శ్రీశ్రీగారు "ఫరవాలేదు బాగానే మాట్లాడుతున్నావే" అన్నారు.
మనసులోనే 'థాంక్స్' అనుకున్నా.
ఆ రోజు ఆఫీసులో కాలక్షేపమే చేశామని చెప్పాలి.
* * *
శ్రీశ్రీ పని తీరు
రాత్రంతా కూర్చొని స్క్రిప్ట్ కుస్తీ పట్టడం ప్ర్రారంభించాను. తెల్లవారే సరికి ఎలాగైతేనేం పన్నెండు పాటలు, నాలుగు పద్యాలు పూర్తిచేసేశాను. కార్బన్ తో రెండు కాపీలు తీశాను.
'హమ్మయ్య, పాటల గొడవ తీరిందిరా బాబూ!' అనుకున్నాను.
మర్నాడు ఉదయం ఆ మాటే శ్రీశ్రీగారితో అన్నాను.
"ఏం! అంత కష్టంగా వుందా"
"లేదుకానీ ఒకమాట చెప్పేస్తున్నాను. ముందే తెలుసుకోండి. నాకు అరవం మాట్లాడ్డం, అర్ధం చేసుకోవడం బాగా చేతనవుతుంది.
చదవడం రాయడంలోనే అంత అనుభవం లేదు. ఈ పిక్చర్ తో ఆలోటు కూడా పూర్తిచేసుకోవాలనుకుంటున్నాను. దయచేసి నాకు కొంచెం టైమివ్వండ"న్నాను.
"అంత శ్రమ ఎందుకు? అరవం బాగా తెలిసి, అర్ధం చెప్పగలిగిన వాడిని పెట్టుకుంటే సరిపోదా?" అన్నారు.
"వద్దుగాక వద్ద" న్నాను.
"సరే నీ యిష్టం" - అనేశారు.
ఆఫీసులో కూర్చున్నప్పుడు రెండు పూటలూ కలిపి రెండు రీళ్ళు రాసేదాన్ని ఇంట్లో తెల్లవారు ఝామున మూడు నాలుగ్గంటల దాకా కూర్చొని మూడు నాలుగు రీళ్ళు రాసేసరికి తల ప్రాణం తోకకొచ్చేది.
ఇలా ఆ స్క్రిప్ట్ తో మహాభారత సంగ్రామం చేస్తూ, విసుగులేకుండా నానా అవస్థలు పడుతూ వుండేదాన్ని.
ఒక్కోసారి జీవితం మీదే విరక్తి కలిగేదంటే నమ్మండి.
అసలే నలిగిపోతున్న నాకు శ్రీశ్రీగారి మాటలు, పనిపట్ల ఆయన చేష్టలు ఒళ్ళుమండించేవి.
ఆఫీసుకు రావడం, కాఫీ, టిఫిన్లు చెయ్యడం, సిగరెట్లు తాగడం, రెండు చేతులూ వెనక్కి వేసుకొని కుర్చీలోనే కళ్ళుమూసుకు పడుకోవడం.
పోనీ నిద్రపోతున్నారా, అంటే అదీ లేదు.
కంటిరెప్పలు రెపరెపలాడేవి. గాలిలో కుడిచేతి చూపుడు వేలు చాలా స్పీడుగా సుళ్ళు తిరిగిపోయేది. ఏదో ఆలోచనలో వున్నార్లే, డిస్టర్బ్ చేయడం ఎందుకని వూరుకునేదాన్ని.
కానీ, రోజూ అదేపని! పిక్చర్ గురించి ఆలోచించినట్టే లేదు.
ప్రొడ్యూసర్ కి శ్రీశ్రీ గారంటే భయం, నన్ను పట్టుకుని, "ఎంతవరకూ వచ్చిందమ్మా? ఎన్ని పాటలయ్యాయి? డైలాగ్స్ రాయడం మొదలు పెట్టారా?" - అని రోజూ నసపెట్టేవారు.
అప్పుడే మైసూరు నుండి వచ్చి వారమైపోయింది. ఏ నిముషంలో వచ్చి శంకర్ సింగ్ గారు బయలుదేరమంటారో....అది వేరే భయం!
ఉమ్డబట్టలేక ఒకరోజు, "పాటలు చూడకూడదండీ? టైమంతా వేస్టయి పోతోంది" - అన్నాను.
నా వైపు ఎర్రగా చూసి, "నీ స్క్రిప్ట్ పని అయిపోయిందా?" అనడిగారు.
నోరు మూసుకుని ఊరుకున్నాను.
ఇంకా కనీసం రెండు రోజులైనా కష్టపడితే కానీ స్క్రిప్ట్ పూర్తవదు. అంటే రాత్రింబవళ్ళు అదేపనిగా కూర్చోవాలి.
'మరొక్క రెండు రోజులు ఓపికపట్టి, ముందు నా వర్క్ పూర్తిచేసి తర్వాత ఈయన సంగతి చూద్దాం' అనుకున్నాను.
అనుకున్న ప్రకారం మొత్తం స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేసి వారి ముందు పెట్టి, "ఇదిగోనండి, నా పని పూర్తిచేశాను. మీరు డైలాగ్స్ రాయడమే బాకీ" అన్నాను.
ఆయనకు ఎందుకు చిరాకు వేసిందో అర్ధం కాలేదు. చిర్రున లేచారు.
"నీకెందుకంత తొందర సరోజా? రేపే పిక్చర్ రిలీజ్ చేస్తారా? వీళ్ళంతా ఓ ప్రొడ్యూసరా? నేను వీళ్ళ పిక్చర్లకి రాయాలా? అసలు ఈ పిక్చర్లు తీసేవాళ్ళ సంగతి నాకు తెలీదూ?
వీళ్ళు సినిమా పూర్తి చేసేదాకా నమ్మకం ఏంవుంది? ఈ రోజు చూసిన బోర్డు తెల్లారేసరికి వుండదు. నీకేం తెలుసు! అనుభవం చాలదు. అనవసరంగా గాభరాపడి నా మూడ్ పాడుచెయ్యకు.
"తిండీ, నిద్రా మానేసి ఏం కొంప మునిగిందని ఈ స్క్రిప్ట్ ఇంత తొందరగా రాసేశావు? తాపీగా అవుతుంది. అవనీ!" అన్నారు.
నాకెంత కోపం వచ్చిందంటే - ఆవేశం ఆపుకోలేక, "అయితే, ఎందుకొప్పుకున్నారండీ, రోజూ వాళ్ళకార్లో వచ్చి, కాఫీ, టిఫిన్ లు చేసి దమ్ము కొట్టడానికా? ఆ పని ఇంట్లోనే చెయ్యొచ్చుగా?
మీకేం పోయింది! 'డబ్బింగ్ ఎప్పుడు పెడదాం. ఆర్టిస్టులతో ఎప్పుడు మాట్లాడి ఫిక్స్ చేద్దాం. మాటలు, పాటలు అయిపోయాయా' అని రోజూ వాళ్ళు నా ప్రాణం తీస్తున్నారు. మీరిలా మొండిగా వాదిస్తే ఎలాగండీ" - అని గట్టిగానే మాట్లాడాను.
"యాభైవేలు బ్యాంక్ లో వేసి నాకు చూపమను" అన్నారు.
"అదంతా మనకెందుకండీ! ఒప్పుకున్నాక మన పని మనం చెయ్యాలి కానీ!" అన్నాను.
"సరోజా! నా సంగతి నీకు తెలీదు. నేను తలచుకుంటే ఒక్క రోజులో డైలాగ్స్, ఒక్కరోజులో పాటలు రాసెయ్యగలను. కానీ రాయను. తొందరలేదు. నేను చెప్పినట్లు నువ్వు చేస్తే చాలు. ఈ ఫీల్డుకి అన్నిచోట్లా నీ స్పీడు పనికి రాదు" - అన్నారు.
అంతే. నా బుర్ర చెడిపోయింది. ఆయన సంగతి నాకేమీ అర్ధం కాలేదు. అయోమయం అనిపించింది. ఇలా మాట్లాడే ఈయనతో పని చెయ్యడమూ, చేయించడమూ కూడా అనుకున్నంత సులభం కాదనిపించింది.
'అగ్రిమెంట్ చేసి, అడ్వాన్స్ తీసుకుని ఈ ధోరణి ఏమిటి? చచ్చాంరా బాబూ! ఇప్పుడిప్పుడే ఒక్కొక్క విషయం బైటపడుతోంది. ఇంకా ఎన్ని వున్నాయో? ఏదో కష్టపడితే నాలుగు రాళ్ళు సంపాదించి ఇద్దరం బాగుపడతామనుకున్నాను. ఇది కొరకబడే ఘటంలా లేదు. కష్టమే' - అనిపించింది.
మా యిద్దరి మాటలు, ఘర్షణ విని మా అమ్మ బేర్ మంది. "ఏమిటి సరోజా! అంత గట్టిగా మాట్లాడతావేమిటి? ఆయన ఏమనుకుంటారు? తప్పుకాదూ?" - అంది.
"తప్పుకాదు. ఒప్పుకాదు.ఓ ఊరుకో అమ్మా! న్యాయం అక్కర్లేదూ!
ఆయన అన్నవన్నీ నిజమే కావచ్చు. కానీ ఒప్పుకున్నా తర్వాత మన పని మనం చెయ్యాలా, వద్దా" - అన్నాను.
పరిపరి విధాలుగా మనస్సు పోతోంది. ముందు శ్రీశ్రీగారిని దార్లో పెట్టడం ఎలా? అని ఆలోచనలో పడ్డాను.
త్వరగా ఆఫీసునుండి బయలుదేరి పోయాం.
"చలపతిరావుగారింటికి వెళ్ళాలి. పాట వుంది. రాయాలి" - అన్నారు.
"రక్షించారు. చలపతన్నయ్యని చూసి చాలా రోజులైంది. మేమూ వస్తాం" అన్నాను.
* * *
శ్రీశ్రీగారితో మేము వెళ్ళడం అనండి. లేక మమ్మల్ని తీసుకుని శ్రీశ్రీగారు వెళ్ళారనండి. చలపతిరావుగారికి మాత్రం మా రాక చాలా ఆశ్చర్యం కలిగించింది.
"అన్నపూర్ణా! అల్లరి పిల్ల వచ్చింది. అది రావడం కాకుండా మహాకవిని తీసుకొచ్చింది. భోజనాలిక్కడే. ఏర్పాట్లు చెయ్యి" అని వదినతో చెప్పి, శ్రీశ్రీగారితో సహా మేడమీదికి వెళ్ళిపోయారు.
నేను వదినతో జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పి, అన్నయ్య దగ్గరికి వెళ్ళాను. ఇద్దరూ మధుపాన స్వీకరణలో పడ్డారు.
చలపతిరావుగారు నన్ను చూసి-
"ఏమిటమ్మా సంగతులు! మైసూరు వెళ్ళావట. ఒక్క మాటైనా చెప్పేవు కావు" అన్నారు.
"అందుకేగా ఇప్పుడొచ్చింది. వదినకి అంతా చెప్పాను. మీకు కూడా చెప్తాను.'- అని, మైసూరు నుండి ఆఫీసులో జరిగిన ఘర్షణ వరకూ అంతా చెప్పాను.
చలపతిరావుగారు విరగబడి నవ్వారు.
"పెద్దవాళ్ళంతా అంతేనమ్మా! శ్రీశ్రీగారిని అంత తేలిగ్గా తీసిపారెయ్యకు. చాలా గొప్పవారు సుమా! ఆరోజు రికార్డింగ్ థియేటర్లలో నన్నడిగినట్లు పిచ్చివారు కాదు. పిచ్చికుదిర్చేవారు.....ఏం శ్రీశ్రీగారూ! అంతేనా?" అనడిగారు.
"మీతో రిపోర్టు చేయడానికే వచ్చినట్టుంది" అన్నారు శ్రీశ్రీగారు.
"కాదండీ, సరోజ మా గొప్ప అల్లరి చేస్తుంది. వాళ్ళమ్మ చిన్నప్పుడు వస పోసిందేమో, తెగ వాగుతుంది. నూరు మంది పెట్టు. మా చెల్లాయి వున్న చోటు కళకళలాడి పోతుంది. అది డల్ గా వుండదు. ఇంకోరుంటే ఊరుకోదు. " అని చెప్పారు చలపతిరావు
గారు.
"అన్నీ బాగున్నాయి కానీ అడిగిన దానికి సూటిగా జవాబిచ్చే అలవాటు లేదండీ! ఎదురు ప్రశ్నే వేస్తుంది. ఒక్కోసారి ఆ ప్రశ్నలోనే మనకి సమాధానం కూడా దొరుకుతుందనుకోండి" - అది వేరే విషయం అన్నారు శ్రీశ్రీ.
