లంచాలుపెడితే మంచాలువేసే ఈరోజుల్లో గుడిలో హత్యలు చేయటం కురైపతి తొందరపాటు తెలివితక్కువ చర్య. గతం మనకి ఏవిధంగానూ ఉపయోగపడదు. ఉపయోగపడకపోగా మార్గమంతా గాజు పెంకులు పోసిన ట్టుతయారైంది.
ఆ గాజుపెంకులు నా కాళ్ళలో గుచ్చుకోకుండా నేనెంత జాగ్రత్తగా అడుగులు వేస్తూ పెంకులని ఏరిపారేసేట్టు ముందుకు అడుగులువేయాలి. ఏకాస్త తొందరపడ్డా కళ్ళు మూసుకు నడిచినా అడుగడుగునా ఉన్న ఈగాజు పెంకులో ఏదో ఒకటి నా కాళ్ళలో కస్సున దిగటం ఖాయం.
ఆ తర్వాత
నా నడక కుంటుపడుతుంది, పరిగెత్తుకుంటూ చెయ్యాల్సిన పనిని కుంటుకుంటూచేస్తే ఎప్పటికయేను! ఏమయేను! అసలు అవుతుందో కాదో కూడా అనుమానమే.
అందుకే
నేను ఎంతో అలోచించి చక్కని చిక్కని పథకం అల్లాను. పది రోజులు అన్ని చర్యలు కనిపెట్టే పరిశోధన ఆపై పదిరోజులూ రంగంలోకి దిగటం, ఆపై కార్యసాధన, కార్యసాధన, కార్యసాధన అనేది నాలుగురోజుల్లో ముగియవచ్చు నలభై రోజుల్లో ముగియవచ్చు, కాని క్లూ దొరికితే కీ దొరికినట్లేకదా! కీ చేతికి చిక్కిన మరుక్షణం తాళం తీయొచ్చు చాలా తేలికగా......
సాధన చెపుతుంటే భేష్ అన్నాడు ఆర్ ష.
"బాస్! నేను ఇంతజాగ్రత్త వహిస్తుంటే గుడిలోపలి గోడలమీద తస్మాత్ జాగ్రత్త అనే హెచ్చరికలతో తెలిసి తెలిసి రాతలు రాస్తానా!
ప్రజలదృష్టిలోగాక పోలీసుల కళ్ళుకూడా ఇప్పుడు పరమేశ్వరీదేవి ఆలయంమీద ఉన్నాయి. వాళ్ళు ఎన్నిజాగ్రత్తలో తీసుకున్నారు, ఈ చిక్కు సమయంలో పనిమాలా నేను ఆ రాతలు రాస్తావా మీరు ఆలోచించి చూడండి బాస్!"
"నా ఆలోచన తర్వాత నీవు చెప్పదల్చుకుంది క్షుణ్ణంగా చెప్పు" ఆర్ష్ అన్నారు.
"బాస్! వెన్నుపాటుగా దెబ్బతీద్దామని బైలుదేరిన నేను గుండెపోటు తెచ్చుకునే పనులు చేయనుగాక చేయను, ఇదెవరో నన్ను దెబ్బతీయటానికి చేసినపని. పన్నుపోటు తెప్పించారు. వెన్నుపోటు గుండె పోటుకన్నా పన్నుపోటు చాలా స్వల్పమైనది, నన్ను నా ఉన్నతిని సహించలేక చాటుగా దెబ్బతీసే ప్రయత్నంలో గుడిలో ఆరాతలురాయటం జరిగింది. ఐ డోంట్ కేర్, ఆ రాతలని నేను తుడిచేసుకుంటాను, ఆ రాసిన వాడెవడో మన ఇంటివాడు, తిన్న యింటివాసాలను లెక్కపెట్టినవాడెవడో మీరే తెలుసుకొని మరోసారి ఇలాంటి రాతలు రాయకుండా వాడిచేతలని రాతలని తుడిచేయండి, నేను ముందుకు సాగటానికి ఇంక అడ్డువుండదు,
"నీకు సంపూర్ణస్వేచ్చ ఇస్తాను, ఆపని నీవే చేయవచ్చుకదా?" సాధన చెప్పింది సాంతంవిని ఆర్ష్ అడిగాడు.
"ఉహు, మీరు నాకు......మాకు......బాస్, మమ్మల్ని రక్షించినా శిక్షించినా అది మీకే చెల్లింది, మీరే చెయ్యండి." వినయంగా చెప్పింది సాధన.
ఆర్ష ముఖం ఆనందంతో విప్పారింది, "నీ కెవరిమీదనైనా అనుమానంవుందా?" అనడిగాడు.
సాధన మౌనంగా ఉండిపోయింది,
"ఫరవాలేదు చెప్పు సాధనా!"
"క్షమించండి బాస్! చూచాయగా ఇప్పటికే అతనెవరో మీరు గ్రహించేవుంటారు, నాకు నేనుగా చెప్పటం ఇష్టంలేదు, నామాటల్లో చేతల్లో తప్పులుంటే శిక్షించండి, ఆశిక్ష ఏదో ఆనందంగా స్వీకరిస్తాను నేను చెప్పినదాంట్లో నిజానిజాలు మీరు క్షుణ్ణంగా తెలుసుకొని నాకు ఎవరైతే అడ్డుతగులుతున్నారో వారి ఆట కట్టించండి చాలు" అంది సాధన.
ఆమోదసూచికంగా ఆర్ష్ తలపంకించాడు,
"థాంక్స్" అంది సాధన,
"నీకు సహాయంగా ఇంకా మనుషులుగాని, ఏదైనా పరికరాలుగాని కావాలా," ఆర్ష అడిగాడు.
"ప్రస్తుతం అవసరంలేదు. నా అసిస్టెంట్ గా ముత్యం ఉన్నాడుకదా అతను చాలు. ఇప్పటికే నేనో పథకం వేశాను. ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాను, నా పరిశీలన పూర్తయి అదే పధకం సరయినది అనుకుంటే మాత్రం స్వయంగా నేనే వస్తాను. ఆ పథకానికి గనుక అయితే మందీ మార్బలం చాలాకావాలి. మీతో చర్చించి రంగంలోకి దూకుతాను కాబట్టి అప్పుడు మీరు నాకు అన్నీ సమకూర్చి ఇద్దురు గాని."
"అలాగే, ఇంకేమైనా చెప్పవలసింది ఉందా?"
"గుడి గోడమీద ఆ రాతలు నేనే రాశానని కావాలనే మనవాళ్ళ ముందు నేను వప్పుకున్నాను కదా, ఆ విషయాన్నీ మీరు కవర్ చేయండి"
"ఎలా?"
"ఈ గదిలోంచి మనం బైటికివెళ్ళగానే వాళ్ళందరి ఎదుట నన్ను కోప్పడండి"
"ఏమని?"
"నీవు చెప్పిన కారణాలేవీ నాకు నచ్చలేదు. ఒక తప్పుని కప్పి పుచ్చేటట్లు ఉన్నాయి నీ మాటలు. పసలేనిమాటలు నా ముందు పలకవద్దు నీవుచేసిన ప్రథమతప్పు గుడిమీద రాతలురాయటం. ఇకముందు ఇలా వెర్రిపనులుచేస్తే నిన్ను వెనక్కి రప్పించి శిక్షిస్తాను ......అయినా కోప్పడండి."
"అలా కోప్పడితే ప్రయోజనం?" ఆర్ష తెలియనట్లు అడిగాడు.
"మీకు తెలుసు అయినా నా నోటంటపలికించాలని అడుగుతున్నా కదూ" సాధన చిరునవ్వుతో అడిగింది.
"ఎస్, కానియ్యి"
"నన్ను మీరు చివాట్లువేయటంవల్ల మనలోవున్న ఆ చాటుమనిషి సంతోషిస్తాడు. మరోసారి నాకు అడ్డుతగలటానికి ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నంలో ఉన్నప్పుడు రెడ్ హేండెడ్ గా మీకు పట్టుబడతాడు. అదే కావాలి నాకు."
"చాలా తెలివైనవని. నీమాటప్రకారమే చేస్తాను" అంటూ ఆర్ష్ కుర్చీలోంచి లేచాడు.
సాధన చాలాసంతోషించి మరోసారి థాంక్స్ చెప్పింది.
గది తలుపులు తెరుచుకుని___
ముందు ఆర్ష్ ఆయన వెనుకనే తలవంచుకుని సాధనకై వచ్చారు.
హాలులో వున్న అందరి చూపులూ వాళ్ళిద్దరిమీదా పడ్డాయి.
లంబా చూపులు మాత్రం సాధనమీద నిలిచాయి.
