Previous Page Next Page 
డెత్ ఛాంబర్ పేజి 20


    సెట్స్ మీద విరామ సమయంలో ఆ చిత్రంలో ఆమె ప్రక్కన హీరోగా నటిస్తున్న కౌశల్ ఓ రోజు ఆమెను అడిగేశాడు.
    "ఏమిటి ఈమధ్య అలా డల్ గా వుంటున్నారు?"
    "ఏమీ లేదు" అబద్దంచెప్పేసింది చంద్రిక.
    "సరే! నాకు అబద్దాలు చెపితే మీకు ఆడపిల్లలుపుడతారు. గుర్తు వుంచుకోండి" అన్నాడతను నవ్వుతూ.
    చంద్రిక కూడా నవ్వేసింది.
    "మీరు నెంబర్ వన్ పొజిషన్ లో ఉండి కూడా ఇలా డల్ గా వుండటం ఏమీ బాగుండలేదు. నన్ను చూడండి! నా స్వంతచిత్రాలు రెండు ప్లాప్ అయినా ..... ఆస్థంతా పోయి అప్పుల్లో చిక్కుకున్నానేనేమయినా జంకానా? అదివరకు ఎలా వుండేవాడినో ఇప్పుడూ అలాగే వున్నాను" అన్నాడు.
    చంద్రిక మాట్లాడలేదు.
    "చంద్రిక గారూ! మీకో విషయం చెప్పమంటారా! మీలాంటినటికి మీ సత్తా చూపగల సినిమా  ఎవరూ తీయలేదింతవరకూ మీ మొదటి పిక్చరు చూసినప్పట్నుంచీ నేను ఆ ఆలోచనలో ఉన్నాను. మీ ప్రతిభనంతా ప్రదర్శించగల కథతీసుకుని నేను సినిమా తీస్తాను. అఫ్ కోర్స్! ఆ సినిమా ఫ్లాప్ అయినా సరే! నేను పూర్తిగా అప్పుల్లో మునిగిపోయినా సరే" అన్నాడతను.
    చంద్రిక ఆశ్చర్యపోయింది. తన నటనమీద అతనికి అంత అభిమానం వుందని తనకుతెలీదింతవరకూ.
    "ఏమీ మాట్లాడరేమిటి? నా మాటలు అబద్దాలనుకుంటున్నారా? చూస్తూండండి! ఎన్నాళ్ళోకాదు, మరో రెండు మూడునెలల్లో ప్రారంభిస్తాను ఆ పిక్చరు" తిరిగి అన్నాడతను.
    చంద్రిక నవ్వింది.
    "మీ మాటలు అబద్దాలనుకునేంత సాహసం లేదునాకు"
    "మీతో ఇంకో విషయం కూడా చెప్పాలనివుంది. కాని ఇప్పుడు కాదు, మరోసారి చెపుతాను"
    "ఏమిటది?" మరింత ఆశ్చర్యంగా అడిగింది చంద్రిక.
    "భలేవారే?" ఇప్పుడే చెప్పనంటూంటే- 'ఏమిటది' అంటూ మళ్ళీ అడుగుతారేం?" చిలిపిగా అన్నాడతను.
    "ప్లీజ్! నేను సస్పెన్స్ భరించలేను. చెప్పరూ!" బ్రతిమాలసాగింది చంద్రిక.
    "నోనోనో! దానికి సమయం సందర్భం వుండాలి"
    ఈలోగా మళ్ళీ షాట్ కి పిలుపు రావటంతో ఇద్దరూ అక్కడ్నించి కెమెరా ముందుకు చేరుకున్నారు. మర్నాడు ఉదయం ఆమె నిద్రలేచి స్టూడియోకు వెళ్లేందుకు సంసిద్దమౌతూండగా హటాత్ గా వాంతిఅయింది. మరి కొద్ది సేపటి తర్వాత మరో వాంతి. కడుపులో తిప్పుతున్నట్లు అనిపించసాగింది. దానర్ధం తేలికగా తెలిసింది.
    సినిమాల్లో అలాంటి సీన్లు చాలా చేసింది. వెంటనే డాక్టర్ కి ఫోన్ చేసిందామె. లేడీడాక్టర్ మరో అరగంటలో అక్కడికి చేరుకుంది.
    చంద్రికను పరీక్షించి ఆమె గర్భవతి అన్న విషయం నిర్ధారించింది.
    చంద్రిక మనసులో అలజడి చెలరేగింది.
    స్టూడియోకి వెళ్ళబుద్ది కావటం లేదు. ఇప్పుడు తనేం చెయ్యాలో అర్ధం కావటంలేదు. తనకూ, ప్రేమ్ కుమార్ కూ మధ్యవున్న సంబంధం చాలామందికి తెలుసు. అయినా అవివాహితురాలైన తను గర్భవతి అయ్యిందన్న విషయం తెలిస్తే ఎంత అవహేళన? ఎంత  నవ్వులపాలు అవుతుంది తను?
    ముందు ఈ విషయం ప్రేమ్ కుమార్ కు తెలియచేయాలి. అతనే ఇప్పుడు ఆలోచించాలి, ఏం చేయాలో నిర్ణయించాలి. తనేమీ ఆలోచించేస్థితిలో లేదు.
    కారు తనే డ్రైవ్ చేసుకుంటూ ప్రేమ్ కుమార్ ఇంటికి చేరుకుంది. అతని భార్య ఆమెను చిరునవ్వుతో పలకరించింది.
    "చాలారోజుల తర్వాత వచ్చారు!"
    "అవును ప్రేమ్ కుమార్ గారున్నారా?"
    ప్రేమ్ కుమార్ తనగదిలో కూర్చుని టేప్ రికార్డర్ పాటలు వింటున్నాడు.
    చంద్రికను చూడగానే "రా కూర్చో" అన్నాడతను.
    "ఏమిటి ఫోన్ కూడా చేయకుండా వచ్చేశావ్?" అడిగాడతను.
    "పెద్ద గొడవొచ్చిపడింది. ఏమి చేయడానికీ తోచక ఇలా వచ్చేశాను"
    "ఏమయిందసలు?"
    "ఉదయం వాంతులయితే డాక్టర్ ని పిలిచాను. ఆమె ఎగ్జామిన్ చెసి నేను గర్భవతినని చెప్పింది"
    అతను నవ్వాడు "ఈ మాత్రానికేనా అంత బెదిరిపోయావ్?" తాపీగా అన్నాడు.
    "భలేవారే! ఇదేంఅంత చిన్న విషయమా?"
    "కాకపోతే ఏమిటి?"
    చంద్రికేం మాట్లాడాలో తెలీలేదు.
    "సరే! ఇప్పుడేం చేద్దామంటారో చెప్పండి?" అంది అతనిమనస్తత్వం అర్ధంగాక.
    'దీంట్లో పెద్దా ఆలోచించేదేముంది? రేపే అబార్షన్ చేయిస్తే సరిపోతుంది"
    చంద్రిక తృళ్ళిపడింది.
    అబార్షన్ చేయించుకోవాలా? అది అంత తేలికయిన విషయమా? ఈ విషయం బయటకు తెలిస్తే తన పరిస్థితి ఏమిటి? ఎంత అసహ్యంగా వుంటుంది! అవన్నీ అతనికి అవసరం......అతనికి కావలసింది తన శరీరంగాని ఇలాంటి సమస్యలు కాదు.
    "సరే! మీ ఇష్టం! మీరెలా చెపితే అలా చేస్తాను" కోపం అణచుకుంటూ అందామె.
    "నాకు తెలిసిన డాక్టరుకి నర్సింగ్ హోమ్ వుంది. అక్కడ రెండురోజులు ఉంటే సరిపోతుంది. నేను ఫోన్ చేసి మాట్లాడతాను" అంటూ ఫోన్ దగ్గరకెళ్ళి ఏదో నంబర్ డయల్ చేశాడతను.
    హఠాత్తుగా రిసీవరు లాక్కుని మళ్ళీ దాని స్థానంలో వుంచేసింది చంద్రిక.
    "ఏమిటిది?" ఆశ్చర్యంగా అడిగాడతను.
    "ఇలాంటివి ఫోన్ లోనా! వద్దు ఇద్దరం వెళదాంరండి!"
    అతను కొద్ది క్షణాలు మాట్లాడలేదు.
    "ఏమిటి ఆలోచిస్తున్నారు?" అసహనంగా అడిగింది చంద్రిక.
    "నేనెందుకు రావడం?" తనకేమీ సంబంధంలేనట్లు అడిగాడతను.
    "దీనికి అర్ధం బాధ్యులం కాబట్టి!"
    "ఇప్పుడా బాధ్యతల విషయం ఎందుకు?"
    "మీరిచ్చిన మాటనిలుపుకోలేదు కాబట్టి!"
    "ఏమిటది?"
    "ఆ రోజు రాత్రి ఏం చెప్పారో గుర్తుకు తెచ్చుకోండి!"
    "చంద్రికా! మన వివాహం ఆచరణయోగ్యం కాదని తరువాత నీకు చెప్పాను. మళ్ళీ ఆ విషయం ఎందుకు మాట్లాడతావ్? అయినా మనం వివాహంకోసంకాదు ఒకటయింది. ఒకరినొకరు ప్రేమించుకున్నాం. దగ్గరయ్యాం. కావలసిన సుఖాలు పొందాం. దీనికి వివాహంతో సంబంధమేమిటి?"
    చద్రికకు కళ్ళవెంట నీళ్ళు తిరిగాయి కాని బలవంతంగా దుఃఖం ఆపుకుంది.
    "అవును మీకు కావలసిందేమిటో మీరు తీసుకున్నారు. అక్కరలేనిది వదిలేస్తున్నారు. మీకింక ఆనాటి మాటలేం గుర్తుంటాయ్! ఉన్నా అదీ నటనలో ఓ భాగం! అంతే!"
    "చంద్రికా! ఈ మాటలన్నీ అవసరం నువు డాక్టరు దగ్గరకు వెళితే నష్టం ఏమిటి? ఏర్పాట్లన్నీ నేను చేస్తున్నాను కదా!"
    "సరే! అలాగే వెళతాను. కానీ ముందు మనవివాహం జరగాలి. ఆ తరువాతే అబర్షన్ చేయించుకుంటాను" మొండిగా అందామె.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS