Previous Page Next Page 
మమత పేజి 2

రాజీవ్ ఆలోచిస్తున్నాడు... ఏం చేయాలి!!
పాపం పుణ్యం ప్రపంచ మార్గం-
ఏమీ తెలియని బాలల్లారా, పాపల్లారా
ఆకసాన హరివిల్లు విరిస్తే
అది మాకేనని ఆనందించే కూనల్లారా!!
'మహాకవీ....నాకో దారి చూపించు!!'
రాజీవ్ సంగీతం, సాహిత్యం బాగా తెలిసినవాడు. చదువుకున్నవాడు, సహృదయుడు అలా పడక్కుర్చీలో పడుకున్నాడు....ఎదురుగా చాపమీద పసికూన!!   
"మిమ్మల్నే - ఆ పిల్ల మళ్ళీ ఏడుస్తుంటే, మీరు నన్ను పాలిమ్మని మళ్ళీ చంపుతారు నేను చచ్చినా దానికి పాలివ్వను - ముందే చెప్తున్నా!" - అరుస్తోంది సుమతి.
రాజీవ్ సుమతి పక్కన మంచంమీద కూచున్నాడు. సుమతి కళ్ళలోకి చూస్తూ -
"దేవుడెందుకు దీన్ని ఇక్కడ దింపాడో!" అన్నాడు.
"దేవుడూ లేడు, దయ్యమూ లేదు - అనాధ శరణాలయంలో అప్పగించి రండి - ఆ తల్లి బతికుందో, చచ్చిందో మనకేమిటి మధ్యలో పీడ!" అంది సుమతి.
"పసిగుడ్డు కేసి చూసి చెప్పు- పాపం... జాలేయటంలేదూ?!"
సుమతి కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి రాజీవ్ మాటకి -
"ఎవరైనా వింటే నవ్వుతారు....అసలు నమ్మరు కూడా!" అంది.
"అంటే..?"
"అవును.... ఎవరూ నమ్మరు - పైగా ఏదో కబుర్లు చెప్తున్నారు - ఇది మీ ఆయన పిల్లే అని-" సుమతి ఏదో అనబోయింది.
చెంప ఛెళ్ళుమంది. పిల్ల కేరుమంది.
చిలికి చిలికి గాలివాన అయింది వ్యవహారం...
"పిల్ల కావాలో, నేను కావాలో చెప్పండి" - కాళికామ్మవారిలా ఉరిమింది సుమతి.
నిజంగానే ఎక్కడయినా వదిలేస్తే!! రాజీవ్ పిల్లకేసి చూసాడు!! గడియారం గంటలు కొట్టింది.
"నువ్వు మనిషిని కాదని ఇప్పుడర్ధమైంది సుమతీ" అన్నాడు బాధగా.
"పోన్లెండి - ఊరూపేరూ లేని, కులం గోత్రం లేని ఈ దిక్కుమాలిన పిల్లని నేను పాలిచ్చి పెంచాలా - నేనేమైనా గొడ్రాలినా, ఇంకొక్కక్షణం ఇది ఇక్కడుండటానికి వీల్లేదు" సుమతి పసివాడు శశికాంత్ ను తీసుకుని గదిలోకెళ్ళి తలుపేసుకుంది.
ఏది ధర్మం, ఏదధర్మం, ఓ మహాత్మా, ఓ మహర్షీ...
ఏది స్తఃయం, ఏదసత్యం, ఓ మహాత్మా, ఓ మహర్షీ...
ఎవరు నీవాళ్ళూ, ఎవరూ కారూ, ఓ మహాత్మా, ఓ మహర్షీ!!
రాజీవ్ నోటికొచ్చినవన్నీ కలిపి పాటలా పాడుకుంటూ కిటికీ దగ్గర నిలబడ్డాడు!
తను చేస్తున్న పని తప్పా, ఒప్పా..? - ఎవరు చెప్పాలి?
ఓ ప్రాణిని కాపాడటం తప్పని ఎవరంటారూ..?! ఫెర్టిలిటీ క్లినిక్ లకి వెళ్ళి నానా అవస్థలూ పడి, వైద్య సలహాలు, సంప్రదింపులతో మాతృత్వాన్ని పొందాలనుకునే ఎందరో స్త్రీలు తెలుసు తనకి. అనాధ శరణాలయాలనుంచి పిల్లల్ని తెచ్చుకుని పెంచుకునే స్త్రీలు ఎందరో తెలుసు తనకి. అయినా తనకి ఒక మగపిల్లాడున్నాడు. మరో పిల్లని కనడం, కనటం కాకుండా పెంచుకుంటే - ఇద్దరు పిల్లలకి తిండి పెట్టలేడా తను? సుమతి ఏమన్నా మొత్తుకోనీ - ఈ పసిగుడ్డును తను రక్షించి తీరుతాడు.
అంతే!! రాజీవ్ తన నిశ్చయాన్ని వెనక్కి తీసుకో దల్చుకోలేదు.
కిటికీలోంచి చూస్తున్నాడు.
"మిమ్మల్నే- ఏం నిర్ణయించారు?" కంచు కంఠం ఖంగున మోగింది.
ఉలిక్కిపడ్డాడు రాజీవ్.
"నే బతికున్నంతవరకు అది ఇక్కడే వుంటుంది"
- రాజీవ్ మాటలను విస్తుపోయినా, మహా మొండితనం వున్న సుమతి తన మాటకి వెనుదిరిగేది లేదని నిర్ణయించింది.
"సరే, నేను నా పిల్లాడూ అక్కర్లేదుగా... ఆ దరిద్రపుదే కావాలిగా... సరే!" విసవిసా లోపలికెళ్ళిపోయింది సుమతి.   
రాజీవ్ అలానే కిటికీ దగ్గర నిలబడ్డాడు. చాపమీద పసిగుడ్డు కదులుతోంది.....రాజీవ్ కి భయమేసింది. ఇప్పుడీ పిల్ల ఏడుస్తుంది- ఏం చేయగలడు తను? పాలు, ఆకలి!
పోనీ... సుమతిని బతిమాలితే..!
పిల్ల ఏడుపు ఎక్కువైపోయింది.... గదిలోంచి సుమతి బయటికి రాలేదు.
రాజీవ్ తలుపు దబదబా కొట్టాడు. తలుపు తెరవలేదు -
"సుమతీ, సుమతీ" - రాజీవ్ కోపంగా ఆ తలుపుని ఓ తన్ను తన్నాడు.
లోపల గడియ ఊడి కింద పడింది.
సుమతి, పిల్లాడు గదిలో లేరు!
   
                                         *    *    *
"అలా పేపరు చూస్తూ కూచోపోతే పిల్లాడికి సాక్సు వేసి బూట్లు తొడగొచ్చుగా!"
వీణ చిరాకుపడుతూ నుదుటిన పడ్డ ముంగురులు వెనక్కి తోసుకుంది.
నాలుగేళ్ళ వినోద్ ఎర్రటి పెదవులతో బొద్దుగా ముద్దుగా డైనింగ్ టేబుల్ మీద కూచున్నాడు. సాక్సు వేయటం కుదరటం లేదు వీణకి. పిల్లాడు పాదాలు అటూఇటూ కదులిస్తున్నాడు.
"మిమ్మల్నే..!" అరిచింది వీణ.
రవి గబుక్కున లేచి పేపరు కింద పడేశాడు.
"బుజ్జి బుజ్జి పాదాలకి సాక్సు తొడిగి ఇంకేం చేయాలీ...?" అన్నాడు వీణతో.
వాటర్ బాటిలూ, స్కూలు బాగ్ భుజాన తగిలించి, "ఇక పద" అంది వీణ. అంతలోనే ఆటో అతను లోపలకొచ్చి వినోద్ ను ఎత్తుకున్నాడు. క్షణంలో ఆటో కదిలింది.
"హమ్మయ్య...!" నుదుటి చెమట తుడుచుకుంది వీణ.
"దేవిగారికి విసరాలా!" అన్నాడు పక్కనున్న పేపరు తీసి భార్యకి విసురుతూ.
"ఆ దేవుడు కొన్నిసార్లు కొందరి విషయంలో పట్టించుకోడు"
"అంటే..?"
"అదే - నీకు కవల పిల్లల్ని ఇచ్చివుంటే ఎలా వుండేదో అని!"
"చాల్లెండి, ఇద్దర్నీ మీకప్పగించి అమెరికా వెళ్ళిపోయి డాలర్లు డాలర్లు సంపాదించేసి..."
"నాకు పంపేదానివి కదూ!"
"ఇంకా నయం, నా కొడుకులకి పంపేదాన్ని!"
వీణ నవ్వుతూ లేచి వంటింట్లోకెళ్ళింది రవి ఆమె వెంటే వెళ్ళాడు.
"వీణా... ప్రతిరోజూ పొద్దున్నే ఆ పసివాడి మీద విసుక్కుని, నాపైనా విసుక్కుని - ఏం లాభం, అందమైన ఉదయాన్ని ఆనందమయం చేసుకోలేకపోతున్నాం కదా!"
"కవిత్వం ఆపండి, అందమైన ఉదయమా.... లేచిందగ్గరనుండీ పరుగులు.... వాడికి పాలుపట్టడం, స్నానం చేయించటం, స్కూలు బాగ్, వాటర్ బాటిల్ సిద్దం చేయటం అన్నీ నేనేగా...! మీరేమో హాయిగా పేపరు తిరగేస్తూ, 'శ్రీదేవి మళ్ళీ పురిటికెడుతోందిట' అని మురిసిపోతూ, వేడి కాఫీ తాగుతూ కూచుంటుంటే, ఎంతగా ఒళ్ళు మండిపోతుందో తెలుసా...ఐ యామ్ రియల్లీ జెలస్ ఆఫ్ యూ!" - భర్త పక్కన సోఫాలో కూచుంది వీణ.
నవ్వాడు రవి.
"సరే, నేనేమి పనులు చేయాలో చెప్పు - రేపటినుంచి చేసేస్తా... వీణా, ఒక్క మాట విను, ఆ పిల్లాడు, స్కూలు గొడవ అంతా నువ్వు చూసుకో, నేను పొద్దున్నే కాఫీ కాచి బ్రేక్ ఫాస్ట్ చేస్తాను సరేనా!" వీణ బుగ్గలు ముద్దుపెట్టుకున్నాడు రవి.
వీణ గలగలా నవ్వి "చెయ్యండి" అంది.
రవికి బాంక్ లో ఉద్యోగం... సరదా అయిన మనిషి, సంగీతం, సాహిత్యం వచ్చినవాడు.... తనకన్నా ఏడాది పెద్దదని తెలిసి ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు వీణని.
"ఉద్యోగం చేయను నేను! మా అమ్మ ఉద్యోగం చేసి ఎంత అలసిపోయేదో నాకు తెలుసు. పైగా.... నాకు సినిమాలు చూడ్డం, షాపింగ్ కి వెళ్ళటం, పిక్ నిక్ కి వెళ్ళటం ఇలాటివి నాకిష్టం. అంతేకానీ, ఎవడు చేస్తాడీ ఉద్యోగం - చచ్చినా చేయను" చాలా ఖచ్చితంగా చెప్పేసింది పెళ్ళికి ముందే వీణ.
రవికి కూడా బాగా నచ్చిందీ విషయం. 'ఇల్లాలు- హాయిగా భర్తనీ, పిల్లల్నీ చూసుకుంటే చాలదా...?' అనుకున్నాడు.
ఈమాటే వీణ చెల్లెలు జయతో అన్నాడు ఓ రోజు. కొట్టినంత పని చేసింది.
"ఏమిటీ, ఇల్లాలా, ఇంట్లో కూచోవాలా..? అలాగేగా ఆడవాళ్ళని వంటింటికి, పడకటింటికి పరిమితం చేసారు మగాళ్ళు - ఆడవాళ్లు ఉద్యోగం చేసి తీరాల్సిందే!!"
ఆరోజు రవి కొంచెం భయపడ్డాడు- ఈ స్త్రీవాది చెల్లెలు మాటలు తన భార్య వీణ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయోనని! అదృష్టం- తన భార్యని ఖచ్చితమైన అభిప్రాయాలు!
ఆఫీసునుంచి వచ్చిన ఓ గంటకి- 'ఎక్కడికైనా బయటకెడదాం' అంటుంది వీణ.
ఆఫీసులో అలసిపోయి వచ్చిన రవికి ఇంట్లో హాయిగా కూచుని, ఏడవగానే భోంచేసి నిద్రపోవాలనిపిస్తుంది. కాకపోతే, టీవీ చూస్తూ కూచోవాలనిపిస్తుంది.
కానీ, ఎక్కడికైనా వెళ్ళాలి..... ఎక్కడికెళ్ళాలీ, టాంక్ బండ్ దగ్గర కాసేపు కాలక్షేపం చేయాలి. సినిమాకెళ్ళాలీ.... ఏ చుట్టాలింటికో కాసేపు వెళ్ళి రావాలి. ఇలా సాయంత్రం అయ్యేసరికి ముస్తాబయి భర్తతో బయట తిరిగిరావాలనే కోరిక వీణది.
ఎన్నిసార్లో వెళ్ళడం, మరెన్నిసార్లో ఈ విషయమై పోట్లాడుకోవడం జరుగుతూనే వుంది.
ఆరోజు ఆఫీసునించి రవి వచ్చి టీవీలో వింబుల్డన్ టెన్నిస్ చూస్తున్నాడు.
"అబ్బ విసుగొచ్చేస్తోంది..... ఇంట్లో పనీ, పిల్లాడు! ఛీ... నాబతుక్కి ఓ ముద్దూ లేదూ- ముచ్చటా లేదు" విసుక్కుంటూ ముందు గదిలోకొచ్చి కూచుంది వీణ.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS