Previous Page Next Page 
శ్రీ శ్రీ సంసార ప్రస్థానం పేజి 20


    నిద్రకి ఉద్వాసన చెప్పక తప్పదు.
    నాకు తమిళభాష బాగా వచ్చునని శ్రీశ్రీ గారనుకుంటున్నారు. కాలక్షేపమే గానీ అంత బాగా రాదని తెలిస్తే యింకేమైనా వుందా?
    అయితే - వారికన్నా నేను మెరుగే నని నాకూ తెలుసు. గట్టిగా తమిళంలో నాలుగుమాటలు మాట్లాడితే 'అర్ధం ఏమిట'ని అడుగుతారాయన. ఓ మాదిరిగా ఆయనకు తెలుసు అంతే. చదవడం రాయడం అసలు చేతకాదు. అందువల్ల ఫరవాలేదు. అరవంలో వున్న అక్షరాల్ని పోల్చుకుంటూ మేనేజ్ చెయ్యొచ్చనుకున్నాను.
    కస్టేఫలేని - తెల్లవారు ఝామున నాలుగు గంటల దాకా కూర్చుని మూడు రీల్సు దాకా రాశాను.
    ఇరవై రీల్సు రాయాలి.
    మొత్తం డైలాగ్స్ పిక్చర్ అయినా, పాటలు, పద్యాలు చాలా వున్నాయి.
    హాయిగా ఓ నిట్టూర్పు విడిచి 'బతికానురా!' అనుకున్నాను.
    మర్నాడు ఎనిమిదిన్నరకే కారొచ్చింది. ఆఫీసుకు వెళ్ళాం.
    కాఫీ టిఫిన్లయ్యాక, "రాత్రి స్క్రిప్ట్ తిరగేశావేమిటి?" - అని అడిగారు.
    - సస్పెన్స్ లో పెట్టాలన్న ఉద్దేశంతోనూ -
    ఒకవేళ నేను రాసినవి చూపించి తప్పయితే, 'చెప్పకుండా ఎందుకు రాశావ"ని తిడతారేమోననే భయంతోనూ-
    రాసే విధానం చెప్తారేమో, తెలుసుకుందామనే ఉద్దేశంతోనూ-
    "లేదండీ" - అన్నాను.
    "వెరీగుడ్" అని, "కాగితం తీసుకుని దగ్గరికి రా మైసూరులో మొదటి పిక్చర్ రాసిన సంగతి మరిచిపో. డబ్బింగ్ పిక్చర్ రాయవలసిన విధానం చెప్తాను. జాగ్రత్తగా గమనించి నేను చెప్పినట్టు రాయి. బాగుపడతావు. నీ కుర్చీ ఇలా తెచ్చుక్కూర్చో" - అన్నారు.
    ఒళ్లంతా కళ్ళు చేసుకుని శ్రద్దగా గమనిస్తున్నాను.
    డబ్బింగ్ పిక్చర్ ఎలా రాయాలో ఆయన ఈ క్రింది విధంగా చెప్పారు.
    
    అరవం        అర్ధం
    అప్పిడియా        అలాగా
    సొల్లు         చెప్పు
    షాట్లు : M.c. మిడ్ క్లోజ్, M.d.మిడ్ షాట్, C.D. క్లోజ్ షాట్, M.L.S. మిడ్ లాంగ్ షాట్, L.S. లాంగ్ షాట్... ఇలాగ కోకొల్లలు. మధ్యలో ట్రాల్, ఫేడవుట్, కట్, M.B.G.M ఏక్షన్.....వగైరాలు చెప్పనే అక్కర్లేదు.
    "అవి ఒక సైడ్ రాయడం, తమిళ్ దైలాగుకి తెలుగు అర్ధం ఇంకోవైపు రాయడం....ఈ విధంగా ముందు పిక్చరంతా రాసేయి. తర్వాత డైలాగ్స్ మాట ఆలోచిద్దాం. నువ్వు నేను చెప్పిన ప్రకారం ముందు తెలుగులోకి రాశావంటే, సగం పిక్చర్ అయిపోయినట్టే" - అన్నారు.
    ఆయన చెప్పకుండానే, అలాగే నేను రాత్రి కూర్చుని ఒరిజినల్ స్క్రిప్ట్ ని మక్కీకి మక్కి కాపీ చేశానుగా! నేను రాసిన విధానం, ఆయన చెప్పిన విధానం కూడా ఒకే విధంగా వుండడంతో ధైర్యం తెచ్చుకుని -
    "ఇదిగో, నిన్నరాత్రి మూడు రీల్సు, ఇప్పుడు మీరు చెప్పినట్టే రాశానండి". అని చూపించాను.
    అంతే. శ్రీశ్రీగారికి వచ్చేసింది కోపం.
    "నేను చెప్పినట్టు అనకు. చెప్పనట్టు రాశావు. స్క్రిప్ట్ ఫాలో అయి రాశావు. సరిగ్గా వుంది. మంచిదే. కానీ - నేను అడిగితే, రాయలేదని అబద్దం ఎందుకాడావు?
    నీకు అబద్దాలాడే అలవాటుందన్నమాట. అబద్దం చెప్పే వాళ్ళని చూస్తే నాకు పరమ అసహ్యం.
    అబద్దాలు, చెప్పుడు మాటలు వినడం, దొంగతనం, ఇచ్చకాలు, పొగడ్తలు, గొప్పలు..... ఇవన్నీ నాకు బొత్తిగా గిట్టవు. నా దగ్గర పని చెయ్యాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకో" - అన్నారు.
    వెక్కి వెక్కి ఏడవడం తప్ప నాకు మరేమీ చేతకాలేదు.
    "ఆ ఏడుపెందుకూ? నేనేమైనా కొట్టానా, తిట్టానా?".
    "కొట్టలేదు కానీ తిట్టారు".
    "అది తిట్టడం కాదు, బుద్ది చెప్పడం".
    "అబద్దాలూ, చెప్పుడు మాటలు.....ఇవన్నీ నాకూ అసహ్యమేనండీ 'రాత్రి పని చెయ్యొద్దు, ఉదయం ఆఫీసులో చూద్దాంలే అన్నారుగా!
    ముందుగానే చేస్తే నేను రాసిన దాంట్లో తప్పులుంటే తిడతారన్నభయంతో అలా చెప్పాను. కానీ ఇప్పుడు మీరు నేర్పినదానికి సరిగ్గానే ఉన్నట్టు అనిపించడంతో చూపించాను.
    "తప్పులు చేసి అందరూ తిట్లు తింటారు. నేను చెయ్యకుండానే తిన్నాను" - అని ఏడ్చాను.
    'ఎంతసేపేడుస్తావో ఏడువు' - అన్నట్లు వదిలేశారు.
    ఆ రోజు శ్రీశ్రీగారి చేత మాటలనిపించుకున్నందుకు నేను పడిన బాధ నా జీవితంలో మొదటిసారీ, ఆఖరుసారీ కూడా అదే అనుకుంటాను.
    "ముందు పాటలూ, పద్యాలూ రాసేయ్. డైలాగ్స్ తర్వాత ప్రారంభించొచ్చు"
    'కార్బన్ పెట్టి రెండు కాపీలు తీస్తాను".
    "ఊఁ" - అన్నారు.
    కానీ రాద్దామన్నా బుర్ర పనిచెయ్యలేదు. అనవసరంగా, పనిచేసి మరీ చీవాట్లు తిన్నానే అనే బాధకాక - 'అబద్దం ఆడే అలవాటుంద"న్న మాట అన్నారనే అవమానంతో పని చేయలేకపోయాను.
    నావరకూ నేను చెప్తున్న మాట - నాకు ఆత్మాభిమానం ఎక్కువ. నేనొకర్ని నొప్పించను. ఎవర్నీ ఓమాట అనను. నన్నెవరైనా అంటే ఊరుకోను. తప్పుచేస్తే ముందుగా నేనే క్షమాపణ కోరుతాను.
    నా ముఖం కందగడ్డలా అయిపోయింది.
    సిగరెట్ దమ్మ్జులాగుతూ, కుర్చీలో కూర్చుని ఓరచూపులతో నన్ను గమనిస్తూనే వున్నారు.
    "రాద్దామా, వద్దా"ని అడిగారు.
    "నే నిప్పుడు రాయలేనండీ" అన్నాను.
    "ఏమయింది? ఎందుకు రాయలేవు".
    "అబద్దాలాడే అలవాటని ఎందుకన్నారు? అసలు నా విషయం మీకు ఏం తెలుసని తిట్టారు?" - అని రుసరుసలాడాను.
    "మళ్ళీ అదేమాట. నిన్ను తిట్టలేదంటే నమ్మవేం? నీకు బుద్ది చెప్పానే కానీ, తిట్టటం కాదు. ఇంటికి పోదాం పద. మధ్యాహ్నం వచ్చి రాద్దాం" - అని చకచకా కిందికి వెళ్ళిపోయారు.
    "ఉదయం తొమ్మిది నుండి ఒంటిగంటవరకూ, మళ్ళీ మధ్యాహ్నం మూడు నుండి ఏడుగంటలవరకూ ఆఫీసులో  కూర్చోవాల"ని పిళ్ళైగారు చెప్పారు. "ఓ.కే. సార్" - అని అమ్మతో నేనూ కిందికి దిగిపోయాను.
    
                          *    *    *
    
    మధ్యాహ్నం మళ్ళీ ఆఫీసులో కూర్చున్నాం.
    "రాసే మూడ్ లో వున్నావా?" అని అడిగారు.
    నేనేమీ మాట్లాడలేదు.
    "ఆ మౌనానికి అర్ధం కోపమూ, లేక బాధనా? ఏమనుకోవాలి?"
    "బాధని అనుకుంటే మంచిది. నేనెప్పుడూ అబద్దాలాడను. మీరు వర్ణించిన కోవలో వున్న అబద్దం, పొగడ్తలు, గొప్పలు.....అంటే నాకూ అసహ్యంతో పాటూ ఒళ్ళు మంట కూడా" అన్నాను.
    "సరే ఆ విషయాలన్నీ మరచిపో. ఇంకెపుడూ సరదాకి కూడా నువ్వలా మాట్లాడకూడదు. నువ్వేడ్చినప్పుడే నీ నైజం నాకు అర్ధమైపోయింది. పాటలు రాసి నాకిచ్చేయ్. నేనేదో అవస్థపడుతూ వుంటాను" అన్నారు. చాలా పాటలు, పద్యాలు వున్నాయి. ముందు రెండు పాటలు రాసి "వీటి సంగతి చూడండి. మిగిలినవన్నీ రేపటికి రాసి ఇచ్చేస్తా"న్నాను.
    ఇంతలో నేనడిగిన పుస్తకాలు, కార్బన్ పేపర్లు, పెద్ద బైండ్ పుస్తకం వగైరాలు మా టేబిల్ మీదకి వచ్చేశాయి.
    బాయ్ తో చెప్పి నాకు వేరే టేబుల్ వేయించుకున్నాను.
    రాయడం మాట ఎలాగున్నా మహాకవికి ఎదురుగా దర్జాగా, టేబుల్ నిండా కాగితాలూ పుస్తకాలూ పెట్టుకుని కూర్చున్నాను.
    "సరోజా!" - అని పిలిచారు.
    "ఈ పూటకి నువ్వు రాసిన ఈ రెండు పాటలు చాలు! టేప్ రికార్డర్ వేసి రాసిన పాటలు (అరవపాటలే) కరెక్టుగా చెక్ చెయ్యి" అన్నారు.
    'మధ్యలో లైన్లు వదిలేస్తే కష్టమే' అనుకుని వారు చెప్పినట్టే చేశాను. పిళ్ళైగారొచ్చి "ఆర్టిస్టుల లిస్ట్ తయారుచెయ్యండమ్మా" అన్నారు.
    వెంటనే శ్రీశ్రీగారు "డబ్బింగ్ రేపేనా?" అని అడిగేశారు.
    నేను గతుక్కుమన్నా.
    వెంటనే "చూడండి సార్! మనం ఒక పద్దతి ప్రకారం పోదాం. అన్ని పన్లూ ఒకేసారి పెట్టుకుంటే కం ఫ్యూజయిపోతాం. మొదట డైలాగ్స్, పాటలు రాయడం పూర్తికానివ్వండి. తర్వాత ఆర్టిస్టుల్ని పిలిచి మాట్లాడి వాళ్ళకి అగ్రిమెంట్స్ చేసి ప్రొజక్షన్ వేసి చూపిద్దాం" అన్నాను.
    "అలాగేనమ్మా!" అన్నారాయన.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS