చాంచల్యం లేని నిర్ణయం తీసుకోడానికి ముప్పై ఏళ్ళు రావాలని నియమం ఏం ఉంది?...ఈ లోపుగా తీసుకున్న నిర్ణయాలు నిలబడ వేమో అని తమనాధం గారు అలా అన్నారు కాని, తనలాంటి స్థిరచిత్తం ఉన్నవాడు ముప్పయి ఏళ్ళ దాకా ఆగడం ఎందుకు?....అప్పటి దాకా అగనూ అక్కర్లేదు సీల్డు కవరు లో ఉన్న రహస్యం ఏమిటో చూడనూ అక్కర్లేదు. ఇప్పుడే వెళ్లి విజయతో తన నిర్ణయం చెప్పి వస్తే సరిపోతుంది. కాని ఇందాకా అలా అని వచ్చేసిన తను ఇంతలోనే మామూలుగా వెళ్లి విజయతో ఎలా మాట్లాడడం?....ఒకవేళ తను పలికించినా విజయ మాట్లాడుతుందా తనతో-- ఏమో-- ఇందాకా జరిగిన సంఘటన తలుచుకుంటే తనకి భవిష్యత్తు అంతా అయోమయంగా కనిపిస్తోంది.
ఇలా అనుకుంటూ లేచి గోపాలం , రూమ్ వేపు బయలుదేరాడు. ఆలోచనలతో తల వంచుకుని వెళ్ళుతున్న గోపాలాన్ని "ఎక్కడికి వెళ్లారండీ....మీ రూమ్ కి వెళ్లి వస్తున్నారా" అంటూ పలకరించాడు వాసు.
గోపాలం ఉలిక్కిపడి "ఆ....ఎవరూ?....ఓ...నువ్వా వాసూ!.... ఏవిటి విశేషాలు?...వారం పది రోజులయింది కనిపించి....పరీక్షల కి తెగ చదివేసినట్లున్నావు -- చిక్కిపోయావు . ఎలా రాశావు పేపర్లు?....."
"బాగా రాశానండి -- క్లాసు రావచ్చు"
"క్లాసయినా సేసయినా బి.ఏ లోచేరి ఆ పైన మా మందలో చేరవలసిన వాడివే కదా ?....ఏ మెడిసినో ఇంజనీరింగో అంటే క్లాసు కాని మీ నాన్నకి దృష్టి అంతా జడ్జి మీదే ఉన్నప్పుడు, నీకు ఇంటర్మిడియట్ లో ఏక్లాసు వచ్చి ఏం లాభం?"
"అవుననుకోండి ." అయినా మన ప్రయత్న లోపం లేకుండా మనం చదివి మార్కులు తెచ్చుకోవాలి కదా?..."
"అవును ఆ మాట నిజం....ఊ....ఎప్పుడేల్తున్నావు ఊరు ?..."
"రేపు వెళ్ళుతున్నానండి....ఏవైనా కబుర్లు చెప్తారేమో అనే మీ రూమ్ కి వెళ్లి వస్తున్నాను."
"ఏ వున్నాయి కబుర్లు ! "ఇలా అనగానే గోపాలానికి తను విజయ ని వివాహం చేసుకోవాలని అప్పుడే చేసుకొన్నా నిర్ణయం జ్ఞాపకం వచ్చింది. అన్నయ్య తనతో మాట్లాడుతున్నా, మాట్లాదతూండక పోయినా ఈ విషయం అతని చెవిని వేసి మరి తను తక్కిన సంగతి ఆలోచించడం ధర్మం. అందువల్ల ఓమారు పల్లె వెళ్లి అన్నయ్య తో , ఈ సంగతి చెప్పాలి . ఇలా అనుకుని "డాక్టరు గారితో, మీ తమ్ముడు ఏదో ముఖ్యమైన విషయం మీతో మాట్లాలిట, నాలుగైదు రోజులలో వస్తానన్నాడు . అని చెప్పు" అన్నాడు గోపాలం.
"అల్లాగే!" అంటూ వాసు వెళ్ళబోయాడు.
"విజయ కి కనిపించి చెప్పావా వెళుతున్ననని?" అన్నాడు గోపాలం.
"ఆ- ఇప్పుడే అక్కడ నుంచి వచ్చా ఆవిడ కి వంట్లో బాగోలేనట్టుంది కళ్ళు రెండూ ఎర్రగా వాచీ ఉన్నాయి." తాళం వేసి వెక్కడికో వెళుతున్నారు-- ఆసుపత్రి కేమో మరి."
"ఊ -- సరే -- వెళ్ళు " అని వాసుని పంపించివేసి విజయ బాధపడుతున్నట్లు ఉంది. కాలక్షేపం కోసం లైబ్రరీ కో వెళ్ళింది అనుకుంటూ తన రూమ్ వైపు అడుగు కదిపాడు గోపాలం...........
"పై వాళ్లకి ఏం తెలుస్తుంది ? పేద ముండా కొడుకు , వీడికి ఇంట్లో ఆమాత్రం పెత్తనం ఉండదా అనే కాని, గోపాలం సర్వ స్వతంత్రుడని . వాడికి నామాటంటే గడ్డి పరక కంటే హీనమని తెలియదు" అన్నాడు శంకరం కోపంగా కటకటాల్లో ఇటూ అటూ పచార్లు చేస్తూ.
"అదేవిటండీ!....ఇప్పుడతను మీ మాట కాదన్న దేమిటి?....ఇంతకీ మళ్ళీ ఏం వచ్చింది ?" అంది సావిత్రి పైట చెంగుతో చెయ్యి తుడుచుకుంటూ అక్కడికి వచ్చి.
"మళ్ళీ ఏం వచ్చిందటావేమిటి?....మామూలే. మా అమ్మాయిని మీ తమ్ముడికి చేసుకోండి. దాన్ని మీ కడుపులో వేసుకోండి. అని ఎంత మందికని " అలాగే చూద్దాం లేండి అంటూ సమాధానం చెప్పకు రావడం....ఎవరికో ఒకరివి అవును, కాదు అని చెప్పాలా?....లేకపోతె నాకా సంగతి తెలియదు. నేను చెప్పినట్లు వాడు వినడు. నేను ఒట్టి చవట దద్దమ్మ ని ...మీరు వెళ్లి వాడితోనే మాట్లాడుకోండి అని చెప్పనా?"
"చాల్లెండి. అన్నగారి మాట తమ్ముడు వినడుట అని నలుగురూ అనుకోవడం మీకు గౌరవమా? అతనికి గౌరవమా?"
"గౌరవమో అగౌరవమో జరుగుతున్న ముచ్చట అదే కదా?....నేనంటే భయం కాని నా మాటంటే భక్తీ కానీ ఉందా వాడికి?....
"ఎందుకు లేదు? ...భయం భక్తీ లేనివాడయితే గృహ ప్రవేశం నాడు భయంతో గుండెలు గవుక్కుమంటూ ఎందుకు వస్తాడు? వచ్చి, సమయానికి రాలేక పోయినందుకు ఎందుకంత బాధపడతాడు?....ప్రోద్దుటికే ఎందుకు రాలేకపోయాడో చెప్పబోతే మనం చెప్పనిచ్చామా? ఇద్దరమూ కోపం తోటి మొహాలు ముడుచుకుని కూచున్నాం. పాపం ఆ రెండు రోజులూ బిడ్డ యెంత విలవిల్లాడి పోయాడు" కళ్ళు వత్తుకుంటూ డగ్గుత్తికతో అంది సావిత్రి. శంకరం ఏమీ మాట్లాడలేదు. గడచిన సంగతులు ఒక్కొక్కటే జ్ఞాపకం తెచ్చుకుంటూ ఆలోచిస్తున్నాడు.
"లా" చదవాడానికి వేళాతానని మొండిగా పట్టుబట్టి పెంకితనంగా మాట్లాడిన ఆరోజు ప్రవర్తన క్షమించా రానిది. తను పంపిన మనియార్డరు తిరగ గొట్టేయడం వాడి నిర్లక్ష్యానికి నిదర్శనం. అయితే ఆ తర్వాత తను శేషయ్య ద్వారా పంపిన డబ్బు మాత్రం నెలనెలా స్వీకరించాడు. మరి శేషయ్య ఏం రాశాడో , ఏం చెప్పి పంపుతూ వచ్చాడో కాని -- కాని తన క్షేమం ఒక్క కార్డు ముక్క రాయకపోవడం , గృహప్రవేశం సమయానికి రాకుండా పది మందిలోనూ తనని అవమానం పరచడం ఇవి మాత్రం తను ఎప్పటికి మరిచి పోలేడు.
అయినా-- శెలవల్లో కూడా మాట్లాడితే రాజమండ్రి పోతూ వుండడం తరచూ ఆ ఊరు వదిలి రాక పోవడం. ఆ రామనాధం గారికి సీరియస్ గా ఉందంటే నుంచున్న పళాన్ని వెళ్ళిపోవడం ఇవన్ని చూస్తుంటే వాడికి రాజమండ్రి లో బలీయమైన ఆకర్షణ ఉండి ఉంటుంది అని తోస్తోంది. రామనాధం గారికి ఎదిగిన మేనకోడలు ఒకామె ఉన్నట్లు ఒకటి రెండు సార్లు శేషయ్య చెప్పినట్లు గుర్తు-- గోపాలం తరచూ రాజమండ్రి వదిలి రాకపోవడానికి ఆమె కాదు కదా కారణం ?.....
ఏమో ఖర్మ..........
పెద్దవాళ్ళం దగ్గర ఉండి జాగ్రత్తగా చూసుకోపోతే ఇలాంటి ప్రమాదాలే ఏవో జరుగుతాయి-- తప్పవు-- అందుకే తను రాజమండ్రి లో ప్రాక్టీసు పెట్టాలి మొర్రో అన్నది. అప్పుడే శేషయ్య పడనిస్తేనా?....అలాగే తను రాజమండ్రి లోనే ప్రాక్టీసు పెట్టి దగ్గరుండి గోపాలాన్ని చదివించు కుంటే వాడి వాళ ఇలాగ కట్లు తెగి విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉండునా?.........
అయినా ఇందులో తన పొరపాటు కూడా ఉంది. ఇక్కడ ప్రాక్టీసు లో పడి అహర్నిశలూ కొట్టుకుంటూ కూర్చోవడమే కాని, అక్కడ వాడి చదువేమిటి , సందర్భం ఏమిటి, అని చెప్పి ఒక్క మారు, ఒక్క మారంటేఒక్క మారైనా చూసి వచ్చాడా తను? అన్నయ్య వస్తాడేమో, చూస్తాడేమో అంటే ఆ పద్దతి వేరుగా ఉంటుంది. ఇప్పుడేమిటి -- చిత్తం వచ్చినంత స్వేచ్చ?
వ్యక్తిగత జీవితంలో ఏమో కాని లాయరుగా మాత్రం ఈ ఏడాది రెండేళ్ళ లోనూ తమ్ముడు చాలా గొప్ప అభివృద్ధి సాధించాడనీ, సమర్దుడూ, నిజాయితీ పరుడూ అని పేరు సంపాదించాడనీ శేషయ్య గారు అంటూ వుంటారు . తనతో -- వాసుని చూడటానికి అయన వెళ్ళినప్పుడల్లా మా గోపాలం కనిపించాడా అని తను అడగడం లేదండీ అని చెబుతూనే , గోపాలం పేరు ప్రతిష్టలు గురించి మాత్రం ఓ అరగంట అనర్గళంగా ఉపన్యసించడం జరుగుతోంది --
తమ్ముడి ఉచ్చస్థితి ని తను కళ్ళారా చూసి ఆనందిచినట్టూ అవుతుంది. అసలు వాడి సంగతేమిటో పరిస్థితి ఏమిటో పరిశీలించినట్టూ అవుతుంది. ఈ పెళ్లి విషయాలు మాట్లాదినట్టూ అవుతుంది. కాళీ చూసుకొని తనోమారు రాజమండ్రి వెళ్లి వస్తే బాగుండును అనుకున్నాడు శంకరం.
ఇంతలో మణి , కాళ్ళకి అద్దాలు పడుతున్న పరికిణి ని గుప్పిట తో పట్టుకుని పరుగు పరుగున వచ్చి "నాలుగైదు రోజులలో బాబయ్య ఓమారు వస్తానని వాసు ద్వారా కబురు చేశాడు." అంది.
"నిజంగా ?" అన్నారు శంకరం, సావిత్రి. ఒక్కమారు ఆ మాట చెప్పేసి మణి తుర్రుమంది. వాడు చెప్పబోయే పట్నం సంగతుల్ని ఆసక్తి తో వినడానికి.
"నే చెప్పానా?' గోపాలానికి మీరంటే భక్తీ గౌరవాలు ఉన్నాయని ?' అంది సావిత్రి.
"నాకు మాత్రం తెలియదుటే-- నా తమ్ముడి హృదయం ఎటువంటిదో నాకంటే ఎక్కువ తెలుసు నేవిటి నీకు అన్నాడు శంకరం.
సావిత్రి నవ్వుకుంది.
"అతను వట్టి పిచ్చి వాడండీ?....పౌరుషమే కాని మరేం లేదు. మనసులో ఉన్న ప్రేమనీ, భక్తీనీ పైకి చెప్పలేడు --భయం ....'
"అవును, నా తమ్ముడే వాడు? ప్రేమా ఉంటుంది, కోపం ఉంటుంది నాలాగే, హృదయం లో ప్రేమ ఉన్నవాడికే , పైకి ఈ కోపం , పౌరుషం పట్టుదలాను-- అసలీ ప్రేమా కోపం అనేవి ఉన్నాయి చూశావు ; మనిషి ఒకే ప్రవృత్తి కి బొమ్మ బోరుసునూ...ఏవిటలా నవ్వుతావు ?"
"ఆహా!...ఈ సౌమ్యం, మంచిగా మాట్లాడడం, ఇవన్నీ ఇప్పుడేనా ?....అనక అతను వచ్చాక కూడా నా అని"

"అప్పుదూనూ....అయినా వాడే రావాలని పట్టుదల ఏం ఉందే.....సోదరుల మధ్య పౌరుషాలు ఏవిటి?....నే వెళ్తాను వెళ్లి "అబ్బాయ్! నువ్వు వెంటనే వివాహం చేసుకోవాలి. ఇప్పటికే ఆలస్యం అయిపొయింది. పైగా నీ పెళ్లి చేసికాని "మణి" పెళ్లి తలపెట్ట దలుచు కోలేదు. ఇప్పటికే దానికి పదేళ్ళు వచ్చేశాయి. పైగా వచ్చేయేడు గవర్నమెంటు యుక్త వయస్సు రాని పిల్లలకి పెళ్ళిళ్ళు చేయరాదని చట్టం ఏదో చేయబోతున్నదట ఆ చట్టం రాకుండా మణి పెళ్లి అయిపోవాలి..." అంటూ వాడికి నచ్చచెప్పి ఒప్పిస్తా" అన్నాడు శంకరం.
శంకరం మాటలు విని సంతోషంతో హృదయం అంతా నిండిపోయి , కళ్ళ నిండా నీళ్ళు నిండి, పెదిమలు ఆనందంతో వణుకుతూ ఉండగా "మీది అమృత హృదయం అండీ! అంది సావిత్రి. ఆమె తల నిమురుతూ "నీ మనసులో కంటే ఎక్కువ అమృతం ఉందా నా హృదయంలో" అంటూ నవ్వాడు శంకరం.
ఇంతలో అటు హాస్పిటల్ వైపున ఏదో అలజడి వినిపించింది. గుంపులు గుంపులుగా జనం హడావిడిగా వస్తున్నట్లున్నారు. ఆ జన సందోహం లోంచి "డాక్టర్ గారూ!...డాక్టరు గారూ అని ఆందోళన , ఆవేదనలతో నిండిన కంఠంతో శేషయ్య కంగారుగా కేకలు పెట్టసాగాడు -- అది విని శంకరం గబగబా గదిలోంచి ఇవతల హాల్లోకి వచ్చి గుమ్మం ద్వారా హాస్పిటల్ లోకి ప్రవేశించాడు.
ఎదురుగుండా ఒక పెద్ద గుంపు-- గుంపు ముందు బట్టలన్నీ నలిగిపోయి , ఒళ్ళంతా చెమట్లు పట్టి మొహం లో ఆందోళన, ఆగ్రహాలు కదిలాడుతున్న శేషయ్య . గుంపు మధ్య తిరగేసి ఎనమండుగురు మోసుకొచ్చిన నులక మంచం మీద రక్తపు గుడ్డలతో అచేతనంగా పడి ఉన్న మొసలి వెంకడు-
