాడే అన్న, అన్నకు జ్వరంవస్తే దిగులుపడే తమ్ముడు క్రమంగా పెరిగి పెద్ధవాళ్లై ఎవరి సంసార తాపత్రయంలో వారుంటారు. చిన్నప్పటి మమత మాసిపోతుంది. వేలకొలదీ ఎకరాల దగ్గర్నుంచీ చెంబూ, గిన్నే పంచుకోవటం దగ్గర కూడ పంపకాలు తెగక కత్తులు దూసుకుంటారు. ఇదీ లోక వ్యవహారం. మరి ఇంత చెప్పాకకూడ నీ మనస్సు ఒంటరిగా ఉండిపోవాలనే కోరుకుంటూందా, శాంతీ?"
"........"
"తొందరపడకు, శాంతీ. బాగా ఆలోచించే నిర్ణయించుకో. ఈ గోవిందరావు కాకపోతే మరో ముకుందమూర్తి. కాని ప్రతి జీవికీ పూర్తిగా ప్రేమించి, తపించి, తపింపబడేవాళ్ళు ఉండాలి. అప్పుడే ఆ జన్మకు సార్ధకత. జీవితాంతం ఒంటరిగా ఉండిపోయే దురదృష్ట వంతులూ ఉంటారనుకో. అవి వారి వారి వ్యక్తిగత సమస్యలపై ఆధారపడి ఉంటాయి. నువ్వు మాత్రం అలాగ ఉండడం నా కిష్టంలేదు. ఆపైన నీ యిష్టం. వస్తాను మరి."
22
"శ్రీ శ్రీహరిగారికి పద్మ వ్రాసేది-నమస్కారాలు. అంతా క్షేమం. మీ క్షేమం తెలుస్తూన్నందుకు ఆనందంగా ఉంది.
మామగారి మనసెరిగి చాలా ఆదరంగా కలుపుగోలుగానే ఉంటున్నాను నేను. కాని ఎంతైనా నేను పరాయిదాన్ని: కోడలిని. ఆయన ప్రాణంలో ప్రాణమైన శాంతిని నేను మరపింపలేనని తెలుసుకున్నాను. ఎప్పుడూ మౌనంగా, గంభీరంగా ఉంటారు. ఎక్కువకాలం ఆ తోటలోనే, శాంతి వృక్షాలదగ్గరే గడుపుతుంటారు. చిక్కిపోయారుకూడ. అత్తగారుకూడ ఎప్పుడూ ఏదో దిగులుగానే ఉంటున్నారు. ఇక ఎంతకాలం గడిచినా ఈ పరిస్థితిలో తగ్గే కాని మెరుగు కన్పించుతుందనే ఆశ లేదు నాకు! ఇటువంటి పరిస్థితిలో అక్కడ మిమ్మల్ని ఒంటరిగా విడిచి ఇక్కడ నేను ఉడడంలో ప్రయోజనమూ లేదు. నేనిక్కడికొచ్చి రెండు నెలలైంది. ఎంత కర్తవ్యనిర్వహణ అయినా మీకు కూడా దూరమై ఈ నిస్తబ్ద వాతావరణంలో ఉండడం ఎంత కష్టమో ఆలోచించండి. ఒకసారి వచ్చి చూచి వెళ్ళగలరని ఆశిస్తున్నాను. ఏమాత్రం అవకాశమున్నా మీరు రాజమండ్రిలో ఏదైనా ఉద్యోగానికి ప్రయత్నం చెయ్యండి. అలాగైతే మాకు దగ్గరలో ఉంటారు. మిమ్మల్ని తరుచుచూస్తూండడంవల్ల మామగారి దిగులు తగ్గగలడని ఆశగా ఉంది. నా కోర్కెను మన్నించండి.
శాంతి అతిగారాబంవల్లనే అలా తయారై ఇందరి మనోవేదనకు కారకురాలైందని వ్రాయడానికి సాహసిస్తున్నాను. ఆమెకు మరోసారి మీరు నచ్చజెప్ప ప్రయత్నించండి. వారానికీ, పది రోజులకూ ఒక్కో ఉత్తరం వ్రాస్తూంది. దానికే మామగారు పరమానందభరితులైపోయి అడిగినదే తడవుగా వందలు వందలు పంపేస్తున్నారు. మరది దగ్గర్నుంచి ఉత్తరాలు వస్తున్నాయి.
తమ్ముడు చిరంజీవి రాజశేఖరానికి ఆశీస్సు లని చెప్పండి.
మీ
పద్మ."
చదివి మడిచిపెడుతూన్న ఉత్తరంపై అప్రయత్నంగా శ్రీహరి నేత్రాలనుండి రెండు నీటి బిందువులు రాలిపడ్డాయి.
"ఏమిటది?" అక్కడే కూర్చుని చదువుకుంటూన్న రాజా ఆత్రుతగా లేచి అడిగాడు.
"ఏంలేదు." కళ్ళు తుడుచుకుని ప్రయత్న పూర్వకంగా నవ్వాడు శ్రీహరి. "ఇంటిదగ్గర్నుంచి. అంతా బాగానే ఉన్నారు."
"మరి నీ బాధ దేనికి?" రాజా నేత్రాలలో సంశయం మాయలేదు.
"ఇదుగో. చదువు అనుమానమైతే." ఉత్తరం అందించాడు శ్రీహరి నవ్వుతూ.
అందుకుని మడతవిప్పి మొదటి వాక్యం చదవగానే కంగారుపడి తిరిగి మడిచి ఇచ్చేయబోయాడు రాజా-"ఇది అక్క వ్రాసినట్టు న్నారు" అని.
శ్రీహరి అందుకోలేదు. "అయితేనేం? నీ దగ్గర అటువంటి అడ్డుతెరలు లేవు, రాజా. చదువు. మీ అక్కయ్యే వ్రాసింది."
రాజా నేత్రాలు అప్రయత్నంగా చెమర్చాయి. 'ఇటువంటి బలవత్తరమైన స్నేహాన్ననుగ్రహించిన దైవం, దాన్ని బంధుత్వంగా పటిష్ఠతరం చేయడానికి దయలేకుండా ఉన్నాడు!' అని కుమిలిపోయింది అంతరాత్మ.
"ఏం చెయ్యమంటావ్?" ఉత్తరం చదివి ఇచ్చేస్తున్న రాజాను అడిగాడు శ్రీహరి.
బుర్వుగా నిట్టూర్చాడు రాజా. "నోటితో చెప్పలేకుండా ఉన్నాను. కాని నిన్ను కర్తవ్యం నుండి దూరం కమ్మని చెప్పే స్వార్ధపరుడైన స్నేహితుడిని కాను. మన ఆనందం కంటే ఆప్తుల ఆనందం ముఖ్యం." మాట్లాడుతూనే బయటకు వెళ్ళిపోయాడు రాజా.
23
శాంతినికేతన్ వార్షికోత్సవ సందర్భంలో మళ్ళీ ఆర్భాటంగా జరుగబోయే నృత్యనాటికాలకూ, సంగీతాలకూ పెద్ద ఎత్తున రిహార్సల్స్ ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంలో కూడా శాంతి రెండు మూడు పాత్రలు ధరించింది. కాని ఈసారి అన్నకూ, రాజాకూ ఆహ్వానం పంపలేదు. 'వాళ్ళకు కళను మెచ్చుకోవడం తెలీదు' అనుకుని సరిపెట్టుకుంది. ఈ సందర్భంలో గోవింద రావుకు మరింత సన్నిహితురాలైంది. అసలు అటువంటి పనులలో ఉపాధ్యాయులు, విద్యార్ధులు అనేకులతో పరిచయమౌతుంది. విధిగా వారితో మాట్లాడవలసిన సన్నివేశాలు ఎదురౌతాయి. కాని గోవిందరావులా అంత సన్నిహితంగా, చిలిపిగా ఎవరూ మాట్లాడలేదు. శాంతితో. ఇప్పుడతడి మాటలూ, చేతలూ ఆమెకు జుగుప్స కలిగించడంలేదు. పైగా ఎందుకో మనస్సు అనునిత్యం అతడితో మాట్లాడటానికి తత్తరపడుతూంది.
వార్షికోత్సవ సందర్భంలో ఏర్పాటుచేసిన చిత్రకళా ప్రదర్శనంలో తాను వేసిన అనేక చిత్రాలతోపాటు రాజా బహూకరించిన రవీంద్రుడు, గులాబిసుందరి పటాలనుకూడా ఉంచింది శాంతి. రాజా ఆఖరిసారి తనకిచ్చిన చిత్రం - శాంతినికేతన్ ను ప్రథమంలో చూడటానికి వచ్చినవాటి తన రూపం, వేషం చిత్రింపబడిన పటం - కూడ పైకి తీసింది. కాని అది ప్రదర్శన కివ్వడానికి ధైర్యం చాలలేదు. అందుల మరీ తన పోలికలు కొట్టవచ్చినట్టు కన్పిస్తున్నాయి.
ప్రదర్శన చూచిన అందరి దృష్టినీ రవీంద్రుని చిత్రం బాగా ఆకర్షించింది. 'రాజా అంటే ఎవరు? ఎవరా చిత్రకారుడు?' అనే ప్రతివారి ప్రశ్నా. శాంతి చెప్పలేక విసిగి పోయింది. ప్రదర్శన చూడవచ్చిన నలుగురైదుగురు పెద్దమనిషులసలు దానిని చెప్పిన నెలకు తీసుకుపోతామన్నారు. కాని శాంతి అంగీకరించలేదు. అది తనది కాదనీ, ఒక మిత్రుని వద్ద నుండి పొందిన బహుమానమనీ చెప్పింది.
నితీంద్రబోస్ అనే బెంగాలీ ఒకాయన చిత్ర లేఖనాచార్యులుగా పని చేస్తున్నారు. శాంతినికేతన్ లో చేర్చినప్పుడు శ్రీహరి శాంతి విషయమై మరీ మరీ చెప్పడంవలన ఆయన శాంతిపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆయన పేరెన్నికగన్న చిత్రకారుడు. చాలా సున్నిత స్వభావి. అందరకూ ఆయనపై గౌరవమే. విద్యార్ధులను కన్నబిడ్డలలా చూచుకుంటారు ప్రొఫెసర్ బోస్. అసలు అక్కడి ప్రతి అధ్యాపకుడూ అంతే. శాంతినికేతనం ప్రత్యేకతే అది. అందునా ప్రొఫెసర్ బోస్ మరీను! ఎవరితో మాట్లాడకుండా అణకువగా, నమ్రంగా, సరళంగా ఉండే శాంతి అంటే ఆయనకు మరీ అభిమానం. చిత్రలేఖనా బోధనలు అయిన తర్వాత అప్పుడప్పుడు పిలిచి ఆమె యోగ క్షేమాలు కనుక్కొంటూ ఉంటారు.
ఆ రోజు ప్రదర్శనం ముగిశాక శాంతిని పిలిపించి, "ఆ చిత్రాలు చాలా బాగున్నా" యంటూ రాజాను గురించి వివరంగా ప్రశ్నించి తెలుసుకున్నారు.
"అతడు నీకు మిత్రుడా? ఆ రోజున శ్రీహరితో కలిసి వచ్చినాయనా?" అనడిగారు గుర్తు చేసుకుంటూ.
"అవును" అంది శాంతి.
"అదృష్టవంతురాలవు. శాంతీ. నేను నిన్ను దీవిస్తున్నాను" అంటూ కళ్ళు మూసుకుని ఆయన తన భాషలో ఏమేమో అన్నారు. ఆకసం వైపు చేతులు జోడించి. "నా దీవన నిజమౌతుంది, శాంతీ. నిండు హృదయంతో నా బిడ్డగా నిన్ను దీవించాను. వెళ్లిరా. చూడగానే రాజశేఖరంలో ఉత్తమ లక్షణాలు కన్పిస్తాయి."
విస్తుపోయి చూడటం తప్ప శాంతి మాట్లాడలేకపోయింది. ఆ ఆశ్చర్యంతోనే వెళ్ళుతూంటే గోవిందరావు ఎదురుపడ్డాడు, మరో యిద్ధరితో కలిసి.
తల వంచుకు వెళ్ళిపోతున్న శాంతిని అతడే పలుకరించాడు. "శాంతీ! రాజా అంటే ఆ రోజు రాత్రి నువ్వు పరిచయం చేశావు. అతడేనా?"
"అవును" అంది శాంతి.
"అంతటి స్నేహమా మీ యిద్దరికీ?" అసూయ స్పష్టంగా కన్పించిండతడి నేత్రలలో.
ఆ స్నేహం విషయం గురించి అతడికంత రెట్టించవలసిన అవసరమేమిటో అర్ధంకాక మౌనంగా చూడసాగింది శాంతి.
"ఛ. చిత్రమంటే అలాగా ఉండడం!" అని అతడూ, స్నేహితులూ ఏమేమిటో అనుకుని నవ్వుకుంటూ వెళ్ళిపోయారు.
అందరి ప్రశంసకు పాత్రమైన చిత్రం అతడి నెందుకాకర్షించలేదో శాంతికి బోధపడలేదు. అంతటి చిత్రకారులు బోస్ గారే ప్రశంసించిన ఆ చిత్రం ఇతడికి హేళనా పాత్రమైన దంటే ఏదో లోపం అతడి కనులలో ఉండాలి. లేక రాజాపై అసూయ కావచ్చు.
అప్రయత్నంగానే ఆమె మనస్సు రాజాతో గోవిందరావును పోల్చింది. 'గోవిందరావులో ఉన్నంత విద్యా ఉండాలి మీలో. బాగా కృషి చేయండి' అన్నాడు రాజా! అతడికి అసూయ లేదు. తాను తృణీకరించినా స్నేహం మానుకోవడం లేదు. ఆలోచించడమేగాని అప్పుడే మరిచిపోయిందా సంగతి.
విశ్వభారతిలో ఎప్పుడూ ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. రవీంద్రులు వ్రాసిన అనేక సంగీత నాటికలూ, నృత్యనాటికలూ తరుచు ప్రదర్శింపబడుతుంటాయి. ఆడుతూ, పాడుతూ ఆనందంగా గడిచిపోతూంది శాంతి నికేతనంలోని జీవితం. ఆ ఆటపాటలలో శాంతీ, గోవిందరావులు చాలా సన్నిహితులయ్యారు. శాంతి మనస్సులో ఎన్నడూ లేని అస్పష్ట నూతన భావతరంగాలు లీలగా మెదలజొచ్చాయి.
24
"అహ్హహ్హ! ప్రపంచంలో అదృష్టం అనేక రకాలు, రాజా. ఒక్కో అదృష్టంవల్ల కలిగే బాధకు ఏ దురదృష్టమూ సరితూగలేదనుకో" అని వికటంగా నవ్వుతూ ప్రవేశించిన శ్రీహరిని విస్తుపోతూ చూచాడు రాజా.
"ఏమిటోయ్, అది?"
"ఏమిటా? మా కంపెనీనుండి ట్రెయినింగుకి జర్మనీ పంపవలసిన యిద్దరు ఇంజనీర్లలో ఒకడుగా నన్ను సెలెక్టు చేశారు. అహ్హహ్హ!"
"ఓ, అభినందనలు." సంతోషంగా లేచి చెయ్యి అందించాడు రాజా.
శ్రీహరి అందుకోలేదు. నిట్టూర్చుతూ సోఫాలో కూలబడ్డాడు. "ఎందుకురా, నాకీ అభినందనలు? మీద తగలేసుకోనా? బదిలీ చేయించుకుని నాన్నగారికి దగ్గరగా పోవాలని కదా నా ప్రయత్నం! ఎందుకిక నాకీ ఆకాశం మీది అవకాశాలు? నేను వెళ్ళనని బలవంతంగా చెప్పవలసి వచ్చింది." శ్రీహరి కళ్ళలో నీళ్ళు తిరిగి ముఖం కందగడ్డ అయింది.
నిర్ఘాంతపోయిన రాజా ఏమీ మాట్లాడలేక పోయాడు.
శ్రీహరి అన్నాడు: "ఒకప్పుడు ఇటువంటి అవకాశంకోసం ఎంతగానో పలవరించాను. దైవానికి మ్రొక్కుకున్నాను. కాని యిప్పుడా అవకాశం దానంతటది వచ్చినా కాలదన్నుకున్న నిర్భాగ్యుడిని. జీవితమెంత చిత్రమైనది!"
"విచారించకు, శ్రీహరీ," సానునయంగా పలుకుతూ స్నేహితుడి వీపు నిమిరాడు రాజా. "ఒక్కొక్కప్పుడు ఆశయావకాశాలకూ, యథార్ధానికీ సఖ్యత కుదరదు. సమన్వయం సాధ్యపడదు. జీవితం అతి నిష్టురమైనది."
