'ఇంకా చేసుకోలేదు-ఇంకా వారంలో చేసుకుంటాను-రిజిస్టర్ మేరేజ్-'
'అదేవిటన్నయ్యా? రిజిస్టర్ పెళ్ళి కర్మమేం? లక్షణంగా ఫెళ్ళుమంటూ పెళ్ళి చేసుకోక...'
'వాళ్ళ వాళ్ళకీ పెళ్ళి ఇష్టంలేదు-అందుకని...'
'అంత ఇష్టం లేని సంబంధం దేని కన్నయ్యా!'
'ఇష్టం లేనిది పెద్ద వాళ్ళకి-నాకూ ఆవిడకీ ఇష్టమే! అని చాలదూ!'
'మరే! అదుంటే చాలు-'
ఎలాగో అనేసి తన హావభావాలు దాచుకోవటానికి అక్కడినుండి వెళ్ళి పోయింది-
పార్వతిని కంటితో చూడక ముందే పార్వతి పట్ల ఒక విద్వేష భావాన్ని పెంపొందించుకుంది రుక్మిణి-పార్వతి రాధాకృష్ణ కు ఇల్లాలిగా వచ్చాక ఆ ద్వేషం మరింత ఎక్కువయింది-పాపం, పార్వతి ఆడబిడ్డ తో స్నేహంగా ఉండాలనే ప్రయత్నించింది- కానీ, ఆ రుసరుసలూ, మూతి విరుపులూ చూసి తటస్థంగా ఉండిపోయింది -తన, అన్నయ్య దయమీద ఆధారపడి ఉంది గనుక-ఆ అన్నయ్యకు పార్వతంటే ప్రాణం కనుక - రుక్మిణి కి తన ఆడపడుచుతనం చూపించు కోవటానికి మాత్రం అవకాశం రాలేదు-
పార్వతితో కాపురం ప్రారంభించాక కూడా రాధాకృష్ణ రుక్మిణికి, అడపా దడపా అయిదూ, పదీ సర్దుతోనే ఉన్నాడు-అయినా రుక్మిణి కి మంటగానే ఉండే-అవును మరి! ఈ 'దెయ్యమే' రాకపోతే, అన్న సంపాదనంతా తనదయ్యేది కాదూ!.......రుక్మిణికి తనపట్ల ఏకోశానా సద్భావం లేదనీ, కలగదనీ అర్ధమయి పోయాక, పార్వతి అసలు రుక్మిణిని పలకరించటమే మానుకుంది -
ఈ నాటికి పార్వతికి ఆ రుక్మిణినే ఆశ్రయించవలసిన దురవస్థ పట్టింది- డబ్బు సంగతలా ఉంచి, తానున్న స్థితిలో ఒక అండ లేకుండా వంటరిగా ఎలా ఉండగలదు? ఎన్నాళ్ళు గానో మనసులో అణిచేసుకున్న రుక్మిణి కోరిక ఈ నాటికి ఫలించింది-
తన ఆడబడుచుతనం చెలాయించటానికి మంచి అవకాశం దొరికింది-
జీవచ్చవంలా తయారయిన పార్వతిని చూస్తోంటే ఆవిడకి జాలి బదులు చిరాకే కలిగింది-
'ఒకొక్కళ్ళ పాదం! అడుగు పెడుతూనే భగ్గుమనిపిస్తారు - రాయిలాంటి మనిషి-ఏనాడూ జిర్రున చీదెరగడు-నిముషాల మీ దెగిరిపోయాడు - వైధవ్యయోగం రాసిపెట్టి నాతల్లి మెళ్ళో తాళి కట్టాక ఇంక నా అన్న నాకెలా దక్కుతాడు?'
ఇలాంటి వాక్యాలు రోజుకు పదిసార్లయినా దొర్లేవి రుక్మిణి నోట్లోంచి. అసలే పార్వతిలో జీవం చచ్చిపోయింది- ఈమాటలు విని విని తనంటే తనకు అసహ్యం బయలు దేరింది -అన్నం మానేసి-చన్నీళ్ళు స్నానం చేసి తడి బట్టలతో గంటలకొద్దీ ఉండిపోయి-ఇలా తనను తను ఎన్నివిధాల హింసించుకోగలదో, అన్ని విధాలా హింసించుకునేది- ఫలితంగా చిక్కి శల్యమయి కూచుంటే లేవలేని దశ కొచ్చింది-
'అమర్చిపెట్టే వాళ్ళుంటే అందరికీ రోగాలే! నేనొక దాన్నున్నానుగా చాకిరీకి-'
అని రుక్మిణి ఎంత సణుక్కున్నా పార్వతికి మంచం మీంచి లేచే శక్తి లేక పోయింది-
సృష్టి కన్న విచిత్రమైంది ఎక్కడుందీ? ఇంచుమించు మరణావస్థలో ఉన్నా, ఏమాత్రం వైద్యసహాయం లేక పోయినా, నాటు మంత్రసాని మోటు తనం మరింత ప్రాణాల మీదకు తెచ్చినా, పార్వతి ప్రసవించింది - ఆడపిల్ల - ప్రసవవేదన పడి పడి శిశువును భూమి మీద వదిలి తన రాధాకృష్ణ దగ్గిరకు పారిపోయింది పార్వతి-
2
కొందరు కొందరు వ్యక్తులు ఎందుకు పరమ రాక్షసంగా ప్రవర్తిస్తారు అన్న ప్రశ్నకు సమాధానం లేదు - వాళ్ళలో మానవత్వం లేదా? మానవుడై జన్మించాక మానవత్వం లేకుండా ఎలా ఉంటుంది?- ఎప్పుడో మేల్కొంటుంది-అప్పుడు వాళ్ళు మానవులు కావచ్చు-అట్టే మాట్లాడితే దేవతలూ కావచ్చు-కానీ ఆ క్షణంలో మాత్రం రాక్షసులు -మానవుడి భావం మానవత్వం-మానవులంతా ఒకలా ఉండరు -పరిస్థితుల్ని బట్టి విజ్ఞానాన్ని బట్టి, సంస్కారాన్ని బట్టి, వాతావరణాన్నిబట్టి వేరువేరు విధాలుగా ఉంటున్నారు - ఒక పరిస్థితిలో పరమదుర్మార్గుడు గా అనిపించిన వ్యక్తి మరో పరిస్థితిలో ఏంటో సహృదయుదిగా ప్రవర్తించచ్చు-అలాగే మానవత్వమూ అందరిలోనూ ఒక్కలా ఉండదు - ఎనిమిదేళ్ళు నిండీ నిండని మాధవి మీరు రుక్మిణి కెందుకంత ద్వేషమంటే సమాధానం లేదు-నిజాని కది ద్వేషం కూడా కాదు-ఎదుగూ బొదుగూ లేని ఎలిమెంటరీ స్కూల్ బడిపంతులికి పెళ్ళాం-చాలీచాలని జీతం రాళ్ళు-మేము మేమంటూ ముగ్గురు పిల్లలు-ఇంట్లో ఏమూల చూసినా ఇనపగజ్జెల తల్లి అందెల ఘలంఘల ధ్వని-ఇలాంటి పరిస్థితుల్లో మనసు చికాకుతో సుడులు తిరిగిపోవటం సహజం-ఆ చికాకు కక్కడానికి ఎవరైనా దొరకితే వాళ్ళని ఉపయోగించుకోక మానరు-
రుక్మిణికి తన చిరాకునంతా గుమ్మరించదానికి మాధవి దొరికింది. అలాంటి పరిస్థితుల్లో సహితం నిగ్రహంగా ఉండే వాళ్ళు లేకపోలేదు-వాళ్ళు ఉత్తములు -కాని రుక్మిణి సరాసరి మనిషికి ఒక మెట్టు దిగువలో ఉన్న వ్యక్తి-న్దుకే మాధవికి ఎనిమిదేళ్ళకే బ్రతుకులో చేదంతా అనుభవంలోకి వచ్చేసింది-
రుక్మిణి లోనూ మానవత్వం ఉంది- అందుకే-మూడు చెక్కలూ ఆవకాయ ముక్కలయితేనేం గాక-మాధవికి కడుపు కింత అన్నం పెడుతుంది-
అదీ పెట్టకపోతే మాత్రం అడిగే వాళ్ళెవరూ? తనకూతుళ్ళ బాగా చినిగిపోయిన పరికిణీలు ఒకటీ రెండూ (వాళ్ళ కుండేవే నాలుగు) మాధవికే ఇస్తుంది-ఎప్పుడైనా పిల్లలొద్దని మిగిల్చేస్తే ఆ కాఫీ మాధవికే ఇస్తుంది-
ఇలా ఇన్నివిధాల చూస్తున్నా ఆ పిల్లకు విశ్వాసం లేదు- నీళ్ళకని చెరువు కెళ్ళి గంటకి కాని తిరిగి రాదు- అదేమంటే 'పెద్దబిందె అత్తయ్యా!' అంటుంది ఏడుపు మొహంలో - దానికీ వాళ్ళమ్మ ముఖమే! ఎప్పుడూ ఏడుపుముఖం, పెద్ద బిందయితే మాత్రం? ఆ మాత్రం తేలేదూ? పోతులా తింటుందే! సమయానికి ఒక్క గిగ్నే అందివ్వదు-చేతులు బొబ్బలెక్కి పోయాయని ఏడుస్తూ కూచుంటుంది-సుకుమారం కడుక్కు పోతోంది-ఈ దరిద్ర గొట్టుకి సాయం ఈ సుకుమారా లెక్కడివో? ఆరోజు ఉదయమే పాలవాడొచ్చి బెదిరించిపోయాడు-
'రెండు నెలలబట్టీ పాలదబ్బు లియ్యటం లేదు-ఇవాళ మొత్తం ఇయ్యకపోతే రేపటినుండి పాలు పొయ్యను -'అని-
రుక్మిణి మనసంతా చికాగ్గా ఉంది-
ఎన్నాళ్ళిలా? పాలవాళ్ళ బెదిరింపులు-కూరగాయలమ్మి దెప్పుళ్ళు - ఇల్లు గలాయన అరుపులు-ఈ సమస్యలన్నీ ఏనాటికి తీరతాయి?
ఆలోచించీ ప్రయోజనం లేని ఈ చికాకులతో రుక్మిణి తల పగిలిపోతోంటే ముందు గదిలోంచి గందరగోళంవిని పించింది-విసుగ్గా అక్కడి కొచ్చింది రుక్మిణి-
'అమ్మా చూడే! నా పరికిణీ కట్టేసు కుంటోంది-'
మొహమంతా చెండుకుని ఫిర్యాదు చేసింది రుక్మిణి పెద్ద కూతురు బాల-
'లేదత్తయ్యా! మడత పెడుతున్నాను-అంతే!'

బిక్కముఖంతో అంది మాధవి-
'అబద్ధాలు - నువ్వు వంటిమీద పెట్టుకోలేదూ?'
'నీవే అబద్ధాలు-నేను పట్టుకుని మడత పెడుతున్నానంతే! నువ్వేగా మడత పెట్టమన్నావ్!'
'మడత పెట్టమంటే కట్టుకోమనా? పైగా నావి అబద్దాలంటావా?'
'నువ్వు నన్ను అనలా?'
'అబ్బబ్బ! వెధవ దెబ్బలాట!'
కోపంతో ముందుకొచ్చింది రుక్మిణి-విసురుగా చెయ్యెత్తింది - తన ఉడుకు చల్లారాలంటే ఎవరినో బాధాలి -బాల నెందుకు కొట్టటం? మాధవి వీపుమీద దభీ దభీమని దెబ్బలు పడుతున్నాయి-'అమ్మో! బాబో!' అని అరుస్తూ తప్పించుకోవటానికి ప్రయత్నిస్తోంది మాధవి-మాధవి అలా తప్పించుకోవటానికి ప్రయత్నించిన కొద్దీ మరింత కసిగా బాదుతోంది రుక్మిణి-సరిగా ఆ సమయంలో వచ్చింది పరమేశ్వరి-మెరుపులా మాధవికి అడ్డు నిల్చుని మాధవి మీద పడాల్సిన దెబ్బ తాను అందుకుంది-తెల్లబోతూ క్షణం ఆగింది రుక్మిణి-
'మీరెవరు?' విసురుగా అడిగింది-
రుక్మిణిదెబ్బ తగిలినచోట చేత్తో నిమురుకుంటూ 'పార్వతికి అక్కయ్యని'- కంది పరమేశ్వరి-
'ఒహో! పార్వతిని చూడటానికి వచ్చారా?' వెటకారంగా అడిగింది రుక్మిణి-
'పార్వతిని చూటానికయితే స్వర్గానికెళ్ళాలి-ఇక్కడి కెందుకూ?' శాంతంగా చెప్పింది పరమేశ్వరి - ఆవిడ కంఠం ఎంత శాంతంగా ఉన్నా ఆమాటలు చురుక్కున తగిలాయి రుక్మిణికి-
'ఇంతకూ తమరు మా గృహం ఎందుకు పావనం చేస్తున్నారో?'
'చెయ్యవలసి వచ్చింది - మాధవి కోసం-'
'మాధవి కోసమా? దానికీ మీకూ ఏం సంబంధం?'
'మీకన్న దగ్గిర సంబంధమే! దాన్ని నాతో తీసుకుపోదామని వచ్చాను-'
''వీల్లేదు - దాన్ని పంపను - మా అన్నయ్య పార్వతిని నా కప్పజెప్పాడు - ఆ నాడు పార్వతి ముఖం చూడటానికైనా మీరెవ్వరూ రాలేదు-నేనే దిక్కయ్యాను- ఈ నాటిక మాధవి కావలిసి వచ్చింది-"
