Previous Page Next Page 
మమత పేజి 3

రవి ఏమీ పట్టించుకోకుండా టెన్నిస్ చూస్తున్నాడు.
"మీరో పనిపిల్లని కుదర్చకపోతే నేనీ పనులు చేసుకోలేను బాబూ!" అంది.
రవి ఫక్కున నవ్వాడు.
"ఏమిటా నవ్వు..?" వీణ ఎర్రటి బుగ్గలు కందిపోయాయి కోపంతో.
"పనిపిల్లా... దేనికీ? నేను ఆఫీసుకెళ్ళిపోయాక, పసివాడు పన్నెండయేసరికి ఇంటికొచ్చాక, ఇంకా ఏం పనులో చెప్పు- నువ్వూ, నీ కొడుకూ హాయిగా నిద్రపోటమేగా!"
వీణ ఆ మాటలకి కస్సుమంది.
"చేసేవాళ్ళకి తెలుస్తుంది- మీకేం తెలుస్తుంది వాడెంత అల్లరి చేస్తాడో? - ఒక్క నిమిషం పడుకోడానికి వీలుండదు. మీరనుకుంటున్నారు లాగుంది..... నేను ఇంట్లో వుండి చాలా సుఖపడిపోతున్నానని!" అంది కోపంగా.
రవికి తన చిన్నతనం. తన పల్లెటూళ్ళో ఇల్లు గుర్తొచ్చింది. తను కాక ఇద్దరు అన్నలు, ఇద్దరు చెల్లెళ్ళు.... పెద్ద ఇల్లు అమ్మ ఎప్పుడూ ఏదో పని చేసుకుంటూ హాయిగా, సంతోషంగా వుండేది. అప్పటి ఆడవాళ్ళకీ, ఇప్పటి ఆడవాళ్ళకీ అంత తేడా వుందా? ఏమో!
"వీణా..... నీ మాటలు నాకేం అర్ధంకావడం లేదు. పైగా- పనిపిల్ల అంత తేలిగ్గా దొరుకుతుందా? అయినా- నమ్మకంగా వుంటుందా..? అంతేకాదు, అసలు ఇంట్లో వున్న పనులేమిటీ..?" అన్నాడు విసుగ్గా.
"మగాళ్ళకేం అర్ధమవుతాయి ఆడవాళ్ళ కష్టాలు? ఏమో... నేనూ చెప్పా- ఎక్కడైనా దొరికితే చూడమని మా చెల్లెలితో..!"
"దొరకటమేమిటీ?" ఫక్కున నవ్వాడు రవి.
పిల్లాడిని రవి పక్కన కూచోపెట్టి విసవిసా లోపలికెళ్ళిపోయింది వీణ.
రవి ఆలోచిస్తున్నాడు... నిజంగా ఈ చిన్న సంసారానికి పనిపిల్ల అవసరమా?! చూద్దాం! తన స్నేహితులతో చెప్తే ఎవరైనా వుంటే చూపిస్తారు!
భోజనాలు చేస్తున్నారు... పడుకున్న పిల్లాడు లేచి నడుచుకుంటూ వచ్చి తల్లి వొళ్ళోకూచున్నాడు.
రవి పట్టించుకోకుండా తింటున్నాడు.
"అర్ధమైందా....పని పిల్ల ఎందుకో- ఇందుకు!! పది నిముషాలు హాయిగా భోజనం చేయటం కుదరదు.... ఛీ!" చేయి కడుక్కుని లోపలికెళ్ళి పిల్లాడిని నిద్రపుచ్చి వచ్చింది వీణ.
"ఇప్పుడు నిజంగా అర్ధమైంది" అన్నాడు రవి నవ్వి.
"మీకంతా నవ్వుతాలగానే వుంటుంది. ఆఫీసులో హాయిగా ఫ్యాను కింద కూచుని నిద్రపోయే మీలాటివాళ్ళకి నాలాటి తల్లుల కష్టాలూ" అంది వీణ.
"అబ్బ కష్టాలు, కష్టాలూ అనకూ - ఇవేం కష్టాలు..? సరే, రేపట్నుంచి చాలా సీరియస్ గా ఇదే విషయం ఆలోచిస్తాగా"
ఫోను గణగణ మోగింది. రవి ఫోను అందుకున్నాడు.
"మీ అన్న!"
- గబుక్కున ఫోను తీసుకుంది.
"ఆ.... ఆ...." ఆశ్చర్యంగా అంటుంటే ఏమిటో అర్ధంకాలేదు రవికి.
"అవును, వదిన చెప్పింది నిజమే.... ఎక్కడైనా దింపేసిరా!" - వీణ ఫోనులో మాట్లాడుతూనే వుంది.
ఐదు నిమిషాలు దాటిపోయింది.
ఫోనుపెట్టేసి, నీరసంగా కూలబడింది సోఫాలో   
"ఏమిటి విషయం? మీ వదిన మళ్ళా...."
"చాల్లెండి - వాడో పెద్ద సమస్యతో కొట్టుకుంటున్నాడు పాపం!" అంది వీణ ఎటో చూస్తూ.
క్షణం విస్తుపోయినా, రవి వెంటనే అన్నాడు-
"మనం తెచ్చుకుందామా!"
"ఏమిటీ?"
'అవును - పాపం, పసిగుడ్డును! మీ వదిన అంత నిర్దాక్షిణ్యంగా వుండకూడదు...మానవత్వం లేకుండా, ఛీ..!" - విసురుగా లేచాడు రవి.
వీణ ఏమీ మాట్లాడలేదు. ఇదంత చిన్న సమస్య కాదు. చాలా ఆలోచించాలి. ఎందుకు అనవసరమైన బాదరాబందీలూ..?! - వీణ భర్తకేసి చూసింది.
"నేనెళ్ళి తీసుకురానా - వీణా! నిజంగా అంటున్నా- పాపం, మీ వదినంత మూర్ఖంగా నువ్వూ వుండాల్సిన పనుందా? బాబుకి మూడేళ్ళొచ్చాయి... ఆడపిల్ల కావాలని నువ్వూ అనుకుంటున్నావుగా దేవుడు పంపాడనుకుందాం..! చెప్పు వీణా.... పాపం-మీ అన్నయ్య ఏం చేస్తాడూ..?!"
వీణ మాట్లడలేదు.
'పోన్లే, పెంచితే ఏమవుతుందీ..? - కాకపోతే తనుమాత్రం ఇద్దరు చిన్నపిల్లల్ని చూడకలదా!'
వీణ పైకి ఎంత గయ్యాళిలా కనిపించినా, మనసు చాలా దయాత్మకం.
ఆ పసిదాన్ని తెచ్చుకుంటే..!
క్షణాల్లో బయల్దేరారు ఇద్దరూ.
"శకుంతలని పెంచి కణ్వుడెంత ఆనందపడ్డాడూ, గోదాదేవిని పెంచి ఆ తండ్రి ఎంత ఆనందపడ్డాడో - మనమూ అంతే! అవునా...?" రవి ఇంటికి తాళమేస్తూ అన్నాడు.
"నాకవేం తెలియవు. చూస్తాను- నాకు నచ్చితే తెచ్చేస్తాను, లేకపోతే అక్కడే వదిలేస్తాను" అంది వీణ.
"అప్పుడు నేను తెస్తాను - మహలక్ష్మి మనింటికొస్తోందేమో..!"
రవి మాటలకి నవ్వింది వీణ.
రాజీవ్, వీణ, జయ అన్నాచెల్లెళ్ళు. తండ్రి డాక్టరు కావటం, తల్లి బ్యాంక్ ఆఫీసర్ కావటం ఆర్ధికంగా, సాంఘికంగా ఒక స్థాయిలో పెరిగారు ముగ్గురూ.
పెద్ద సైంటిస్ట్ గా స్థిరపడ్డ రాజీవ్ ఆలోచనా ధోరణులు కొత్త పుంతలు తొక్కడమేకాక, దయ, జాలి మొదలైన సహృదయ లక్షణాలు బాగా అలవరచుకున్నాడు.
వీణ గారాబంగా పెరిగి కష్టపడడానికి ఇష్టపడకుండా హాయిగా జీవితం గడిపేయాలనే భారంతో వుంటుందెప్పుడూ.
జయ గొప్ప స్త్రీవాదిగా - ఆ సిద్దాంతాలు ఒంటపట్టించుకుంటూ స్త్రీ పురుష వ్యత్యాసాన్ని క్షణక్షణం నిరసిస్తూ ఒక విధమైన ఉద్యమకారిణిలా వుంటుంది.
ఎందుకో.....ఆ పసిగుడ్డును చూడగానే మురిసిపోయింది వీణ. తను తీసికెడుతుంది. తిండిబట్టకి కరువు లేకుండా పెంచుతుంది. కానీ, ఆడపిల్లని పెంచటం ఎంత బాద్యతో తల్చుకుంటే భయమేస్తుంది. వీణ అలా ఆలోచిస్తూ పిల్లకేసి చూసింది. రవి కూడా ఆ పిల్లకేసి చూస్తున్నాడు.
"వీణా, సుమతి చాలా మొండిది..... తెలుసుగా! అందుకే.... అయినా నేను చూసుకోగలను. కానీ...." అన్నయ్య రాజీవ్ మాటలు నెమ్మదిగా చెప్తుంటే-
"నేను తీసికెడతా, హాయిగా చూసుకుంటా, నువ్వేం బెంగపడకు!" అంది వీణ.
ఆ మాటలు అమృతపు జల్లులా తగిలాయి రాజీవ్. రవికి కూడా.
కానీ, వీణ మనసు క్షణం అల్లకల్లోలంగా అయింది. నాలుగేళ్ళ పిల్లాడితో సతమతమైపోతున్న తను మరో పసిపిల్లని పెంచగలదా! తనకి జీవితం అంటే హాయిగా, సరదాగా సినిమాలకి, షికార్లకి వెడుతూ గడిపేయాలనే ఎప్పుడూ ఆలోచన. అలాటి తను పనిపిల్ల దొరకలేదు.... ఒక్కర్తీ చూసుకోవాలిగా!
వీణ పసిగుడ్డుకేసి చూసింది.
తనూ, భర్త ఈమధ్యే అనుకున్నారు కూడా- 'పిల్లాడికి నాలుగేళ్ళొచ్చాయి. వాడికి ఓ చెల్లెలో, తమ్ముడో వుండాలి - లేకపోతే తరువాత వాడు వంటరితనం అనుభవించలేడు. ఆడుకోటానికి, అల్లరి చేయడానికి వాడికీ ఓ తోడువుండాలిగా. భగవంతుడే ఈ పిల్లని ఈ రూపంలో చూపిస్తున్నాడేమో! వీణ అంతవరకు ఎంత తేలిగ్గా ఆడుతూ పాడుతూ గడిపేయాలనుకుందో.... ఆ క్షణమే తను ఓ బాధ్యతాయుతమైన తల్లిగా, ఇల్లాలిగా జీవించాలని నిశ్చయించుకుంది. తను ఇల్లాలు, మంచి గృహిణి.... ఇంటినీ, పిల్లల్నీ చూసుకుంటే చాలు- అదే తన భర్తకు ఇష్టం కూడా. అయినా.... పిల్లలు ఎంతలోకి పెరిగిపోతారో! ఇలా చూస్తుండగానే వినోద్ నాలుగేళ్ళ పిల్లాడై, స్కూలుకి పరిగెడుతున్నాడు! ఈ పిల్లని తనే పెంచుతుంది... అయితే! వీణ నిశ్చయం ఎంతో ఆనందం కలిగించింది ఆమె మనసుకి.   
                                       *    *    *
తలుపు చప్పుడవుతుంటే, చిరాగ్గా తలుపు తీసిన తులసమ్మగారు విస్తుపోయింది- సుమతిని, పిల్లాడిని చూసి!
తులసమ్మ దగ్గర్లో వృద్దాశ్రమం నడుపుతోంది. మంచి మనిషిగా ఎంతో పేరు తెచ్చుకుంది. తులసమ్మ, సుమతి తల్లి ఒకప్పుడు పక్కపక్క ఇళ్ళలో ఎంతో స్నేహంగా వుండేవారు.
తులసమ్మ భర్త పోయాక, ఒక్క కొడుకూ అమెరికా వెళ్ళి స్థిరపడ్డాక, తులసమ్మ వృద్దాశ్రమాన్ని నడుపుతోంది. ఆడవాళ్ళ జీవితాల్లోని ఆవేదనకి ఒక ఊరట, వారికొక రక్షణ, ఆప్యాయత ఎంత అవసరమో గ్రహించింది. ఆశ్రమంలో అందరూ 'పిన్నిగారూ...' అని పిలుస్తారు ఆప్యాయంగా.
"రా... లోపలికి రా! ఏమిరా-అమ్మమ్మని మరచిపోయావా, గుర్తున్నానా..?!" అంటూ పసివాడ్ని ఎత్తుకుంది. సుమతి లోపల గదిలో కొచ్చి కూచుంది.
"నన్ను కూడా నీ దగ్గర చేర్చుకో" అంది సుమతి.
తులసమ్మ నవ్వి - "చాల్లే - నా ఆశ్రమం వృద్దులకే!" అంది.
తులసమ్మని చిన్నప్పట్నుంచీ 'పిన్నీ...' అని పిలుస్తుంది సుమతి.
"ఓ పెద్ద సమస్యలో కొట్టుకుంటున్నా" అంది ఒళ్ళో పిల్లాడి తలనిమురుతూ.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS