"ఉహు! అది సాధ్యంకాదు!"
"బహుశా ఇప్పుడు నన్ను మించిన అందమైన అమ్మాయిలింకెవరయినా మీ వలలో పడివుంటారు.....అందుకని ఆ పాఠం నా దగ్గర ఇక వల్లించరు. నన్ను ఎలాగోలా వదిలించుకోవడమే మీక్కావలసింది. అంతేకదూ!"
"ఆ మాటే నేనూ అంటే....? నువు ప్రస్తుతం కౌశల్ తో ప్రణయ కలాపాలు జరుపుతున్నావనీ, ఈ గర్భం అతనివల్లవచ్చిందనీ నేనూ అనగలను! నిజంచెప్పు! నీకూ కౌశల్ కూ సంబంధం లేదా?" అడిగాడు అతను సూటిగా.
చంద్రికకు నోటమాటరాలేదు కొద్దిసేపు.
"కౌశల్ తో నాకు సంబంధం వుందా?"
"ఏ సంబంధమూ లేకుండానే మీరిద్దరూ కలసి హోటల్లో డిన్నర్ కెళ్ళారా? అతను నీ కోసం అన్నిసార్లు మీ ఇంటికి రావల్సిన అవసరం ఏమిటి?"
అతని మాటలవెనుక అంతరార్ధం చంద్రికకు బోధపడింది. తనిప్పుడు అతనికి పనికిరాని వస్తువు అంతే! ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా తనను వదిలించుకోవాలి. అదీ అతని ధ్యేయం.
"ఇంత నీచ ప్రవృత్తిగల మిమ్మల్ని ప్రేమిచడంనా తప్పు. వస్తాను!" అనేసి అక్కడినుంచి బయటకు నడిచింది చంద్రిక. సాయంత్రం వరకూ స్టూడియోలో నే గడిచిపోయింది. స్టూడియో నుంచి డ్రయివర్ ని ఇంటికి పంపించివేసి తనే కారు నడుపుకుంటూ తనకు బాగా పరిచయమున్న సరోజిని ఇంటికి చేరుకుందామె.
ఆమెను చూస్తూనే సరోజిని ఆదరంగా ఆహ్వానించింది.
సరోజిని డాక్టర్ ఆమె చంద్రిక అభిమాని చాలాసార్లు చంద్రిక యింటికివచ్చి ఆమెతో స్నేహం పెంపొందించుకుందామె.
చాలాసార్లు చంద్రికను తన ఇంటికి విందులకు ఆహ్వానించింది. తనే స్వయంగా వచ్చి బలవంతంగా ఆమెను తీసుకెళ్ళింది రెండుమూడుసార్లు.
"మీ అంతట మీరు వచ్చారంటే నమ్మశక్యం కావడంలేదు" అందామె ఆనందంగా.
చంద్రిక మందహాసం చేసింది.
ఇద్దరూ లోపలికి నడిచిసోఫాల్లో కూర్చున్నారు.
చంద్రికకు అసలు విషయం చెప్పడానికి బిడియంగా వుంది.
"అనుకోకుండా ఓ పెద్ద శిక్షపడింది నాకు. మీకు సహాయంచేస్తేనే గాని ఈ గొడవలోనుంచి బయటపడలేను."
'ఏమిటది!"
"నేను ప్రెగ్నెంట్ అయ్యాను. ఈ విషయం బయటపడిందంటే అందరిలోనూ ఎంత అసహ్యంగా వుంటుందో మీకు తెలుసు. నన్నీ అసహ్యకరమైన పరిస్థితి నుంచి వెంటనే తప్పించాలి మీరు. మీ కంటే ఆప్తులింకెవరూ లేరుకదా నాకు".
"ఈ మాత్రానికేనా అంతగా బిడియపడుతున్నారు? యిందులో మీరు చిన్నపోవాల్సిన విషయమేముంది? ఎన్నో విపరీత పరిస్థితుల్లో వుండికూడా ఇలాంటి బలహీనతలకు లొంగిపోయిన వారెందరో తెలుసు నాకు. మరి యింతటి గ్లామరస్ ప్రపంచంలో వుంటూ కూడా యింత కాలం మీరు వీటన్నిటికీ దూరంగా గడపగలిగారంటే మీ ఔన్నత్యమే యిది. మీరు నా సోదరిలాంటివారు. మీరింక ఎలాంటి భయమూ పెట్టుకోకండి. మీరు రెండురోజులు నా అధీనంలో వుండాలి. అంతే! మిగతాదంతా నేను చూసుకుంటాను. ఆ రెండు రోజులూ మాయింట్లోనే మీ మకాం. మరిమీకెప్పుడు వీలవుతుందో చెప్పండి. నాదేం ఆలస్యం లేదు" ఎంతో ఆప్యాయాభిమానాలతో మాట్లాడిందామె.
చంద్రికకు పెద్ద భారం తొలగిపోయినట్లయింది.
"థాంక్యూ వెరీమచ్! ఇప్పుడు గాని నా మనసు మనసులో రాలేదు. అలాగయితే రేపు మా ప్రొడ్యూసర్ కి ఫోన్ చేసి రెండురోజులు టైం ఎప్పుడిస్తారో అడుగుతాను. అప్పుడు మళ్ళీ మీకు ఫోన్ చేసి చెప్తాను!"
"అలాగే!"
ఆ రాత్రి మళ్ళీ నిద్రపట్టలేదామెకి. ప్రేమ్ కుమార్ మీద కోపంరాన్రాను పెరిగిపోతోంది. అతనినలా వదిలేస్తుందనీ, జరిగింది ఎవరి తోనూ చెప్పుకోలేక కుమిలిపోతుందనీ అనుకున్నాడేమో!
కానీ తను మొండిది. తన పరువు ప్రతిష్టలు సర్వనాశనమైనా ఫర్వాలేదు. అతనికి మాత్రం బుద్దిచెప్పాలి.
అదెలాగో కూడా తనకు తెలుసు. అతనికీ తనకూ మధ్యవున్న సంబంధం గురించీ, అతను తనను వివాహం చేసుకుంటానని యిచ్చిన మాటగురించీ, మాయ మాటలుచెప్పి తనను లొంగదీసుకోవడం గురించీ అన్నీ ఫిలిమ్ జర్నలిస్టులకు చెప్పాలి. ఈ విషయాలన్నీ అన్ని పత్రికల్లోనూ ప్రచురింపబడితే అప్పుడుగాని తనకు మనశ్శాంతివుండదు.
అందువల్ల తనకూనష్టం కలుగుతుంది. అయినా సిద్దమే. ఎందుకంటే అది తనకంటే ఎక్కువ చెరుపు అతనికి కలిగిస్తుంది. ప్రజల్లో అతని పట్ల వున్న అభిమానం కాస్తా వ్యతిరేకభావంగా మారుతుంది. అతని భవిష్యత్తు పైయిది పెద్ద విఘాతంగా మారినా తను ఆశ్చర్యపడదు.
ఉదయం ఆమె నిద్రలేచేసరికి ఎనిమిదైపోయింది. సరిగ్గా అప్పుడే ఫోన్ మోగసాగింది.
"ఎవరు?" ఫోన్ అందుకుని అడిగింది చంద్రిక.
"నమస్కారమండీ! నేను 'తార' జర్నలిస్టుని మాట్లాడుతున్నాను."
"నమస్తే! ఏమిటో చెప్పండి?"
"మీ ఇంటర్ వ్యూ కావాలి మీకు ఎప్పుడు వీలవుతుందో చెపితే...."
"వెంటనే రండి మరోగంట దాటితే నేను స్టూడియోకి వెళ్ళాలి మరి."
"థాంక్స్! ఇప్పుడే బయల్దేరుతున్నాను."
ఫోను పెట్టేసిందామె.
"ఇవాళ తను చెప్పేవార్త మరో నాలుగు రోజుల్లో తెలుగు దేశమంతాపాకిపోతుంది" కసిగా అనుకుంది.
మరి కాసేపట్లో జర్నలిస్టురానే వచ్చాడు.
అప్పటికి కాఫీ ఫలహారం ముగించిందామె.
"మాసపత్రికకు ఈసారి కవర్ ఫోటో మీది వేస్తున్నామండీ. అందుకని మీ గురించి క్లుప్తంగా చెపితే 'ముఖచిత్రం గురించి"లో ప్రచురిస్తాం" అన్నాడతను.
"నా గురించిన అన్ని వివరాలూ అన్ని పత్రికలూ రాసినయ్. వాటి బదులు ఒక సెన్సేషనల్ వార్త చెపుతాను. ప్రచురించేధైర్యం వుంటే ప్రచురించండి" చంద్రిక అంది తెగింపుగా.
అతను ఆశ్చర్యపోయాడు.
ఇది మొదటిసారి ఓ తెలుగుతార సెన్షేషనల్ న్యూస్ గురించి మాట్లాడడం, చెప్పడం.
"చెప్పండి" అన్నాడు తను నోట్ బుకే తీసి రాసుకోడానికి సిద్దమవుతూ.
"మీరు తెరపైన ప్రేమకధలు చూశారు కదా! అందులో సాధారణంగా హీరో, హీరోయినూ ప్రేమించుకోవడం,. హీరోయిన్ కి గర్భం రావడం, హీరోపారిపోవడం ఇలాంటి కధలు కూడా చూసేవుంటారు. కానీ తెరవెనుక కూడా ఒకోసారి ఇలాంటి కధల్లో పాత్రలవుతూంటారు. అదే నేను మీకు చెప్పదల్చుకున్న కధ.
ఒక ప్రఖ్యాత తారను ఒక ప్రఖ్యాత హీరోపెళ్ళి చేసుకుంటానని మాయమాటలు చెప్పాడు. ఆమెను నమ్మించాడు. ఆమెను శారీరకంగా లొంగదీసుకుని అనుభవిస్తూరోజులు గడిపాడు. ఎంత కాలమయినా వివాహంమాటే ఎత్తకపోయేసరికి ఆమెకు అనుమానం వచ్చింది. వివాహం గురించి అతనిని నిలదీసింది. అప్పుడా హీరో తెరమీద కధలాగానే "నీకు నాకూ ఎటువంటి సంబంధమూలేదని తప్పించుకున్నాడు "చెప్పండి ఆపింది చంద్రిక.
జర్నలిస్టు ఖంగారుపడ్డాడు ఆమె కోపం చూస్తే ఆ హీరోయిన్ మరెవరోకాదని ఆమేననీ తెలిసిపోతోంది.
