నవ్వింది మనోరమ. "పంజరంనుండి వెలువడబోతున్నానన్నమాట. వస్తాను, మరి. ఛీరియో" అంటూ ఎవరో పిలువగా మనోరమ వెళ్ళిపోయింది.
"ఒకరికి శాంతినికేతనం. మరొకరికి పంజరం!" తనలో తను అనుకుంటున్నట్లుగా అనుకొని నిర్లిప్తంగా నవ్వాడు శ్రీహరి.
"అయితే మనోరమ నాట్యం బాగుందని పొగిడేశారు కాని నా నటన బాగుండలేదూ? నా నృత్యం ఎలాగుంది?" చంటిపిల్లలా కళ్ళు త్రిప్పుతూ అడిగింది శాంతి, రాజాను.
"దివ్యంగా ఉంది. వేరే చెప్పాలా? బాగా సాధన చెయ్యండి. గోవిందరావులో ఉన్నంత విద్యా ఉండాలి మీలో" అన్నాడు గంభీరంగా రాజా.
"తప్పకుండా, అదే నా పట్టుదల కూడ" అంది శాంతి. "అయితే, అన్నయ్యా, నువ్వు మాట్లాడవేం? నీకు నచ్చలేదా?"
శ్రీహరి వదనం గంభీరంగా ఉంది. "ఒక్క నాట్యం విషయంలో బాగే కాదు. ఇంకా అనేకం ఆలోచించుకోవాలి. నువ్వేమీ పసిపిల్లవు కాదుగా, నేను చెప్పడానికి?"
"అంటే?" అభిమానంతో ప్రశ్నించింది శాంతి.
"ఏమిటో తర్వాత ఆలోచించుకో. విచ్చల విడిగా ఉండడంలోగల అనర్ధాలు నీకింకా తెలియవు. సరే, ఇంటికి ఉత్తరాలు వ్రాస్తున్నావా?"
"ఆఁ." తల ఊపింది శాంతి, బొటనవ్రేలితో నేల రాస్తూ.
"సరే. మేం వెళ్తున్నాం. నువ్విక్కడ చిత్ర కళాభివృద్డికి జేరావు. నేనూ అలాగే అనుకుంటున్నాను. ఆ నమ్మకాన్నలా ఉండనీ. ఆ గోవిందరావుతో-అతడేమిటి-ఎవరితోనైనాసరే అతి చనువు అనర్ధహేతువు" అంటూ సాగిపోయాడు.
"వెళ్తాం, శాంతీ" అంటూ రాజా, శ్రీహరిని అనుసరించాడు.
"అదేం, శ్రీహరీ, శాంతి నట్లా చిన్న బుచ్చావ్?" అన్నాడు రాజా దారిలో.
"చిన్నబుచ్చుకుంటుందని బుద్ది చెప్పకపోతే ఎలా?"
"పోనీ. ఆమె అభిరుచికి తగిన వ్యక్తి అక్కడైనా లభిస్తే...."
"రాజా!" శ్రీహరి కేకతో రాజా మాట సగంలోనే ఆగిపోయింది, "ఎందుకిలా చిత్రవధ చేస్తావ్, నన్ను?"
"క్షమించు, శ్రీహరీ!" మెల్లగా అన్నాడు రాజా.
అన్నయ్య మాటలలో అంతరార్ధం గురించి ఆలోచిస్తూ నడుస్తూన్న శాంతి, చెట్లమాటు నుండి "శాంతీ" అనే గోవిందరావు కంఠం విని త్రుళ్ళిపడింది. అందరూ భోజనశాలలో ఉన్నట్టున్నారు. ఆవరణ అంతా నిర్జనంగా ఉంది. పైగా అటు లైబ్రరీ ప్రక్క అలంకరణలనీ ఏమీ చెయ్యలేదు. లైట్లు కూడా లేవు. చీకటిగా ఉంది. అప్పుడే చంద్రోదయమౌతూంది.
"నీకోసమే వేచి ఉన్నాను, శాంతీ" అంటూ చెట్లనీడనుంచి శాంతి దగ్గరగా వచ్చాడు గోవింద రావు. "ఎంత బాగా నటించావ్! నిన్ను చూచి ఆవేశం వచ్చి నేను మరీ బాగా నటించాను" అన్నాడు ప్రశంసాపూర్వకంగా ఆమె నీవు తట్టుతూ.
వణికిపోయింది శాంతి. ఏమీ మాట్లాడలేక పోయింది.
"నువ్వెంత అందంగా ఉన్నావ్, శాంతీ, ఇవ్వాళ!"
"గోవిందరావ్!" కంపిత స్వరంతో రెండడుగులు వెనక్కువేసింది శాంతి.
అంతలో ఎవరో అటుగా వస్తున్నట్టు ఎండుటాకులపై అడుగుల సవ్వడి విన్పించింది. గబగబా నడిచి చీకట్లో కలిసిపోయాడు గోవిందరావు. భీతహరిణంలాగా శాంతి త్వర త్వరగా పోయి హాస్టల్ రూమ్ లో పడింది. ఇంకా శరీరం వణుకుతగ్గలేదు. గుండె వేగంగా కొట్టుకుంటూంది.
భోజనానికి కూడ వెళ్ళకుండా మంచంమీద పడి బావురుమంది. కొంతసేపటికి మనోరమ వచ్చింది, "చాలా బాగా యాక్ట్ చేశావు, శాంతీ" అంటూ. కాని, శాంతి స్థితి చూచి ఆశ్చర్యపోయింది.
"ఏమిటి, శాంతీ, ఏం జరిగింది, చెప్పవ్?" లాలనగా అడిగింది మనోరమ. శాంతికింకా దుఃఖావేగం అధికమైందేకాని తగ్గలేదు. జ్ఞానం వచ్చాక ఎప్పుడూ శాంతి ఏడవలేదు. ఏడువంటే ఏమిటో తెలియని ఆమె ఇవ్వాళ కుమిలి కుమిలి ఏడ్వసాగింది.
కడకు అతి బలవంతంపై విషయం తెలుసుకోగలిగింది మనోరమ. వింటూనే తేలికగా నవ్వేసింది. "ఛస్! ఈమాత్రానికేనా? ముందు భోజనం కానీ. తర్వాత మాట్లాడుకుందాం."
బలవంతాన తీసుకువెళ్ళి భోజనం చేయించి, "పడుకో. రేపు మాట్లాడుకుందాం" అని వెళ్ళిపోయింది మనోరమ.
మర్నాడు ఉదయం మనోరమ వచ్చేసరికి శాంతి స్నానాదులు ముగించి కూర్చుని ఉంది.
"ఏమోయ్, నీ ఆవేశం తగ్గిందా?" అనడిగింది నవ్వుతూ మనోరమ, శాంతి పక్కన కూర్చుని.
శాంతి మాట్లడలేదు.
"చూడు, శాంతీ." భుజంపై చేయివేసి అనునయంగా చెప్పసాగింది మనోరమ. "అతడలా ప్రవర్తించటమేదో మహాదారుణంలాగా బాధ పడతావేమిటి, శాంతీ? అతడు నిన్ను ప్రేమిస్తున్నాడేమో!"
"మనోరమా!"
"అవును, ఏం? ప్రపంచధర్మాన్ని నువ్వు మీరగలవా?"
"అనే నిర్ణయించుకున్నాను."
నవ్వింది మనోరమ. "లేదు, శాంతీ. అది కేవలం భ్రమ. నా ఒక్కతెతో తప్ప నువ్వింకెవరితోనూ స్నేహం చెయ్యవు, మాటే ఆడవు. కాని గోవిందరావుతో స్నేహం చేస్తున్నావ్."
"నీతోలాగే."
"కాదు. అతడి వేణుగానం ఒక్కరోజు విని పించకపోతే పిచ్చెక్కిపోతావ్. అతడితో ఒక్క రోజు మాట్లాడకపోతే గిలగిల లాడిపోతావ్. అతడికోసమే అతడి నాటికలో వేషం వేశావు!"
"ఏమిటి, మనోరమా? నువ్వేమేమో మాట్లాడుతున్నావ్. కళను మెచ్చుకోవడం, నిర్మలంగా స్నేహం చేయడం తప్పా?"
"తప్పని అనలేదు. అందులోనే నీ మనసులో దాగిన మమత ప్రతిబింబించుతున్నదంటున్నాను. నామాట అబద్ధమైతే ఒక్కసారి ఆత్మపరీక్ష చేసుకొని ఈ రెండు రోజులుగా నువ్వు గీస్తూన్న ఆ చిత్రంవైపు చూడు. కళాపిపాసి అని పేరు పెట్టావు. ఒక వృక్షం క్రింద ఒక యువకుడు కూర్చుని మురళి వాయిస్తున్నాడు!"
"అయితే? నే ననేక చిత్రాలు గీస్తాను!" అయోమయంగా అంది శాంతి.
హేళనగా నవ్వింది మనోరమ. "అవును, గీస్తావ్. నేను నాట్యసాధన చేస్తూండగా అనేక పర్యాయాలు నన్ననేక భంగిమలలో చూచావు. ఏదీ, చిత్రించావా, మరి? ఆ ఫలకం మీది దృశ్యం, ఆ భంగిమ అంతా రోజూ నువ్వు ప్రభాత సమయాన చూచేనే. ఇంకా నిశితంగా చూడు, ఆ బొమ్మలో గోవిందరావు పోలికలు స్పష్టంగా కన్పిస్తున్నాయి."
నిర్ఘాంతపోయింది శాంతి. మనోరమ చెప్పాక చూస్తే ఆ చిత్రం తనకూ అలాగే కన్పించింది. మంధస్వరంలో మాట్లాడింది: "మనస్సాక్షిగా చెపుతున్నాను మనోరమా. నా హృదయంలో ఏ మాలిన్యమూ లేదు."
స్నేహపూర్వకంగా చిరుహాసం చేసింది మనోరమ. "అలా కంగారు పడకు, శాంతీ. నాదగ్గర నీకు సిగ్గేమిటి? నిజంగా నీ మనస్సు నీకు తెలియకపోవచ్చు. కాని, నిశితంగా ఆలోచించి తెలుసుకోవడంలో తప్పులేదుగా? ఇదివరలో ఒకసారి ఇటువంటి విషయాల గురించి మనకు చర్చ జరిగింది. అప్పుడు 'ప్రేమ, సంసారం తప్ప మరొక పరమార్ధం లేదా జీవితానికి?' అనడిగావు, జ్ఞాపకముందా? నేను తర్వాత చెప్తానన్నాను. ఇప్పుడు చెప్పవలసిన సమయం వచ్చింది.
మానవ జన్మకుగల అనేక పరమార్దాలలో అదొకటి. అది లేనిదే జీవితానికి సంపూర్ణత్వం లేదంటారు. అదీకాక చూడు, నీమట్టుకు నువ్విక్కడున్నావు. మీ అన్నయ్యలూ వాళ్ళ గొడవానీకంతగా అక్కర్లేదు. అంటే వాళ్ళపైన నీకు ప్రేమ లేదని కాదు. మరీ అంతగా తపించిపోదు వాళ్ళ విషయంలో నీ మనస్సు. అలాగే నీ విషయంలో వాళ్ళూ అనుకోవచ్చా? ముందువాళ్ళూ, వాళ్ళ భార్యాపిల్లలూ, వాళ్ళ సంసారాలూ- అవేగదా వాళ్ళకు ముఖ్యం? ఆపైన ఖాళీ ఉంటే, ఇష్టమైతే నీ సంగతి చూస్తారు. అవునా?"
"అవుననుకో" అంది శాంతి.
"ఆఁ. అలా దారికి రా. ప్రస్తుతం నీ విషయంలో ఎక్కువ శ్రద్ధ ఎవరికీ? మీ నాన్న గారికి. నేనంటున్నందుకేమీ అనుకోవద్దు. మీ అమ్మా, నాన్నగారూ నీ జీవితకాలమంతా ఉండరు. కలకాలం వాళ్ళ అధికారమూ ఉండదు ఇంట్లో. క్రమంగా సమిష్టి కుటుంబం చీలిపోతుంది. చెట్టు కాసిన ఒక్కొక్క విత్తూ తిరిగి ఒక్కో వృక్షంగా పెరుగుతుంది. అప్పుడు ఏ చెట్టు కాచెట్టే ఠీవిగా నిలబడుతుంది. కాని ఒకనాడు ఒక పండులో కలిసి ఉన్న గింజలంకదా, ఒక్క చెట్టు సంతానాలమే కదా - అని ఆలోచించి శైశవాస్థను గుర్తు చేసుకోదు. మరొక చెట్టుకోసం పాటుపడదు. దేని దారి దానిదే.
