ఈ దృశ్యం చూసి డాక్టర్ ఒక్క క్షణం దిగ్భ్రమ చెందాడు. ఆతనికేం అర్ధం కాలేదు.
శేషయ్య ఉద్వేగం తో మునసబు మా వెంకడి ని చంపించేశాడండోయ్!" అంటూ ఓ వెర్రి కేక పెట్టాడు.
డాక్టరు గబగబా వెంకడి ని బల్ల మీద పడుకో బెట్టించి కంపౌండరు దెబ్బల చుట్టూ పేరుకొన్న రక్తాన్ని తుడిచి శుభ్రం చేస్తుండగా తను ఈ జబ్బ కి ఆ జబ్బకి రెండు మూడు ఇంజక్షన్లు చేశాడు. పెద్ద గాయాలు కుట్టి చిన్న గాయాలకి కట్టు కట్టి తల మీద తగిలిన బలమైన గాయానికి మరింత శ్రద్ధ తీసుకుని మొత్తం మీద గంట గంటన్నర కి కాని శంకరం కట్లు అన్నీ పూర్తిచేసి విశ్రాంతి తీసుకోలేక పోయాడు.
ఒళ్ళంతా చెమట్లు పట్టి కుర్చీలో నీరసంగా కూర్చుంటున్న శంకరం తో "మరేం ప్రమాదం లేదు కదా?' అన్నాడు శేషయ్య.
"రక్తం చాలా పోయింది. అందులో ముసలి ప్రాణం " అన్నాడు శంకరం అనుమానంగా.
"రంగయ్య ని కూడా కొట్టారండీ ! వెట్టి వాళ్ళూ , మునసబు పాలేర్లూ ను. కానయితే కముకు దెబ్బలు. వెంకడు నేలకి ఒరిగిపోవడం చూసి రంగయ్య కూడా అలా అయిపోతాడని భయపడి కర్ర మడమలతో ఒళ్ళంతా కుళ్ళ బోడిచారు నాకు మందు వద్దని చెప్పి వాడు ఇంటికి వెళ్ళాడు. ఉడుకు నీళ్ళతో ఒళ్ళు కాచుకోడానికి " అన్నాడు శేషయ్య.
"అసలు ఏం జరిగింది " అన్నాడు శంకరం.
"అది కాదండీ! చిరకాలం నుంచి అమ్మవారికి "గరగ' ఎట్టారంటే మొదట మనింటికి రావడం ! పోలేరమ్మ తల్లికి మన లోగిట్లోంచి పసుపూ కుంకం, రవికల గుడ్డా, పళ్ళూ, బియ్యం పెట్టడం . అమ్మవారు మొదట మనం కాళ్ళ మీద పోసిన పసుపునీళ్లు తొక్కితేనేగాని ఇంకో గడప తోక్కక పోవడం అనావాయితీ గా ఉంది కదాండీ. అలాంటిది ఇవాళ "అమ్మవారు మొదట -- మునసబు గారింటికి రావాలి. పెద్దకాపు . మునసబు గారి కంటే ఎక్కువేమిటి " అంటూ అతకాయించారుట వాళ్ళ పాలేర్లు వాళ్ళూ. దాంతో వెంకడూ , రంగయ్య వీల్లేదు అమ్మవారు పెద్దకాపు గారి ఇంటి ఆడబడుచు ముందు అక్కడికి రావలసిందే!.... అయినా చిరకాలంగా వస్తూన్న ఈ ఆచారాన్ని ఇప్పుడు మార్చవలసి ఎందుకు వచ్చింది అంటూ అటకాయించారుట!..... దాంతో ఘర్షణ బయలుదేరింది. మాటా మాటా పెరిగింది. మనవాళ్ళు ఇద్దరు . వాళ్ళ పాలేర్లూ వెట్టివాళ్ళూ కలిసి దాదాపు అరడజను పైన-- ఏవుంది?.... నలుగురం పొగడేటప్పటికి ఈ దారుణం జరిగిపోవడం , పడిపోయిన వీళ్ళనిద్దరినీ అక్కడ వదిలేసి వాళ్ళు పారిపోవడం అయిపొయింది."
"ఎంత అన్యాయం?..... ఊరు ఓ కట్టు బాటు . పెద్దలంటే భయం ఇవన్నీ పోయాయన్న మాట?.... అయినా మునసబు కేం వచ్చిందండీ?..... ఈ ఏడెనిమిదేళ్ళ నుంచీ చూస్తున్నాను మీరంటే స్నేహంగానూ మంచిగానూ ఉంటారే ! ఎంతో ఆప్యాయత కూడా చూపిస్తాడు"
"ఆ....ఏం ఉండడం లెండి -- అదంతా నటన. అసలు వాడికీ మనకీ పాత కక్షలున్నాయి, మీకు తెలియదు మా వాసు తల్లి పోయేదాకా నేను వాడి ఆటలెం సాగనివ్వకుండా ఏ మాత్రం తేడా వచ్చినా రామనాధం గారి వకాల్తా నామాతో ఏ సివిల్ కేసో , క్రిమినల్ కేసో వాడి వాళ్ళ మీద పెట్టేవాడిని . వాడూ అలాగే, చిత్రపు వెంకటచలం గారిని లాయరుగా పెట్టుకొని నా పార్టీ వాళ్ళ మీద కేసులు బనాయించే వాడు. మా యింటిది పోయాక నాకే విరక్తి వచ్చి, ఉన్న కేసులు ఉపసంహరించు కున్నా-- దాంతో తను కూడా విరోధం మాని స్నేహంగా వుంటున్నాడు ఇన్నాళ్ళ నుంచీ--"
"ఆహా....అలాగా?...మీ ఇద్దరికీ పాత కక్షలున్నాయన్న మాట ?...అలా చెప్పండి- అందుకే ఇంత దారుణానికి ఒడిగట్టాడు"
"కడతాడు కడతాడు -- ఒక్క మాటు వాడినీ, వాడి జనాన్ని కోర్టు కీడ్పించి మూడు చెరువులు నీళ్ళు తాగిస్తే సరి-- ఈ అన్యాయాలేవిటో , కొట్టించడాలేవిటో తెల్తాయి " అన్నాడు శేషయ్య పళ్ళు కొరికి కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ --
శేషయ్య ముఖంలో ఎప్పుడూ కనిపించని ఆ ఆగ్రహాన్ని చూసి శంకరం తెల్లబోయాడు . ధర్మరాజు లాంటి వాడు -- ఇతనికి కోపం వస్తే పట్టాన పోదు -- అనంతర పరిణామాలు ఎంత ప్రమాదకరంగా ఉంటాయో!.......
"పోనిద్దురు బావగారూ !....తగిలిన దెబ్బలు ఎలాగా తగిలాయి. కేసు పెడితే మనకి కలిసి వచ్చేదేమిటి ? కక్షలు కల్లోలం -- ఒకటిగా ఇప్పుడున్న ఊరు రెండుగా చీలిపోవడం -- అంతేకదా?"
"ఊళ్ళో అశాంతి రేగుతుందని గాజులు తోదిగించుకుని కూర్చుంటాముటండీ?..... వీల్లేదు...."
కొంచెం సేపు ఎవరూ మాట్లాడలేదు.
"మన గోపాలం ఇప్పుడు రాజమండ్రి లో ఉన్న పెద్ద వకీళ్ళ లో ఒకడయ్యాడు. రామనాదం గారు ఎలాగా పోయారు కనక ఈ కేసు వకాల్తా నామా గోపాలానికి ఇయ్యాలి అనుకుంటున్నా " అన్నాడు శేషయ్య--
'అలాగే చెయ్యండి -- మనవాడు -- బాధ్యతగా జేస్తాడు-- అందులో మీరంటే వాడికి నాలాగే గౌరవం" అన్నాడు శంకరం --
ఆ మాటతో శేషయ్య కి రెండేళ్ళ క్రితం పొలంలో కనిపించినప్పుడు గోపాలం తన పట్ల ప్రవర్తించిన తీరు జ్ఞాపకం వచ్చింది--
"నామీద గౌరవానికేం లెండి -- అన్నాగారు మీరంటే , ఆ భక్తీ, ఆ గౌరవం వేరు -- మీరు ముందు వెళ్లి గోపాలంతో ఈసంగతి అంతా ముచ్చటించి వకాల్తా నామాకి ఒప్పించి రండి -- ఆ తర్వాత నేను వెళ్తాను " అన్నాడు శేషయ్య . తనపట్ల గోపాలం ఎలా ప్రవర్తిస్తాడో అనే అనుమానంతో--
'అక్కర్లేదండీ ! మీరైనా నేనైనా ఒకటే -- ఓమారు ముందు ఒప్పించడం, తర్వాత వెళ్ళడం ఎందుకు?....అబ్బాయి ఇది నువ్వు చెయ్యాలి అని చెప్పే అధికారం మీకు లేదు కనకనా?..... అందువల్ల ఒకేసారి వెళ్లి వకాల్తా నామా పడేసి రండి -- మళ్ళీ నేను ముందు వెళ్ళడం అదీ ఎందుకు?"
"అలాకాదు -- నేను ఎందుకు చెప్పానో వినండి "
"సరే -- అలాగే మీ మాట ఎందుకు కాదనాలి -- తీర్ధం స్వార్ధం అంతా కలిసి వస్తుంది -- నేను ఎలాగా వెళ్ళాలి అనుకుంటున్నా"
"ఎలాగేనా ఈ కేసు గోపాలం నడిపేటట్టు చూడాలి -- ఆ బాధ్యత మీది--"
"మీకెందుకు -- గోపాలం అంగీకరించినట్టే -- సరేనా ?"
"మీరామాత్రం భరోసా ఇస్తేచాలు -- మీరు గట్టిగా చెప్తే గోపాలం అంగీకరించక పోడు -- ఈ మాటు ఆ మునసబు తడాఖా ఏదో చూద్దాం -- వెంకటచలం గారు పోయారు -- గోపాలానికి పోటీగా సుబ్బారావు గారినే పెట్టుకుంటాడో , మద్రాసు నుంచి లాయర్ నే తెచ్చుకుంటాడో !" అంటూ విజయ గర్వంతో నవ్వాడు శేషయ్య -- ఇంతలో కంపౌండరు వేసిన కేకకి ఇద్దరూ పరిగెట్టారు -- వెంకడి పరిస్థితి విషమించింది వాడి నేలాగేనా బతికించాలని సర్వ విధాలా ప్రయత్నం చేశాడు శంకరం. ఆరోజు గడిచింది -- అయిదారు రోజులు గడ్డు రోజులు గడిచాయి-- ఆ రోజున ఫరవాలేదు అనుకుంటుండగానే వెంకడు చనిపోయాడు. శేషయ్య గుండె మూర్దిల్లింది-- వెంటనే తొందర చేసి రాజమండ్రి పంపించాడు శంకరాన్ని కక్షగా అలా అనుకున్న రోజుకి వారం ఆలస్యంగా శంకరం రాజమండ్రి వెళ్ళాడు--
8
శేషయ్య చెప్పిన అనవాళ్ళ ప్రకారం ఆ గేటు దగ్గర ఆగి లోపలికి పరకాయించి చూశాడు శంకరం. ఓ పాతికేళ్ళ లోపు అమ్మాయి అశోక వృక్షం కింద సీత లాగ దిగాలు పడి మల్లె పందిర దగ్గర కూర్చుని ఉంది. తలడువ్వు కోక అరబెట్టు కుంటున్నా, కట్టుకున్న ఉతికి ఆరేసిన చీర నలిగి పోయి ఉన్నా మొహంలో లక్ష్మీ కళ ఉట్టి పడుతోంది. ఎవరో కాని చక్కని లక్షణ మైన పిల్ల అనుకున్నాడు శంకరం. ఒక్క క్షణం ఆ అమ్మాయిని చూస్తూ అలా ఉండి పోయి "రామనాధం గారి ఇల్లు ఇదేనా అమ్మా" అన్నాడు.
ఆ అమ్మాయి ఉలిక్కిపడి అటు చూసి "ఆ.....ఇదేనండీ లోపలికి రండి" అంటూ గేటు తీసి హాల్లోకి తీసుకు వెళ్లి సోఫా మీద కూర్చో పెట్టింది శంకరాన్ని -- "నీ పేరు ఎవరమ్మా?....రామనాధం గారు ఏమౌతారు నీకు" అంటూ కూర్చుంటూ సౌమ్యంగా అడిగేడు శంకరం.
"నా పేరు విజయండి. అయన మా మావయ్యే ! అయన రెండేళ్ళ క్రితం పోయారండీ" అంది గడప అవతల వినయంగా నిలబడి ఉన్న విజయ"
ఓహో! ...శేషయ్య అప్పుడప్పుడు చెప్పే విజయ ఈ అమ్మాయే అన్నమాట!.....అని మనస్సు లో అనుకుని "అవునమ్మా అయన పోయారని తెలుసు . నా పేరు శంకరం. నేను గోపాలం అన్నగారిని" అన్నాడు.
"ఆ!" అని ఒక్క క్షణం నివ్వెరపోయి చూసి "నమస్కారం అండీ" అంది తొట్రు పడుతూ విజయ. ఆ నమ్రత, ఆ వినయం చూసి శంకరం " పట్నవాసం వాళ్ళలో కూడా ఇంతమంచి పిల్లలున్నారన్న మాట!" అనుకున్నాడు మనస్సులో-
"ఉండండి ఇప్పుడే వస్తా" అంటూ వంటింట్లోకి వెళ్లి వెండి గ్లాసు తో కాగి చల్లారిన పాలల్లో పంచదార కలిపి తీసుకువచ్చి స్టూలు మీద పెడుతూ "తీసుకోండి" అంది.
"ఇప్పుడెం వద్దు అమ్మా"
"ఫరవాలేదు తీసుకోండి"
"అదికాదు -- నేను స్నానం చేస్తే కాని ఏం పుచ్చుకొను"
"అయితే నీళ్ళు కాగి వున్నాయి. లేవండి " అంది విజయ.
