శంకరం నవ్వి "ఎందుకమ్మా , నేను గోపాలం మకాం కి వెళ్తాను. వాడు ఎక్కడ ఉంటున్నాడో తెలియక , ఇక్కడకు వచ్చి వాకబు చేస్తే తెలుస్తుందని శేషయ్య చెబితే, ఇక్కడికి వచ్చాను." అన్నాడు.
"ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళినా అయన దొరకరు. పూట కూళ్ళ ఇంటికి వెళ్లి భోజనం చేసి కోర్టుకు వెళ్ళిపోతారు."
"అయ్యో, అలాగా! నేను తెల్లారేటప్పటికే పడవ దిగాను సుమా!....ఇల్లు వెతుక్కోవడం లో ఈ వేళ అయింది."
"పోన్లెండి . ఈ కారణంగా నేనా పెద్దలు మీరు మా యింటికి రావడం పడింది. లేవండి . స్నానం చేసి భోం చేద్దురు గాని వంట అయింది" అంది విజయ.
"భోజనమా?....ఇక్కడెందుకూ?....ఏ పూట కూళ్ళ ఇంటికో వెళతాను " అన్న శంకరం తో "అక్కడి కేం వెళతారు...పైగా గోపాలం గారు చెప్పేవారు మడీ ఆచారం కదా మీకు?...." అంది విజయ.
'అందుకే.......అనుమానిస్తున్నా........' అన్నాడు శంకరం తనలో తను అనుకున్నట్లు.
విజయ కొద్దిగా నవ్వి "బ్రహ్మ సమాజ మతస్తుని ఇల్లు అని అనుమానమా మీకు?....అదంతా మా మావయ్యతోటే పోయింది. పైగా మా నాన్నా మా అమ్మా కూడా మీలాగే సనాతన పరులు . అందువల్ల నా చేతి వంట మీరు తినడానికి అభ్యంతరం ఉండకపోవచ్చు" అంది.
"అది సరే అనుకో...."
"ఇంకా మీకేవిటి అనుమానం ?-- నేను రోజూ తలారా స్నానం చేసి మడి గట్టుకుని మరీ వండుతాను....నిజం అండి-- నా మాట నమ్మండి. ఇంత జుట్టుతో రోజూ నేను తలకి స్నానం చేసినా పడుతుంది. నాకు జబ్బు చెయ్యదు."
ఇందాకా తను చూసినప్పుడు తల అరబెట్టు కుంటున్న సంగతి జ్ఞాపకం వచ్చి "నిజమే ఈమె చెబుతున్నది" అని సమాధాన పడ్డాడు శంకరం.
మొహమాటపడి మొహమాట పడి స్నానానికి లేచాడు శంకరం. విజయ తన పట్ల చూపిస్తున్న శ్రద్ధ మర్యాద ఆమె ప్రతి కదలికలోనూ కనిపిస్తున్న వినయం ఇవన్నీ చూసేసరికి శంకరానికి ఈ పిల్లని గోపాలానికి చేస్తే బాగానే ఉంటుంది . బ్రహ్మ సమాజపు పిల్ల కూడా కాదు, విజయా గోపాలం ఇద్దరికీ ఇష్టమైతే బాగానే ఉంటుంది.
కాని ఒక్కటే అభ్యంతరం?
మరీ ఇరవై ఇరవై రెండేళ్ళ పిల్ల?
ఇంత పెద్దది పెళ్లి కూతురేమిటి?....పైగా ఇప్పటికి తమ కుటుంబం లో ఈడేరిన పిల్లని తెచ్చుకోవడం కాని , యుక్త వయస్సు వచ్చాక పెళ్లి చెయ్యడం కాని జరగలేదు. అబ్బే లాభం లేదు. పిల్ల రత్నం అయితే కావచ్చు కాని యుక్త వయస్సురాలైన పిల్ల వీల్లేదు. కాని,మరి ? ఇరవై ఆరు, ఇరవై ఏడు ఏళ్ళు వచ్చిన గోపాలానికి పది పన్నెండేళ్ళ పిల్లని పెళ్లి చేస్తే ఈడూ, జోడూ అవుతుందా ?.....ఏవిటో ? ...అందుకే ఏ ఈడు కా అందం అన్నారు. అలా అలా ఆలస్యం అయిపొయింది కాని ఏడెనిమిదేళ్ళ క్రితం వాడు ఎఫ్.ఏ. లో చేరగానే పెళ్లి చేస్తే ఎంత బాగుండును?
విజయ మాటలని బట్టి గోపాలం ఇక్కడ వీళ్ళింట్లో ఉండడం లేదని, రామనాధం గారు పోగానే వేరే రెండు గదులు తీసుకుని అందులోకి వెళ్ళిపోయాడనీ, ఏ పొద్దుటి పూటో ఓ గంట వచ్చి చూసి వెళ్ళే వాడని, వారం పది రోజులయి అదీ రావడం లేదనీ తెలిసింది శంకరానికి-- గోపాలం అనుసరిస్తూన్న పద్దతిని మనస్సులోనే మెచ్చుకున్నాడు శంకరం. అవును మరి! అలా ఉండకపోతే ప్రమాదం కదూ?....ఇద్దరూ వయస్సులో ఉన్నవాళ్ళు దగ్గరేవళ్ళూ మంచీ చెడూ చూసే పెద్దవాళ్ళు లేరు - వయస్సులో చిన్నవాడయినా పెద్ద ఆలోచనే చేశాడు గోపాలం అనుకున్నాడు శంకరం - భేష్ !....బాగుంది......
ఆ సాయంత్రం నాలుగు అయిందింటి దాకా అక్కడే విశ్రాంతి తీసుకుని గోపాలం కోర్టు నుంచి వచ్చే టైము కి , విజయ చెప్పిన అనమాళ్ళు ఆధారంగా గోపాలం మకాం వైపు బయలుదేరాడు శంకరం.
కోర్టు నుంచి వచ్చి బట్టలు మార్చుకుంటూ తనలో తానూ నెమ్మదిగా శ్రీరాద్భామ సహస్రమండల విభావీ ........అంటూ భక్త చింతామణి లో పద్యాలు చదువు కుంటూన్న గోపాలం , గడపలో అడుగు పెడుతున్న అన్నయ్య ని చూసి ఆశ్చర్యంతో ఆ మట్టునే ఆగిపోయాడు. ఒక్క త్రుటి కాలం విస్తుపోయి మరుక్షణం లోనే సంతోషం పట్టలేక "అన్నయ్యా" అన్నాడు గట్టిగా , శంకరం చిరునవ్వు నవ్వాడు.
చేతిలో సంచి అందుకుని కుర్చీ దులిపి కూర్చో బెడుతూ "ఇదేనా రావడం?' ఇప్పుడు పడవెం వచ్చింది....వస్తున్నావని తెలిస్తే నేను పడవల రేవుకేనా వచ్చేవాడిని కదా?....ఊ....వదిన మణి అంతా కులాసా?".....అన్నాడు గోపాలం గుక్క తిప్పుకోకుండా . తమ్ముడి ఆప్యాయత కి హృదయం అంతా సంతోషంతో నిండిపోయి ఆనందం వల్ల బొంగురు పోయిన కంఠం తో తమ్ముడి ఒక్కొక్క ప్రశ్నకే సమాధానం చెప్పసాగాడు శంకరం. అన్నయ్య కి విజయ ఆతిధ్యం ఇచ్చిందని విని ఆశ్చర్యపోయాడు గోపాలం. శంకరం మాట్లాడుతున్నంత సేపూ గోపాలం అన్నయ్య ముఖం కేసు పరిశీలనగా చూడసాగాడు. నుదుటి పైన పూర్వం ఒక వరుసలో వుండే జుట్టు ఇటూ అటూ వెనక్కి జరిగి నుదుటి ని విశాలం చేసి ఆపైన బట్టతలగా మారుతోంది. కనురెప్పల క్రింద చర్మం నల్లబడి ముడతలు పడుతూ వయసుతో వచ్చిన మార్పును చెబుతోంది . చెంపలు కొద్దిగా అక్కడక్కడ నెరిసి, జీవితానుభవాన్ని జీర్ణించుకొని పకపకా నవ్వుతున్నట్లున్నాయి. ముఖంలో కొంచెం అలసట శరీరంలో కొంత నీరసం చూస్తె అన్నయ్య లో పూర్వపు దార్ధ్యం తగ్గి మనిషి సడలినట్లున్నాడు.
ఈ రెండేళ్ళ లోనూ అన్నయ్య లో ఎంత మార్పు వచ్చింది.
పాపం పెద్దవాడవుతున్నాడు.
విజయ చూపించిన ఆదరణ, ఆమెలో కనిపించిన వినయ విధేయతలు ఉత్తమ గుణ సౌశీల్యం ఇవన్నీ పొగడుతూ "అన్నీ బాగానే వున్నాయి కాని ఇప్పటి దాకా పెళ్లి చేసుకోకుండా ఉండడం మాత్రం చాలా ఎబ్బెట్టుగా వుంది" అన్నాడు శంకరం.
విజయ అన్నయ్య కి నచ్చినందుకు గోపాలం ఏంతో ఆనందించాడు, ఊరికే నచ్చడమే కాదు. అమెచేతి వంట కూడా తిన్నాడు అన్నయ్య. ఇంకఫరవాలేదు . తను విజయ ను పెళ్లి చేసుకోవడానికి ఒక రకంగా మార్గం సానుకూల మైనట్లే....
"అంత వయస్సు వచ్చేదాకా ఆగడం ఏవిటిరా. మరీ విడ్డూరం గానూ ! ఇప్పుడు మన మణి కి చూడు నేను ఈ ఏడో, వచ్చే ఏడో చేసేద్దాం అనుకుంటున్నాను........." ఆన్నాడు శంకరం.
వెంటనే గోపాలం కంగారుగా "అలా చెయ్యకు సుమా?....నిన్ననే శాసనం ప్యాస్ అయింది. పదహారేళ్ళ లోపు పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తే అది నేరం అవుతుంది " అన్నాడు.
శంకరం "ఆ" అని నిస్తేజుడై ఆ మట్టునే వుండిపోయాడు. అతనికి తనదాకా వచ్చిన ఆ మహా సంప్రదాయ మంతా ఒక్కమారుగా నేలమట్టానికి కూలిపోయినట్లూ , జరగరాని ఒక మహోపదవ మేదో జరిగి పోయినట్లు అనిపించి బాధపడ సాగాడు. అన్నయ్య పడుతున్న ఆవేదనను గ్రహించి "వవృత్తి కోసం అయితే అన్నయ్య వైద్య శాస్త్రం చదివాడు కాని నిజంగా సంప్రదాయాల మీద ఉన్నంత విశ్వాసం శాస్త్రం మీద లేదు' అనుకున్నాడు గోపాలం.
శంకరం నిస్సహాయంగా "ఇదేం శాసనం రా-- ఇంటా వంటా లేని పనులెలాగా చెయ్యడం ?"...దీనికి మార్గాంతరం లేదూ?' అన్నాడు.
"లేకేం?....కొందరు యానం వెళ్లి, ఆంగ్ల శాసనం చెల్లని ఆ ఫ్రెంచి ప్రాంతంలో బాల్య వివాహాలు చేసుకు రావాలని అని ఆలోచిస్తున్నారు , కాని అది ఋజు మార్గం కాదు"
"కాకపోతే మానిరి ! ఋజు మార్గాన్నే నడవాలని నియమం ఏమిటి? ఇలాంటి అర్ధం లేని శాసనాలు పెడుతూన్న ప్రభుత్వం ఏం ఋజు మార్గం లో ఉందొ చేబుదూ?"
అన్నయ్యతో వాదించి లాభం లేదని గోపాలం ఊరుకున్నాడు. శంకరం కాస్సేపటికి "చూడు నీ వల్ల ఎంత వచ్చిందో -- అయిదారు ఏళ్ళ క్రితం నువ్వు పెళ్లి చేసుకుంటే ఈ ఇబ్బంది రాకపోనా?-- నీకూ ఒక చిన్నపిల్లని చేద్దును-- మణికా ముచ్చటగా చిన్నప్పుడు పెళ్లి చేసేసి ఉందును." అన్నాడు.
గోపాలం ఈ మారూ ఏం మాట్లాడలేదు.
"సరే- అయిందేదో అయింది- ఏం అఘోరించి ఏం లాభం? ఇంక ముందు చెయ్యవలసింది ఏదో ఆలోచిద్దాం. నీ పెళ్లి మాట ఏం చెప్పావ్?..... ఈ ఏడైనా చేసుకుంటావా చేసుకోవా?" అన్నాడు శంకరం గట్టిగా. గోపాలం ఏం మాట్లాడలేదు. "నిన్నే" అన్నాడు శంకరం. అన్నయ్య అలా రెండు మూడు సార్లు అదిగాక గోపాలం నేలకేసి చూస్తూ "నువ్వు వింటానంటే ఒక్కమాట?" అన్నాడు నెమ్మదిగా.
తమ్ముడు తన దగ్గర అంత భయం భయంగా ఉండడం చూసేసరికి శంకరానికి సంతోషంతో పాటు గర్వం కూడా కలిగింది. ఆనందంతో కళ్ళు ఆర్ద్రం కాగా "వెఱ్రి నాన్నా-- నా దగ్గర భయం ఎందుకురా నీకు?...చెప్పు ' అన్నాడు -- మళ్ళీ మళ్ళీ బుజ్జగిస్తూ అడిగాడు. చివరికి గోపాలం "నేను విజయ ని పెళ్ళాడుతాను " అని అన్నాడు నెమ్మదిగా. ఆ మాటకి శంకరం ఒక్కమాటు ఉలిక్కిపడ్డాడు. ముఖం కోపం తో ఎర్రగా జేవురించి, శరీరం వణికి పోసాగింది. చాలాసేపటికి కాని కోపం తీవ్రత తగ్గలేదు. "ఇన్నాళ్ళూ వీడు ఈ ఊరు వదిలి రాకపోవడానికి కారణం ఇదా?....సరే అర్ధం అయింది, ఇందుకే నన్నమాట ఆ అమ్మాయి తనని అంతగా గౌరవించింది ఇందాకా ?....పెళ్ళాడు తాడుట, పెళ్లి! తను అనుకుంటే సరిపోయింది కాబోలు. ఇంత పెద్దవాళ్ళూ, అంగీకారాలూ ఏం అక్కర్లేదూ...." అన్నయ్య ముఖం చూసి గోపాలం ఆగిపోయాడు. ఆ తర్వాత శంకరం , గోపాలం ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోలేదు. ఆరోజు శనివారం కావడం వల్ల తను హోటలు నుంచి భోజనం చేసి వచ్చేటప్పుడు అన్నయ్య కి పళ్ళు తెచ్చాడు గోపాలం. బత్తాయి తొనలు ఒలిచి పెట్టి, పక్కని నిలబడి విసిరి, పక్క వేసి అన్ని సపర్యలూ చేస్తూన్న తమ్ముడిని చూస్తె ఓ పక్క నుంచి సంతోషంతో కూడిన సంతృప్తి . "విజయని పెళ్లి చేసుకుంటాన"ని ఖచ్చితంగా చెప్పిన గోపాలం మొండితనం చూస్తె మరో ప్రక్క నుంచి పట్టరాని కోపం కలుగజోచ్చాయి శంకరానికి. శంకరానికి మంచం మీద పక్కవేసి , తను రెండు టేబిల్ లూ దగ్గరగా లాగుకొని వాటి మీద పడుకున్న గోపాలానికి ఎంతసేపటికి నిద్దర పట్టలేదు. అన్నయ్య కి బాగా నిద్దర పట్టిందని నమ్మకం కుదిరాక . మనస్సు బాగుండనప్పుడు తను సాధారణంగా చదువుకునే భక్త చింతామణి లోని పద్యాలు చిన్న స్వరంతో నెమ్మదిగా చదవసాగాడు. నిద్ర పట్టకపోయినా సరే, కళ్ళు మూసుకుని పడుకుని ఆలోచిస్తున్న శంకరం, తమ్ముడు చదువుతున్న పద్యాలు విని "ఎక్కడివో కాని చాలా బాగున్నాయే --మంచి భక్తీ రసంగా ఉన్న పద్యాలు -- ఓ మాటు చూడాలి" అనుకున్నాడు.
