Previous Page Next Page 
డెత్ ఛాంబర్ పేజి 19


    ఆమెకది చిన్నతనంగా తోచింది. మరో పక్క తన తండ్రికీ, శాంతమ్మ కూ కూడా అనుమానంగా వుండి వుంటుందన్న ఆలోచన మనశ్శాంతిని కరువు చేస్తోంది.
    తామిద్దరూ వివాహం చేసుకోబోతున్నారన్న విషయం వారెవరికీ తెలీదు. తెలిసేంత వరకూ తామిద్దరి మధ్య పెరిగిపోతున్న అనుబంధంవారికి తప్పక అనుచితంగా కనబడుతుంది. తనమీద తేలికభావం ఏర్పరుస్తుంది.
    ప్రేమ్ కుమార్ సంగతేమోగాని తను మాత్రం అతనిని ఒక్క రోజయినా చూడకుండా వుండలేని పరిస్థితికొచ్చింది.
    ఒకవేళ ఇద్దరూ షూటింగులతో బిజీగా వుంటే ఫోన్ చేసి ఐనా మాట్లాడుకోవలసిందే.
    చంద్రిక, ప్రేమ్ కుమార్ నటించిన చిత్రాలు వరుసగా విజయవంతమయ్యేసరికి చంద్రికకు తీరికలేనంత పని ఎక్కువయిపోయింది.
    ఎయిర్ కండిషనర్ కారు కొనుక్కుందామె.
    తన తండ్రి జగన్నాధ్ సెక్రటరీ శ్రీనివాసరావ్ నడిగి ఎంతడబ్బు తీసుకుంటున్నదీ ఓసారి గమనించి తెల్లబోయిందామె. నెలకు సుమారు ఐదారు వేలు ఖర్చు చేస్తున్నాడతను. వెంటనే శ్రీనివాసరావుని పిలిచింది.
    "మా నాన్నగారికి ఎందుకంత పెద్దమొత్తాలు ఇస్తున్నావ్?" కోపంగా అడిగిందామె.
    "మీరు ఎప్పుడూ ఇవవద్దని అనలేదు కదండీ!" చంద్రిక కేం చెప్పాలో తెలీలేదు.
    "సరే! ఇప్పుడు చెపుతున్నాను. ఇక ముందు ఆయనకేమీ ఇవ్వకు!" అంది అతనితో.
    "సరేనండీ!" అతను వెళ్ళిపోయాడు.
    ఆ రోజు రాత్రి చాలాసేపటివరకు మేలుకుని తండ్రికోసం ఎదురు చూడసాగిందామె.
    రాత్రి రెండుగంటలకు అతనిని ఎవరో టాక్సీలో తీసుకువచ్చారు. నడవడమే కష్టంగా వుందతనికి." ఇలా అర్ధరాత్రి వరకూ తాగి తందనాలాడటం ఏదయినా బావుందా మీకు?" కోపంగా అడిగిందామె.
    "తప్పేముంది? నువు చేసే పనులకన్నా నయమే ఇది!" తూలుతూ అన్నాడతను.
    అతను తనకూ ప్రేమ్ కుమార్ కూ మధ్య వున్న సంబంధం గురించే అలా మాట్లాడుతున్నాడన్న విషయం అర్ధమైపోయింది.
    "ఏమిటి నేను చేస్తున్న తప్పు!" కోపంగా అడిగింది ఆమె.
    "నీ మనసుకి నీకు తెలుసు. మళ్ళీ నాతో చెప్పించడం ఎందుకు?"
    "నాకు తెలిసి నేనే తప్పూ చేయడంలేదు!"
    "ఓహో! నీకంత ముచ్చటగా వుంటే అలాగే చెపుతాను. ఆ ప్రేమ్ కుమార్ తో రాత్రుళ్ళు గడపటం తప్పులా కనబడటంలేదా?"
    "అందులో తప్పేమీలేదు. నేనూ...అతనూ ప్రేమించుకున్నాం. పెళ్లి చేసుకుంటున్నాం!"
    అతను ఆశ్చర్యపోయాడాజవాబుకి.
    "పెళ్ళా?"
    "ఔను!"
    "ఎలా? అతనికి ఇదివరకు పెళ్ళయింది కదా!"
    "ఐనా ఫరవాలేదు."
    అతనింకేమీ మాట్లాడలేదు. అక్కడినుంచి నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ తన గదిలో కెళ్ళిపోయాడు.
    వెంటనే ప్రేమ్ కుమార్ ఇంటికి ఫోన్ చేసిందామె. తమ వివాహం వెంటనే జరగడం ఇరువురికీ శ్రేయస్కరం. లేకపోతే అసహ్యంగా నలుగురూతమ గురించి చెప్పుకోవడం ప్రారంభమవుతుంది.
    "హలో....." స్త్రీగొంతు మాట్లాడింది.
    "నేను చంద్రికను మాట్లాడుతున్నాను. ప్రేమ్ కుమార్ గారున్నారా?"
    "నిద్రపోతున్నారు!"
    "ఒకసారి లేపి మాట్లాడమని చెప్పండి!"
    "ఊహు! రేపు ఉదయం ఫోన్ చేయండి మళ్ళీ...." ఫోన్ పెట్టేసిందామె.
    మాట్లాడింది ప్రేమ్ కుమార్ భార్య అని తనకు తెలుసు. తనకూ ప్రేమ్ కుమార్ కూ మధ్యవున్న బాంధవ్యం కూడా ఆమెకు తెలుసు. చేసేదేమీలేకనిద్రపోవడానికి ప్రయత్నించసాగింది చంద్రిక.
    తిరిగి ఉదయం ఆరుగంటలకు ఫోన్ మోగుతుంటే మెలకువ వచ్చింది.
    "హలో!" అంది పడుకునే ఫోన్ అందుకుని-
    "ఏమిటి అర్ధరాత్రి పిలిచావుట?" ప్రేమ్ కుమార్ మాట్లాడాడు.
    "మీతో మాట్లాడాలనిపించింది."
    "ఏమిటంత అర్జంటువిషయం!"
    "మీరు రాకూడదూ?"
    "మీరు రాకూడదూ?"
    "సరే గంట సేపట్లో వస్తాను" ఫోన్ పెట్టేశాడతను.
    తను లేచిరెడీ అయి అతనికోసం ఎదురు చూడసాగిందామె. మరి కాసేపట్లో అతని కారు ఇంటిముందాగింది. ఇద్దరూ మేడమీద కెళ్ళారు.
    "ఏమిటో ఇప్పుడు చెప్పు!"ఆమెను తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటూ అడిగాడతను.
    "నిన్నరాత్రి మాఫాదర్ తో ఓ చిన్న గొడవ అయింది" నవ్వుతూ అందామె.
    "ఏమిటది?"
    "ఆయన తాగి ఆలస్యంగా ఇంటికొస్తే మందలించబోయాను. ఆయనేమన్నారో తెలుసా? నేను చేసే తప్పుకంటే ఎక్కువేమీ చేయడంలేదటతను. అంటే అర్ధమయిందికదా!"
    "ఆ! కానీ ఇందులో నువ్వంత ఖంగారు పడాల్సిందేముందీ?"
    "భలేవారే! కన్న తండ్రిముందు దోషిలా నిలబడడం చిన్నతనంగా వుండదూ!"
    "ఓహో! అర్ధమయింది. ఇప్పుడేంచేద్దామంటావో చెప్పు!"
    "మనం వివాహం చేసుకుంటే బావుంటుంది!"
    "నిజమేననుకో! కానీ ఇప్పుడు ఇలా కలిసివుంటే మాత్రం ఏమైంది?"
    "అది వేరు, ఇది వేరు కాదా! ఇలాగయితే నలుగురూ మన గురించి చెడుగా అనుకునే అవకాశం వుంది."
    "కానీ చంద్రికా! మనం వివాహం చేసుకుంటే మన ఇద్దరికీ నష్టం!"    
    చంద్రిక త్రుళ్ళిపడింది.
    "ఏమిటది?"
    "మనం వివాహం చేసుకుంటే ఎలాగూ పత్రికలవాళ్ళు ప్రచురించక మానరు. ప్రేక్షకులకు నేనిలా భార్యాబిడ్డలుండగా నిన్ను వివాహం చేసుకున్నానని తెలిస్తే వాళ్ళకు మనిద్దరిమీదా అంతవరకూ వున్న అభిమానం కాస్తా పోతుంది. కట్టుకున్న భార్యాబిడ్డలకు అన్యాయం చేశాడే అన్న అపవాదు నాకు! అతనిని భార్యాబిడ్డలనించి విడదీసింది అన్న అపవాదు నీకూ రాకతప్పదు. ఇలా ఇద్దరికీ చెడ్డపేరొస్తే అది మనకూ, మనల్ని నమ్ముకుని చిత్రాలు ప్రారంభించిన ప్రొడ్యూసర్స్ కీ కూడా నష్టం! కనుక మనం ఇలాగడిపితేనే బాగుంటుంది. నువు కూడా ఆలోచించిచూడు. నేను చెప్పిన మాటలు నిజమేనని నువ్వే ఒప్పుకుంటావు" వివరిస్తూ అన్నాడతను.
    చంద్రిక ఏమీ మాట్లాడలేదు.
    అతని మాటలు ఓ విధమైన అశాంతిని కలుగచేశాయి. ఎప్పటికప్పుడు "త్వరలో మనం వివాహం చేసుకుందాం" అంటూ అతను చెప్పిన మాటలను నమ్మి ఆ మంచిఘడియకోసం ఎదురుచూస్తూ వచ్చింది తను.
    కానీ ఇప్పుడు అతను ఈ విధంగా మాట్లాడటం భరించలేకపోతోంది.
    మరి కొద్ది రోజులు గడిచిపోయినయ్.
    చంద్రికకు మనసులో అదివరకటి ఆనందం, ప్రశాంతత లేదిప్పుడు, ఏదో తెలియని లోటు ఆమెని వేధిస్తోంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS