Previous Page Next Page 
ధర్మ చక్రం పేజి 19


                                        23

              
    "ఏమో, నాయనా! కడకీ దైవం నిన్నేం చేస్తాడో తెలియకుండా ఉంది. చీమకైనా హాని చేయని నీకు, అడుగడుగునా ఏమిటో, ఈ పరీక్షలు? నాకు తెలియడం లేదు." అంటూ విలపించింది దయామయి, ధర్మారావు కు జైలు లో జరిగిన ప్రమాదం తెలిసి.
    "ఫర్వాలేదమ్మా. ఖంగారు పడకు. "ధర్మారావు ఓదార్చలేక పోయాడు.
    అదే సమయంలో "అమ్మా, ఎలా ఉన్నారు?" అని సత్య లోనికి ప్రవేశించింది. ఆమెను చూస్తూనే దయామయి ముఖం ఉదాసీనంగా మారిపోయింది. ప్రయత్నపూర్వకంగా తనను తాను సంబాళించుకుని, "రా, అమ్మా" అంటూ ముక్తసరిగా మర్యాద చేసింది.
    "ఉదయం మీరు స్పృహ తప్పి పడిపోతే వెళ్లి పోయాము. అప్పటి నుంచీ నాదృష్టి ఇక్కడే ఉంది. ఎలా ఉన్నారు?"
    "బాగానే ఉందమ్మా. ఏమిటో నీరసం వల్ల కొంచెం కళ్ళు తిరిగాయి."
    "అదేమిటి, మీకా కట్టు?' అదిరిపడింది సత్య ధర్మారావు ను చూచి, "ఉదయం బాగానే ఉన్నారే?"
    ధర్మారావు వారించుతున్నా వినకుండా, దయామయి విషయమంతా వివరించింది.
    "అయ్యయ్యో! ఎంత పని జరిగింది!'  
    "ఏమోనమ్మా, ఈ మాయదారి ఉద్యోగం!' నిట్టూర్చింది దయామయి. "ఎంతలో వాళ్లు అంతలో నే ఉండాలి కాని, తగని పనులూ, తగని స్నేహాలు ఎందుకు? ఆపైన కష్ట నిష్టూరాలెందుకు?"
    అర్ధ యుక్తమైన ఆ మాటలకు సత్యాదేవి, ధర్మారావు ముఖా ముఖాలు చూచుకున్నారు. బరువుగా ఉన్న ఆ వాతావరణం లో నుండి బయట పడటానికి లేచింది సత్య. కారు వరకూ తనను అనుసరించి వచ్చిన ధర్మారావు ను "వస్తారా?" అని అడిగింది. ముభావంగానే కారులో కూర్చున్నాడు ధర్మారావు.

                                *    *    *    *
    "ఇదీ, అసలు విషయం. నేను దిక్కులేని వాడిని. అనాధాశ్రమం లో పెరిగాను, సత్యాదేవి! ఈ విషయం చెప్పలేకనే అమ్మ బాధపడి అలా అయింది ఉదయం."
    సత్య చాలాసేపు మాట్లాడలేదు. "మరి మీరామేను "అమ్మా' అని పిలుస్తారు?' అని అడిగింది చివరికి.
    "అవును. ఆశ్రమం లోని అనాధలందరికీ ఆమె అమ్మే. అయితే ఆరంభం నుండి పెంచిన మూలాన, నేనంటే కొంత ప్రత్యేకాభిమానం."
    "సరే. అయితే ఈ విషయాలు చెప్పటానికి అంత సందేహం దేనికి?"
    "నిర్జీవంగా నవ్వాడు ధర్మారావు. "మరి సందేహం , సిగ్గు కాదూ? మావంటి వారిని మీ వంటి కుటుంబీకులు చిన్న చూపు చూస్తారు. అందుకే నేను ఆరంభం లోనే ఈ విషయం చెప్పే ప్రయత్నించాను. నువ్వు అవకాశ మివ్వలేదు."
    "అసహ్యమెందుకు, ధర్మారావు గారూ? అనాధ శరణాలయం లో పెరుగే వారందరూ కళంక చిహ్నాలు కారు. ఆ కళంకం చేసిన వారెక్కడో సభ్య సమాజం లో పెద్ద మనుష్యులుగా చలామణీ అవుతూ తమకు అడ్డు రాకుండానే కదా, అమాయక శిశువులను అనాధ శరణాలయాల పాలు చేయడం?"
    ధర్మారావు ముఖం మాదిపోవడం తో తన మాటలలో తప్పిదాన్ని గుర్తించిన సత్యాదేవి లోలోని చాలా బాధపడింది. మంద స్వరాన అన్నది: "అయినా , ధర్మారావు గారూ, సభ్య సమాజం అన్నంత మాత్రాన అందులో అందరూ సత్ప్రవర్తన గలవాళ్ళూ, గుణవంతులే ఉంటారా? ఎవరిలో నైనా ఎక్కడైనా సరే మంచీ, చెడూ కలిసే ఉంటాయి. పూర్తిగా విభజించి వేయడానికి వీలులేదు. అనాధ శరణాలయం అన్నంత మాత్రాన అలా ఒకే పద్దతిలో ఆలోచించడం దేనికి? అందరూ పుట్టిన చోటే పెరుగుతారా? వెనక ఏవేవో కారణాలు ఉండవచ్చు. అంత మాత్రాన అపార్ధాలు తీసుకోకూడదు. శ్రీ కృష్ణుడు దేవకీ దేవి బిడ్డడే అయినా, యశోద దగ్గర పెరిగాడు. దేనికేమిటి , మరి?"
    "సంతోషం, సత్యాదేవీ! కాని నువ్వొక్కతేవు అలా అలోచించినంత మాత్రాన చాలదు. నావంటి వారిని లోకం ఒక్క నాటికీ గౌరవించదు. పెద్దలూ, పూర్వ చారపరాయణులూ అసలే అంగీకరించరు. అందుకే నేను నువ్వు దగ్గరయిన కొలదీ వెనుకంజ వేశాను. మన స్నేహం అధికం కాకముందే ఈ విషయం చెప్పాలని ప్రయత్నించాను. కాని ఆనాడు నువ్వా అవకాశం ఇవ్వలేదు. ఈనాడు చెప్పక తప్పలేదు. ఇప్పుడైనా మించిపోయింది లేదు. నన్ను మరిచిపో, సత్యాదేవీ!"
    "ధర్మారావ్!" ఉలిక్కిపడుతూ అతడి నోటికి తన చేతిని అడ్డు పెట్టింది సత్య. "మళ్లీ ఎప్పుడూ అలా మాట్లాడకండి. నేను మీకు ఎప్పుడో చెప్పాను. నాకు ముఖ్యం వ్యక్తీ. పూర్వాపర చరిత్రలన్నీ నాకు అనవసరం. ఈ అభిప్రాయం ఈ జన్మ లో మారదు. మీ గురించి ఇంతకంటే భయంకర సత్యాలేమైనా బయల్పడినా నేను బెదరను. జన్మ జన్మాలకూ నేను మీదాన్ని; మీరు నావారు. అంతే."
    "సత్యా!"
    "ప్లీజ్! తర్కించ వద్దు. నడవండి. పోదాము చీకటి పడబోతుంది" అంటూనే తాను లేచి అతని చేయి పట్టుకుని లేవదీసింది.
    "ధన్యుడిని, సత్యా! కాని దైవ నిర్ణయం ఎలా ఉన్నదో!"
    "ధర్మం తోనే దైవం ఉంటాడంటారు కదా? చూద్దాము. అతడు కూడా ఈ రక్త మాంసాలున్న స్వార్ధ మానవులతో సమమే అయిపోతాడో ; ధర్మం, దైవం నీతి, నియమం న్యాయం, సత్యం అనే పదాలు అర్ధరహితమూ, ఆధార రహితమూ కావని నిరూపించు తాడో!"
    నవ్వుతూ అన్నాడు ధర్మారావు; "ఇది కలియుగం , సత్యా! ధర్మం ఒంటి పాదంతో కుంటుతున్నది."
    "ఏదో ఒకటి. అసలు "పాదం', 'ప్రాణం' అంటూ ఉండి నడక సాగుతున్నప్పుడు మనసు ధ్యేయం పైననే నిలిచి, చేరటానికి తాపత్రయ పడుతుంటుంది కదా?"
    "లాయర్ అనిపించావు లే." ప్రేమగా ఆమె చేతిని నొక్కి వదిలేశాడు.
    పక్కపక్కనే నడుస్తూ కారు దగ్గరకు వచ్చిన ఇద్దరి ముందూ రివ్వున వచ్చి ఒక కత్తి నేలలో నాటుకుంది. దానినే ఒక కాగితం ఏదో చుట్టబడి ఉంది. ఇద్దరూ ఉలిక్కిపడి ఒక్క అడుగు వెనక్కు వేశారు. భయంతో కంపించి పోతున్న సత్యను ధర్మారావు గట్టిగా పట్టుకున్నాడు.
    "భయపడకు, సత్యా! ఎవడో పిరికి వెధవ చేసిన పని. లేకుంటే ఎదురుగానే వచ్చి ఉండును. అదుగో అక్కడేదో చెట్లు కదులుతున్నాయి. ఉండు. వెళ్లి చూడనీ."
    అటు వెళ్ళబోతున్న ధర్మారావు ను సత్య వదలలేదు. "వద్దు, వెళ్ళకండి. ఎవరో దూర్తులు. ఏమైనా చేస్తారు."
    "ఏడిశారు. అంత ధైర్యం ఉంటె ఎదుటికే వద్దురు కాని, వదులు నన్ను."
    "వదలను. నాకేమిటో భయంగా ఉంది. నన్నోక్కతేనూ వదిలి వెళ్ళకండి."
    ఆ మాటతో ఆగిపోయాడు ధర్మారావు. చటుక్కున జేబులోకి చెయ్యి పోనిచ్చి పిస్టల్ పైకి తీసి ఆ కత్తి వచ్చిన దిశగా పేల్చాడు. వెంటనే కాలి బలం కొద్దీపరుగు తీసి పారిపోతున్న ఆ ఇద్దరు వ్యక్తులతో ఒక ఆకారం చిరపరిచితమైనదిగా తోచింది ఇద్దరికీ కూడా.
    "ఎవరి కంటావు, మన మీద ఇంత కక్ష?"
    "ఏముంది? మంచి వాళ్ళంటే కక్ష చెడ్డ వాళ్ళకే ఉంటుంది. ఉండండి. ఈ ఉత్తరం చూద్దాము." ముందుకు వంగి కర్చీఫ్ తో ఆ కత్తిని తీసింది సత్య.
    "పద. తర్వాత చూడచ్చు. ఇక అట్టే సేపు ఇక్కడ ఉండద్దు మనం."
    "అవును ,రండి."
    ఇంటికి తిరిగి వచ్చిన సత్య, ధర్మారావు జాగ్రత్తగా తమ చేతులూ, వేళ్ళూ ఆ కత్తికి కాని, ఉత్తరానికి కాని తగలకుండా కర్చీఫ్ తో పట్టుకుని కాగితం విప్పారు.
    'ధర్మారావ్!
    జాగ్రత్త! ఉద్యోగం కోసం వచ్చిన వాడిని నలుగురి దారినా నడిచి బాగుపడు. వెర్రి వేషాలు వేసి అందరినీ ఇబ్బంది పెట్టావంటే మొదటికే మోసం! అణగదోక్కేస్తాను. మళ్ళీ ఈ భూమి మీద కనిపించవు. కుర్రడివీ, అనుభవం లేని వాడినీ అని దయతో ఈ హెచ్చరిక చెయడమైనది."  
    సంతకం లేదు.
    చదివి, సత్య వైపు తిరిగే సరికి ఆమె నేత్రాల నిండా నీరు!
    "ఛచఛ! ఎంత చదివినా ఆడపిల్లననిపించావు" అంటూ నవ్వి , ప్రేమగా కన్నీలోత్తాడు ధర్మారావు. "మరేమీ ఫర్వాలేదు సత్యా! తాటాకు చప్పుళ్ళకే బెదిరిపోతామా?"
    "ఏమో! నాకు చాలా భయంగా ఉంది. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి."
    "ఏమిటది?" కాఫీ తెచ్చిన దయామయి ప్రశ్నించింది.
    "ఉష్!" ఆమె చూడకుండా ధర్మారావు సత్యను వారించాడు.
    "అబ్బే. ఏమీ లేదమ్మా. ' ప్రయత్న పూర్వకంగా నవ్వింది సత్య. "నీతికి నిలబడి నడిచేవారు కావడం వల్ల , మీ అబ్బాయి అందరికీ శత్రువై పోయారు. ఉదయం తగిలిన ఆ దెబ్బ చూచారా మరి? అందుచేత కొంచెం జాగ్రత్తగా ఉండాలంటూన్నాను."
    దయామయి మరేమీ మాట్లాడలేదు. అక్కడి నుండి మౌనంగా వెళ్ళిపోయిన ఆమె తీరు ఆ ఇద్దరికీ కూడా అర్ధం కాలేదు. ఎందుకో, అసలే గంబీరంగా ఉండే ఆమె ఉదయం నుండీ మరింత గంబీరంగా మారిపోవడం ఇద్దరూ గమనించారు.
    "ఈ విషయం లో ఏం చేద్దాము? ఎవరి కైనా చెబితే మనకే యాగీ యేమో?' అంది సత్య కారెక్కుతూ.
    "అనే నేనూ అనుకుంటున్నాను. ఆలోచించుతాను." అన్నాడు ధర్మారావు.'    
    "అయితే ఆ సత్యతో స్నేహం మానవన్న మాట?' సత్య నిష్కమణానంతరం దయామయి తీవ్రంగా ప్రశ్నించింది.
    దీనంగా చూచాడు ధర్మారావు. "అదొక విడరాని బంధమై పోయిందమ్మా."
    తల పంకించింది దయామయి. "నేను తల్లి నైనా కాకపోయినా, తల్లినే. నీ క్షేమం కోరి చెబుతున్నాను. తల్లిగా ఆజ్ఞాపిస్తున్నాను. ఇక ఆ సత్యతో ఏ విధమైన స్నేహాలు వీలులేదు."
    "అమ్మా!"
    "నీ వాదనలు నేను వినదలుచుకోలేదు. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నేను చెప్పినట్టు విను. నీ ప్రవర్తన వల్ల నువ్వు ఒక్కడివే కాదు -- మరొక నలుగురి ని , ఎవరైతే నిన్నింత వాణ్ణి చేయడానికి సర్వం వదులు కొన్నారో, బాధలు అనుభవించారో వాళ్ళను మృత్యువు కు సమర్పిస్తున్నావని గుర్తుంచుకో!"
    తల తిరిగిపోయింది ధర్మారావు కు. "అమ్మా! తనకే వినిపించనంత మంద స్వరంతో పిలిచాడు. "అయితే నా పుట్టు పూర్వోత్తరాల సంగతి నీకు తెలుసా, అమ్మా? ఎవరిని నేను? చెప్పమ్మా."
    "ఇదివరకు చాలాసార్లు ఈ ప్రశ్న అడిగావు. చెప్పలేదు. ఇప్పుడు చెప్పను. చెప్పడానికి ఇంకా సమయం రాలేదు. నేను చెప్పినట్లు మాత్రం నువ్వు విని తీరాలి."
    "సత్యతో స్నేహం నువ్వు చెప్పినంత దారుణ పరిణామాలు తెధమ్మా. ఆమె చాలా మంచిది."
    "సత్య ఎటువంటితో నాకు తెలియదు. ఆమె ఉత్తమురాలని కూడా నేను అనుకోను. అయినా అది వేరే విషయం. నాకు అనవసరం. వ్యక్తీ గుణగుణాలతో నిమిత్తం లేదు. వాళ్ళ చుట్టూ ఏర్పడి ఉన్న చక్రం తిప్పినట్లుగా వాళ్ళు తిరుగుతారు. వాళ్ళ చేతుల్లో ఏమీ లేదు."
    "నాకేమిటో మతి పోతుందమ్మా. ఏమీ తెలియడం లేదు."
    "ముందు ముందు నీకే తెలుస్తుంది. ప్రాణానికే మోసం తెచ్చే ఆ విష బిందువు తో స్నేహం మాత్రం వద్దు. ఏదీ మాట ఇయ్యి, మళ్ళీ దాని ముఖం చూడనని. "దగ్గరగా వచ్చి చెయ్యి చాచింది దయామయి.
    "విష బిందువా?' వెర్రి వాడిలాగా చూశాడు.
    "అవును. ఇయ్యి మాట! ' మళ్ళీ దాని ముఖం చూడను. స్నేహం మానివేస్తాను." అని మాట ఇయ్యి."
    ధర్మారావు ఆలోచనలు పరిపరి విధాల పోయాయి. సత్యతో మాట్లాడుతుండగా కత్తి వచ్చి పడడం, తాను అటు వెళ్ళ బోతుండగా ఆమె వారించడం! మళ్ళీ తాను అర్జున్ తో చేబుతానంటే వద్దన్నది! నిజంగా సత్య విష బిందువేనా? ఏమో! కుట్రదారులు; హత్యలు, దోపీడిలు చేసేవాళ్ళు స్త్రీల ద్వారానే కార్యం సాదిస్తారట! ఎవరి అంతరంగం లో ఏ ఆలోచన ఉన్నదో ఎవరు తెలుసుకో గలరు?"
    యాంత్రికంగా దయామయి చేతిలో చేయి వేసేశాడు. "సరేనమ్మా, ఇదే మాట ఇస్తున్నాను. సత్యతో మరి మాట్లాడితే ఒట్టు!"
    ఏమో తెలియరాని, గుండెలను దహించి వేస్తున్న బాధను అణుచుకుంటూ గదిలోకి పోయి తలుపులు మూసుకున్నాడు.
    అతడు గదిలో మంచం మీద పడుకోవడం, మళ్ళీ లేచి పచార్లు చేయడం, కిటికీ తలుపులు మూయడం, తెరవడం అన్నీ దయామయి నిస్సహయంగా తన గదిలో నుండి గమనిస్తూనే ఉన్నది.
    ఆమె వెక్కిళ్ళు ధర్మారావు కూ వినిపించక పోలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS