Previous Page Next Page 
రారామాఇంటిదాకా పేజి 21


    అంగడి బాగా జరిగినా అందులో లాభం ఎంత వస్తుందని? రోజుకి ముఫ్ఫై లేదా నలభయ్ రూపాయలు మిగిలేవి. మా కుటుంబం చాలా పెద్దది. అమ్మా నాన్నకు మొత్తం నలుగురు సంతానం నేను పెద్దదాన్ని నా వెనుక ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్ళు.
    
    వచ్చే లాభాన్ని పేకాటలో ధారపోస్తూ, తిరిగి గెలుస్తూ మా నాన్న తంటాలు పడుతుండేవాడు.
    
    నేను టెన్త్ క్లాస్ పాసయ్యాను. ఇక ఇంటర్ చదవాలంటే నగరికి వెళ్ళాలి.
    
    కాలేజీ మరో రెండు ఎల్లో తెరుస్తారనగా నా శరీరంలో విపరీతమైన మార్పులొచ్చాయి. యవ్వనాన్ని పీల్చుకుని ఊరినట్టు నా ఎద పెరిగింది. ఓ రెండు గుప్పెట్లు పొడుగు పెరిగాను.
    
    నడుం దగ్గర ఎవరో కర్ఫ్యూ పెట్టినట్లు ఆ భాగంలోని శరీరం మాత్రం అలానే వుండిపోయింది.
    
    ఇక దానికింది భాగం మాత్రం ఎదతో పోటీ పడింది. నాకు నేనే ఆశ్చర్యపోయేంత మారిపోయాను.
    
    ఓరోజు స్నానం చేసొచ్చి పావడా, జాకెట్ వేసుకుంటూండగా మా అమ్మ వచ్చి 'ఇది పైట - ఇక నుంచీ దీన్ని కూడా వేసుకో" అంది.
    
    మౌనంగా దాన్నందుకున్నాను. దాన్ని వేసుకొని వేసుకొని వీధిలోకి పోవాలంటే తగని సిగ్గుగా అనిపించింది. అందుకే ఓ రెండురోజుల పాటు ఇంటిలోంచి కాలు బయట పెట్టలేదు.
    
    మూడోరోజున అలా వరండాలోకి వచ్చి నిలుచున్నాను. నాలుగోరోజు బావి దగ్గరికి వెళ్ళాను. ఇక ఆ తర్వాత బెరుకుపోయింది.
    
    ఇదంతా నాన్న గమనించినట్లున్నాడు.
    
    'ఇక నువ్వు కాలేజీకి వెళ్ళనక్కరలేదు. కొట్టు కూడా సరిగా నడవడం లేదు డబ్బుకు చాలా ఇబ్బందిగా వుంది' అన్నాడు.
    
    అలా నా చదువుకు బ్రేక్ పడిపోయింది. ఇక అప్పటినుంచీ ఇంటి దగ్గరే వుండిపోయాను.
    
    అప్పుడప్పుడే టీవీలు ప్రవేశిస్తున్నాయి. మా ఊరి సర్పంచ్ మొదటిగా టీవీ కొన్నాడు.
    
    సాయంకాలం అయితే ఆడవాళ్ళందరూ టీవీ దగ్గర గుమికూడే వాళ్ళు.
    
    ఈ సమయంలోనే మనోహర్ అద్దెకు టీవీ, వీసీపీ సినిమాలు వేసేవాడు.
    
    సినిమాలు చూడాలనుకునేవాళ్ళు రూపాయి ఇవ్వాలి.
    
    ఆరోజు వినాయక చవితి.
    
    ఆరోజు మనోహర్ రెండు చిరంజీవి సినిమాలు డెక్ లో వేస్తున్నట్లు తెలిసింది.
    
    సినిమా రాత్రి ఎనిమిది గంటలకు స్టార్టవుతుంది.
    
    నేను తొందరగా భోజనం చేసి సినిమా వేసే మనోహర్ ఇంటికి చేరుకున్నాను.
    
    డాబా మీద కరెంట్ కనెక్షన్ తీసుకుని అక్కడ వేసేవాడు.
    
    నేను మెట్లెక్కి చివరి మెట్టు మీదకు చేరుకున్నాను. అక్కడ లైటు వున్నా మెట్ల దగ్గర చీకటిగా వుంది.
    
    డబ్బులు కలెక్టు చేసుకోవాడానికి మనోహర్ పిట్టగోడ మీద కూర్చున్నాడు.
    
    అతని ఫ్రెండ్ శరత్ టీవీ సరిచేస్తున్నాడు.
    
    నేను నిలబడి చిన్నగా దగ్గి, లోనికి వెళ్ళడానికి ఒక అడుగువేసాను.
    
    శరత్ వేపు చూస్తున్న అతను ఎవరో పిల్లలు వచ్చి లోనికి దూరుతున్నారనుకుని వెళ్ళకుండా ఆపడానికి చేయి అడ్డం పెట్టాడు.
    
    నేను మెట్లెక్కడం కోసం ఓ అడుగువేయడం, అతను చేయి చాపడం, అతని చేయి నా ఎదకు తగిలి ఒక్కసారిగా నా కళ్ళముందు వేల వేల దీపాలు వెలిగినట్లనిపించడం క్షణంలో జరిగిపోయాయి.
    
    కొత్తదయిన ఆ స్పర్శకు అతను ఉలిక్కిపడడం మసక వెలుతురులో కనిపెట్టాను. జీవితంలో తొలిసారిగా మగవాడి స్పర్శ.... అదీ తగలరాని భాగంలో.
    
    బాగా వర్షం కురిశాక, చెట్టుకింద నిలబడి వున్నప్పుడు ఎవరైనా కొమ్మను విదిలిస్తే, మనమీద ఒక్కసారిగా నీటిబిందువులు జలజలా రాలినప్పుడు కలిగే అనుభూతిలాంటిది నాలో.
    
    అతనూ అదే పరిస్థితిలో వున్నాడు.
    
    హైస్కూల్లో నాకంటే మూడేళ్ళు సీనియర్. టెన్త్ క్లాస్ ఫెయిలయ్యాడు. మరో రెండుసార్లు రాశాడు గానీ ఫలితం మాత్రం మారలేదు. ఇంటి దగ్గరే వుండిపోయాడు. వ్యవసాయం చేస్తుంటాడు. తీవెలు వచ్చాక, ఇలా సినిమాలు వేస్తూ పై సంపాదన సంపాదిస్తున్నాడు. ఇరవై రెండేళ్ళు వుంటాయనుకుంటాను.
    
    "నువ్వా?" కాసేపటికి తేరుకున్నాక అన్నాడు.
    
    నేనేమీ మాట్లాడకుండా చేతిలో రూపాయిబిళ్ళ వుంచి లోనికెళ్ళాను.
    
    నా వెనకే జనం రావడం ప్రారంభించారు.
    
    చూస్తూ వుండగానే డాబా నిండిపోయింది.
    
    "హౌస్ ఫుల్ బోర్డు పెట్టేయ్' ఎవరో జనంలోంచి జోక్ చేశారు. సినిమా మొదలయింది.
    
    నా మనసు మాత్రం సినిమా మీద నిలబడడం లేదు. మాటి మాటికీ పైట సర్దుకుంటూనే వున్నాను. నేను మొదట వెళ్ళడంవల్ల చివరన పిట్టగోడకు దగ్గరగా కూర్చున్నాను. కలెక్షన్ అంతా చూసుకుని మనోహర్ వచ్చి నా వెనక నిలుచున్నాడు. టీ.వీ. కనతి తప్ప మరో వెలుగులేదు. తలతిప్పి అతనివైపు చూడాలన్న మనసును అదుపులో వుంచడం కష్టమైపోతోంది. కానీ తమాయించుకున్నాను.
    
    సినిమా అయిపోయింది.
    
    కేసెట్ మార్చి మరోటి పెట్టడానికి మనోహర్ ముందుకు వెళ్ళాడు.
    
    అతన్ని చూస్తూ అక్కడి నుండి రావడం సాధ్యం కాదనిపించి, ఇదే తగిన సమయమనిపించి లేచి వచ్చేశాను. ఇంటికొచ్చి పడుకున్నాను.
    
    మొదటిసారిగా నిద్ర రావడం లేదు. ఏవేవో ఆలోచనలు ఊహలు, భయాలు-రేడియోలో పలు స్టేషన్లు ఒక్కసారిగా వస్తున్నట్లు అన్నీ కలగాపులగంగా కలిసిపోయాయి. పద్దెనిమిదేళ్ళ పరువం శరీరపు ఉనికిని తొలిసారిగా తెలియజేస్తోంది.
    
    ఎప్పుడో కోడి కూస్తున్నప్పుడు నిద్రపోయాను.
    
    ఇక అప్పట్నుంచి వీధిలోకి వస్తే మనోహర్ కోసం నా కళ్ళు గాలించేవి. ఎప్పుడయినా అతను ఎదురుపడ్డప్పుడు కాళ్ళు వణికేవి, కళ్ళు సిగ్గు బరువుకి కిందకు వాలిపోయేవి. శరీరమంతా బరువుగా తోచేది. రక్తప్రసరణంతా తెలిసేది.
    
    మరో వారం రోజులకే మనోహర్ డెక్ తెచ్చి, సినిమా వేశాడు. నేను ఏడుగంటలకంతా రెడీ అయిపోయి ఆరోజులాగానే మొదటగా వెళ్ళాను. చివరి మెట్టు దగ్గరకు చేరుకొని ఒకడుగు వేయబోయేంతలో అచ్చం ఆరోజులాగానే ఎటో చూస్తున్న అతను చేయి చాచడం, అది నా ఎదకు తాకడం జరిగిపోయింది.
    
    ఇదంతా నటనే అని నాకు తెలుసు. కానీ నేను దాన్ని గుర్తించనట్టు రూపాయి చేతిలోపెట్టి లోపలి కెళ్ళాను. అంతక్రితం నెలకోమారు సినిమా వేసే అతను అప్పటినుంచీ వారానికి ఓ సినిమా వేస్తున్నాడు. కేవలం నేను వచ్చి, అలా నిలబడితే చేయి చాచడం కోసమే అంత తొందరగా సినిమాలు వేస్తున్నాడని నాకు తెలుసు. అందుకే నేను సినిమా వేసిన ప్రతీసారీ అతన్ని నిరుత్సాహపరచడం లేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS