Previous Page Next Page 
శాంతినికేతన్ పేజి 19

 

                                       20

    'ఇవ్వేళ సరదాగా అలా బోటుషైరు వెళ్దాం, రాజా. నువ్వెందుచేతో ఇదివరకులాగా సంతోషంగా ఉండడంలేదు" అన్నారు రాజా స్నేహితులు బెహరా, మోహన్.
    ఆదివారంనాడు తీరికగా కూర్చుని సల్పుతూన్న ఆ ఇష్టాగోష్ఠిలో శ్రీహరి కూడా ఉన్నాడు. "అవును ఇవ్వాళ సరదాగా వెళ్దాం" అంటూ అతడు బలపరిచాడు.
    "వెళ్ళండి మీరు" అన్నాడు రాజా.
    "ఎందుకిలా మారిపోయావ్, రాజశేఖరం?" అడిగాడు ఔహరా. "నువ్వే ఇదివరకు ఇటు వంటి కార్యక్రమాలు వేసేవాడివి."
    "మార్పు లేదు. నాకు వేరే పనుంది" అని తప్పించుకున్నాడు రాజా.
    "ప్రేమ వ్యవహారమేమీ బెడిసికొట్టలేదు కదా?" అడిగాడు మోహన్ నవ్వుతూ.
    "నోర్ముయ్యవోయ్." లేని ఉత్సాహం తెచ్చిపెట్టుకుంటూ నవ్వుతూనే అన్నాడు రాజా. కాని ఆ విసురు అతడికి, శ్రీహరికికూడ సూటిగా తగిలింది.
    స్నేహితులు వెళ్ళిపోయాక శ్రీహరి అన్నాడు! "బొత్తిగా నీ ధోరణి నాకు నచ్చటంలేదు, రాజా. నువ్వలా బొమ్మలా కూర్చుంటే నేను చూడలేక పోతున్నాను. నేను వేరే పోతాను."
    నవ్వాడు రాజా. "పో, చూద్దాం వెనుకపడి నేనూ వస్తాను. నువ్వు పొమ్మన్నా అక్క పొమ్మనదులే."
    శ్రీహరి నేత్రాలు చెమర్చాయి. "చదువు కొనేటప్పుడు కంటే ఏమిటో ఈ కలకత్తాలో కలుసుకున్నాక మరీ దగ్గరైపోయాం, రాజా మనం. ఆశ్చర్యంగా ఉంటుంది నాకు."

                              
    "నిజమే. నేనూ అలాగే అనుకుంటున్నాను. అయితే మనం తయారై వెళ్దామా?"
    "ఓ. వెళ్దామా!" సంతోషించాడు శ్రీహరి. "పాపం నీ స్నేహితుల నలా నిరుత్సాహపరిచావెందుకు మరి?"
    "వాళ్ళు రమ్మన్నచోటికి కాదు. విశ్వభారతికి. ఇవ్వాళ ఏడవ తారీకు. కార్యక్రమాలు ఉన్నాయి కదూ?"
    శ్రీహరి ముఖం ముడుచుకున్నాడు. "అక్కర్లేదు లెద్దూ, అక్కడికి."
    "ఏం?" ఆశ్చర్యపోయాడు రాజా. "శాంతి చిన్నబుచ్చుకోదూ?"
    నిర్లక్ష్యంగా నవ్వాడు శ్రీహరి. "అదా మన కోసం చిన్నబుచ్చుకోవడం, మనకోసం తపించడం! దాని లోకమే వేరు. నేను వెళ్తే రమ్మని చెప్పింది. ఏదీ ఆహ్వానం పంపించిందా? నిన్ను పిలిచిందా?"
    "అదేమిటి, శ్రీహరీ, చెల్లెలి విషయంలోనా పంతాలు? ఇలాగెప్పుడు మారిపోయావ్, నువ్వు? శాంతిని వారానికోసారి వెళ్ళి చూచి రమ్మని మీ నాన్నగారి ఆజ్ఞ! నువ్వక్కడకు వెళ్ళి పదిహేను రోజులైంది. ఆ సంగతైనా గుర్తు ఉందా?"
    శ్రీహరి మాట్లాడలేదు.
    కొద్దిసేపు మౌనంగా గడిచాక రాజా చటుక్కున తలెత్తాడు. "శ్రీహరీ, ఒక మాట. పోనీ, నువ్వు వెళ్ళు. నేను రావడంలో నీకు అభ్యంతరముందనుకుంటాను."
    దెబ్బతిన్నట్టు త్రుళ్ళిపడి చూచాడు శ్రీహరి, రాజా వైపు. కళ్ళు మూసుకుని ఒక్క నిశ్వాసం వదిలాడు బరువుగా. "ఇన్నాళ్ళకు నీకీ అనుమానం రావడం! ఆశ్చర్యంగానే ఉంది. బహుశః క్రిందటిసారి నేను ఒక్కడినీ శాంతినికేతన్ వెళ్ళడం మనస్సులో పెట్టుకుని నువ్వలా మాట్లాడుతున్నావనుకుంటాను. నా మనస్సులో సంగతి ఎప్పటికీ రహస్యంగా ఉంచాలనే అనుకున్నాను. కాని చెప్పకపోతే కోరిన బంధుత్వం గగనమైనట్లే మన స్నేహం కూడ ఎడారిలో నీరులా యింకిపోతుందేమోనని భయంగా ఉంది."
    కొద్దిసేపాగి చెప్పడం ప్రారంభించాడు శ్రీహరి: "ఒక రోజు అర్దరాత్రి వేళ చూస్తే నువ్వు మంచులో పూలమొక్కల మధ్య పరధ్యానంగా కూర్చున్నావ్ - గుర్తుందా? అప్పుడు నేను లోపలికి పిలుచుకొచ్చాను. మరోసారి బెనర్జీ వచ్చినవాడు నేను రవీంద్రుని చిత్రం గురించి అడిగితే చెప్పలేక బాధపడ్డావ్. ఆ రోజు నువ్వు భోజనంకూడా తిన్నగా చెయ్యలేదు. రాత్రి ఒంటిగంటకు నాకు మెలకువ వచ్చేసరికి నువ్వు ముఖం మీద ఏదో పుస్తకం పెట్టుకుని నిద్ర పోతున్నావ్. తీసి ప్రక్కనపెట్టి లైటు తీసేద్ధామని లేచాను నేను. నీ చెక్కిళ్ళపై కన్నీటి చారలు. పుస్తకం తఃదిసి ఉంది. తలగడ తడిసి పోయింది. అప్పుడు నేను పడ్డ బాధ ఏమని వర్ణించను? సరే, నీ చిత్రలేఖనం మూల పడింది. ఇల్లూ, ఆఫీసూ మినహా స్నేహితులందర్నీ వదులుకున్నావు వినోదాలన్నీ మానుకొన్నావు. ఓ సినీమా అయినా చూడడంలేదు. ఎందుకిలా బాధపడాలి నువ్వు? సుఖంగా సాగిపోయే నీ జీవిత మిలాగవడానికి నేనూ, నా చెల్లెలేగా కారణం? మేము ఎదురుగా ఉంటే నీకీ బాధ నిత్యం రేగుతూనే ఉంటుంది. అందుకే ఆ రోజు శాంతిని చూసేందుకు వెళ్ళినప్పుడు నీకు తెలియనీయలేదు. నేను కూడ ఇక్కడి నుంచి బదిలీ చేయించుకు పోవాలనుకుంటున్నాను."    
    బరువుగా వింటూన్న రాజా, శ్రీహరి ఆఖరి మాటలకు ఉలిక్కిపడ్డాడు. "వెళ్ళిపోతానా?" అని కుర్చీలోంచి ముందుకు వంగి అతడి చెయ్యి పట్టుకున్నాడు.
    మెల్లగా చెయ్యి విడిపించుకున్నాడు శ్రీహరి. "పద వెళ్దాం" అని లేచాడు.
    "వెళ్ళవు కదూ?" తిరిగి అడిగాడు రాజా, శ్రీహరి దగ్గరగా వెళ్ళి.
    "వెళ్ళను, రాజా, వెళ్ళను." ద్రవించి పోతున్న హృదయంతో రాజాను చేతులతో చుట్టేసి కన్నీళ్ళు కార్చాడు. "మనది అపూర్వ స్నేహం, రాజా. నిన్ను వదలను."

                                    21

    శ్రీహరీ, రాజా వచ్చినట్టు తెలిసి సంతోషంగా గ్రీన్ రూమ్ లోనుంచి వచ్చింది శాంతి. "వచ్చారా? రారనుకున్నాను" అంటూ గోవింద రావును పిలిచి పరిచయం చేసింది.
    "నమస్తే." లాంఛనప్రాయంగా అని "ఐయామ్ వెరీ బిజీ. ఎక్స్యూజ్ మీ" అంటూ వెళ్ళిపోయాడు గోవిందరావు.
    శ్రీహరికీ, రాజాకూ మర్యాదలు చేసే బాధ్యత ఒక విద్యార్ధి స్వచ్చందసేవకునికి అప్పజెప్పి తానుకూడ గ్రీన్ రూమ్ లోకి వెళ్ళిపోయింది శాంతి. ఎందుకో శ్రీహరి ఆకసం వైపు దృష్టి సారించి అస్పష్టంగా నిట్టూర్చాడు.
    రంగస్థలంపై నటించటం అదే ప్రథమ పర్యాయమైనా చాలా బాగా చేసింది శాంతి. బంగరుఛాయతో మిసమిసలడుతూ సన్నగా పొడవుగా ఉండి సౌందర్యానికి నిర్వచనం చెప్పే శాంతి 'వసంత కన్య' భూమికకు ఎంతైనా తగింది. ప్రకృతి పురుషుడుగా గోవిందరావు అందరి మన్ననలకూ పాత్రుడయ్యాడు. విదేశీ అతిథులుకూడ చాలా ముగ్ధులయ్యారు. ఆ వసంత కన్య, ఋతురంగా నాటికలను చూచి, అసలు ఆ రంగస్థలాలంకరణకే ముగ్ధులై పోయారు. తర్వాత మనోరమ నాట్యప్రదర్శనం జరిగింది. ఇంకా నాలుగైదు నాట్యాలుకూడ ప్రదర్శింపబడ్డాయి.
    కార్యక్రమం అంతా ముగిశాక మనోరమను రాజాకూ, శ్రీహరికీ పరిచయం చేసింది, శాంతి.
    "చాలా బాగుంది మీ నాట్యం. ఎంతకాలం మండి నేర్చుకుంటున్నారు?" అడిగాడు రాజా.
    అసలే చలాకీగా ఉండే మనోరమ హాస్యంగా జవాబిచ్చింది. "ఎంతకాలంనుండి ఈ బందిఖానాలో ఉన్నానని అడగండి" అంటూ నవ్వింది.
    ఆ జవాబుకు శ్రీహరీ, రాజా ఆశ్చర్య పోయారు. శాంతి విషయం వివరించింది.
    "ఓ. అయితే త్వరలో శ్రీమతి కాబోతున్నా రన్నమాట. అభినందనలు" అన్నాడు రాజా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS